Saturday, September 7, 2024

తుం గ భ ద్రా న ది

గంగా సంగమ మిచ్చగించునె, మదిన్  కావేరి  దేవేరిగా

అంగీకారమొనర్చునే, యమునతో ఆనందమున్ పొందునే,

రంగత్తుంగ తరంగ హస్తములతో రత్నాక రేంద్రుండు నీ

అంగంబంటి సుఖించునేని, గుణభధ్రా తుంగభద్రా నదీ!

తెనాలి రామకృష్ణ కవి

పాండురంగ మాహాత్మ్యము

ప్రథమాశ్వాసం

139 వ పద్యం

తెనాలి రామకృష్ణ కవి తుంగభద్రానదిని స్తుతిస్తున్నాడు.

ఓ తుంగభద్రా నదీ!

నీవు గుణభద్రవు, నీవు సముద్రునితో కలవడం లేదు. ఒకవేళ, తన ఉత్తుంగ తరంగ హస్తాలతో రత్నాకరేంద్రుడైన సముద్రుడు నీ స్పర్శా సౌఖ్యాన్ని గనక పొంద గలిగి వుంటే, అతడు తానిప్పుడు అనుభవిస్తున్న గంగాసంగమాన్ని ఇష్టపడతాడా? కావేరిని దేవేరిగా అంగీకరిస్తాడా? యమునతో ఆనందాన్ని పొందుతాడా?

అవేవీ ఆ నదులతో పొందబోడని పద్యభావం.

Also read: సంధ్య

ఈ పద్యంలో సముద్రంలో ప్రత్యక్షంగా కలిసే నదులు రెండు – గంగ, కావేరి. అట్లా కలవని ఉపనదులు రెండు – యమున, తుంగభద్ర. తక్కిన నదీ సముదాయాన్ని కవి పేర్కొనడం లేదు. యమున శాఖానది. త్రివేణి వద్ద గంగతో సంగమిస్తుంది. కాకపోతే, సముద్రుడు యమునతో కూడా ఆనందాన్ని పొందుతున్నాడని వక్కాణిస్తున్నాడు. అంటే, యమునానది, గంగతో బాటు రహస్యంగా ప్రవహించి, సముద్రునితో రహస్య దాంపత్యం నెరపుతున్నదని కవి భావం. అందుకే యమునతో “ఆనందమున్ పొందునే” అంటున్నాడు.

విశ్వనాథ వారు ఈ పద్యం గురించి రాస్తూ ఇట్లా అంటారు: “యమున ప్రయాగ వద్ద గంగతో కలిసి ఆమె వెనక దాగికొని వెళ్ళుచున్నది. గంగకు కూడా తెలియకుండా వెళ్ళు చున్నదేమో! సముద్రునకు యమున తోడి సంగమం చాల రహస్య సంగమం. అందుచేత అతడధికమైన సుఖాన్ని పొందుచున్నాడు. అందుకనియే గంగా కావేరుల విషయంలో ఉపయోగించి ఆనంద శబ్దమును వాడినాడు. గంగా కావేరితో సంసారం చేయుచున్నాడు. యమునతో ఆనందమును పొందుచున్నాడని అర్థము” .

ఇది విశ్వనాథవారి వ్యాఖ్య. మరి తుంగభద్ర విషయం? ఆ నది సముద్రునితో రహస్య కాపురం చెయ్యడం లేదని, ఒక్కసారి గనక తుంగభద్రా సౌఖ్యం సముద్రునికి కలిగితే, యమునను పరిత్యజించి, తుంగభద్ర తోనే ఆనందాతిరేకాన్ని పొందుతాడనీ కవి తాత్పర్యం.

ఇదంతా రామకృష్ణ కవి పద్యరచనలో చూపించే గడుసుదనం.

Also read: అమృతోత్సవ వేళ ఆప్తవాక్యం

శబ్ద సౌందర్యంలో ఈయన ఎవరికీ తీసిపోడు. ఈ పద్యంలో తుంగభద్ర పొంగులను చూపడానికి శార్దూల వృత్తాన్ని ఎన్నుకున్నాడు. ఇతర నదులను వర్ణిస్తున్నా ఆయన ధ్యాస తుంగభద్ర పైనే. అందుకే అందుకు అనుగుణమైన పాదప్రాసను ఎన్నుకున్నాడు. గంగాసంగమము, అంగీకార మొనర్చడము, రంగత్తుంగ తరంగ హస్తాల సముద్రుడు, అంగంబంటి సుఖించడము – తుంగభద్రానదిని స్ఫురింపజేసే శబ్దాలు ఇవన్నీ.

All the sounds that rhyme with the spelling of Tungabhadra.

ఇవి గాక, కావేరి దేవేరి కావడము, తుంగభద్ర గుణభద్ర కావడమూ, ఈ ప్రాసా సౌందర్యాలన్నీ ఒలకబోసి, మీదికి లంఘించే శార్దూల పద్యంలో సముద్రుడు, కనీసం భావనా ప్రపంచంలో నైనా తుంగభద్రను తన ఉత్తుంగ తరంగ హస్తాలతో గాఢ పరిష్వంగంలో చేర్చుకొక పోతాడా అనే భ్రమను సృష్టిస్తాడు.

పాశ్చాత్య దేశాల్లో నదీతీరాలకు వెళ్ళి చేపలు పట్టడం ఒక కళ, ఒక మనోహరమైన క్రీడ. ఏటి గట్టున చేతిలో గాలం పట్టుకొని గంటల తరబడి చేపల కోసం ఎదురు చూడడం ఒక ఆనందం. ఈ నిరంతర సాధనచే, ఆ చేపలు పట్టే కళాకారులందరూ, నదీ ప్రేమికులౌతారు. అట్టి నదీ ప్రేమికులకై  ఉద్దేశింపడిన పుస్తకం The Angler’s Garland.  ఈ పుస్తకం ప్రేరణగా  మనోజ్ఞమైన సంకలనమొకటి వెలువడింది. దీనిలో నదీ నదాలపై, చేపలు పట్టడంపై అనేక రచనలు వున్నాయి. వచనరూపంలో, పద్యాలు, పాటల రూపంలో వెలువడిన ఈ రచనలు పఠితను సారస్వత స్వర్గసీమకు తీసుకుని పోతాయి.  ఈ సంకలనంలోని రచయితల్లో పలువురు రామకృష్ఢకవి వలె తమతమ స్థానిక నదీ ప్రవాహాలే, ఇతర నదుల కన్న మిన్నగా భావించే వారే.

Also read: నర్మగర్భితమైన జవరాలి పలకరింపు

నదులను మనం మాతృ దేవతలుగా పూజిస్తాం. మనకు ఏ నదులతో చిన్ననాటి నుండి అనుబంధం కలుగుతుందో వాటిని మరింత వాత్సల్యంతో భావిస్తాం.

గంగ కన్న బ్రహ్మపుత్ర పెద్దది. బ్రహ్మపుత్ర కన్న పెద్దవి అమెజాన్, యాంగ్ సీ వంటి నదులు. కానీ గంగానది భారతీయుల్లో కలిగించే పవిత్ర భావన విదేశీ నదులు కలిగించవు.  పుట్టి పెరిగే రోజుల నాటి స్థానిక నదితో మనకు గల బాంధవ్యం ప్రత్యేకమైనది. మన అధోచేతనలో భాగమై, ఆజన్మాంతం విడదీయలేని ఆధ్యాత్మిక బాంధవ్యమిది.

మా  ఊరిని ఆనుకుని కుందూనది

మా ఊరిని ఆనుకుని కుందూనది (కుముద్వతి) ప్రవహిస్తుంది. పెన్నానదికి కుందూనది ప్రధానమైన ఉపనది. వేసవిలో నీళ్ళే వుండవు. వర్షర్తువులో ఒడ్డులు ఒరుసుకుంటూ భీకరంగా పారుతుంది. శరత్తులో ఇసుకతిన్నెలు బయటపడి జలధార క్షీణించడం ప్రారంభిస్తుంది. ఎనిమిదేళ్ళ కొకసారి వరదలు వచ్చి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను ముంచివేస్తుంది. వేలాదిమంది దీనులను నిరాశ్రితులను చేస్తుంది.

కాలక్రమంలో, దేశంలో గల పెద్ద పెద్ద నదులనేకం చూసినాను. ఈ నదులు తమ మహాప్రవాహవేగంతో అపారమైన తమ పరిమాణంతో,  అపురూపమైన తమ మూర్తిత్వంతో,  ఉద్వేగాన్ని, ఆశ్చర్యాన్ని, కొన్నిసార్లు భయాన్నీ, కలిగిస్తాయి. కానీ ప్రత్యేకమైన మనందరి అభిమానం ఎల్లప్పుడూ చిన్ననాటి మన స్థానిక నదుల పైననే ఉండడం జీవనసహజం. ఆ నదుల్లో మనం ఒకప్పుడు మునకలు వేసిన రోజులు, ఆ నీటి ఉపరితలాలపై  రాళ్లు విసిరిన రోజులు,  ఆ నదీజలాన్ని దోసిళ్ళతో పట్టి త్రాగిన రోజులు, జ్ఞాపకాల  పుస్తకంలో స్థానిక నదుల పుటలు త్రిప్పినప్పుడల్లా అంతులేని పారవశ్యంలో మునిగిపోతాము.

Also read: ఏల ప్రేమింతును

పన్నాలాల్ అనే గుజరాతీ రచయిత మహత్మాగాంధీ అనుయాయుడు, ఆజన్మాంత బ్రహ్మచారి కూడా. ఆయన స్వాతంత్ర్య యోధుడు. దేశంలోని ప్రతినదినీ దర్శించి, దాని పూర్వాపరాలు సేకరించడం ఆయన సరదా. ఆయన దర్శించని భారతీయనది లేదు. చిన్నా పెద్దా,  భారతదేశంలో గల ప్రతి నదినీ వర్ణిస్తూ గుజరాతీలో ఆయన రచించిన పుస్తకం “జీవన లీల” అనే పేరుతో తెలుగులోకి అనువదింపబడింది. అనువాదం చేసినది పురాణం సుబ్రమణ్య శర్మగారు. అద్భుతమైన పుస్తకమిది.

నదులకు వృద్ధాప్యం వచ్చిందా? ఈ విషయం స్పష్టంగా గోచరిస్తూనే వున్నది. నదుల్లో ఎడతెగక కశ్మలాలు వదులుతున్నాం. నదుల ఇసుకతిన్నెలను  దొంగలించుకొని పొతున్నాం. పరిశ్రమల వ్యర్థాలను నదుల్లో వదలి వాటిలోని జీవరాశులను చంపుతున్నాం.

తుంగభద్రా తీరాన క్రీశ1335 లో ఏర్పడిన మహాసామ్రాజ్యం విజయనగరం. క్రీశ 1565 లో రాక్షస తంగడి వద్ద ఘోర యుద్ధం జరిగింది. పొంగి ప్రవహించే తుంగభద్రను దాటి వచ్చి బహమనీ సంయుక్త సేనలు అళియరామరాయల శిరస్సు ఖండించడంతో రెండు వందల ముప్పై సంవత్సరాల విజయనగర ప్రాభవం ఒక్కసారిగా అంతర్ధానమై పోయింది. చితికి పోయిన విజయనగర వైభవాన్ని కొడాలి సుబ్బారావు గారు నిర్వేదభారంతో అక్షరబధ్ధం చేసిన కావ్యమే “హంపి క్షేత్రము.” అందులో ఒక పద్యం:

“శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్ర లో

పల, గుడి గోపురమ్ములు సభాస్థలులైనవి కొండముచ్చు గుం

పులకు, చరిత్రలో మునిగి పోయినదాంధ్ర పురంధరాధిపో

జ్జ్వల విజయప్రతాప రభసమ్మొక స్వప్నకథా విశేషమై!”

మానవ నాగరకత తొట్టతొలుత నదీతీరాలపైనే వెలుగు చూసింది. గంగాసింధు మైదానంలో పురుడు పోసుకున్న హైందవ నాగరకత, యాంగ్ సీ నదీతీరంలో కళ్ళు తెరచిన చైనా నాగరకత, నైలునదీ మైదానంలో తొలి ఉషోదయాన్ని చూసిన ఈజిప్షియన్ నాగరకత, యూఫ్రటిస్ టైగ్రస్ తీరాలపై ప్రాణవాయువులు పీల్చిన మెసపుటేనియన్ సంస్కృతి నదీతీరాల్లో తలెత్తిన మానవకథా వికాసానికి  ఉదాహరణలు. “ఓల్గా నుండి గంగానది వరకు” అనే పుస్తకంలో రాహుల్ సాంస్కృత్యాయన్ మానవవికాసకథను వర్ణిస్తాడు. “లైఫ్ ఆన్ ది మిసిసిపీ” మార్క్ ట్వైన్ కు మిసిసిపీ నదికి నడుమ అనుబంధాన్ని తెలుపుతుంది. “క్వయట్ ఫ్లోస్ ది డాన్” అనే పద్దెనిమిది వందల పేజీల సుదీర్ఘ నవల డాన్యూబ్ నదీతీరాన జరిగిన రష్యన్ విప్లవకాలం నాటి గాథ. మైఖేల్ షాలకోవ్ ను ప్రపంచ ప్రసిద్ధుణ్ణి చేసిన అపూర్వమైన నవల ఇది. ఒకప్పుడీ నదులన్నీ స్వచ్ఛ, సుజల స్రవంతులు. మానవుని దురాశ ఫలితంగా క్రమక్రమ జరారుజాగ్రస్తమై నానాటికి కనుమరుగై పోతున్న మన మాతృస్తన్యాలు.

Also read: భ గ్న మా లి క

తన వీలునామాలో పండిత జవహర్ లాల్ నెహ్రూ ఇట్లా అంటాడు: “పసితనం నుండీ అలహాబాద్ వద్ద నా జీవితంతో పెనవేసుకొని పోయిన నది గంగానది. ఒకసారి మౌనంగా, మందగతితో గంగ పారుతుంది. మరొకసారి కట్టలు తెంచుకొని ఉద్విగ్నంగా పారుతుంది. తరతరాల భారతీయ నాగరకతకీ నది మౌనసాక్షి. దీని గట్టున అనేక సామ్రాజ్యాలు పరిఢవిల్లినవి.  అనేక సామ్రాజ్యాలు సైతం దీని ఒడ్డుననే కుప్పకూలి పోయినవి. నేను మరణించిన తర్వాత నా అస్థికల్లో కొంత భాగాన్ని మాతృమూర్తి వంటి గంగలోనూ, ఇతర భారతీయ నదుల్లోను కలపండి.

“వేలాది యేండ్లుగా బక్కచిక్కిన భారతీయ హాలకులు తమ చెమటను, శ్రమశక్తిని, ధార పోసి పంటలు పండిస్తున్న పొలాలివి. కోట్లాది భారతీయుల ఆకలిని తీరుస్తున్న ఈ పొలాలతో నాకు తీరని అనుబంధం. ఈ పొలాలపై మిగిలిన నా అస్థికలు చల్లండి. తద్వారా ఈ దేశపు నేలతో నేను మమేకమై పోతాను. ఇది నా కడపటి కోరిక!”

బృహదారణ్యకోపనిషత్తు ప్రజాపతి తనయులుగా, సురాసురులను, మానవులను పేర్కొంటుంది. సృష్టిలో  సురులకన్న అసురులే ఎక్కువ. ఇంద్రియ నిగ్రహం లేని రాక్షస తత్వమే మానవుల్లో అధికం.

దాదాపు నూరేళ్ళ క్రిందట వెలువడిన టి. ఎస్. ఎలియట్ కావ్యం “ది వేస్ట్ లాండ్.” ఐదు భాగాలు గల ఈ కావ్యంలో క్షీణదశకు చేరుకుంటున్న ప్రాచ్య యూరోప్ నాగరకతను, ప్రపంచంలో రానురాను తరగిపోతున్న మానవతా విలువలను ఎలియట్ ప్రతీకాత్మకంగా వర్ణిస్తాడు.

ది వేస్ట్ లాండ్” కావ్యంలో చివరిదైన ఐదవభాగానికి బృహదారణ్యకోపనిషత్తు ప్రేరణ. ఈ భాగంలో గంగానది క్షీణదశను ఎలియట్ ఇట్లా వర్ణిస్తున్నాడు.

“Ganga was sunken, and the limp leaves

Waited for rain, while the black clouds

Gathered far distant, over Himavant;

The jungle crouched, hummed in silence,

Then spoke the thunder!”

“గంగానది అడుగంటింది. వాడిపోయిన పల్లవాలు వర్షం కోసం ఎదురుతెన్నులు చూసినవి. దూరంగా హిమవత్ పర్వతాగ్రంపై నల్లని వానమబ్బులు గుమిగూడినవి. అడవి కుంచించుకొని పోయి, మౌనముద్ర దాల్చింది. దిగంతరాళంలో అశనిపాతం గర్జించింది.

ఈ పంక్తుల్లో గంగానది అడుగంటడం, ఆకులు రాలిపోవడం, క్షీణదశకు చేరుకున్న మనిషి మనుగడకు సంకేతం. హిమవత్ శిఖరాలపై గుమిగూడిన వార్షుకాభ్రాలు, భీకరంగా నినదించే సన్నిపాతం, మానవుణ్ణి రక్షించే మరో భగీరథునికై వెల్లివిరిసే ఆశకు సంకేతం.

“ద” అనే అక్షరాన్ని పదంగా మార్చమని ప్రజాపతి తన ముగ్గురు కొడుకులనూ అడుగుతాడు. “ద” అనగా “దత్త” (ఇవ్వడం/త్యాగం చెయ్యడం) అని సురుని జవాబు. “ద” అనగా “దమ్యత” (ఇంద్రియనిగ్రహం) అని అసురుని సమాధానం. “ద” అనగా “దయ” అని మానవుని ప్రత్యుత్తరం.

దత్త, దమ్యత, దయ (దయాధ్వం), అనే మూడు గుణాలపై ఆధారపడి మాత్రమే, క్షీణ మానవ నాగరకతను  పునురుజ్జీవింప జేయడం సాధ్యపడుతుందని “ది వేస్ట్ లాండ్” కావ్యం యొక్క చరమసందేశం. ఈ మూడు గుణాలను పేర్కొనడంతోనే  కావ్యం సమాప్తమౌతుంది. ది వేస్ట్ లాండ్ కావ్యం యొక్క చివరి రెండు పంక్తులివి.

“Datta, Dayadhvam, Damyatha

Om Shantih, Shantih, Shantih”

Also read: నా గు ల చ వి తి

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles