Monday, March 20, 2023

ఏడాది గడచినా కొనసాగుతున్న ఉక్రేయిన్ యుద్ధం, చర్చల ప్రసక్తి లేదు

  • అణ్వస్త్ర ఒప్పందం నుంచి తప్పుకున్న రష్యా
  • ఉక్రేయిన్ ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
  • మాస్కోకు వెళ్ళనున్న చైనా అధినేత షీ జింగ్ పింగ్

ఉక్రేయిన్ పైన రష్యా దాడులు ప్రారంభించి సంవత్సరం దాటిపోతోంది. 24 ఫిబ్రవరి 2022న యుద్ధం ప్రారంభమైంది. సరిగ్గా సంవత్సరం గడిచింది. ఈ  యుద్ధానికి అంతం కనిపించడం లేదు. రష్యా అయిదు లక్షల మంది సైనికులను ఈ దాడులకు ప్రయోగించింది. యుద్ధం ప్రారంభించినప్పుడు ఇందులో సగం మందిని ఉపయోగించింది. యుద్ధం ఎడతెగకుండా సాగడంతో సైనికుల సంఖ్యను రెట్టింపు చేసింది. ఉక్రేయిన్ ఒంటరి దేశమైతే ఎన్నడో కూలిపోయేది. కానీ పాశ్చాత్య దేశాలు ఉక్రేయిన్ కు వెన్నుదన్నుగా నిలిచాయి. అయినప్పటికీ అమెరికా, యూరప్ దేశాలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి, ఆయుధాలు పంపుతున్నాయి. సైనికులను పంపడం లేదు. వాటిని ప్రయోగిస్తూ మురణిస్తున్నది మాత్రం ఉక్రేయిన్ పౌరులే. పాశ్చాత్యదేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఆత్మరక్షణకోసం ఉపయోగపడుతున్నాయి. రష్యా సైనికులపై దాడులు చేయడానికి సైతం ఆయుధాలు ఉక్రేయిన్ కి అందుబాటులో ఉంచాయి పాశ్చాత్య దేశాలు.

అకస్మాత్తుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రేయిన్ రాజధాని కీవ్ లో దర్శనమిచ్చారు. ఆ మర్నాడే, అంటే మంగళవారంనాడు, రష్యా అధ్యక్షుడు వ్లాడమిర్ పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉక్రేయిన్ తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అణ్వస్త్ర ప్రయోగాలపైన కట్టడి విధించే న్యూస్టార్ట్ ఒప్పందం నుంచి రష్యా వైదొలుగుతున్నదని కూడా పుతిన్ ప్రకటించారు. త్వరగా విజయం సాధించవచ్చునన్న ఉద్దేశంతో యుద్ధం ప్రారంభించిన పుతిన్ కు అనూహ్యమైన ప్రతిఘటన ఎదురయింది. ఒక పక్కన ఉక్రేయిన్ భారీగా జననష్టాన్నీ, వస్తునష్టాన్నీ చవిచూస్తూనే రష్యాకు సైతం భారీగానే నష్టం కలిగించింది. కొన్ని ఉక్రేయిన్ రాజ్యభాగాలను రష్యా కైవసం చేసుకున్నది. పాశ్చాత్యదేశాలు మాత్రం ఉక్రేయిన్ కు కొండంత అండగా నిలిచాయి.

ఇరు పక్షాలకూ భారీగా ప్రాణ, ఆస్థి నష్టాలు

జననష్టం, ఆస్థినష్టం భారీగా సంభవిస్తున్నప్పటికీ రెండు దేశాలు యుద్ధసన్నాహాలు చేస్తూనే ఉన్నాయి కానీ రాజీకి సిద్ధంగా లేవు. చర్చల ప్రసక్తి చేయడంలేదు. యుద్ధాన్ని కొనసాగించేందుకు పుతిన్ సిద్ధంగా ఉంటే ఎంతకాలమైనా ఉక్రేయిన్ ను బలపరిచేందుకు యూరోపియన్ దేశాలు, అమెరికా సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం యావత్తూ ఉక్రేయిన్ భూభాగంలోనే జరుగుతోంది కనుక సుదీర్ఘ యుద్ధం ఉక్రేయిన్ కి నష్టదాయకం. గణనీయమైన  ఉక్రేయిన్ భూభాగం  రష్యా వశమైపోయింది. ఆస్థినష్టం భారీగా జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. పైగా యుద్ధం ఇంకా కొనసాగితే అది రష్యాకీ, నాటో దేశాలకీ మధ్య ప్రత్యక్ష యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉంది. అణ్వస్త్రాలు కలిగిన దేశాలమధ్య యుద్దం జరిగితే వినాశనం ఆ దేశాలకే పరిమితం కాదు. మొత్తం ప్రపంచాన్ని విధ్వంసం చేస్తుంది. ఇప్పటికే ఆహార, ఇంధన సంక్షోభాలు సృష్టించి ప్రపంచాన్నిఅతలాకుతలం చేసింది. సైనికులు కాకుండా యుద్దం కారణంగా చనిపోయిన ఉక్రేయిన్ పౌరుల సంఖ్య 7, 199 మంది. గాయపడినవారి సంఖ్య 11,756 మంది. యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య 1,44,440 మంది. ఫ్రాణాలు కోల్పోయిన ఉక్రేయిన్ సైనికుల సంఖ్య  1,00,00 మంది. యుద్ధం కారణంగా ఉక్రేయిన్ లో సుమారు 400 వంతెనలు ధ్వంసమైనాయి. ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్లు విచ్ఛిన్నమైనాయి. ఉక్రేయిన్ ఆర్థికంగా 70 వేల కోట్ల డాలర్లు నష్టబోయింది.

ఉక్రేయిన్ పై రష్యా ఏకపక్షంగా యుద్ధానికి దిగిందంటూ రష్యాపైన అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. అధిక ధరకు చమురు కొనుగోలు చేయకుండా కట్టడి చేశారు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రష్యా ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలిపోతుంది. కరోనా దెబ్బ నుంచి ప్రపంచం కోలుకోకముందే పుతిన్ దెబ్బకొట్టాడు.

పుతిన్ ను ప్రేరేపించిన నాటో విస్తరణ ప్రయత్నాలు

సోవియెట్ యూనియన్ పతనం తర్వాత తూర్పు ఐరోపా దేశాలు స్వతంత్ర్యం ప్రకటించుకున్నాయి. సోవియట్ యూనియన్ నాయకత్వంలోని సెంటో దాదాపు రద్దయింది. సెంటో దేశాలుగా ఉండిన తూర్పు ఐరోపా దేశాలను క్రమంగా నాటో కూటమిలో చేర్చుకుంటూ అమెరికా బలపడుతోంది. చివరికి ఉక్రేయిన్ ను కూడా నాటోలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేయడం పుతిన్ సుతరామూ సహించలేకపోయారు. ఇది ఇలా ఉండగా, తూర్పు ఉక్రేయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడేవారిపైన ఉక్రేయిన్ ప్రభుత్వం మారణకాండ సాగిస్తోంది. దీన్ని కారణంగా చూపించి పుతిన్ ఉక్రేయిన్ పైకి సుమారు రెండు లక్షల మంది సైనికులను పంపించారు. వారు శతఘ్నులు, డ్రోన్లూ, క్షిపణులతో దాడులకు తెగబడ్డారు. విద్యుచ్ఛక్తి కేంద్రాలను పేల్చివేశారు. ఆవాసాలపైన దాడులు చేసి వాటిని విధ్వంసం చేశారు. క్రిమియా సహా చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఒకానొక దశలో రష్యా సైనికులు కీవ్ వరకూ వెళ్ళారు. ఉక్రేయిన్ లోని దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా అనే ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకున్నట్టు పుతిన్ ప్రకటించారు. మొత్తం మీదికి ఉక్రేయిన్ కు పొరుగుదేశంలోని బెలారస్ ప్రాంతం రష్యా చేతుల్లో ఉంది. బెలారస్ భూభాగం నుంచి రష్యా సైనికులు ఉక్రేయిన్ పైన దాడులు ముమ్మరం చేశారు.  మొదట్లో ఆత్మరక్షణకు పరిమితమైన ఉక్రేయిన్ సైనికులు పాశ్చాత్యదేశాల నుంచి ఆయుధాలు అందడంతో విజృంభించారు. హాస్య నటుడుగా పేరుతెచ్చుకొని రాజకీయాలలోప్రవేశించిన ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గొప్ప పోరాట యోధుడుగా, దౌత్యవేత్తగా పరిణమించి ప్రపంచాన్ని అమితాశ్చర్యంలో ముంచెత్తారు. పుతిన్ తో చర్చలు జరపడానికి సిద్ధపడిన జెలెన్స్కీ ని నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెనక్కి లాగారు.

చైనా, భారత్ తటస్థ వైఖరి

రష్యాకు చైనా మిత్రదేశం. భారత్ కూడా మిత్రదేశమే. ఇరాన్ అండగా నిలిచింది. ఇరాన్ డ్రోన్లను రష్యాకు సరఫరా చేస్తోందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ చైనాకు దగ్గరవుతోంది. భారత్ కు కూడా ఇరాన్ సన్నిహితమే. చైనా, భారత్ లు రష్యా దుందుడుకు వైఖరిని ఖండించడం లేదు. సమర్థించడం లేదు కూడా. తటస్థంగా ఉన్నాయి. బారత్ వైఖరి నచ్చకపోయినా పాశ్చాత్య దేశాలు కిమ్మనకుండా గమ్మునున్నాయి. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొంటున్న భారత్ పైన ఆంక్షలు విధించలేదు. అది తమ వ్యవహారం కాదని జర్మన్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. అమెరికా కూడా అంతే. పట్టించుకోవడం లేదు.

ఏదో ఒక పక్షం విజేతగా నిలిస్తేనో లేదా చర్చల ద్వారానో యుద్ధాలు ఆగిపోవాలి. ఏ పక్షమూ గెలిచే సూచనలు కనిపించడం లేదు. కనుక చర్చలే శరణ్యం. ఉక్రేయిన్ లో శాంతిస్థాపనకు చైనా విశేషంగా ప్రయత్నిస్తున్నది. ఇండియా కూడా శాంతి కోరుకుంటున్నది. చైనా ముందు యుద్ధానికైనా, శాంతి సాధనకైనా ఇండియా బలం సరిపోదు. అయితే,  భారత్ ప్రభావం ఐరోపా దేశాలపైన గణనీయంగానే ఉన్నది. బారత్ రష్యాకీ, ఉక్రేయిన్ కీ దగ్గర. చైనా కూడా రష్యాకీ, ఉక్రేయిన్ కీ సన్నిహిత దేశం. రష్యాకైతే అత్యంత సన్నిహితం. ఉక్రేయిన్ తో సైతం చైనాకు సంబంధాలు బలంగానే ఉన్నాయి. రష్యాతో సన్నిహిత సంబంధాల కోసం ఉక్రేన్ ను త్యాగం చేయడానికి చైనా సిద్ధంగా లేదు. అంతమాత్రాన చైనాను దూరం చేసుకోవడం కూడా చైనా అభిమతం కాదు.

షీ మాస్కో సందర్శన

చైనా అధినేత షీ జిన్ పింగ్ త్వరలో మాస్కో సందర్శించనున్నారని పుతిన్ బుధవారం ప్రకటించడం విశేషం. ఇది బైడెన్ ఉక్రేయిన్ సందర్శనకు విరుగుడు. చైనా కనుక రష్యాని పూర్తిగా సమర్థించి ఆయుధాలు సరఫరా చేస్తే అమెరికా, కెనడా, యూరప్ దేశాల ఎత్తులు చిత్తయ్యే ప్రమాదం ఉంది. అదే సమయంలో భారత్ దౌత్య ప్రతినిధులు బీజింగ్ లో చైనా దౌత్య ప్రతినిధులతోసమావేశం కావడం గమనార్హం. డధ్దాఖ్ లో ఘర్షణ తర్వాత చైనా, ఇండియా దౌత్య ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరపడం ఇదే ప్రథమం. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించినప్పటికీ, చైనాతో వైరం పెట్టుకోవాలంటూ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు పురిగొల్పుతున్నప్పటికీ భారత ప్రధాని నరేంద్రమోదీ మాత్రం చైనాతో సఖ్యంగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అటు అమెరికాతో, ఇతర పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సాధ్యమైనందవరకూ చైనాతో కూడా సంబంధాలను పెంపొందించుకోవాలనే సకారాత్మక వైఖరిని మోదీ అవలంబిస్తున్నారు. ఉక్రేయిన్, రష్యా మధ్య చర్చలు జరిగే విధంగా వాతావరణం నిర్మించేందుకు చైనాతో సహకరించడానికి కూడా మోదీకి అభ్యంతరం ఉండనక్కరలేదు. పాకిస్తాన్ పైన ఒంటికాలిమీద లేచినట్టు చైనామీద లేవడానికి వీలులేదనే క్షేత్రవాస్తవికత, ప్రాప్తకాలజ్ఞత మోదీకి పుష్కలంగా ఉన్నాయి. అనునయంగా వ్యవహరించి, ఇండియాలో స్నేహం వల్లనే చైనా ప్రయోజనాలు ఉంటాయనే అభిప్రాయం కలిగించి, చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. చైనా ఆధిక్యాన్ని అంగీకరించడం వాస్తవిక దృక్పథం అనిపించుకుంటుంది. అలవికాని చోట అధికులమనరాదనే సూత్రం మోదీకి బాగా తెలుసు.

ఉక్రేయిన్ అధ్యక్షుడితో, రష్యా అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు శాంతి ఒప్పందం చేసుకోవాలని భారత ప్రధాని మోదీ అన్నారు. యూరోపియన్ దేశాలకు ఉక్రేయిన్ లో శాంతి స్థాపన చాలా అవసరం. ముఖ్యంగా గతంలో సోవియెట్ యూనియన్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన తూర్పు ఐరోపా దేశాలపైన ఉక్రేయిన్-రష్యా యుద్ధం ప్రభావం ఉంది. వచ్చే రెండు, మూడు వారాలలో దిల్లీలో విదేశీ నాయకుల తాకిడి ఎక్కువగా ఉండబోతున్నది. జర్మనీ అధ్యక్షుడు ఓలాఫ్ సోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియామెలోనీ త్వరలో దిల్లీ సందర్శించనున్నారు. జి-20 దేశాల విదేశాంగమంత్రులు సమావేశం వచ్చేవారం దిల్లీలో జరగబోతోంది. రష్యా విదేశాంగమంత్రి సెర్జీ లవరోవ్, అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ దిల్లీ సందర్శించనున్నారు.

వాంగ్ యీ యూరప్ పర్యటన

ఇది ఇలా ఉండగా, చైనా అధినేత షీ జింగ్ పింగ్ ఏదో ఒక శాంతి ప్రతిపాదన సిద్ధం చేసుకుంటున్నట్టు వినికిడి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ యూరప్ లో పర్యటించారు. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ విదేశాంగమంత్రులతో మాట్లాడారు. ఉక్రేన్ విదేశాంగమంత్రి డిమెట్రో కులేబాను కూడా వాంగ్ యీ కలుసుకున్నారు. ఆయన ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. షీ జింగ్ పింగ్ ప్రతిపాదనకోసం విదేశాంగమంత్రి యాంగ్ రంగం సిద్ధం చేస్తున్నారు. రష్యాకి అత్యంత సన్నిహితమైన దేశం చైనా కనుక చైనా మాటకు యూరప్ లో విలువ ఎక్కువ. ఉక్రేయిన్ లో యుద్ధాన్ని ముగించేందుకు రష్యాకు నచ్చజెప్పవలసిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ చైనా అధినేత షీ జింగ్ పింగ్ కు విజ్ఞప్తి చేశాడు. అదే సమయంలో దౌత్యలో విజయం సాధించి చైనా బలపడడం కూడా బైడెన్ కు ఇష్టం లేదు. బ్రిటన్ ప్రధాని సునాక్ కూడా ఈ విషయంలో బైడెన్ మాటే బలపర్చుతారు. యుద్ధాన్ని నిలుపు చేయించి లోగడ ఐరోపా దేశాలతో చెడిపోయిన సంబంధాలను మెరుగు పరచుకోవాలన్నది షీ జిన్ పింగ్ ఆలోచన. ఐరోపా భద్రతావ్యవస్థకు చైనా పూచీదారుగా ఉండడం అన్నది చైనాకు కలిసివచ్చే అంశం. ఐరోపాని అమెరికా చేతులలో నుంచి తన చేతులలోకి తీసుకోవాలన్నది చైనా ప్రయత్నం. ఆ ప్రయత్నం జరుగుతున్న సమయంలోనే ఉక్రేయిన్ యుద్ధం వచ్చి అమెరికాను తిరిగి బరిలోకి తీసుకొని వచ్చింది. ఉక్రేయిన్ లో శాంతి స్థాపించిన తర్వాత ఐరోపాలో బలపడటానికి చైనా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే జర్మనీతో చైనాకు మంచి సంబంధాలు  ఉన్నాయి. బ్రిటన్ తో మాత్రం చైనా కు సత్సంబంధాలు లేవు. బ్రిటన్ కంటే జర్మనీ పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన దేశం. తూర్పు యూరోపియన్ దేశాలతో చైనా సంబంధాలు బాగానే ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికాలలోచైనాకు తిరుగులేదు. ఐరోపాలో కూడా ఆధిక్యం సంపాదిస్తే ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదగవచ్చునని చైనా ఆశ. ఈ క్రమంలో చైనాతో విరోధం పెంచుకోవడం కంటే స్నేహం పెంచుకోవాలని మోదీ తాపత్రయం. భారత ప్రయోజనాల దృష్ట్యా చూసినట్లయితే ఇది చాలా నిర్మాణాత్మకమైన విదేశీ విధానం. ప్రస్తుతానికి ఉక్రేయిన్ లో యుద్ధం నిలిపివేయడానికి బీజింగ్ తో కలసి దిల్లీ ప్రయత్నించాలి.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles