Tuesday, April 16, 2024

నేటి తరగతి గదులలో జంట ప్రమాదాలు

తరగతి గదులు ఎన్నడూ వార్తలలోకి ఎక్కవు. ఎప్పుడైనా అవి వార్తలలోకి ప్రవేశిస్తే అది సర్వసాధారణంగా తప్పుడు కారణంగానే జరుగుతుంది. తరగతి గదులు రాజకీయ కుస్తీలకు గోదాలవుతాయనే పచ్చి నిజాన్ని కర్ణాటకలో ఇటీవల సంభవించిన పరిణామాలు మన కళ్ళకు కట్టాయి. తరగతి గదులు మన దేశంలోని వైవిధ్యాన్ని పెంచిపోషించగలవు, సంబరం చేసుకోగలవు. లేదా ఆధిక్యభావాన్ని నొక్కివక్కాణించేందుకూ, ప్రతిఘటన శక్తిని ప్రదర్శించేందుకూ దీటైన స్థలాలుగా మారవచ్చు. మన నయాభారతంలో పురుడుపోసుకుంటున్న కొత్త వాస్తవికత ఇది.  ఉడుపిలో జరిగిన అలజడి కలిగించే పరిణామాలకు సంబంధించిన వార్తలు వచ్చినప్పటి నుంచీ, నా మనసు తరగతి గదిపై నుంచి మరోవైపు మళ్ళలేదు. దేశంలోకెల్లా అత్యంత పవిత్రమైన దేవాలయంలోని గర్భగుడి కంటే ఎంతో ముఖ్యమైన ప్రదేశం అది నాకు. తరగతి గదిపైనా, ఆ పవిత్రమైన ప్రదేశంలో నా యాత్రానుభవంపైనా నా అభిప్రాయాలను ఈ రోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.

Also read: హిజాబ్ వివాదం- ఏ తీరాలకి ఈ పయనం?

నా జీవితంలో చాలా భాగం తరగతి గదులలో గడిపాను. నిజంగా అంటే నిజంగా చాలా భాగం. మనకు పాఠాలు చెప్పే విద్యాసంస్థలలో అతి చిన్న తరగతి నుంచి అత్యున్నత విద్య  బోధించే తరగతి వరకూ నేను తరగతి గదులలోనే ఉన్నాను. 10+2+3+2+2+4. పదేళ్ళ బడి. రెండేళ్ళు విశ్వవిద్యాలయంలో చేరడానికి చదివే ప్రీయూనివర్శిటీ (ఇంటర్మీడియట్) కోర్సు, మూడేళ్ళ డిగ్రీ చదువు, రెండేళ్ళ మాస్టర్స్ (పోస్ట్ గ్రాడ్యుయేషన్), పరిశోధనలో ప్రవేశించే డిగ్రీ కోసం రెండేళ్ళు, పరిశోధనలో పట్టా కోసం నాలుగేళ్ళ అధ్యయనం. అంతా కలిపితే శతాబ్దంలో దాదాపుగా నాలుగోవంతు. ఒక చిన్న పట్టణంలో మామూలు మునిసిపల్ స్కూలులో చదివాను. ప్రపంచంలో కెల్లా అత్యంత వైభవోపేతమైన నగరాలలోని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విద్యాసంస్థలలో చదివాను. అటువంటి విద్యాసంస్థలలో కొంతకాలం పాటు పాఠాలు చెప్పాను. మీలో చాలామంది లాగానే నేను కూడా తరగతి గదిలో ఉద్భవించిన జీవిని. నాకు తెలిసిన పద్ధతులలో కంటే ఎక్కువగానే తరగతి గదులు నా జీవితాన్ని తీర్చిదిద్దాయి. నాలో ఉన్న మంచీ, చెడూ తరగతి గది ప్రసాదించినవే. మీలో చాలా మందికీ ఇలాగే జరిగి ఉంటుంది.

Also read: దక్కన్ పీఠభూమి నుంచి దేశ ప్రజలకు రెండు పరస్పర విరుద్ధమైన సందేశాలు, సంకేతాలు

పాత ఇంట్లో చదువు ప్రారంభం

నేను ఒక మునిసిపల్ స్కూల్లో చదివాను. అది ఒక పాత ఇల్లు. బడికోసం కట్టిన భవనం కాదు. ముందు గదిలో ఎడమవైపు ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులూ కూర్చునేవారు. కుడివైపు ఉన్న చిన్నగది స్టోర్ రూం. ఈ రెండు గదుల మధ్యన ఉన్న వరండాలో రెండు తరగతులు జరుగుతూ ఉంటాయి. గడప దాటుకొని మధ్యలో ఉన్న గదిలోకి వెడితే తరగతి గదిలో ఉంటారు. మధ్యలో ఉన్న ఈ గదికి ఎడమవైపునా, కుడివైపునా రెండు చిన్న గదులున్నాయి. అవి కూడా తరగతి గదులే. మధ్య గదిలో నుంచి ఇంకా లోపలికి వెడితే, ఇది వరకు వంటగదిగా ఉపయోగించిన చిన్న గది ఉంది. అక్కడా ఒక తరగతి జరుగుతోంది. వెనక పెరట్లో కొద్దిగా స్థలం ఉంది. అందులో పెద్ద పూరిగుడిశ వేశారు. అందులో మూడు తరగతులు జరుగుతాయి. ఒక తరగతికీ, మరో తరగతికీ మధ్య విభజన గోడలు లేవు. బడి జరిగే సమయంలో అక్కడంతా ధ్వని ఉంటుంది. విద్యార్థులకు వినపడే విధంగా మాట్లాడాలని టీచర్లు స్వరం పెంచుతారు. బడిలో ప్రతి టీచరూ చెప్పిన ప్రతి విషయం విద్యార్థులూ, టీచర్లూ అందరూ వింటారు. నేలకు రెండు అడుగుల ఎత్తులో ఉన్నబెంచీలపైన మేము కూర్చునేవాళ్ళం. బడికి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం. మేము తరగతి గదికి వెళ్ళగానే అంతవరకూ రాని విద్యార్థులను వారి ఇళ్ళకు వెళ్ళి తీసుకొని రమ్మని టీచర్లు పురమాయించేవారు. మొదటి అరగంటసేపూ ఇటువంటి పనులే. మేము విద్యార్థులం మాత్రమే కాకుండా తోటి విద్యార్థులు బడికి వచ్చేట్టు చూసేవాళ్ళం కూడా. వరుసగా నాలుగైదు రోజులపాటు బడికి రాని విద్యార్థుల ఇళ్ళకు టీచర్లు స్వయంగా వెళ్ళేవారు. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల్ని వెంటబెట్టుకొని బడికి తీసుకొని వచ్చేవాళ్ళు. తరగతి గదిలోకి ఎవరైనా నిరభ్యంతరంగా రావచ్చు. మా చిన్న పట్టణంలో తగినంతమంది క్రైస్తవులూ, ముస్లింలూ ఉన్నారు. తరగతి గదిలో మేమంతా కలిసి కలివిడిగా ఉండేవాళ్ళం. మా మతాల గురించి కొద్దిగా అవగాహన ఉన్నా వాటిని పట్టించుకునేవాళ్ళం కాదు. మేము భిన్నంగా ఉన్నామని ఎన్నడూ అనుకోలేదు. మాలో కొందరిని పరాయివారుగా చూడనే లేదు.

Also read: స్వాతంత్ర్య సమరయోధులను కాజేయడం నయాభారత్ కు అనివార్య

పక్కా భవనంలో హైస్కూల్

నేను చదివిన హైస్కూల్ కి పక్కా భవనం ఉంది. విశాలమైన ఆటస్థలం ఉంది. మాకు చక్కటి తరగతి గదులు ఉండేవి. విశాలంగా, గాలి వీస్తూ హాయిగా ఉండేవి.  ఇద్దరు విద్యార్థులు కూర్చోడానికి వీలుగా గట్టి చెక్క బల్లలు ఎత్తయినవి ఉండేవి. వాటిమీద డెస్క్ లు ఉండేవి. ఇంకు పాత్రలు ఉండేవి. వాటిని మేము ఎన్నడూ ఉపయోగించలేదు. కానీ అవి అక్కడే ఉండేవి. గోదావరి డెల్టా మిషన్ అనే సంస్థ మా స్కూలును నడిపేది. ప్రతి ఉదయం మా తరగతి గదుల నుంచి ‘సారే జహా సే అచ్చా…’పాట ఆలాపనతో మార్చి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కొద్దిసేపు బైబిల్ పఠనం, చిన్న ప్రార్థన, ప్రధానోపాధ్యాయుడి హితవాక్యాల తర్వాత జాతీయ గీతాలాపనతో ‘అసెంబ్లీ’ (సమావేశం) అయిపోయేది. మళ్ళీ ‘సారా జహా సే అచ్చా…’ గీతాలాపన వింటూ మా తరగతి గదులకు మార్చి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మాకు చాలా క్రమశిక్షణ పాటించే పాత తరం ఉపాధ్యాయులు ఉండేవారు. వారే మాకు దేవుళ్ళు.  వారంటే భయం ఉండేది. గౌరవం ఉండేది. వారి గురించి ఉదాత్తమైన భావన ఉండేది.

పెద్ద ప్రాంగణంలో డిగ్రీ కాలేజీ

నా ఇంటర్మీడియట్ చదువు మా చిన్న పట్టణంలోని కాలేజీలోనే సాగింది. కాలేజీ ప్రధాన భవనంలో లోగడ డచ్ ఫ్యాక్టరీ ఉండేది. దాని చుట్టూ ఆస్బెస్టాస్ కప్పులతో కొన్ని షెడ్లూ, కొన్ని ఆర్ సీసీ గదులూ నిర్మించారు. బోధనా మాధ్యమం తెలుగు. ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా బోధించేవారు. ఆ సబ్జెక్టును క్షుణ్ణంగా చెప్పేవారు. ఎంత బాగా చెప్పేవారంటే నేను ఇంగ్లీషు మీడియంలో డిగ్రీ చదవడానికి వెళ్ళినప్పుడు కొత్త మాధ్యమం నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఇంగ్లీషు మాట్లాడటం కొంచెం కష్టంగా ఉండేది. కొద్ది మాసాలకే ఆ అవాంతరాన్ని తేలికగా అధిగమించాం. ఆ డిగ్రీ కాలేజిని జేసూట్ ప్రీస్ట్ లు నడిపేవారు. పెద్ద ప్రాంగణం, పరిశుభ్రంగా ఉండే  తరగతి గదులూ, హాస్టల్ గదులూ, ఆహ్లాదకరమైన పరిసరాలూ, సుచిగా తయారు చేసిన మామూలు ఆహార పదార్థాలూ ఉండేవి. క్రమశిక్షణ మాత్రం కఠినంగా అమలు జరిగేది. ప్రతి విషయం మీద స్పష్టతనిచ్చే విధంగా బోధన ఉండేది. ప్రార్థనలు కానీ, హితోక్తులు కానీ మతప్రస్తావన కానీ ఉండేది కాదు. మా అధ్యాపకులలో హిందువులూ, ముస్లింలూ, క్రైస్తవులూ ఉండేవారు. విద్యార్థులూ అంతే. మా మతాల గురించీ, ఆచారాల గురించీ, మా అస్థిత్వం గురించీ మాతో ఎవ్వరూ ప్రస్తావించేవారు కాదు. మేము చదివే చదువులూ, మేము ఎంచుకునే ప్రత్యేక కోర్సులూ,  మేము ఉండే హాస్టళ్ళూ మా అస్థిత్వాన్ని చాటేవి. అంతే. మరేమీ కాదు.

Also read: భారత భవితవ్యాన్ని నిగ్గు తేల్చే యూపీ ఎన్నికలు

విశ్వవిద్యాలయం అపరిమిత స్వేచ్ఛ

నేను విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు సాంస్కృతికపరమైన దిగ్భ్రాంతికి (కల్చరల్ షాక్) లోనైనాను. మేము తాగే కాఫీ కప్పులతోనే తరగతి గదిలోకి వెళ్ళేవాళ్ళం. ఆడపిల్లలూ, మగపిల్లలూ కలిసి పక్కపక్కనే కూర్చొనేవాళ్ళం. మామీద ఎటువంటి నిర్బంధాలూ ఉండేవి కావు. తెల్లవారుజాము వరకూ కాంపస్ లో కార్యకలాపాలు కొనసాగుతూ ఉండేవి. తరగతి గదులలోకి వెళ్ళి, లైట్లు తీసివేసి, పడుకోమని ఎవ్వరూ  చెప్పేవారు కాదు. తరగతి గదులు, చాయ్ ధాబా, హాస్టల్ డైనింగ్ హాల్, విద్యార్థి సంఘాల ఎన్నికల సందర్భంగా సమావేశాలు ధ్వని, ప్రతిధ్వనులుగా ఉండేవి. ఒకదానిలోకి మరొకటి చొరబడేది. పుస్తకాలు అదేపనిగా చదివేవాళ్ళం, నిరంతరం చర్చించుకునేవాళ్ళం, లైబ్రరీ దగ్గరే ఎక్కువగా ఉండేవాళ్ళం. కాంపస్ జీవితం నియంత్రణ లేనిది. కానీ దిశ, లక్ష్యం లేనిది మాత్రం కాదు. ఆత్మనియంత్రణ అందరికీ వర్తించే సూత్రం. దిగాలు పడిన క్షణం ఉండేది కాదు. హింసకు తావు లేదు. కాంపస్ లో కొత్తగా చేరిన పిల్లల్ని ఏడిపించడం (రాగింగ్)కానీ ఆడపిల్లలను ఆటపట్టించడం కానీ ఉండేది కాదు.  మా అందరికి అది అత్యంత భద్రమైన ప్రాంగణం. మేము ఏ స్కూల్లో లేదా  ఏ సెంటర్ లో చదువుతున్నామో అదే మా గుర్తింపు. చదువుతున్న చదువు, రాజకీయాలు మా అస్థిత్వంపైన ప్రభావం వేసేవి. ప్రాంతం గురించి అప్పుడప్పుడు ప్రస్తావన వచ్చేది. కానీ ప్రాంతీయతత్వం రవ్వంతైనా ఉండేది కాదు. మా కాంపస్ ఒక నోబెల లారియెట్ ను సమాజానికి ఇచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులూ, ప్రధాన కార్యదర్శులూ, పోలీసు డైరెక్టర్ జనరల్స్, రాయబారులూ, ప్రొఫెసర్లూ, వైస్ చాన్స్ లర్లూ, పార్లమెంటు సభ్యులూ, రాజకీయ నాయకులూ ఒకప్పుడు ఈ కాంపస్ విద్యార్థులే. ప్రస్తుత కేంద్ర మంత్రి మండలిలో అత్యంత ప్రదానమైన రెండు స్థానాలలో ఉన్నవారు మా కాంపస్ లో చదువుకున్నవారే. వారంతా దేశానికీ, సమాజానికీ, మానవాళికీ ఎంతో విశిష్టమైన సేవలు చేస్తున్నారు.

Also read: రైతులు, ఆర్థికప్రవీణులూ, ప్రజాస్వామ్యం

ఎల్ఎస్ఐలో ప్రపంచంలోని అన్ని రకాలవాళ్ళూ ఉండేవాళ్ళు

నా విశ్వవిద్యాలయం జెఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూయూనివర్శిటీ) ఒకానొక మినీభారతం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ ఎస్ ఇ)లో తరగతులు ప్రపంచానికి సూక్ష్మరూపాలు. ఆ కాంపస్ లో , సెమినార్ హాల్స్ లో భూగోళంలోని అన్ని ఖండాల నుంచీ, జాతుల నుంచీ విద్యార్థులు వచ్చి నిండిపోయేవారు. మా పాత థియేటర్ ప్రతి భావజాలానికీ చెందిన నాయకుల ప్రసంగాలకు వేదిక అయ్యేది. సంపూర్ణ అతివాదుల నుంచి పూర్తి మితవాదుల వరకూ అన్ని రకాల రాజకీయ భావజాలాలకి చెందినవారూ వచ్చేవారు. వారు హుందాగా మాట్లాడేవారు. మేము చాలా గౌరవంగా వినేవాళ్ళం. ప్రతి వక్తపైనా ప్రశ్నలతో దాడి చేసేవాళ్ళం. వారి అలవాట్లనూ, ఉద్దేశాలనూ, లక్ష్యాలనూ నిశితంగా ప్రశ్నించేవాళ్ళం. వక్తలను వెక్కిరిస్తూ వింత ధ్వనులు చేయడం కానీ, వారు కోపం వచ్చి క్లాసును రద్దు చేసి వెళ్ళిపోవడం కానీ జరిగేది కాదు. మా తరగతి గదులు భద్రమైనవి. కొత్త ఆలోచనలు వ్యక్తపరచుకోవచ్చు. చర్చోపచర్చలు జరుపుకోవచ్చు. ప్రశ్నలు సంధించుకోవచ్చు. విభేదాలను వ్యక్తీకరించవచ్చు. దుస్తులు, వైఖరులూ, లింగం, భావజాలం, సంస్కృతి, భాష, యాస, నేపథ్యం కారణంగా ఎవ్వరూ ఎవ్వరినీ పరాయివారుగా పరిగణించేవారు కాదు.

Also read: నవభారతం: మతి పోకుండా ఉండటం ఎట్లా?

అదంతా నా కథ

ఇంతవరకూ మీరు చదివింది నా కథ. తరగతి గది కథ. ముఖ్యంగా భారత తరగతి గతి కథ. దీనిలోని ప్రత్యేకత ఏమంటే ఆ తరగతి గదిలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటుంది. దేశ వైవిధ్యాన్నీ, బహుళత్వాన్నీ, సహనాన్నీ సంబరం చేసుకునే ప్రదేశం.  విద్యార్థుల కుటుంబాల పేదరికం కానీ సామాజిక స్థితిగతులు కానీ విద్యాలయాలలో చేరడానికీ, విద్యార్జన చేయడానికీ అడ్డురావు. ప్రాథమిక స్థాయి నుంచి పరిశోధన స్థాయి వరకూ ఇదే పద్ధతి. విద్యార్థి విశ్వాసాలూ, మతం, దుస్తులూ, సంస్కృతీ, ఆహారపుటలవాట్లూ వేటినీ ప్రశ్నించేది లేదు, వేటికీ అభ్యంతరం చెప్పేది లేదు. అస్థిత్వ ఆదిక్య ప్రదర్శన ఉండేది కాదు. అందరూ ఒకే రకంగా ఉండాలని తరగతి గది కోరుకోలేదు. ఒక రకమైన దుస్తులు ధరించమని కానీ ఫలానా దుస్తులు ధరించకూడదని కానీ ఆదేశిస్తూ ఆధిక్యాన్నినిరూపించుకునే ప్రాంగణమని ఎవ్వరూ అనుకోలేదు. విద్యార్థులు ఏ తరగతి గదులకు హాజరు కావలో నిర్ణయించే అంశం తమ తల్లిదండ్రుల ఆర్థిక హోదా కానే కాదు.

Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం

కథ మారిపోయింది

ఈ కథ మారిపోయింది. ఈ రోజు ఎయిర్ కండీషన్డ్ తరగతి గదులూ, ఎయిర్ కండీషన్డ్ బస్సులూ, సుఖప్రదమైన ఫైవ్ స్టార్ సదుపాయాలూ కలిగిన సంపద్వంతమైన ప్రైవేటు స్కూళ్ళు  ఉన్నాయి. అక్కడ చదువుకునే విద్యార్థులు విజ్ఞాన యాత్రకోసం బహు సుందరమైన ప్రాంతాలకు, కొండొకచో విదేశాలకు వెడతారు. వారి తరగతి గదులలో అధునాతన ఫర్నీచర్ ఉంటుంది. ఆడియో-విజువల్ పరికరాలు సిద్ధంగా ఉంటాయి. ఇంటర్నెట్ సౌకర్యం సరేసరి. తాజా టీచింగ్-లర్నింగ్ సదుపాయాలు ఉంటాయి. కొత్తగా వస్తున్న ప్రైవేటు యూనివర్శిటీలు సైతం కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా అద్భుతమైన భౌతికపరమైన ఫర్నీచర్  ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ప్రభుత్వరంగంలో ఉన్న పాఠశాలల్లో, కళాశాలల్లో పరిస్థితులు అధ్వానంగా, దయనీయంగా ఉన్నాయి. తక్కువస్థాయి ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ప్రభుత్వ విద్యాసంస్థలలో కంటే మెరుగైన సదుపాయాలు కలిగి ఉన్నాయి. ఆ విధంగా ఈ రోజు సంపన్నులకో తరగతి గది ఉంది. పేద విద్యార్థులకు మరో రకమైన తరగతి గది ఉంది. ఈ మార్పు చాలా కాలంగానే చోటు చేసుకుంటూ వస్తోంది.  బహుశా 1990 దశకం అంతంలో ప్రారంభమైంది.

Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?

కర్ణాటక నమూనా

మరో విధంగా కూడా తరగతి గది కథ మారుతూ వస్తున్నది. తరగతి గతి సామాజిక కలుపుగోలుతనం ప్రమాదంలో పడింది. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నది దేశం అంతటికీ ఒక నమూనా – ఒక టెంప్లేట్ – అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇదేదో తాత్కాలిక ధోరణి అనో, కర్ణాటకకు మాత్రమే పరిమితమైన వికారమనో భావించి దులిపేసుకోవద్దు. విద్యార్థులు కోడి గుడ్డు తినాలో లేదో, వారు ఏ విధమైన దుస్తులు ధరించాలో, ధరించకూడదో నిర్ణయించే హక్కు తమకు ఉన్నదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ ధోరణిని విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ప్రతిఘటిస్తే తరగతి గదులు రణక్షేత్రాలుగానూ, మతపరమైన చీలికలు తెచ్చే వేదికలుగానూ, సామాజిక విభేదాలకు రంగస్థలాలుగానూ మారిపోతున్నాయి. దీనికి మరో తీవ్రమైన పార్శ్వం ఉంది. ఇప్పుడు తరగతి గదులపైన భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. తమ భావజాలం కాంపస్ లలో ఆధిక్యం సంపాదించాలని ఇనుప రాడ్లు ధరించిన ముసుగు వీరులను రంగంలో దించుతున్న సైద్ధాంతికులున్నారు. ప్రభుత్వం, సానుకూలమైన పోలీసు యంత్రాంగం నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. ఈ రెండు ప్రమాదాలూ తరగతి గదులకు నయాభారత్ ప్రసాదించిన బహుమానాలు.  

Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు 

(ఎండబ్ల్యూఎం (MwM) 47కి స్వేచ్ఛానువాదం)  

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles