Thursday, April 25, 2024

పరమ పవిత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం

అనంతమైన కాలం భగవత్ స్వరూపం. ప్రాచీనులు కాలాన్ని నాలుగు ప్రమాణాలతో సూచించారు. మాస చతుర్దా… సావనః సౌర చాంద్రో నాక్షత్ర ఇతి” అని నిర్ణయ సింధులో పేర్కొనబడింది. సావనము, సౌరము, చాంద్రము నక్షత్రము ద్వారా గణించడం పరిపాటి. చైత్ర వైశాఖ మాసములు, ప్రతిపద విదియాది తిథులు చాంద్రమానం ప్రకారం లెక్కిస్తారు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాస నిర్ణయం చేయగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులు సౌరమానం ప్రకారం మాసంగా గణిస్తారు. సౌర మాన మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలి అధికంగా ఆయా తేదీలలోనే వస్తాయి. అందుకే తమిళులకు ఏప్రిల్ 14ననే మేషారంభమై సంవత్సరాది వస్తుంది. నాగర ఖండ ఆధారంగా రవే: సంక్రమణం రాశౌ సంక్రాంతి రిథి కథ్యతే”…

ఒక్కొక్క మాసం ఒక్కొక్క సంక్రాంతి

ఒక్కొక్క మాసము ఒకొక్క సంక్రాంతిగా చెప్ప బడుతుంది. మకర సంక్రాంతి జనవరి 14నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16 వరకూ ఉత్తరాయణం, తదాది మరల మకర సంక్రాంతి వరకూ దక్షిణాయనంగా చెప్పబడింది. సౌరకాలమానం ప్రకారం ధనుస్సంక్రమణమైన మాసం దేవతలకు ఉషఃకాలం. “బ్రాహ్మీ ముహూర్తే బుద్దేత ధర్మార్థ చాను చింతయేత్” అని స్మృతి చెపుతున్నది. దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉషఃకాల షోడశోపచార పూజలు చేసి పులగం – పొంగలి – శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు –  గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును.

ఏకాదశులు పవిత్రమైనవి

ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికానుసారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమాన మైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. “గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ ధైవచః,; ఏకాదశ్యాంశ భుంజిత పక్ష యోరు భయోరపి” అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి “హరి వాసరము”గా కొనియాడ బడుచున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గ శీర్తము లేక పుష్య మాసం) వైకుంఠ ఏకాదశి గా పిలువ బడుచున్నది.

సూర్యచంద్రులు నేత్రాలు

సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునికి సౌర చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మాస శక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. “ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ త్రింషత్  సురేః సాకం బ్రహ్మ వైకుంఠ మాగతః పాలస్త్యేనని పీడితా: సురగణా: వైకుంఠలోకం యయు:, ద్వారే తత్ర విషాదభావ మనసా సూక్తైర్ హరిం తుష్టువు: శుక్లై  శ్రీ: హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధను: సంస్థితే, తేభ్యో దాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ: రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా.

vaikunta ekadashi festival

మధుకైటభుల సంహారం

ఆ దేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠమును చేరి, హరి వాసరము నందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా  స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసినని వివరిం చబడినది. శ్రీప్రశ్న సంహిత(5వ అధ్యాయము) నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించి నపుడు వారు దివ్యరూప ధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులు ఎవరైనను  నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని “మోక్షోత్సవ దినము”గా వరమిచ్చినట్లు తెలియు చున్నది.

మక్కోటి ఏకాదశి

ముక్కోటి దేవతల బాధలను నివారించి నందున “ముక్కోటి ఏకాదశి” గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక “వైకుంఠ ఏకాదశి” గాను కొనియాడ బడు చున్నది. భగవద్దర్శనము చేయు  పవిత్ర దినమైనందున “భగవదవ లోక  దివసము”గా  కొనియాడ బడు చు న్నది. ధనుర్మాస ఏకాదశి కొన్ని సార్లు  మార్గశిర మాసమందు,   మరికొన్ని మారులు పుష్య మాస మందు  రావడం చేత రెండు మాసాల ఏకాదశులు  ప్రశస్తములైనవే. మార్గశిర మాస  ఏకాదశిని “మోక్ష కైకాదశి” అని,  పుష్యమాస ఏకాదశిని “పుత్ర దైకాదశి” అని, “రైవత మన్యాది దిన”మని పిలుస్తారు. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుని చేరుతుండగా, బహుళ ఏకాదశి నాడు చంద్రుని నుండి పదకొండవ కళ సూర్య మండలాన్ని చేరుతుంది.

విష్ణుదేహం నుంచి ఏకాదశి ఉద్భవం

కృతయుగంలో చంద్రవతీ నగరాన్ని ఏలిన మురుడనే రాక్షస సంహార సమయాన, విష్ణు దేహం నుండి ఉత్పన్నమైన స్త్రీ మూర్తియే ఏకాదశి, కనుక ఏకాదశి  అధిదేవతయైన ఏకాదశి దేవి మహావిష్ణు అంశయే. సూర్యుడు ధనురాళిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుండ) పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతో వైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహావిష్ణువు దిన్యదర్శనం గావించిన సందర్భంగా కోటి తేజో మూర్తిని దర్శించిన బ్రహ్మాది దేవతలు, సనక సనంద ఆది ముసులు “పశ్యన్ నిముష మాత్రేన కోటి యజ్ఞంపలం లభేత్” అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించ బడింది. ఈ పవిత్రదినాన విష్ణు సంబంధ ఆలయాలలో ఉత్తర ద్వారం వద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసుకోవడం సత్సాంప్రదాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles