Friday, April 19, 2024

ఉదయశ్రీ కరుణశ్రీ ఉదయించిన సుదినం

  • బుద్ధుడినీ, గాంధీనీ ప్రేమించిన కవీశ్వరుడు
  • గీతాల ద్వారా జాతిని జాగృతం చేసిన దేశభక్తుడు

“భగవంతుడు కరుణామయుడు. సృష్టి కరుణామయం. ప్రపంచం కరుణలో పుట్టి కరుణలో పెరిగి కరుణలోనే విలీనమౌతుంది”…ఈ మాటలను అక్షరాలా నమ్మి, అనుభవించి,  పల్లవించి, కవిత్వంలో కుమ్మరించిన కవితాశ్రీమంతుడు మన ‘కరుణశ్రీ’. ఆ మాటలను అన్నది కూడా ఆయనే. ‘ఉదయశ్రీ’ అరుణరేఖల్లో తన హృదయాన్ని అలా పరుచుకున్నాడు. ఆమె నిట్టూర్పులు నన్ను మానవుణ్ణి చేశాయి… ఆమె కన్నీళ్లే నాలోని కవిత్వం… అన్నాడు ఆ కరుణాహృదయశ్రీ. ఆగస్టు 4 వ తేదీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పుట్టినరోజు. కలంపేరు ‘కరుణశ్రీ’ తో కడు ప్రసిద్ధుడు. జీవించినంతకాలం కవిత్వం రాశాడు. కవిత్వం రాసినంతకాలమే జీవించాడు. ఉఛ్వాసనిశ్వాసలే కవిత్వంగా జీవించిన ఈ కవి కల్పాంతం వరకూ ఉంటాడు. అతని మహత్వ కవిత్వ పటుత్వ సంపదలే అతడ్ని చిరంజీవిని చేశాయి.

Also read: పింగళిది ‘పతాక’స్థాయి

ప్రజలను రంజింపజేసిన కవితాశిల్పి

కవులకు కాణాచియైన గుంటూరు మండలంలో 1912లో ఆయన ఉదయించాడు. పద్య సాహిత్య ప్రపంచంలో ఈ శతాబ్దంలో జన్మించిన పద్యకవులలో ఇంతటి పేరు తెచ్చుకున్న కవి, అంతగా ప్రజలను రంజింపజేసిన కవి ఇంకొకడు లేడన్నది అతిశయోక్తి కానే కాదు. ఆయన పద్యం ఒక్కటైనా తెలియని, ఆయన పేరు వినని తెలుగువాడు నేటి తరంలో కూడా ఒక్కడూ ఉండడు. కరుణశ్రీ కవితాశిల్పంపై పోతన్న ప్రభావం ప్రధానమైంది. లలిత సుందరంగా, భావబంధురంగా, రసరంజితంగా,  పరిమళ పదగుంభితంగా సామాన్యుడిని సైతం కదిలించి కరిగించేలా ఆయన కవిత్వం తెలుగునేలంతా ప్రవహించింది. ఒకరినొకరు మాట్లాడుకుంటున్నట్లు సాగే సంభాషణాశైలి వీరిదైన విశిష్టత. మందార మాకంద మధు మరందాల అందాలు ఆ పదాల్లో  చిందుల విందులు చేస్తాయి. తెలుగు నుడికారములు ఒయ్యారములు ఒలికిస్తాయి. బుద్ధుడు అంటే ఆయనకు వల్లమాలిన ఇష్టం. గాంధీ అంటే చెప్పలేని గౌరవం. గౌతమ బుద్ధిని హృదయ స్పందనలకు అద్దంపట్టే కరుణరసాన్ని తన కలంలో నింపుకున్నాడు. కలంపేరుగా పెట్టుకున్నాడు. పుంఖానుపుంఖాలుగా కవిత్వాన్ని పండించాడు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ అత్యధిక ముద్రణలు పొంది ఆయనకు అనంతమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అన్నింటిలో ‘ఉదయశ్రీ’ శిఖరాయమానమై నిలిచింది. స్వర్ణోత్సవ ముద్రణలు పొందింది. ఈ వందేళ్లలో, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ వలె అన్ని ముద్రణలు పొందిన గౌరవం, విఖ్యాతి ‘ఉదయశ్రీ’ కే దక్కాయి. కరుణశ్రీ అభిమానులు అన్ని రంగాలలో, అన్ని తరాలలో ఉన్నారు. అగ్రనటుడు ఎన్టీఆర్ మొదలు ప్రఖ్యాత కవి ప్రసాదరాయ కులపతి వరకూ, ఘంటసాల నుంచి యండమూరి వరకూ ఎందరెందరో ఆ కవితా కన్యను ఎంతగానో ప్రేమించారు. కరుణశ్రీ పద్యాలు కొన్ని వందలు ప్రసాదరాయకులపతి రసనాగ్రంపై నాట్యం చేసేవి. ప్రసాదరాయ కులపతి నేడు కుర్తాళ పీఠాధిపతిగా, సిధ్ధేశ్వరానందభారతిగా మన మధ్యనే ఉన్నారు. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ నిర్మించినప్పుడు విడుదల కాకముందే కరుణశ్రీని, విశ్వనాథ సత్యనారాయణను ఆహ్వానించి, వారిద్దరి కోసం ప్రత్యేకంగా సినిమా వేసి చూపించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కరుణశ్రీపై ఎన్టీఆర్ కుండే గౌరవానికి, విశ్వాసానికి ఇదొక ఉదాహరణ. ఆర్డ్రత నిండిన కరుణశ్రీ కవిత్వంలో నేను సేద తీరుతానని యండమూరి వీరేంద్రనాథ్ అన్నమాటలు సాహిత్యలోకంలో చాలామందికి ఎరుకే.  పుష్పవిలాపం, కుంతీకుమారి మొదలైన కవితా ఖండికలను ఘంటసాల హృదయంగమంగా పాడి, ఆ సొగసుకు కొంగ్రొత్త సోయగాలను అందించారు. ఘంటసాల పాడడం అదనంగా కలిసి వచ్చిన సౌభాగ్యం.అంతకు ముందే మహావాది వెంకటప్పయ్యశాస్త్రి ‘కుంతీకుమారి’ కవితా ఖండికలోని 30పద్యాలను 30 రాగాల్లో తన సంగీత కచేరి చివరిలో గానం చేసి వినిపించేవారు. దీనికి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చేది.

Also read: రాజరాజ పట్టాభిషేకం – నన్నయ సహస్రాబ్ది

పద్యకవిగా ప్రసిద్ధుడు

జంధ్యాలవారి గోత్రనామమైన ‘భరద్వాజ’ కలం పేరుతో కొన్నాళ్ళు పత్రికలకు రచనలు పంపించేవారు. పాపయ్యశాస్త్రి గొప్ప పద్యకవిగా ఎక్కువ ప్రసిద్ధుడు. ఆయన మంచి నటుడు, నాటక కర్త కూడా. తానే రాసిన ‘చంద్రగుప్త’ నాటకంలో చంద్రగుప్తుడి పాత్ర అనేకసార్లు పోషించి ప్రేక్షకుల మెప్పును గణనీయంగా పొందారు. ‘రాధ’గా ఏకపాత్రాభినయంలోనూ ఎందరినో మురిపించారు. వారికి దైవభక్తి, దేశభక్తి రెండూ మెండుగా ఉండేవి. ఎన్నో దేశభక్తి గీతాలు రాసి ‘అరుణ కిరణాలు’ గా ప్రచురించారు. కరుణశ్రీ రాసిన సాంఘిక నాటకం ‘కరుణామయి’ కొన్ని వందల ప్రదర్శనలతో చరిత్ర సృష్టించింది. చిత్రలేఖనం కూడా ఆయనకు చాలా ఇష్టం. గుంటూరు జెకెసీ కాలేజీలో రీడర్ గా పనిచేసిన గుండవరపు లక్ష్మీనారాయణ…ఆదిభట్ల నారాయణదాసుపై పరిశోధన చేసి పి హెచ్ డి తీసుకున్నారు. దానిని పుస్తకంగా తీసుకువచ్చినప్పుడు దానికి ‘నారాయణ దర్శనము’ అనే పేరు కరుణశ్రీయే పెట్టారు. అంశం నారాయణదాసు – చేసినవారు, రాసినవారు లక్ష్మీనారాయణ కాబట్టి ఉభయతారకంగా ఉంటుందని అలా నామకరణం చేశారు. ఇలా ఎందరికో తన పదహృదయశ్రీని పంచిపెట్టారు. ఒకసారి ప్రఖ్యాత నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్ కోరికపై అప్పటికప్పుడు వేంకటేశ్వరస్వామిపై  “జయ జయ పద్మావతీ హృదయేశ్వర! శేషగిరీశ్వర! శ్రీ వేంకటేశ్వర! ” అంటూ అద్భుతమైన గీతాన్ని అందించాడు. ఆ సాహిత్య సంపదను చూసి పిబి శ్రీనివాస్, అక్కడే ఉన్న వేదవతి ప్రభాకర్ ఆశ్చర్య ఆనంద చకితులయ్యారు. కోటప్పకొండ కోటీశ్వరస్వామిపై 27 పద్యాల ‘బాల కోటీశ్వర తారావళి’ని రాశారు. అవి ఆద్యంతం దివ్య పరిమళ శోభితంగా ఉంటాయి. కరుణశ్రీ కలం నుంచి వచ్చిన రచనలు 70కి పైగా గ్రంథాలుగా వెలుగుచూశాయి. అన్నీ మధుర మనోహర మరందాలు.. కవితా సుగంధాలే. జంధ్యాల పాపయ్యశాస్త్రికి గుర్రం జాషువా, పింగళి కాటూరి కవిత్వమంటే అపరిమితమైన అభిమానం, అనురాగం. అట్లే, శ్రీశ్రీకి కరుణశ్రీ పద్యాలంటే అంతే ఇష్టం. ‘వాగ్దానం’ సినిమాలోని హరికథలో కరుణశ్రీ రాసిన పద్యాన్నే శ్రీశ్రీ చేర్చాడు. ‘ఉదయశ్రీ’లోని ‘ధనుర్భంగం’ ఖండికలోని “ఫెళ్లుమనె విల్లు – గంటలు ఘల్లుమనె… “అనే పద్యమది. ఆ హరికథ మొత్తం ఒకఎత్తు – ఈ ఒక్క పద్యం ఒకఎత్తుగా గుండెలను ఝల్లు మనిపిస్తుంది. శ్రీశ్రీకి పద్యం రాయడం చేతకాక కాదు. కరుణశ్రీ కవిత్వంపై ఆయనకున్న మక్కువకు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. “మెత్తని చేయి నీది… సుతిమెత్తని చిత్తమువాడ వంచు నీ పొత్తమె సాక్ష్యమిచ్చు..” అంటాడు పోతన గురించి కరుణశ్రీ. ఈ పదాలు నూటికి నూరుపాళ్ళు కరుణశ్రీకి కూడా చెందుతాయి, చెల్లుతాయి. నిజంగా కరుణశ్రీ హృదయం, కవితాహృదయం, మాటతీరు,నడక,నడత అన్నీ సుతిమెత్తనివే.

Also read: దాశరథి – కవితా పయోనిథి

అజాత శత్రువు

ఎవ్వరినీ ఎప్పుడూ పరుషంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరిపైనా రవ్వంత శత్రుత్వ భావనలు లేవు. ఎంత మంచికవిగా పేరుతెచ్చుకున్నారో అజాతశత్రువుగా అంత మంచిపేరు తెచ్చుకున్నారు. జుంటి తేనియల వలె, సుధారసాల వలె, గోర్వెచ్చని పాలమీగడల వలె, మధుర మంజుల మోహన ముగ్ధ శైలి కరుణశ్రీది.వెరసి సుకవి, సుకుమారకళా కళానిధి కరుణశ్రీ. తన కవితా మహత్వం చేత ఎన్నో బిరుదభూషణములు పొందారు.ఘన గౌరవ సత్కారాలను అందుకున్నారు.1987లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు,  డాక్టర్ సి నారాయణరెడ్డి అధ్యక్షతలో హైదరాబాద్ రవీంద్రభారతిలో గొప్ప సభ జరిగింది. ఆరోజు  ఉదయశ్రీ -విజయశ్రీ -కరుణశ్రీ ప్రత్యేక ప్రతులను ఆవిష్కరించి ఘనంగా గౌరవించారు. కమ్మని తేట తెల్గు నుడికారము లేరిచి కూర్చి, చాకచక్యముగ కైతలల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లోకమ్మున లేరు? వారిలో ఈ శతాబ్దంలో కరుణరసామృత కేతమెత్తిన మహాకవి కరుణశ్రీ. ఇంతటి కవితా శ్రీమంతుడు ఉదయించిన ఈ వేళ, ఆ తలపులలో అంజలి ఘటిద్దాం.

Also read: గుడిపూడి శ్రీహరికి నివాళి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles