Saturday, September 7, 2024

పేరు ఏదైనా ఏకత్వమే పెన్నిధి

తాజాగా బీహార్ అసెంబ్లీలో ఒక వివాదం చెలరేగింది. అది, మన దేశానికి సంబంధించిన పేరు చుట్టూ సాగింది. బీహార్ లో ఎన్నికల్లో గెలుపొందిన ఏ ఐ ఎం ఐ ఎం ఎమ్మెల్యే అఖ్తరుల్  ఇమాన్ దీనికి కేంద్ర బిందువు అయ్యాడు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే నేపథ్యంలో, ముసాయిదాలో ” హిందుస్థాన్” పదానికి బదులుగా రాజ్యంగంలో ఉన్న “భారత్” అని ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రొటెం స్పీకర్ జితిన్ రాం మాంఝి కొంచెం సేపు అయోమయానికి గురయ్యారు. సభా నియమాల ప్రకారం ఉర్దూలో ప్రమాణం చేసేవారు ” హిందుస్థాన్” అనే పదాన్ని ఉచ్చరించాలని ఆయన సూచించారు. చివరకు, భారత్ అనే పదాన్ని వాడడానికి సభ ఎమ్మెల్యే అఖ్తరుల్ కు అనుమతించింది. హిందుస్థాన్ అనే పదం వాడడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, రాజ్యంగ ప్రవేశికలో అన్ని భాషల్లోనూ “భారత్” అని ఉందని, రాజ్యాంగానికి కట్టుబడి భారత్ అనే పదాన్ని ఉపయోగించాలని తాను భావించినట్లుగా తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆ ఎమ్మెల్యే వివరించారు.

హిందుస్థాన్ అనే పదంపై చర్చ

మొత్తంమీద ” హిందుస్థాన్” అనే పదంపై చర్చ జరిగింది. నిజానికి,  హిందుస్థాన్ అనేది కొత్త పదం కాదు. భారతదేశంలో చాలా చోట్ల వాడే పదమే. ఉత్తర భారతంలో ఎక్కువగా వాడుకలో ఉన్న పదమే.  భారత్ అని అంటారు. తెలుగువాళ్లు ఎక్కువగా భారతదేశం అనే పదం వాడతారు. దేశ వ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండే పదం ” ఇండియా”. ప్రభుత్వ పరంగా భారత్,  ఇండియా  అనే పదాలు గుర్తింపు పొంది ఉన్నాయి. హిందూస్థాన్ అనేది  హిందూదేశానికి రూపాంతరమే. “ఇండియా” అనే వాడుకలో ఉన్న పదానికి బదులుగా భారత్ లేదా హిందుస్థాన్ అనే పేరును అధికారికంగా నామకరణం చెయ్యాలనే ఆలోచనలో బిజెపి ప్రభుత్వం ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. హిందుస్థాన్ అనే పదం వైపే  వారికి మొగ్గు ఎక్కువ ఉన్నప్పటికీ, “హిందూ” అనే పదం ఒక మతానికి ప్రధాన సూచికగా కనిపిస్తూ, లౌకికవాదానికి భిన్నంగా, వివాదానికి కేంద్రబిందువు అవుతుందా? అనే ఆలోచన చేసినట్లుగానూ ప్రచారమైంది.

దేశం పేరు మార్చేస్తారా?

దేశం పేరును మార్చే విషయంలో,  బిజెపి ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా  చెయ్యలేదు. భవిష్యత్తులో చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు చెప్పలేం. కానీ, నామకరణం అంశం కొట్టిపారెయ్యలేం. మన దేశానికి ఉన్న పేర్ల  పుట్టుపూర్వోత్తరాలకు వెళ్తే, అనేక అంశాలు బోధపడతాయి. ఈ భూభాగం మొత్తాన్ని జంబూ ద్వీపం అనేవారు. ఇదే మన ప్రాచీన నామం. తర్వాత భరత శబ్దం వచ్చిచేరి, భరతవర్షం, భారతదేశం అనే పేర్లు రూపొందాయి. హిందూదేశం, ఇండియా అనే పదాలు కూడా వచ్చాయి. జంబూ ద్వీపం అనేది వేదాలలో, పురాణాలలో ఉంది. ఇప్పటికీ వైదిక క్రతువులలో… జంబూ ద్వీపే, మేరో దక్షిణ భాగే/ఉత్తర భాగే  అనే మొదలు పెడతారు. మేరో అంటే మేరు పర్వతానికి ఏ దిక్కులో ఉంటే, ఆ ప్రాంతీయులు ఆ భాగాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో నదుల గురించి కూడా ప్రస్తావిస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే, మన విలాసాన్ని (అడ్రస్ )ను వివరించడం. భరతుడు పరిపాలించాడు కాబట్టి, ఆ పేరుతో భరతవర్షం, భరతఖండం, భారతదేశం అనే పేర్లు వచ్చాయి.

నాగరికత పరిణామం

నాగరికత పరిణామంలో భాగంగా, ముఖ్యంగా నదుల ఒడ్డునే నాగరికత పుట్టింది, పేరుమోసింది. హిందూ అనే శబ్దం అలా వచ్చిందే. సింధు నది ఒడ్డున, పరీవాహక ప్రాంతాలలో వెలసిన నాగరికత సింధూ నాగరికత. సింధూ దేశమే హిందూ దేశంగా పిలవబడుతోంది. పర్షియన్లు సింధూను హిందూగా పిలవడం ప్రారంభించారు. ఇండియా అనే పదం కూడా సింధూ నుండి వచ్చిందే. సింధూ నదిని గ్రీకువాళ్లు ఇండస్ నదిగా పిలిచేవాళ్ళు. ఆ ఇండస్ నుండి ఇండియా ఏర్పడింది. గ్రీక్ నుండి జరిగిన అనువాదంలో ” ఇండికా” అనీ, లాటిన్ అనువాదంలో ఇండియా అనే పదాలు వచ్చాయి. సింధు అనేది సంస్కృత పదం. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ భాషా ప్రభావాలతో “ఇండియా” అనే  పదం రూపాంతరం చెందింది. వీళ్ళెవ్వరికీ భారతదేశ భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సంస్కృతిపై సమగ్రమైన అవగాహన లేదు.

బ్రిటిష్ వారి దురాక్రమణతో ఇండియా పేరు

బ్రిటీష్ వాళ్లు భారత్ ను దురాక్రమించిన తర్వాత ఇండియా అనే పదం మరింత బలపడింది. దేశ నామకరణంలోని వివిధ నిర్వచనాలు గమనిస్తే, ఇలా ఉన్నాయి. ఇండియా, హోదు, ఇండికా, జంబూద్వీప, భరతవర్ష, భారతం, ఇండోయ్, ఇండో, హింద్, ఇండోస్థాన్, హిందూస్థాన్ ఇలా అనేకం ఉన్నాయి. హింద్ స్థాన్ హిందూస్థాన్ అయ్యింది. ఇది పర్షియన్ ప్రభావంతో జరిగింది. ఈ దేశంలో జీవించేవారంతా హిందుస్థానీయులే. “హిందూ శబ్దం” పరిణామ క్రమంలో నాగరికత నుండి మతం ముద్రలోకి వచ్చేసింది. దీనివల్ల  వివాదాలు తలెత్తుతున్నాయి. నేడు  భారతదేశంగా పిలుచుకునే ఈ భూమిని ఎందరెందరో పరిపాలించారు. మరెందరో దురాక్రమించారు. భాషలు, సంస్కృతి, వేషం,ఆహారం, ఆహార్యంలో పెనుమార్పులు వచ్చాయి.

మిశ్రమ సంస్కృతి

నేడు మిశ్రమ సంస్కృతి సాగుతోంది. మానవ పరిణామ క్రమంలో వికాసం, విధ్వంసం రెండూ జరిగాయి. స్వాతంత్ర్య అనంతరం భారత భౌగోళిక రూపమే మారిపోయింది. ఒకప్పటి  భారతదేశం వేరు. ఇప్పటి దేశం వేరు. మొన్నటి వరకూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ భారత్ భూభాగాలే. విభజన దశ నుండి వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో నేడు కొన్ని పదాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఏకత్వం నుండి అనేకత్వం ఏర్పడుతున్న క్రమంలో, సామరస్యం లేకపోతే, ఏ వ్యక్తి అయినా, దేశమైనా రేపు ఏకాకిగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయి. భిన్న భాషల, సంస్కృతుల సమాగమమైన భారతదేశం తెచ్చుకున్న ప్రతిష్ఠ “ఏకత్వం” నుండి వచ్చిందే. హిందూస్థాన్ అని పిలిచినా, భారత్ అని పిలిచినా దేశం ఒక్కటే. అందరూ భారతీయులే.

ప్రభుత్వం పూనుకుంటే…

మన భాషా, సంస్కృతులను మరింత చాటి చెప్పడానికి  ప్రభుత్వం కంకణం కట్టుకొని, పేరును మార్చే ప్రయత్నం చేస్తే, అందరికీ ఆమోదయోగ్యమైన, భారతీయమైన పేరు ఉండడమే సబబు.” సారే జహా సే అచ్ఛా… హిందుస్థాన్ హమారా…” అని, ఎప్పుడో వందేళ్లకు పూర్వమే,  మహ్మద్ ఇక్బాల్ అనే కవి, ఉపాధ్యాయుడు, పండితుడు హిందుస్థాన్ అనే పదం వాడాడు. అందులో ఆయన మతం చూసుకోలేదు. మాతృభూమిని, దేశ ప్రజలను చూసుకున్నాడు.ఇప్పటికీ ఆ గీతాన్ని  అపురూపంగా భావిస్తూ, ఎందరో ఆలపిస్తూ ఉన్నారు. అన్ని దేశాల కంటే, ఈ దేశం మంచిది, గొప్పది అని చాటిచెప్పుకున్న అటువంటి మహనీయులే మనకు ఆదర్శం. దేశంలోని ప్రతి ఒక్కరూ బాగున్నప్పుడే మంచి దేశం అవుతుంది, మంచి ప్రభుత్వం అవుతుంది.”పేరు” ఏదైనా,  దేశ ప్రతిష్ఠ ముఖ్యం, ప్రజల బాగోగులు చూసుకునే పాలన ముఖ్యం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles