Friday, March 29, 2024

ఉద్యమమే ఇంటి పేరు

ఉద్యమాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న నేత. అటు ఆంగ్లేయులను, అనంతరకాలంలో నిజాంను ఎదిరించడంలో  వట్టికోట, దాశరథి లాంటి ఎందరికో స్ఫూర్తిప్రదాత. ఆయనే వావిలాల రామచంద్ర రావు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్యాతూరులో  1918 ఏప్రిల్ 25న జన్మించిన ఆయన గద్వాలలో  ప్రాథమిక విద్య, హైదరాబాద్ లో ఉన్నత  విద్యను అభ్యసించారు. ఆర్యసమాజ్ నేత రాంచందర్ దేహెల్వా ప్రసంగా లతో ప్రభావితుడైన ఆయన తన సోదరుడు  నరేంద్రరావు (వీరభద్ర రావు)తో కలసి అందులో సభ్యత్వం పొందారు. అనంతర కాలంలో తాను నివసించిన సీతారాంబాగ్ లో ఆర్య సమాజ్ శాఖను ప్రారంభించారు.

స్వాతంత్ర్ర్య పోరాటంలో భాగంగా ఆయన కూడా జైలుకు వెళ్లారు. తోటి సత్యాగ్రహవాదఖైదీలతో కలసి  రోజూ `వందేమాతరం`గీతం ఆలపించే వారు.ఆ గీతాలాపనను జైలు అధికారి నిషేధించినా వారు లక్ష్యపెట్ట లేదు. పాడుతూనే  ఉన్నారు. దాంతో ఆగ్రహించిన  ఆ అధికారి ఆయనను పిలిపించి రెండు చెంపలు వాయించడంతో పాటు 24 కొరడా దెబ్బల శిక్ష కూడా వేశాడు. ప్రతి దెబ్బకు `అమ్మా` అనడానికి బదులు `వందే మాతరం` అని నినదించారు రామచంద్రరావు. అప్పటి నుంచి అదే ఆయన ఇంటి పేరైంది.

నిజాంపై పోరు

తరువాత నైజం రాష్ట్ర ఉద్యమానికి  ఆయన నాయకత్వం వహించారు.  కొంతకాలం అజ్ఞాతంగా వుండి పోరాటం సాగించిన ఆయన నిజాం సైనిక రహస్యా లను సేకరించి  హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ ప్రతినిధి కేఎం మున్షీకి అందించేవారు. హైదరాబాద్ విమోచనోద్యమంలో, కార్మికుల సహకారోద్యమంలో పనిచేశారు. .కార్మికుల హక్కుల పరిరక్షణకు మజ్దూర్ యూనియన్, రైతుల కోసం నల్గొండ జిల్లా మల్కాపూర్ లో వ్యవసాయదారుల సహకార సంఘం నెలకొల్పారు.

రాజకీయ జీవితం

ఉమ్మడి అంధ్రప్రదేశ్  శాసనసభకు 1952 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించారు. మూడవసారి  (1967) అప్పటి  అప్పటి ఉ ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డిపై విజయం సాధించారు. మంత్రులుగా ఉన్న వీ.బీ. రాజు, మర్రి చెన్నారెడ్డి  ఎన్నికలలో అవినీతికి పాల్పడినట్లు న్యాయస్థానంలో రుజువు చేయడం ద్వారా   వారి  శాసనసభ  సభ్యత్వాలను రద్దు చేయించారు.1969లో వచ్చిన   ప్రత్యేక తెలంగాణ వాదనను బలపరిచారు.

భాషా సేవ

మొదటి ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థకు అధ్యక్షుడుగా వ్యవహరించారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా (1978-81) సేవలు అందించి, ప్రభుత్వ శాఖల్లో తెలుగు అమలు పరచటానికి విశేషకృషి చేశారు. రామఛంద్రరావు మంచి వక్త. తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ‘హైదరాబాద్ పై పోలీస్ చర్య’, ‘‘చైనా దురాక్రమణ’, `స్వామి దయానంద జీవితంలోని   కొన్ని ఘట్టాలు`, `స్వాతంత్య్ర వీర సావర్కర్` ఆయన ప్రముఖ రచనల్లో  కొన్ని. ఆయన  2001 నవంబర్ 28వ తేదీన కన్నుమూశారు.

(ఈరోజు 28న వందేమాతరం రామచంద్రరావు వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles