Thursday, April 25, 2024

న్యాయమూర్తుల నేరం నిరూపించినా చర్య అసాధ్యం

  • జగన్ లేఖపై ఏమి జరుగుతుంది?
  • అభిశంసనలో అమెరికా, ఇండియా అనుభవాలు

 (ప్రొఫెసర్ ఎం. శ్రీధర్ ఆచార్యులు)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు పక్షపాతంగా ఉన్నాయనీ, రాజకీయంగా కుమ్మక్కు జరిగిందనీ, దిల్లీ నుంచి అమరావతిపైన ప్రభావం పడుతోందనీ ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించడానికీ లేదా తిరస్కరించడానికీ ప్రాథమిక దర్యాప్తు జరిగే వరకూ ఏ చర్యా తీసుకునే అవకాశం లేదు. ఆరోపణలు ఎదుర్కొనే న్యాయమూర్తులు జవాబుదారీతనాన్ని నిర్ణయించే క్రమానికి సైతం అతీతులా అన్నది ప్రశ్న.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, మరి కొందరు న్యాయమూర్తులనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి. రమణ ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకండా హైకోర్టు నిర్ణయాలు వెలువడడానికి జస్టిస్ రమణకూ, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడికీ మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను జగన్ మోహన్ రెడ్డి నిరూపించగలరా? చాలా కష్టం. ఒక వేళ ఆయన తన ఆరోపణలను నిజమని నిరూపించారని అనుకుందాం. పర్యవసానం ఏమిటి? వారిపైన ఎటువంటి చర్యలు తలపెట్టవచ్చు?

న్యాయపరంగా న్యాయమూర్తులు అక్రమంగా, అపసవ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు నిజమని నిరూపించినప్పటికీ వారిపైన చర్యలు తీసుకోవడం భారత దేశంలో దాదాపు అసాధ్యం. గతంలో ఎవరైనా న్యాయమూర్తి న్యాయపరంగా అక్రమం చేసినందుకో, రాజకీయంగా కుమ్మక్కు అయినందుకో, పక్షపాతంగా వ్యవహరించినందుకో, అవినీతికి పాల్బడినందుకో పదవి నుంచి బర్తరఫ్ అయిన సందర్భం ఒక్కటైనా ఉన్నదా? అమెరికా, ఇండియాలలో రెండు అభిశంసన (ఇంపీచ్ మెంట్) ప్రయత్నాలు జరిగాయి. ఆరోపణలు నిజమని నిరూపించినా బర్తరఫ్ చేసే ప్రయత్నం మాత్రం విఫలమైంది.

అభిశంసన ప్రక్రియ వైఫల్యం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించే ప్రయత్నం విఫలమైనప్పటికీ ఎటువంటి పద్ధతి ఈ వ్యవహారంలో అనుసరిస్తారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 1990లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామి పంజాబ్-హరియాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో కొన్ని ప్రశ్నార్థకమైన చర్యలకు పాల్బడినట్టు ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు అంతర్గత ఆడిటింగ్ సెల్ కు చెందినవారూ, జిల్లా  విజిలెన్స్ జడ్జి (విజిలెన్స్), అక్కౌంటెంట్ జనరల్ ఆఫీస్ కు చెందినవారూ నివేదికలు సమర్పించారు.

ఈ నోటీసులను నాటి భారత అటార్నీ జనరల్ సొలి జె. సొరాబ్జీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కె. వేణుగోపాల్, ఇతర బార్ అసోసియేషన్ నాయకులూ నాటి భారత ప్రధాన న్యాయమూర్తి సబ్యసాచి ముఖర్జీ దృష్టికి తీసుకొని వెళ్ళారు. 20 జులై 1990న ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రకటన చేశారు. అది సుప్రీంకోర్టు రికార్డులో ఎక్కింది. ఇతరత్రా కూడా చాలా ప్రాచుర్యం పొందింది.

జస్టిస్ రామస్వామి గురించి అప్పటికే ప్రచారంలో ఉన్న వార్తలను ప్రస్తావిస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బార్ ను ఉద్దేశించి బహిరంగ న్యాయస్థానంలో ఈ విధంగా ప్రకటించారు: ‘‘ఇది ఇదివరకు ఎప్పుడూ కనీవిననీ విషయం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. జాగ్రత్త వ్యవహరించవలసిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఎవ్వరూ కాదనలేని విధంగా ఒక సంప్రదాయాన్ని నెలకొల్పవలసిన అవసరం కూడా తప్పకుండా ఉన్నది.’’ ‘‘చట్ట ప్రకారం పరిపాలన జరిగే విధంగా సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉండాలి. చట్టప్రకారం పరిపాలన జరగాలంటూ నిర్ణయాలు చేసేవారు చట్టానికి బద్ధులై జీవించాలి. న్యాయమూర్తులు చట్టప్రకారం జీవిస్తారని ప్రజలకు విశ్వాసం కుదిరే విధంగా న్యాయమూర్తులు జీవించాలి…ఈ పరిస్థితులలో సోదర న్యాయమూర్తి రామస్వామిని దర్యాప్తు ముగిసి, ఆయన మచ్చలేకుండా ఆరోపణల నుంచి బయటపడేవరకూ న్యాయవ్యవస్థపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండవలసిందిగా సలహా ఇవ్వక తప్పడం లేదు. ఈ అంశాన్ని పరిశీలిస్తానంటూ అటార్నీ జనరల్ కూ, న్యాయశాఖ మంత్రికీ, బార్ అసోసియేషన్ కూ చెప్పాను. కనుక నా  పరిశీలన పర్యవసానం ఏమిటో చెప్పవలసిన బాధ్యత నాపైన ఉన్నది,’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి వివరించారు.  

అప్పుడ జస్టిస్ రామస్వామి సెలవుపై వెళ్ళారు. ముగ్గురు న్యాయమూర్తులతో – జస్టిస్ రే, జస్టిస్ షెట్టీ, జస్టిస్ వెంకటాచలయ్య – ఒక కమిటీని చీఫ్ జస్టిస్ ముఖర్జీ 29 ఆగస్టు 1990న ప్రకటించారు. జస్టిస్ రామస్వామి సుప్రీంకోర్టులో పని చేస్తూ విధులలో కొనసాగాలా లేదా సలహా ఇవ్వవలసిందిగా ఈ ముగ్గురు న్యాయమూర్తుల సంఘాన్ని ప్రధాన న్యాయమూర్తి కోరారు. ప్రధాన న్యాయమూర్తి సబ్యసాచి ముఖర్జీ పదవిలో ఉండగానే 25 సెప్టెంబర్ 1990న అకాల మరణం చెందారు. 6 అక్టోబర్ 1990న జస్టిస్ రంగనాథమిశ్రాని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. నవంబర్ 6న ముగ్గురు న్యాయమూర్తుల సంఘం జస్టిస్ మిశ్రాకు నివేదిక సమర్పించింది. తమకు జస్టిస్ రామస్వామి కోర్టులో కొనసాగకుండా ఉండవలసినంత నైతిక తప్పిదం ఏదీ కనిపించలేదని ఈ సంఘం స్పష్టం చేసింది.

జస్టిస్ రామస్వామి అభిశంసన తీర్మానం

జస్టిస్ రామస్వామిని అభిశంసించాలంటూ (ఇంపీచ్ మెంట్) లోక్ సభలో ఒక తీర్మానం చర్చకు వచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో ఒక కమిటీని స్పీకర్ నియమించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ.బీ. సావంత్, బొంబాయ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీ.డీ. దేశాయ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఓ. చిన్నప్పరెడ్డి  ఈ కమిటీలో సభ్యులు. జస్టిస్ రామస్వామి వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా, అపసవ్యంగా ఉన్నదంటూ ఈ కమిటీ నివేదిక సమర్పించింది.  తీర్మానాన్ని ఓటింగ్ కు పెట్టగా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో తీర్మానం వీగిపోయింది (తీర్మానానికి అనుకూలంగా 196 ఓట్లు, వ్యతిరేకంగా సున్నా ఓట్లు పడగా, సభకు గైర్ హాజర్ అయిన సభ్యుల సంఖ్య 205). జస్టిస్ రామస్వామి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి సబ్యసాచి ముఖర్జీ బహిరంగ న్యాయస్థానంలో చేసిన ప్రకటననే ఆరోగ్యప్రదమైన ఆనవాయితీగా పరిగణించాలి.

దర్యాప్తు సంఘం జస్టిస్ రామస్వామిని మొత్తం 14 ఆరోపణలకు గానూ 11 ఆరోపణలలో దోషిగా నిర్ణయించినప్పటికీ, అంతిమ దశలో సభలో సభ్యులు తగినంతమంది లేరు కనుక ఆయనను బర్తరఫ్ చేయాలనే ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత కొందరు న్యాయమూర్తులను బర్తరఫ్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఒక్క న్యాయమూర్తి కూడా బర్తరఫ్ కాలేదు. సిక్కిం హైకోర్టు న్యాయమూర్తి పీడీ దినకరన్ పైన ఆరోపణలు నిజమని నిరూపితమైనాయి. వ్యవహారం అభిశంసన దాకా వెళ్ళకుండా వెంటనే ఆయన రాజీనామా చేశారు. అదే విధంగా కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి సుమిత్రాసేన్ పైన వచ్చిన అవినీతి ఆరోపణ నిజమని తేలింది. అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. కానీ 2011లొ బర్తరఫ్ తీర్మానం ప్రవేశపెట్టగానే రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. గాంగెలీ లైంగిక అత్యాచారానికి పాల్బడినారనే ఆరోపణను రాజ్యసభ నియమించిన సంఘం నిరూపించలేకపోయింది. అందుకని ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీ.వీ. నాగార్జునపైన 2016-17లో సాగిన దర్యాప్తులో ఆయన కులం ప్రాతిపదికగా పక్షపాతమైన వ్యాఖ్యాలు చేశారనే ఆరోపణలకు ఆధారం కనిపించలేదు.

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసన యత్నం

అమెరికా సంయుక్త రాష్ట్రాల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శామ్యూల్ చేజ్ ను 1796లో నాటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ నియమించారు. అమెరికా స్వాతంత్ర్యం సాధించిన కొత్త రోజులు. 1780 ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత థామస్ జెఫర్సన్ అధ్యక్ష పదవి చేపట్టారు.  ప్రత్యేక న్యాయసమీక్ష చేసే హక్కు న్యాయవ్యవస్థకు ఉన్నదనే వాదనతో న్యాయవ్యవస్థ ఆధిపత్యం పెరిగిపోవడం చూసి ఆందోళన చెందారు. అప్పుడు అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ గా ఉండిన శామ్యూల్ చేజ్ (1741-1811) నిస్పక్షపాతంగా లేరనీ, ఆయన వ్యవహారం సక్రమంగా లేదనీ జెఫర్సన్ భావించారు. జస్టిస్ చేజ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీర్పలనూ, ప్రవర్తననూ అనుసరించి ఒక నిర్ధారణకు వచ్చారు. ఆయనను అభిశంసించాలని ప్రెసిడెంట్ జెఫర్సన్ నిర్ణయించుకున్నారు.

చేజ్ పైన ఎనిమిది ఆరోపణలు (అమెరికాలో ఆరోపణలను ‘ఆర్టికిల్స్ ఆఫ్ ఇంపీచ్ మెంట్’ అంటారు) మోపారు. ఒక వ్యక్తిని విచారించిన విధానాన్నీ, రాజకీయ పరువునష్టం కేసులో విచారణ జరిపించిన పద్ధతినీ ప్రశ్నించారు. ఒక న్యాయమూర్తి హోదాకు తగినట్టు చేజే ప్రవర్తించలేదనీ, వివిధ అంశాలలో విధివిధానాలు అనుసరించడంలో పొరబాట్లు చేశారనీ, అసందర్భంగా, అనుచితంగా, అనవసరంగా వ్యవహరించారనీ, చాలా అసభ్యంగా ప్రవర్తించారనీ, న్యాయమూర్తికి ఏ మాత్రం తగని విధంగా వ్యవహరించారనీ ఆరోపించారు. బాల్టిమోర్ గ్రాండ్ జ్యూరీకి బాధ్యత అప్పగిస్తూ అసభ్యమైన పదజాలం ఉపయోగించారనీ నిందించారు. అన్ని అభియోగాలూ నిజమేనని భావించి, అన్ని నిర్ణయాలకూ రాజకీయ పక్షపాతమే కారణమని నిర్ధారించి చేజ్ ను అభిశంసించాలంటూ 12 మార్చి 1804న అమెరికా ప్రతినిధుల సభ 73-32 ఓట్ల తేడాతో తీర్మానించింది.

కానీ సెనేట్ ఇందుకు భిన్నంగా ఓటు చేసింది. అన్ని ఆరోపణలూ నిరాధారమైనవని సెనేట్ తేల్చింది. 1811లో ఆయన తుదిశ్వాస వరకూ చేజ్ అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు (see the webpage: Samuel Chase – “The Samuel Chase Impeachment Trial, and Samuel Chase” The Supreme Court Historical Society. Archived from the original on 13 July 2007, Richard Ellis, “The Impeachment of Samuel Chase.” In American Political Trials, ed. By Michael R. Belknap (1994) pp. 57-76,  quote on P. 64).

అమెరికాలో జడ్జీలకు పదవీ విరమణ లేదు

చేజ్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేసి, అభిశంసన తీర్మానం ఓటింగ్ కు పెట్టడం, చివరికి సెనేట్ చేజ్ నిర్దోషి అంటూ నిర్ణయించడం ద్వారా న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని  కాపాడటం అమెరికాలో ఏ విధంగా జరిగిందో గమనించవచ్చు. చేజ్ శేషజీవితం యావత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు. అమెరికాలో న్యాయమూర్తి జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛలో న్యాయమూర్తులకు పదవీ విరమణ లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. ఒక సారి నియమించిన తర్వాత న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించాలంటే  పార్లమెంటులోని రెండు సభలూ ఆమోదించాలి.

‘‘రీకనస్ట్రక్టింగ్ ది ఫెడరల్ జుడీషియరీ: ది చేజ్ ఇంపీచ్ మెంట్ అండ్ ది కాన్ స్టిట్యూషన్’’ (స్టడీస్ ఇన్ అమెరికన్ పొలిటికల్ డెవలప్ మెంట్ 1995) అనే గ్రంధంలో రచయిత రీత్ ఇ. విట్టింగ్టన్ న్యాయవ్యవస్థ స్వభావంపైన చేజ్ బర్తరఫ్ వ్యవహారం అనేక ప్రశ్నలను లేవనెత్తిందని అన్నారు. ఈ కేసు ఇంపీచ్ మెంట్ చేయడానికి పార్లమెంట్ కు గల అధికారాల పరిమితిని చాటిచెప్పింది. అదే సమయంలో రాజకీయ వ్యవహారాలలో న్యాయవ్యవస్థ తలదూర్చకూడదని కూడా స్పష్టం చేసింది.

పదవీ విరమణ: ఒక ఊరట

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 వ ఏట పదవీ విరమణ చేయాలని మన రాజ్యాంగనిర్మాతలు నిర్ణయించారు. న్యాయమూర్తుల బర్తరఫ్ (ఇంపీచ్ మెంట్)కు ఒక విధానాన్ని పొందుపరిచారు. పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలుగా నిర్ణయించడం గొప్ప సంస్కరణ అంటూ కొందరు సమర్థిస్తే, పదవీ విరమణ తర్వాత ఏ పదవి వస్తుందా అని పదవీ విరమణ చేసే న్యాయమూర్తులు ఆలోచిస్తుంటారనీ, దాని వల్ల న్యాయమూర్తుల స్వాతంత్ర్యానికీ, వస్తునిష్టమైన దృక్పథానికీ నష్టం వాటిల్లుతుందనీ మరికొందరు విమర్శించారు.

అమెరికాలో విఫలమైన న్యాయమూర్తి అభిశంసన ఉదంతాన్ని ఇక్కడ ఉటంకించడంలో అక్కడి, ఇక్కడి ఘటనల మధ్య సారూప్యం ఉన్నదని చూపేందుకు కాదు. న్యాయమూర్తులు పక్షపాతం చూపిస్తున్నారనే ఆరోపణలపై విచారణకు ఒక పద్ధతి అంటూ ఉన్నదని తెలియజేయడమే ఉద్దేశం. అదే సమయంలో అమెరికాలో న్యాయవ్యవస్థ స్వాంతంత్ర్యాన్ని పరిరక్షించేందుకు ఏమి చేశారో తెలుసుకోవడం కూడా అవసరం.

న్యాయవిచారణ సంఘం నియమించేందుకు అమెరికాలో ఒక పద్ధతి ఉంది. ఒక న్యాయమూర్తి పైన అసమంజసమైన, పక్షపాతంతో కూడిన వ్యవహారం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించేందకు ఎటువంటి కమిటీని నియమించాలో అమెరికా ఉదాహరణ చెబుతుంది. కానీ అటువంటి న్యాయవిచారణ కమిటీల నియామకం అన్నది ఎప్పుడో ఒక సారి, చాలా అరుదుగా జరుగుతుంది. సెప్టెంబర్ 2004 నుంచి సెప్టెంబర్ 2007 వరకూ అమెరికా న్యాయస్థానాలలో న్యాయమూర్తుల ప్రవర్తనపైన మొత్తం 1,484 ఫిర్యాదులు వస్తే కేవలం 18 ఫిర్యాదులు పరిశీలించేందుకు మాత్రమే న్యాయవిచారణసంఘాలు నియమించారు. ప్రతి ఫిర్యాదును విచారణకు స్వీకరించరు. చాలా సందర్భాలలో న్యాయవిచారణ సంఘాన్ని నియమించవలసిన అవసరం న్యాయవ్యవస్థకు కనిపించదు.

బ్రిటన్ లో న్యాయ వ్యవహరణ దర్యాప్తు అధికారి ఉంటారు. న్యాయవ్యవస్థలో అపసవ్యాలపైన విచారణ జరిగే పద్ధతిని ఆ అధికారి పర్యవేక్షిస్తారు.

ఒక సీనియర్ న్యాయవాది సలహా

న్యాయవ్యవస్థలో అపసవ్య ధోరణుల పట్లా, న్యాయమూర్తుల అభిశంసన (ఇంపీచ్ మెంట్)కు అనుసరించవలసిన పద్ధతుల పట్లా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అనీల్ దీవాన్ ఒక సలహా ఇచ్చారు.  జస్టిస్ వి.  రామస్వామిని సెలవు పెట్టవలసిందిగా అడగడం ద్వారా చీఫ్ జస్టిస్ ముఖర్జీ స్థాపించిన ఆనవాయితీ అనుసరణీయమైనదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కొలిజియం అప్పుడప్పుడు ప్రకటనలను మీడియాకు విడుదల చేయడం, న్యాయవాదుల సంఘానికి విషయాలు తెలియజేయడం, ప్రజలకు విషయం తెలిసేటట్టు చర్యలు తీసుకోవడం ద్వారా పారదర్శకంగా వ్యవహరించడం ఒక్కటే భవిష్యత్తులో అనుసరించదగిన మార్గమని కూడా ఆయన అన్నారు. మంచుముద్ద కొండచరియగా మారి నెత్తిమీద పడకముందే న్యాయమూర్తి పైన వచ్చిన ఆరోపణల విషయంలో ఏమి జరుగుతున్నదో వెల్లడించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యాయం భ్రమ కారాదు

రామస్వామి కేసులో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ చెప్పిన అంశాన్ని అనీల్ దీవాన్ ఉటంకించారు: ‘‘ఒక జడ్జి నైతిక విలువలు అంగడిలో వర్తించే విలువలు కాజాలవు. అవి అంతకంటే ఉన్నత స్థాయికి చెందినవి…న్యాయవ్యవస్థలో ప్రమాణాల పతనం పట్ల, న్యాయవ్యవస్థలో జరుగుతున్న అపసవ్యాలను చాపకిందికి నెట్టే వ్యవస్థీకృతమైన రక్షణల పట్ల ప్రజలలో ఒకరకమైన అపనమ్మకం, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. (https://www.thehindu.com/pinion/lead/judicial-integrity-lessons -from-the-past/article168879000.ece). అనీల్ దీవాన్ 20 అక్టోబర్ 2009లో రాసింది నేటికీ వర్తిస్తుంది. ‘‘ఈ రోజు న్యాయవ్యవస్థలో ఉన్నవారు చెప్పే నీతులు నమ్మేవారు లేరు. ఆమోదయోగ్యమైన సూత్రం ఆమోదయోగ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది. సూర్యుడి వెలుగు బహుశా అన్నిటి కంటే ఉత్తమమైన అంటువ్యాధినివారిని,’’ అంటూ ఆయన రాసింది అక్షరసత్యం.

సంపూర్ణమైన పారదర్శకత, వస్తునిష్టంగా, నైతికత పాటిస్తూ వ్యవహరించేలా చూసే నిఘాయంత్రాంగం వ్యవస్థలోనే అంతర్గతంగా ఉంటే తప్ప న్యాయం అనేది భ్రమాజనితమైన మిథ్యగానే మిగిలిపోతుంది.   

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles