Saturday, February 24, 2024

తమిళనాడు రాజకీయాలలో మూడుముక్కలాట

  • ద్రవిడ రాజకీయంలో సీనీ ప్రముఖుల ప్రస్థానం
  • స్పష్టంగా కనిపిస్తున్న నాయకత్వ శూన్యం
  • ముగ్గురు దిగ్గజాల వారసత్వం
  • రజినీ, కమల్ తో పాటు ఖుష్బూ ప్రాముఖ్యం
  • రెండు జాతీయ పార్టీల పొత్తు రాజకీయం

తమిళనాడు రాష్ట్రంలో 2021 సంవత్సరం మే నెల లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆరు నెలల ముందుగానే రాజకీయ వేడి రాజుకుంది. ఒక వంక ఇప్పటికే బలంగా వేళ్ళూనుకుని ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. దీనికితోడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి తమదైన శైలిలో రెండు ప్రాంతీయ పార్టీల పక్షాన రాజకీయాలు నడుపుతున్నాయి. ఇప్పటికే డీఎంకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుండగా, అన్నాడీఎంకేకు బిజెపి పార్టీ మద్దతు ఇస్తుంది. తమిళనాట అపారమైన ప్రజాభిమానం గల  పురచ్చితలైవి జయలలిత మరణం తర్వాత పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఏర్పడిన  ప్రభుత్వానికి బిజెపి వెనక నుంచి మద్దతు ఇస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని అన్నీ తానే నడిపిస్తుంది.

సూపర్ స్టార్ పార్టీ  ఆవిర్భావంతో పెను మార్పులు సంభవిస్తాయా?

 తమిళనాట అపారమైన ప్రజాభిమానం గల సూపర్ స్టార్ రజినీకాంత్ తన పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెడతాం అని ప్రకటించారు. దానికి డిసెంబర్ 31న ముహూర్తం కూడా నిర్ణయించారు. పార్టీ రిజిస్ట్రేషన్ కావడం మాత్రమే మిగిలింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక రజినీకాంత్ పార్టీ  పెట్టకముందే సుమారుగా రెండేళ్ల  నుండి ప్రజలు రకరకాల అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే  మరొక రాజకీయ పార్టీని స్థాపించిన మరొక ప్రముఖ నటుడు కమలహాసన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇప్పటికైతే ఎన్నికలలో  నిలబడని ఆయన రేపటి అసెంబ్లీ ఎన్నికలలో నిలబడతానని అంటున్నారు. ఇక మరో సినీ దిగ్గజం తమిళనాట దేవతగా  పిలువబడుతున్న, కొలువబడుతున్న ప్రముఖ నటి ఖుష్బూ మొదట డిఎంకె పార్టీలో చేరింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మారి ప్రస్తుతం బీజేపీ లోకి చేరింది. ఇలా ఈ ముగ్గురు సినీ నటుల ముక్కోణపు ప్రస్థానం దేనికి దారి తీస్తుందో  రాజకీయకాలమే సమాధానం చెబుతుంది. ప్రస్తుతం ద్రవిడ  మూలాలు కలిగిన  డీఎంకే అన్నాడీఎంకే  రెండు పార్టీల మధ్యనే కొనసాగుతున్న పోటాపోటీ రాజకీయం ఒకవైపు జాతీయ పార్టీలు మరొక వైపు సినీ ప్రముఖుల రాజకీయ రంగప్రవేశం తో మూడుముక్కలాట గా మారాయి. ఈ మూడు ముక్కలాట లో తురుపుముక్కగా సినీరంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన రజనీకాంత్, కమలహాసన్, ఖుష్బూ లలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనేది మరొక ప్రశ్న.

ఇది చదవండి :రజినీ పార్టీ పెడతారు…

సాంప్రదాయంగా వస్తున్న తమిళనాట సినిమా రాజకీయాలు

తమిళనాట సినీ రంగ ప్రముఖుల రాజకీయ రంగప్రవేశం ఇవాళ కొత్త కాదు. ఆనాటి ఎంజీ రామచంద్రన్, కరుణానిధి నుండి ఆ తర్వాత జయలలిత తమిళనాట రాజకీయాలను ఏలారు. ముగ్గురు కూడా  సుదీర్ఘకాలం ముఖ్య మంత్రులుగా కొనసాగారు. విపరీతమైన ప్రజాభిమానం సంపాదించారు.  వీరి కోసం ప్రజలు ప్రాణ త్యాగాలు చేశారు. అటు ఎంజీ రామచంద్రన్ నుండి కరుణానిధి, జయలలిత కోసం వారు రాజకీయాలలో ఎన్నో  ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు ప్రజలు వీరి వెంట నిలిచారు. ఆ తర్వాత విజయ్ కాంత్ తో సహా ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాజకీయాలలో నిలదొక్కుకున్న వాళ్లు మాత్రం కొందరే. వీరందరిలో 2005లో దేశీయ ముర పొక్కు ద్రావిడ కజగం (డీఎండీకే )పార్టీని స్థాపించిన విజయ కాంత్ కొంతవరకూ రాజకీయాలలో నిలదొక్కుకున్నట్లే లెక్క. 2009 పార్లమెంట్ ఎన్నికలలో పది శాతం ఓట్లు సాధించినా కూడా  ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకో లేకపోయారు. కానీ కానీ 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 29 స్థానాలు సాధించి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన హీరో విశాల్ కూడా మరో కొత్త పార్టీతో రానున్నారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.

ఇది చదవండి :‘రజని’ రాజకీయంలో అదే సస్పెన్స్

చరిత్ర సృష్టించిన సినీ నటుల రాజకీయ ప్రస్థానం

తమిళనాడు రాజకీయాలలో సినీరంగ ప్రముఖుల ప్రవేశం మొదట  కరుణానిధితో మొదలైంది. ఆయన జీవితకాలమంతా మొదట కళాసేవ, ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాసేవలో గడిపారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన జీవితం ఒక సుదీర్ఘ ప్రస్థానం. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి ఆ పార్టీ పత్రిక కి ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగా, పత్రిక  సంపాదకుడిగా ఉన్నారు. ఇక ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న ఆల్ ఇండియా అన్నాడీఎంకే (ఏ ఐ ఎ డి ఎం కె) పార్టీని స్థాపించారు. మొదట 11 మంది ఎమ్మెల్యేల తో మొదలైన ఆయన ప్రస్థానం 1977లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి పదేళ్ల సుదీర్ఘ కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక జయలలిత విషయానికి వస్తే ఎం.జి.రామచంద్రన్ మరణానంతరం ఆయనకు వారసురాలిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఆమె రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. 1991లో తమిళనాడులో ఉన్న మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 225 గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రిగా రాజకీయాలలో తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత 2001 లో రెండవ సారి 2011 లో మూడవసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మరణానంతరం వెనువెంటనే మేరు నగ ధీరుడు, రాజకీయ దిగ్గజం కరుణానిధి కూడా మరణించడంతో తమిళనాడులో ప్రస్తుతం నాయకత్వ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ రాజకీయ శూన్యత ను అవకాశంగా తీసుకొని జాతీయ పార్టీలైన అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమిళనాడు రాజకీయాలలో ఏదో ఒక పంచన చేరి తమ ఉనికిని నిలబెట్టు కుందామని, ఈ వంకన తమ ప్రభావాన్ని చాటుకుందామని ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో కమలహాసన్ “మక్కల్ నీది మయ్యం” (ప్రజా న్యాయ కేంద్రం) అనే పార్టీని ఇప్పటికే స్థాపించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త పార్టీ ప్రారంభం అవుతుందని ప్రకటించడంతో ఇప్పటిదాకా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి ఉన్న అనుమానాలను పటాపంచలు అయ్యాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో బస్తీమే సవాల్ మొదలైంది.

తమిళ, తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పోలిక

గతంలో ఎంజీ రామచంద్రన్ కరుణానిధి సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశానికి వచ్చిన విధానాన్ని మన తెలుగు చిత్ర సీమ సినీరంగంలో రాజకీయాల తో పోలిస్తే ఎన్టీఆర్  గుర్తుకు వస్తారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ 1982 లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురు లేకుండా ఉన్నాకూడా ఆ పార్టీకి దీటైన సవాలు విసిరి తాను అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు నడిపి ఫెడరల్ ఫ్రంట్ పేరుమీద దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేశారు. ఆనాడు తెలుగునాట ఉన్న రాజకీయ శూన్యతను ఆయన అలా ఉపయోగించుకున్నారు.

చిరంజీవి చిద్విలాసం

పాతిక సంవత్సరాల తర్వాత మరో ప్రముఖ తెలుగు సినీ రంగ దిగ్గజం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఆ ప్రయత్నంలో కేవలం 18 అసెంబ్లీ స్థానాలు మాత్రమే సాధించగలిగారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం  అందరికీ తెలుసు. ఆ తర్వాత తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుమీద రాజకీయ ప్రవేశం చేసి మొదట 2014లో బిజెపి కి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని స్థానాలకు సొంతంగా పోటీ చేసి తాను రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన తరఫున ఒక సీటు మాత్రమే గెలుచుకో గలిగారు. అప్పటికి బలంగా వేళ్ళూనుకుని ఉన్న రెండు పార్టీల హోరాహోరీ పోరు మధ్య మూడవ పార్టీ నిలబడలేదని తెలుగునాట రాజకీయాలు రుజువు చేశాయి. సరిగ్గా అదే పరిస్థితి ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో వస్తుందా అన్నది కూడా ఆలోచించవలసిన విషయమే. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ దురంధరులు, మేరునగ ధీరులైన జయలలిత, కరుణానిధి మరణంతో నాయకత్వ లేమి కొనసాగుతోంది. వ్యక్తిపూజకు సినిమారంగ ప్రభావానికి పెట్టింది పేరైన తమిళనాడులో రాజకీయ  నాయకత్వ  శూన్యతను ఎవరు పూడుస్తారు అన్నది ప్రశ్నార్థకమే.

ద్రవిడ పార్టీల దారిలోనే కొత్త పార్టీలు నడుస్తాయా?

ప్రస్తుతం అటు కమలహాసన్, రజనీకాంత్ రాజకీయ ప్రవేశంతో తమిళనాడు రాజకీయాల్లో మరొకసారి సినీరంగ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. దీనికి తోడు ఇప్పటికే బీజేపీలో చేరిన మరో సినీ హీరోయిన్ కుష్బూ జయలలిత తర్వాత తమిళనాడులో అంతటి పేరుప్రఖ్యాతులు కలిగిన నటిగా పేరుగాంచింది. ఒక దశలో ఆమె అభిమానులు కుష్బూను దేవతగా భావించి గుళ్ళు కూడా నిర్మించారు. కుష్బూ కి రాజకీయంగా కూడా మంచి అవగాహన ఉంది. బిజెపి తరఫున కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి  అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో మరొకసారి ఎంజీ రామచంద్రన్, కరుణానిధి లను  గుర్తుకు తెచ్చేలా రజనీకాంత్ కమల్ హాసన్ రాజకీయాలు నడుస్తున్నాయి.

కమల్ హాసన్ హేతువాదం, రజినీ ఆధ్యాత్మికం

కమల్ హాసన్ హేతువాద దృక్పథంతో రాజకీయాలను నడుపుతామని అనుకుంటున్నారు. కానీ మరొక నటుడు రజినీకాంత్ ఇప్పటికే తన ఆధ్యాత్మిక ధోరణితో రాజకీయాలను విశ్లేషించుకుంటూ ఉన్నారు. ఒక దశలో రజినీకాంత్ ప్రకటనలు చూస్తే బిజెపి పార్టీకి మద్దతు ఇస్తారా అనిపించే విధంగా ఆయన అడుగులు పడ్డాయి. కానీ కొత్త పార్టీ ఏర్పాటు తో ఇప్పటికే అన్నాడీఎంకేతో స్నేహం చేస్తున్న బిజెపి పార్టీ రజినీకాంత్ తో కలసి అడుగులు వేస్తుందా అనే అనుమానం కూడా వస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ని కాదని కొత్తగా పార్టీ పెట్టిన రజనీకాంత్ తో బీజేపీ స్నేహం చేస్తుందా లేదా అన్నది కూడా అనుమానమే. కమల్ హాసన్ ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం ద్రవిడ  తమిళ రాజకీయాలకు కొత్త కాదు. ద్రవిడ పార్టీల పుట్టుక హేతువాద, భౌతికవాద, నాస్తికవాద, అగ్రవర్ణ వ్యతిరేక ధోరణితోనే మొదలైంది. మొదట డిఎంకె, ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీలు ఆ నేపథ్యంతోనే పుట్టాయి. అలాగే ద్రవిడ ఉద్యమం నేపథ్యంగా తమిళ భాష అభిమానంతో ఈ పార్టీలు గత ఐదు ఆరు దశాబ్దాలుగా తమిళనాడులో తమ ఉనికిని చాటుకుంటున్నారు. దీనికి విరుద్ధంగా కొత్తగా వచ్చిన ఇద్దరు నటులు రాజకీయాలు నడుపుతారా అన్నది ఆలోచించదగ్గ విషయం.

మూడింటిలో ఏది తురుపు ముక్క?

అందుకే తమిళనాట ప్రస్తుతమున్న అన్నాడీఎంకే డీఎంకే పార్టీ లకు దీటుగా మూడవ పార్టీగా ఏది నిలుస్తుందన్నది కాలమే తేలుస్తుంది. అలాగే రజినీకాంత్ కమల్ హాసన్ తో పాటు ఇప్పటికే రాజకీయాలలో వేళ్లూనుకొని ఉన్న విజయ్ కాంత్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది కూడా రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. అందుకే తమిళనాడు రాజకీయాల్లో పార్టీల పరంగా మూడుముక్కలాట, వ్యక్తుల పరంగా కూడా జరిగే మూడు ముక్కలాటలో ఎవరు తురుపుముక్క అవుతారు?. తమిళనాడు రాజకీయాల భవితవ్యాన్ని ఎవరు సొంతం చేసుకుంటారన్నది 2021 అసెంబ్లీ ఎన్నికల రాజకీయ రంగం అనే వెండితెర పైనే చూడవలసి ఉంటుంది. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles