Thursday, April 25, 2024

పొద్దెరగని నవతరం కొత్త “బిచ్చగాళ్ళు” ఈ నయా, ఆల్ట్రా-మోడరన్, మహా”ముష్టోళ్ళు”

నా చిన్నప్పుడు, మాఊర్లో, మా ఇంటికి ప్రతీరోజూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో క్రమం తప్పకుండా ఒక ముష్టివాడు వచ్చేవాడు. “అమ్మా… మాదాకబళం  తల్లే… ఆకలిగా ఉందమ్మా… కొంచెం ముద్ద ఉంటే పెట్టమ్మా…” అంటూ చాలా దీనంగా, హృదయవిదారకంగా, మనసును కదిలించేలా అడుక్కునేవాడు. దగ్గర దగ్గర ఒక యాభయ్ ఏళ్ళుండేయేమో, గడ్డంతో, పాతబట్టలు ధరించి అతని ఆహార్యం కూడా చాలా బీదగానే ఉండేది.

మా అమ్మ కూడా వాడికోసం రోజూ ఎంతో కొంత అన్నం, కూర కొంచెం ఎక్కువగా వండి ఉంచి మరీ పెట్టేవారు. ఒక్కోసారి మేము విసుక్కున్నా, అతను రాని రోజు అయితే, అమ్మ కూడా ‘పాపం ఈవేళ రాలేదెందుకనో అనవసరంగా భోజనం వృధాఅయిపోతుంది’ అని కొంచెం బాధపడేవారు.అప్పట్లో ‘ఫ్రిజ్’లు లేని మంచి రోజులు. అన్నం, కూరలు, పెరుగూ కూడా దాచుకుని మరీ తినడం తెలియని రోజులు. పల్లెటూళ్లలో ఎందరో మా అమ్మలాంటి మహాతల్లులు ఎందరో ముష్టివాళ్లకు రోజుకింత భోజనం పెట్టేవారు. అసలు భోజనం వండుకొనేటప్పుడే ఒకరిద్దరికి ఎక్కువే వండేవారు. భోజనం చేసేవేళల్లో పల్లెల్లో రోజూ ఎవరోఒకరు బంధువులో, స్నేహితులో, పొలాల్లో పనిజేసేవాళ్ళో వస్తే వాళ్లకు కూడా సమానంగా భోజనం పెట్టె సంప్రదాయం మా ఊళ్ళల్లో ఉండేది. ఒకవేళ మిగిలిపోతే, ఇలా ముష్టోళ్ళకు వేస్తే పుణ్యం అనేవారు.

Also Read: “అగ్నిశిఖలనెవ్వరూ ఆపలేరు…”

నేను గ్రాడ్యుయేషన్ చేసేరోజులకే మా వూళ్ళో ముష్టివాళ్లు రావడం బాగా తగ్గిపోయింది. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ రోజులకైతే, మొత్తానికే మావూళ్ళో ముష్టివాళ్లు మృగ్యమైపోయారు. దాంతోపాటే సమాంతరంగా పల్లెల్లో అడుగుపెట్టిన   ‘ఫ్రిజ్’లు కూడా ఒక దరిద్రమైన ‘దాచుకొని-తినే’ సాంప్రదాయానికి దారితీసాయి. దానివల్ల కూడా ముష్టివాళ్ళ జీవనోపాధి దెబ్బతిందని చెప్పవచ్చు. మొత్తమ్మీద ముష్టివాళ్ళతోపాటే మా వూళ్ళో పుణ్యం కూడా బాగా తగ్గింది!

ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాకు గత కొద్దికాలంగా నా చిన్నప్పటి రోజులు, నేను మరచిపోయిన ముష్టివాళ్లను ఒకరకమైన పొద్దెరగని నవతరం కొత్త “బిచ్చగాళ్ళు” ఈ మధ్య తరచూ గుర్తుచేస్తున్నారు. ఈ నయా, ఆల్ట్రా-మోడరన్ నిజంగా మహా”ముష్టోళ్ళు” ప్రతిరోజూ నాకు తారసపడుతున్నారు. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్లుంది వీళ్ళ ప్రవర్తన. ఆడుక్కోవడం, ఫాలో-అప్ వ్యవహారశైలి. ఇదో సరికొత్త ముష్టి పద్దతి. నవతరం వ్యాపారపోకడ…!

నా చిన్నప్పుడు కూడా ఇప్పట్లానే ‘ఓట్లు’ అడుక్కునే వారుగానీ, చాలా పద్దతిగా అడుక్కునే వారు. ఇప్పుడు కొంచెం జబర్దస్త్ గా అడుక్కొంటున్నారు. తర్వాత జనాలను వాడుకొని బాగా తింటున్నారు అది వేరే సంగతి. ఈ నిత్య నూతన రాజకీయ ముష్టోళ్ళకు ఎప్పటికీ అంతం లేదు గానీ నేను చాలా తరచుగా క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీసుకి, ఇతరపనులకు వాడుతుంటాను. కొద్దికాలంగా ప్రతి క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగటానికి ముందే “మంచి రేటింగ్ ఇవ్వండి సార్” అని అడుగుతున్నారు.

మా గోదావరి జిల్లావాళ్లకు కామన్ గా ఉండే క్రేజ్ గానివ్వండి, కంపల్సరీ వీక్నెస్ గానివ్వండి ముప్పొద్దులా ‘భోజనప్రియత్వం’ అందులోనూ రెగ్యులర్ గా బయటతినడం అందునా ఈ మధ్య ఎక్కడ తినడానికెళ్లినా ఏ హోటల్, ఢాబా, ఐస్ క్రీమ్ పార్లర్, రెస్టారెంట్ లకు వెళ్ళినా బిల్లుతోపాటు “మంచి రేటింగ్ ఇవ్వండి సార్” అని అడుగుతున్నారు. దీనికి ఆది – అంతం – సమయం – సందర్భం – విచక్షణలు, తేడాలు ఏమీ లేవు. మీరు ఆఖరికి ఏమైనా కొనడానికి వెళ్లినా, సెలూన్ కు వెళ్లినా, బ్యూటీపార్లర్ కు వెళ్లినా, పిల్లలతో సరదాగా అమ్యూజమెంట్ పార్క్ కి వెళ్లినా  ఒకవేళ ఖర్మకాలి ఏ హాస్పిటల్ కు వెళ్లినా, అక్కడ కూడా వాళ్ళు వైద్యంతో పాటే  “మంచి రేటింగ్ ఇవ్వండి సార్” అని మరీ అడుగుతున్నారు.

Also Read: నేను “మనిషి”ని…

అడగడంలో తప్పులేదు… అడుక్కోవడంలోకూడా తప్పులేదు కానీ మంచి సర్వీస్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి రేటింగ్ ఖచ్చితంగా ఇస్తారు అనే కనీస స్పృహ, వివేకం, వివేచన కూడా వీరికి లేకపోవడం దురదృష్టకరం. అడుగడుగునా అడుక్కునే బదులు తమ సేవలను, తమ కేర్, సర్వీస్ లను మెరుగుపరచుకోడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి, కస్టమర్ ను నిజంగా వాస్తవంగా సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం లేదు. అలా చేసినప్పుడు అడుక్కునే పనులెందుకు…!

ఈరోజుల్లో ఇదొక కొత్త విష-సంస్కృతి తయారయింది. వీళ్లంతా మళ్ళీ మంచిగా చదువుకున్నవాళ్లే. కానీ, పని చేయడంకన్నా, తమ బాధ్యత నెరవేర్చడం కన్నా, రేటింగ్స్ అడుక్కునైనా ప్రజెంటేషన్ చేసుకునే తరం ఇది. ఇంకా దరిద్రమేమిటంటే యాజమాన్యాలు కూడా పనిచేసేవారికన్నా ఇలాంటివారిని బాగా గుర్తించడం, గౌరవించడం, ప్రోత్సహించడం. సోషల్ మీడియా రేటింగ్స్ పుణ్యమా అని డిజిటల్ మార్కెటింగ్ పేరుతో వీళ్ళు చేసేవన్నీ గారడీలు, కనికట్టు మోసాలే, చెప్పేవన్నీ  అబద్ధాలే…! కస్టమర్ కి సరైన సేవలు అందించగలిగితే ఇలాంటి నీచాలకు దిగజారే అవసరం లేదు.

పాపం ఆరోజుల్లో తినడానికి తిండిలేక ముష్టి అడుక్కొనేవారు. ప్రజలు కూడా జాలి, దయ, కరుణ చూపి వారి పొట్టనింపేవారు. కానీ, తమపని తాము చేయకుండా బద్దకంతో, సోమరితనంతో అడుక్కుతింటున్న పొద్దెరగని ఈ నవతరం కొత్త “బిచ్చగాళ్ళు”, ఈ నయా, ఆల్ట్రా-మోడరన్, మహా”ముష్టోళ్ళు తమ కళ్లు తెరిచి కష్టపడి, తమపని తాముచేసి కస్టమర్ కు తమ నిర్ణయం తమ విచక్షణతో తామే తీసుకునే స్వేచ్చ, స్వాతంత్య్రం ఇవ్వాలని ఆశిస్తూ… ప్రార్థిస్తూ… కోరుకొంటూ…

జై హింద్ … భారత మాతకు జై…

వివరణ: ‘ఈ ఆర్టికల్ ఎవరినీ ఉద్దేశించినది కాదనీ, పొరబాటునకూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదనీ, ముందుగానే ఎవరికీ, ఎవ్వరి మనోభావాలకీ, సంబంధించినదికాదనే ఈ నిరాకరణ వివరణ’

Also Read: కొందరు యోగులు… ఇంకొందరు భోగులు… మరికొందరు నియంతలు… ఇంకెందరో గొప్పోళ్ళు-పెద్ద మనుషులు…

Ashoka Varma Penmetsa
Ashoka Varma Penmetsa
Mr. Ashoka Varma Penmetsa is a Senior Consultant of Advertising, Branding, Media& Public Relations. He has been in this field for more than 25 Years. He takes care of Corporate Communications Department at a Leading Healthcare Group as HOD. He is also a good writer.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles