Monday, November 28, 2022

తాత్పర్యం లేని టీకాలు

వ్యాక్సిన్లపై ప్రజలు ఎంతో విశ్వాసం పెట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు, నిపుణులు కూడా   విశ్వాసాన్ని పెంచేలా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవాక్జిన్, కోవిషీల్డ్ కు తోడు స్పుత్ నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చేస్తోంది. ఫైజర్, ఆస్ట్రాజెనికా(2) మొదలైన వ్యాక్సిన్లు కూడా రానున్న నెలల్లో మార్కెట్ లో లభిస్తాయని వార్తలు బాగా వస్తున్నాయి.139కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో అందరికీ వ్యాక్సిన్లు అందించడమంటే ఆచరణలో అంత సాధ్యమైన విషయం కాదు.

Also read: తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్

అందరికీ టీకాలు వేయడం అంత సులభం కాదు

గతంలో వివిధ వ్యాధులకు సంబంధించి రూపొందించిన వ్యాక్సిన్ల చరిత్రను గమనించినా ఆ విషయం బోధపడుతుంది. (1) వ్యాక్సిన్ల తయారీకి పట్టే సమయం (2) ప్యాకింగ్ (3)రవాణా (4)డిస్ట్రిబ్యూషన్ (5) నిలువ (6) సామర్ధ్యం (7) జనాభా సంఖ్య (8) వ్యాక్సినేషన్ ప్రక్రియకు పట్టే సమయం (9) ఆయా దేశాల ఆర్ధిక సామర్ధ్యం మొదలైనవన్నీ పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలే. కోవిడ్ -19 వల్ల కలిగే విభిన్న దుష్ప్రభావాలు, ఆవశ్యకత, అభివృద్ధి చెందిన సాంకేతికత, పెరిగిన పరిశ్రమల దృష్ట్యా కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్లు ఆఘమేఘాల మీద అన్ని అనుమతులను పూర్తిచేసుకొని మార్కెట్ లోకి వస్తున్నాయి.

Also read: అనివార్యమైన లాక్ డౌన్

స్వాగతిద్దాం, అభినందిద్దాం!

ఇది స్వాగతించవల్సిన, అభినందించాల్సిన పరిణామమే. కానీ, వ్యాక్సిన్ల అంశంలో కొన్ని మౌలికమైన ప్రశ్నలు, సందేహాలు, సందిగ్ధ ధోరణులు ఉన్నాయన్నది వాస్తవం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ వ్యాక్సిన్ వేయడానికి దేశం సిద్ధంగా ఉందనే మాటలు ప్రభుత్వాల నుంచి వినపడుతున్నాయి. కానీ, ఆచరణ ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. ఇందులో ఎవరి దేశభక్తిని శంకించలేము. కానీ, సన్నద్ధం కావడంలో,  ప్రణాళికలో మనం వెనుకపడ్డాం అన్నది చేదునిజం. తొలిగా అందుబాటులోకి వచ్చిన కోవాక్జిన్, కోవీషీల్డ్ సామర్ధ్యం విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలను రేకేత్తించారు. ఒకటి మంచినీళ్లతో సమానమని, ఇంకొకదానికిఅంత సామర్ధ్యం లేదని ఆయా కంపెనీలే ఒకదానిపై ఇంకొకటి బురద చల్లుకున్నాయి. ఏమైందో ఏమోకానీ రెండు రోజుల తర్వాత, ఆ మాటలను అవే విరమించుకున్నాయి.

Also read: అంతా ఆరంభశూరత్వమేనా?

కోవాగ్జిన్ పై గురి కుదిరినట్టేనా?

విరమించుకున్నా? ప్రజల్లో ఆ మాటలు నాటుకున్నాయి. ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్లపై పూర్తిగా విశ్వాసం కలగడం లేదు. దొందూదొందే.. అనే అభిప్రాయంలో వున్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి పెద్దలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెల్లగా కొందరిలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం కూడా ఎక్కువమందికి కోవాక్జిన్ పైనే కాస్త ఎక్కువ ఏర్పడింది. దానికి ప్రధానమైన కారణం ప్రధానమంత్రి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే. అందుకే, ఎక్కువమంది సామాన్య ప్రజలు ఆ వ్యాక్సినే కావాలనే ధోరణిలో ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత దృష్ట్యా, గుడ్డిలో మెల్లగా భావిస్తూ కోవీషీల్డ్ కు కూడా సిద్ధమవుతున్నారు. ముందుగా 60ఏళ్ళు పైబడినవారికి, తర్వాత 45ఏళ్ళు నిండినవారికి, ఆ తర్వాత 18ఏళ్ళు దాటినవారికి అనుమతులు వచ్చాయి.

Also read: కోరలు చాచుతున్న కరోనా

పిల్లలకు సైతం…

ఇప్పుడు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ అందించే అవకాశం ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 18కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది.వీటిలో రెండు డోసులు వేసుకున్నవారి సంఖ్య కోటి డెబ్భై ఐదు లక్షలు మాత్రమే. వీరందరూ 60 ఏళ్ళు దాటినవారే కావడం గమనార్హం.45 ఏళ్ళు నిండినవారిలో కేవలం సుమారు 87లక్షలమందికి మాత్రమే రెండు డోసులు అందాయి. 18సంవత్సరాలు దాటినవారు 42లక్షలమంది మాత్రమే మొదటి డోసు తీసుకున్నారు. ఈ లెక్కన చూస్తే, డిమాండ్ – సప్లై మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ ఉందన్నది తెలిసిందే.

Also read: మళ్ళీ కమ్ముకొస్తున్న కరోనా మహమ్మారి

కాలపరీక్షలో తేలవలసిందే

ఈ అందిన వ్యాక్సిన్ల సామర్ధ్యం కూడా కాలపరీక్షలోనే తేలనుంది. రెండు డోసులు పూర్తయిన కొన్నిరోజుల తర్వాత రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఆ పెరిగిన శక్తి కూడా ఎక్కువకాలం నిలబడేట్లు లేదు. మళ్ళీ రోగనిరోధకశక్తిని పెంచుకోవాల్సిందే. దానికోసం మళ్ళీ మరో వ్యాక్సిన్ తీసుకోవాలా? తెలియరావడం లేదు.కోవాక్జిన్ మొదటి డోస్ తీసుకున్న వ్యక్తి 28 రోజుల తర్వాత రెండవ డోస్ తీసుకోవాలి. గణాంకాల నివేదికలను గమనిస్తే, రెండవ డోస్ తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కోవాక్జిన్ మూడవ డోస్ బూస్టర్ డోస్ గా తీసుకోవాలని అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది? కేవలం రెండు డోసులు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Also read: మనిషి మారకపోతే మహమ్మారే

కోవిషీల్డ్ కు వ్యవధి పెంచుతున్నారు

కోవీషీల్డ్ రెండవ డోస్ కు వ్యవధి కాలాన్ని తాజాగా మార్చేశారు. 6-8-12వారాలు అంటున్నారు. రెండు డోసులు పూర్తయితేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో, అన్ని నెలలపాటు సామర్ధ్యాన్ని పొందకుండా ఉండడం వల్ల కరోనా నుంచి ఇబ్బందులు తలెత్తుతాయి కదా? దీనికి సమాధానం కావాలి. ఇక కొత్తగా అందుబాటులోకి వస్తున్న స్పుత్ నిక్ విషయంలోనూ సందేహాలు కనిపిస్తున్నాయి. మొదట్లో, ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు, సింగిల్ డోస్, డబుల్ డోస్ రెండూ ఉంటాయని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలి. ఫైజర్, మోడెర్నాకు మంచి వ్యాక్సిన్లనే ప్రచారం ఉంది. ఫైజర్ రెండు డోసులు వేసుకున్నవారు మాస్కులు ధరించక్కర్లేదు, భౌతికదూరం పాటించనవసరంలేదని, సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెబుతున్నారు.

Also read: చేజేతులా తెచ్చుకున్న ముప్పు

మాస్క్ విషయంలో గందరగోళం

వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా, మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలని ఆంథోనీ పౌచీ వంటి వైరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదొక గందరగోళం. వైరస్ లో బ్రిటన్, సౌత్ ఆఫ్రికన్, ఇండియన్ వేరియంట్లు అనే వివిధ రకాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లపై పనిచేయవని, ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క వేరియంట్ పై మాత్రమే పనిచేస్తుందని కథనాలు వస్తున్నాయి. అసలు ఇండియన్ వేరియంట్ అనేది లేనేలేదని కొందరు చెబుతున్నారు. ఈ వేరియంట్ల విషయంలోనూ శాస్త్రీయమైన సమాధానాలు కావాలి. మేధో హక్కుల మార్పిడితో ఉత్పత్తి పెంచవచ్చని,విదేశీ, స్వదేశీ అన్నింటికీ ఉపయోగపడుతుందనే వాదనలు ప్రభుత్వాల నుంచి వింటున్నాం.

Also read: వాక్సిన్ విజేత భారత్

ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలి

అదే సమయంలో,ఉత్పత్తి చేసే  సామర్ధ్యం అన్ని కంపెనీలకు లేవని ఇప్పటి వరకూ వ్యాక్సిన్ ను రూపకల్పన చేసిన భారత్ బయోటెక్ మొదలైన సంస్థలు అంటున్నాయి. అనుమానాలు, అవగాహనా రాహిత్యం, సంసిద్ధత లేమి, కో ఆర్డినేషన్ కొరత,అశ్రద్ధ,వివిధ స్వదేశీ విదేశీ మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాలు, వ్యాఖ్యల వల్ల మన దేశంలో మొదటి రెండు నెలల్లో సుమారు 10-24శాతం వ్యాక్సిన్లు వృధా అయ్యాయని తెలుస్తోంది. ఏది ఏమైనా, వ్యాక్సినేషన్ త్వరితగతిన, పెద్దఎత్తున జరగడం ఎంత ముఖ్యమో, ఈ సందేహాలు, సందిగ్ధాలు తీరడం అంత ముఖ్యం. వ్యాక్సిన్ల ధరలపై కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ ఎంత పెరిగితే, అంత హెర్డ్ ఇమ్మ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి) పెరుగుతుందని చెబుతున్నారు.

Also read: మళ్ళీ వస్తోంది మహమ్మారి!

ఉత్పత్తి సమస్యల వల్ల వ్యవధి పెంచుతున్నారా?

వ్యవధి ఎందుకు పెంచుతున్నారు? 1. ఎన్ని డోసులు వేసుకోవాలి? మొదటి డోస్ కు తర్వాత డోస్ లకు మధ్య ఉండే వ్యవధుల్లో వ్యాక్సిన్-వ్యాక్సిన్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.తయారీ, పంపిణీలో ఉన్న ఇబ్బందుల వల్ల, ఇన్ని వ్యత్యాసాలు ఉత్పన్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.(2) వ్యాక్సిన్ ధర మొదట్లో, సుమారు 150రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు దాదాపు  1500రూపాయలు దాకా వెళ్ళింది. ముందుముందు ఎంతవుతుందో కూడా తెలియదు. ఇంకో పక్కన ఉచిత వ్యాక్సిన్ అంటున్నారు.

Also read: వ్యాక్సినేషన్-వైరస్ లో మార్పులు

సందేహ నివృత్తికి ప్రాధాన్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ వర్గాలకు అందించే ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. ధరల విషయంలో క్రమశిక్షణ ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీటన్నింటిపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసి, అగాధాలను తొలగించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలపైనే ఉంది. శాస్త్రవేత్తలు, నిపుణులు, సంబంధిత వర్గాలకు చెందిన వ్యక్తులతో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సిన్ల విషయంలో ఉన్న సందేహాలన్నింటికీ, సింగిల్ విండో పథకంలాగా,ఒకే నివేదికలో సమాధానాలన్నింటినీ పొందుపరిచి ప్రజలకు అందించడం అత్యంత ముఖ్యం. సామర్ధ్యం కలిగిన వ్యాక్సిన్లతో టీకాప్రక్రియను  సమర్ధవంతంగా నిర్వహిస్తూ, ఈ గందరగోళాలకు ముగింపు పలికే దిశగా పాలకులు ముందుకు సాగాలి.

Also read: ఇది టీకానామ సంవత్సరం

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles