Saturday, February 24, 2024

నగర ప్రజలపై టీఆర్ఎస్ వరాల జల్లు

  • జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్
  • మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆకర్షణీయ హామీలతో ప్రజల ముంగిట నిలిచింది. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అంశాలుగా టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలంటూ నగర ప్రజలపై హామీల వర్షం కురిపించింది.

జీహెచ్​ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎష్ అసెంబ్లీ ఎన్నికల తరహాలో హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది.   వివిధ వర్గాల ఆకాంక్షలు, వినతులను పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం  సుదీర్ఘ కసరత్తు చేసి మేనిఫెస్టోను ప్రకటించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా ఈ సారి తెరాస మేనిఫెస్టోలో ప్రధాన ప్రచారాంశం కానుంది. దేశ రాజధాని దిల్లీ తరహాలో డిసెంబరు నుంచే ఉచితంగా మంచి నీటిసరఫరా చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. 20 వేల లీటర్ల లోపు నల్లా నీళ్లు వినియోగించే వారు డిసెంబరు నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది.

సమగ్ర జీహెచ్ఎంసీ చట్టం

మారుతున్న కాలానికనుగుణంగా జీహెచ్ఎంసీ చట్టానికి ఇప్పటికే పలు సవరణలు చేశాం. పాలనను మరింత సమర్థవంతంగా సాగించడానికి త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందింస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడంతో పాటు అధికారుల్లో బాధ్యతను పెంపొందించేలా నూతన చట్టానికి మెరుగులు దిద్దుతామని తెలిపారు. ఇప్పటికే టీఎస్ బీపాస్, నూతన రెవెన్యూ చట్టం వంటి పదునైన చట్టాలను తెచ్చినట్లు మేనిఫెస్టోలో తెలిపారు. ఈ క్రమంలో నగర అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలను పొందుపరచనున్నట్లు తెలిపారు.

సెలూన్లు, దోబీఘాట్, లాండ్రీలకు ఉచిత విద్యుత్

రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, దోబీఘాట్‌లు, లాండ్రీలకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరాకు  హామీ ఇచ్చింది.

కరోనా కాలానికి వాహన పన్ను రద్దు

కరోనా కాలానికి  గాను రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 37 వేల 611 వాహనాలకు రెండు త్రైమాసికాల వాహనపన్ను 267 కోట్లు రద్దు చేస్తామని తెలిపింది. లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ పోర్టు వాహనాల యజమానులు చేసిన విజ్ఞప్తి చేశారు. 

సినిమా పరిశ్రమకు బాసట

సినిమా థియేటర్లు సహా వ్యాపార సంస్థలకు ఆరు నెలల కరోనా కాలంలో కనీస విద్యుత్ చార్జీలను మాఫీ చేస్తామని కేసీఆర్​ మేనిఫెస్టోలో పొందుపరిచారు. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయెంబర్స్ మెంట్‌ను అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్న విధంగా టికెట్‌ ధరలను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక

జీహెచ్​ఎంసీలో 13వేల కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 12వేల కోట్లతో సమగ్ర వరద నీటి నిర్వహణ ప్రణాళిక అమలు చేస్తామని తెలిపింది. మూసీని గోదావరితో అనుసంధానం చేసి శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. సుమారు 5వేల కోట్ల రూపాయలతో మూసీని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు గోదావరి నీళ్లను తరలిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

చెరువుల సుందరీకరణ

జీహెచ్​ఎంసీ పరిధిలో 185 చెరువుల్లో 20 చెరవుల సుందరీకరణకు 250 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపింది. హెచ్​ఎండీఏ పరిధిలో 20 చెరువులను 120 కోట్లలో సుందరీకరిస్తున్నామని టీఆర్ఎస్  మేనిఫెస్టోలో తెలిపింది. గచ్చిబౌలి టిమ్స్‌ తరహాలో మరో మూడింటిని అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపింది. ఇప్పటికే ఉన్న 5 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా మరో 5లక్షల కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. వివాదాస్పద, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి స్థలాలు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది.

అర్బన్ లంగ్ స్పేస్ లు మహానగరానికి కొత్త ఊపిరి

హైదరాబాద్ లో ఆర్బన్ లంగ్స్ స్పేస్ కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే 50 ఆర్బన్ లంగ్స్ స్సేస్ లను గుర్తించింది. థీమ్ పార్క్ లను ఏర్పాటు చేస్తుంది. గత ఐదేంఢ్లలో వెయ్యి నర్సరీలను ఏర్పాటు చేసినట్లు మేనిఫెస్టోలో తెలిపారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్ల మొక్కలను సంరక్షిస్తున్నట్లు తెలిపారు.

కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాలు

నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు, కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు టీఆర్ఎస్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాలుష్య కారక వాహనాలను తగ్గించి విద్యుత్ వాహనాల వినియోగాన్ని పోత్సహిస్తామని తెలిపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు, తయారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు మేనిఫెస్టోలో తెలిపారు.

వ్యర్థాలకు కొత్త అర్థం

నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొచ్చాం. వేస్ట్ టు వెల్త్ దిశగా వ్యర్థాలకు కొత్త అర్థం చెప్పేలా ప్రత్యేక పాలసీని రూపొందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యర్థాల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజూ 500 టన్నుల వ్యర్థాల నుంచి 23 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ల సామర్థ్యాన్ని మరో 500 టన్నులకు విద్యుత్పత్తి సామర్థ్యాన్ని 43 మెగా వాట్లకు పెంచుతామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. వ్యర్థాల రవాణాకు ఆధునిక వాహనాలను సమకూర్చనున్నట్లు తెలిపారు.

నలువైపులా టిమ్స్ సేవలు

టిమ్స్ పేరుతో గచ్చిబౌలిలో ఒక ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. వీటిని నగరం నలువైపులా విస్తరిస్తామని తెలిపారు. వీటి కోసం  350 బస్తీ దవాఖానాలు నిర్మిస్తామని వెల్లడించారు.

లింకు రోడ్ల రెండవ దశకు శ్రీకారం

లింకు రోడ్ల అభివృద్ధికి మొదటి దశలో 37 చోట్ల లింకు రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.రెండో దశలో మరో 11 రోడ్లకు ఇటీవల ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 125 చోట్ల లింకు రోడ్లు నిర్మించాలని యోచిస్తున్నట్లు మేనిఫెస్టోలో తెలిపింది.

బీఆర్టీఎస్

రాబోయే ఐదేళ్లలో మెట్రో రైలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బీఆర్ టీస్ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

రీజనల్ రింగు రోడ్డు

హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డుకు అవతల మరో రింగు రోడ్డును నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రీజనల్ రింగు రోడ్డు గా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతుంది.

గోదావరితో మూసీ అనుసంధానం

నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు గోదావరితో మూసీనదిని అనుసంధానిస్తామని ప్రభుత్వం తెలిపింది. బాపూఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని అభివృద్ధి కోసం 5000 కోట్లు కేటాయిస్తామన్నారు.

మెట్రోరైలు రెండో దశ అభివృద్ధి

మెట్రోరైలు రెండో దశలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు, బీహెచ్ఈఎల్ నుంచి మెహదీపట్నం వరకు విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

మెట్రోరైలు ప్రాజెక్టును రెండోదశ

ప్రస్తుతం ఉన్న బాహ్యవలయ రహదారికి అవతల మరో ప్రాంతీయ వలయదారిని నిర్మిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. మెట్రోరైలు ప్రాజెక్టును రెండోదశలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరిస్తామని తెలిపింది. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్​ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.  

సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్ లో లైబ్రరీ, క్లబ్, యోగా జిమ్ సెంటర్, ఉచితంగా బస్ పాస్ ల సౌకర్యాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఈ-లైబ్రరీలు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles