Friday, September 29, 2023

అధికార మార్పిడికి సహకరిస్తా : ట్రంప్

  • అంతకు ముందు ప్రజాస్వామ్యాన్నిఅపహాస్యం చేసిన ట్రంప్ మద్దతుదారులు
  • అమెరికా సేనేట్, ప్రతినిధుల సభ అధినేతల కుర్చీల్లో అసభ్యంగా కూర్చున్న దుండగులు
  • ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన అలజడి కారణంగా నలుగురు మృతి

వాషింగ్టన్ : అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అధ్యక్షుడు ప్రోద్బలంతో ఆయన మద్దతుదారులు అపహాస్యం చేశారు. ట్రంప్ జెండాలూ, రిపబ్లికన్ పార్టీ పతాకాలు పట్టుకొని రొమ్ములు విరుచుకుంటూ ఇక్కడి కేపిటల్ హిల్ లో ప్రజాస్వామ్యానికి అయువుపట్టు అయిన సెనేట్ లో , హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటీవ్స్ లో జుగుప్సాకరమైన విధంగా వ్యవహరించారు. సెనేట్ లో అంతవరకూ ఉపాధ్యక్షుడు పెన్స్ కూర్చున్న కుర్చీలో ఆగంతుకుడు ఒకడు కూర్చొని అవాకులు చెవాకులు పేలాడు. హౌస్ లో స్పీకర్ నాన్సీ పెలోసీ కుర్చీలో ఒకడు వెకిలిగా కూర్చొని పిచ్చివాగుడు వాగుతూ ఫొటో దిగాడు.

నలుగురి దుర్మరణం

ఒక వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ముగ్గురు వ్యక్తులు సరైన సమయంలో ఆస్పత్రికి వెళ్ళలేక మరణించారు. మొత్తం మీద ట్రంప్ మద్దతుదారుల ఆగడం వల్ల నలుగురు అసువులు బాశారు. బుధవారంనాడు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా ప్రజాస్వామ్య సౌధంలోని ఒక్కొక్క కార్యాలయాన్నీ ట్రంప్ మద్దతుదారులు పాదాక్రాంతం చేసుకున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజంటేటీవ్స్ సభ్యులూ, సెనేట్ సభ్యులూ దుండగులకు భయపడి టేబుళ్ళ కింద తలదాచుకున్నారు. దేశంలో కనిపిస్తున్న చీలికనూ, కళ్ళ ఎదుట కనిపిస్తున్న అశాంతిని నివారించాలంటూ వారు ప్రార్థనలు చేశారు.

సెనేట్ లో అధ్యక్షస్థానంలో దుండగులు కూర్చున్నారు. అప్పటి వరకూ అధ్యక్ష ఎన్నికలలో జరిగిన ఓటింగ్ సరళిని చర్చించి కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ఎన్నికైనట్టు ధ్రువీకరించిన కాంగ్రెస్ సమావేశంలో సెనేట్ అధ్యక్షుడు, దేశ ఉపాధ్యక్షుడు  మైక్  పెన్స్ అదే కుర్చీలో కూర్చొని ఉన్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటెటీవ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూర్చుండే కుర్చీలో ట్రంప్ దురభిమాని  కూర్చొని నానాయాగీ చేశాడు.

ఇదీ చదవండి:బైడెన్-కమలా హ్యరీస్ కి స్వాగతం

అభిమానులను రెచ్చగొట్టిన ట్రంప్

అంతకు ముందు ఎలిప్స్ లో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ, ‘‘మీరు వీరోచితంగా పోరాడకపోతే మీకంటూ ఒక దేశం ఉండదు. బలహీనులను పోనీయండి. ఇది బలవంతుల దేశం,’’ అంటూ రెచ్చగొట్టారు. ‘‘ఎన్నికల దొంగతనాన్ని ఎండగడదాం, మనమే విజేతలమని చాటుదాం’’ అంటూ ట్రంప్ విధేయులు నినదించారు. స్వపరిపాలనకు ప్రపంచం అంతటికీ స్పూర్తిని ప్రసాదించే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థపైన జరిగిన దుర్భరమైన దాడి ఇది. ‘‘సమాజాన్ని చీల్చడానికి ప్రెసిడెంట్ ట్రంప్ నిత్యం ప్రయత్నించిన ఫలితమే ఈ దౌర్జన్యం, ఈ హింసాకాండ,’’ అని ట్రంప్ విమర్శకుడు సెనేటర్ బెన్ సెసే వ్యాఖ్యానించారు.

అమెరికన్ కాంగ్రెస్ నుంచి సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చిన తర్వాత 90 నిమిషాలకు ట్రంప్ ఒక సందేశం పంపారు. తాను తన మద్దతుదారులను ప్రేమిస్తున్నానంటూ ‘ఐ లవ్ యూ’ అని చెప్పారు. ముందు కేపిటల్ హిల్ పైన పోలీసు బలగం అంతగా లేదు. రోజు గడుస్తున్న కొద్దీ ఉద్రిక్త వాతావరణం పెరగడంతో పోలీసు బలగాలను పెంచారు.

నలుగురు అధ్యక్షుల ఖండన

ఇంత గొడవ అయిన తర్వాత అధికార మార్పిడి సవ్యంగా, ప్రశాతంగా జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రెసిడెంట్ ట్రంప్ హామీ ఇచ్చారు. జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడుగా జోబైడెన్ ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారంనాడు కేపిటల్ హిల్ పైన జరిగిన ఘటనలను ఇప్పటికీ జీవించి ఉన్న నలుగురు మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బాబ్ క్లింటన్, జార్జిబుష్, బరాక్ ఒబామాలు నిర్ద్వంద్వంగా ఖండించారు.

ఈ లోగా జార్జియాలో తిరిగి ఎన్నికలు జరిగిన క్రమంలో ఇద్దరు డెమాక్రాట్లు గెలుపొందారు. అమెరికా సెనేట్ లో ఇంతవరకూ డెమాక్రాటిక్ పార్టీకి ఉన్న మైనారిటీ హోదాను మెజారిటీ హోదాకు మార్చివేశారు. ఆఫ్రికన్ అమెరికన్ రాఫేల్ మార్నాక్, జాన్ ఆసాఫ్ గెలుపొంది అమెరికాలో డెమాక్రాటిక్ పార్టీ సెనేటర్ల సంఖ్యను 51 కి పెంచారు. 1973లో జోబైడెన్ అతి పిన్న వయస్సులోసెనేటర్ గా ఎన్నికైనాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జాన్ ఆసాఫ్ అతిపిన్న వయస్కుడైన సెనేటర్. 2000ల సంవత్సరం తర్వాత గడచిన ఇరవై ఏళ్ళలో నల్లజాతికి చెందిన వ్యక్తి జార్జియాలో సెనేటర్ గా ఎన్నిక కావడం ఇదే ప్రదమం. సెనేట్ లో డెమాక్రాట్లకు మెజారిటీ సిద్ధించడం వల్ల అమెరికాలో అర్హత కలిగిన ప్రతివ్యక్తికీ కరోనాపైన పోరాడటానికి అందించే సాయాన్ని 600 డాలర్ల నుంచి రెండు వేల డాలర్లకు పెంచడానికి అవరోధం ఉండదు.

ఇదీ చదవండి:అమెరికాలో అలగా చేష్టలు, ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles