Sunday, December 3, 2023

మునుగోడు విజేత కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి

మునుగోడు ఉపఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపైన 11,666 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నవంబర్ 3న పోలింగ్ జరుగగా ఆరో తేదీన ఓట్లు లెక్కించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలవాయి స్రవంతికి ధరావత్తు దక్కలేదు. కానీ 23వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 2018లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి 25 వేల ఓట్లు సంపాదించుకున్నారు. అంటే, కాంగ్రెస్ ఓట్లు స్రవంతికి పడలేదని అర్థం. టీఆర్ఎస్ అభ్యర్థికి 97,006  ఓట్లు రాగా, బిజేపీ అభ్యర్థికి 86,697 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 23,906 ఓట్లు లభించాయి. టీఆర్ ఎస్ మంత్రుల పప్పులు ఉడకలేదు. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ,  ప్రశాంతరెడ్డి బాధ్యతలు తీసుకున్న ప్రాంతాలలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. పల్లా రాజేశ్వరరెడ్డి ఇన్ చార్జిగా ఉన్న ప్రాంతంలోనూ బీజేపీదే  అధిక్యం. టీఆర్ఎస్ అభ్యర్థి సొంత గ్రామంలో కూడా బీజేపీకి ఆదిక్యం రావడం విశేషం. ఒక్క హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న మరిగూడ మండలంలో మాత్రం టీఆర్ఎస్ కు గణనీయమైన మెజారిటీ వచ్చింది. మొత్తం 15 రౌండ్లలో రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీకి మెజారిటీ వచ్చింది. తక్కిన రౌండ్లలో టీఆర్ఎస్ దే మెజారిటీ. కాంగ్రెస్ అభ్యర్థి మూడు మండలాలలోనే గట్టిగా ప్రచారం చేశారు. వాటిలో గణనీయంగా ఓట్లు సంపాదించడం విశేషం.

నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉపఎన్నికలలోనూ టీఆర్ఎస్ గెలుచుకోవడం విశేషం. నాగార్జునసాగర్, హుజూర్ నగర్, మునుగోలులో గెలుపొందింది. మెదక్ జిల్లాలో దుబ్బాక, కరీంనగర్ హుజూరాబాద్ లోనూ బీజేపీ గెలిచింది. అన్ని ఉపఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపాలైంది.

2018లో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి ఫిరాయించి ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. అందుకే ఉపఎన్నిక అవసరం ఏర్పడింది. టీఆర్ ఎస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోకపోయినా, కాంగ్రెస్ అభ్యర్థికి పడిన ఓట్లు పది, పదిహేను వేలకే పరిమితమైనా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండేది. విజయం తర్వాత విలేఖరులతో కేటీఆర్ మాట్లాడుతూ, బీజేపీ డబ్బు విపరీతంగా ఖర్చు చేసినప్పటికీ, ఎంఎల్ఏలను కొనడానికి ప్రయత్నించినప్పటికీ టీఆర్ఎస్ పైన గెలవలేకపోయిందనీ, మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ పతాకానికి ఓటు వేశారనీ అన్నారు.

గౌరవ ప్రదమైన రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయమని నిరూపించుకున్నది. ఈ ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్ కు కీడు కలిగించేదిగా కనిపిస్తోంది. మునుగోడులో మూడవ స్థానానికి దిగజారి, దరావత్తు పోగొట్టుకోవడం మంచి పరిణామం కాదు. ఓటు వేసిన తర్వాత వార్తాచానళ్ళవారు కొందరు ఓటర్లను ఎవరికి ఓటు వేశారని అడిగారు. ఎవరికి ఓటు వేసిందీ చెప్పలేదు కానీ తమకు ఒక్కొక్కరికి టీఆర్ఎస్ అయిదు వేల రూపాయలు ఇచ్చిందనీ, బీజేపీ నాలుగువేల రూపాయలు చెల్లించిందనీ మొహమాటం లేకుండా  చెప్పారు. రాజగోపాలరావు కౌంటింగ్ తర్వాత విలేఖరులతో మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ అధికారాన్నీ, డబ్బునూ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. రెండు పార్టీలే సర్వశక్తులూ వొడ్డి, అన్ని మర్యాదలూ, నియమాలూ ఉల్లంఘించి ఎన్నికల బరిలో పోరాడారు. ఈ పలితం చూసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికల గురించి ఆలోచిస్తారా అన్నది వేచి చూడాలి. కొత్తగా ఎన్నికల రంగంలో దిగిన బీఎస్ పీ రెండున్నర వేలకు మించి ఓట్లు పొందలేకపోయింది. కోదండరాం పార్టీ అభ్యర్తి కూడా పెద్దగా ప్రభావం వేయలేదు. పాల్ సంగతి సరేసరి. పోటీ ప్రధానంగా అందరూ అనుకున్నట్టే టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే నెలకొన్నది. పట్టణ ప్రాంతమైన చౌటుప్పల్ లో బీజేపీకి పది వేల మెజారిటీ వస్తుందని ఊహించామనీ, అది బాగా తగ్గిందనీ రాజగోపాల్ రెడ్డి ఆధివారం ఉదయం ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయే అవకాశం ఉన్నదని అప్పుడే సూచించారు.

దేశంలోని ఇతర రాష్ట్రాలలో జరిగిన ఉపఎన్నికలలో బీజీపీ నాలుగు స్థానాలు గెలుచుకున్నది. తన స్థానాలు తాను నిలబెట్టుకోవడమే కాకుండా హరియాణాలో కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకున్నది. బీహార్ లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఆర్ జేడీసైతం తన స్థానాన్ని తానూ, బీజేపీ తన స్థానాన్ని తానూ నిలబెట్టుకున్నాయి. ఒడిశాలో బీజేపీ దాంనగర్ స్థానాన్ని నిలబెట్టుకున్నది.  అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉపఎన్నికలోనూ బీజేపీ గెలిచింది. అది కూడా బీజేపీ స్థానమే. మహారాష్ట్రలోని తూర్పు అంధేరీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిని  ఉపసంహరించుకున్నది. ఫలితంగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గం ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles