Saturday, April 20, 2024

రాయదుర్గానికి కథాతోరణం

ఆకాశవాణి లో నాగసూరీయం: 2

రాయదుర్గంలో పని చేస్తున్న కాలంలో నాగసూరి వేణుగోపాల్

 ఒక్క కథే కాదు, హరికథ, బుర్రకథ, జానపద, శాస్త్రీయ సంగీతం, ప్రసంగం, నాటకం – ఇలా చాలా కళా రూపాలు రేడియోతో మమేకమై కొత్త రూపాలుగా పరిణమించాయి. రాత్రంతా సాగే నాటకం, తెల్లవారు జాము దాకా నడిచే హరికథ — రేడియో మాధ్యమానికి ఒదిగిపోయి గంటకో, గంటన్నరకో తమను తాము కుదించుకున్నాయి. అయితే, అలా కుదించుకోవడం అనేది రేడియో మాధ్యమం ద్వారా ఇంటింటికీ విస్తరించి దూరాన్ని జయించడానికే! చివరికి రెండున్నర గంటల సినిమా కూడా ఓ గంట వ్యవధికి పాటలు లేకుండా  ‘సంక్షిప్త శబ్ద చిత్రం’ గా మారిపోయింది. 

ఎందరో మహానుభావులు

ఆయా రంగాలలో గొప్పగా రాణించిన మహానుభావులు – దేవులపల్లి కృష్ణశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, దాశరథి కృష్ణమాచార్య, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం, కె. మునయ్య, త్రిపురనేని గోపీచంద్, గుర్రం జాషువా, బుచ్చిబాబు, గొల్లపూడి …ఇలా ఎందరో  చక్కగా రేడియో మాధ్యమంలో అడుగులోఅడుగు వేసుకు పోవడమే కాదు, ఆయా కళారూపాలను కొత్తగా పునఃసృష్టిచేయడానికి ప్రయత్నించి, కొంత చరిత్రను కొత్తగా సృజించి మనకు వదిలి రేపటి తరాలకు బహుమతి గా ఇచ్చారు. అలాంటి ఆకాశవాణిలో సుమారు ముప్పయి మూడేళ్ళు పనిచేయడం మాత్రమే కాదు, ఈ కాలపు మరెందరో మహానుభావులతో  దగ్గరగా మసలుకోవడం నాకు అనుకోని అవకాశమే! ఎన్నో ప్రాంతాలు, ఎందరో పెద్దలు, మరెన్నో సందర్భాలు, ఇంకెన్నో సంస్థలు … ఆకాశంలో తారలతో షికారు చేసినట్టుంది గతాన్ని పరికిస్తే!  ఇంతకు ముందే చెప్పుకున్నట్టు, సందర్భాలను ఊతంగా చేసుకొని జ్ఞాపకాలను చేదుకుందాం, ఆధారాలతో చరిత్రగా పేనుకుందాం! రేడియో ప్రక్రియల మీద ఆసక్తి గలవారిని చేయూతగా సాగిపోదాం!

కోదండరామస్వామి దేవాలయం

అనంతపురం ఆకాశవాణి 1991 మే 29న ప్రసారాలు ప్రారంభించడానికి నెలన్నర ముందే,  గోవా నుంచి (ప్రమోషన్ కాదు) యూ పి ఎస్ సిసెలెక్షన్ మీద అక్కడ చేరాను. బోలెడు సంగతులుంటాయి… అయితే వట్టివి కాకుండా గట్టివి మాత్రమే అవసరం.  అవే మిగలాలి,  మిగులుతాయి. కనుక  ఏవి ప్రధానమో, వాటి గురించి వారం వారం చెప్పుకుందాం.

జ్ఞాపకాల నావలో పయనిద్దాం

ఈ సారి ఒక్క ఇరవై ఎనిమిదేళ్ళ క్రితానికి జ్ఞాపకాల నావలో పయనిద్దాం. ఇలాంటి సందర్భం వస్తుందని ఆనాడు కలలో కూడా ఊహించలేదు. పక్కాగా డైరీ రాసుకునే అలవాటు దాదాపు లేదు. కొన్ని ఫోటోలు, కొన్ని పేపరు ముక్కలు, గందరగోళంగా రాసుకున్న నోట్ పుస్తకాలు.. ఇంతే! ఒకదానికీ దారీ, తెన్ను ఉండదు. అయినా మనిషి బుర్ర …ఆయనే సృష్టించిన కంప్యూటర్ కన్నా తెలివైందీ, చురుకైందీ! అదే ఇప్పుడు నాకు, నా రచనకు ఆధారం, సమాచార పరమైన పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను!  

రాయదుర్గం అనేది హైదరాబాదు నగరంలో ఓ ప్రాంతం. అంతేకాదు, అనంతపురం జిల్లాలో అదే పేరుతో ఒక  పట్టణం ఉంది.‌ ఉభయ గోదావరి జిల్లాలను కలిపితే  వైశాల్యంలో అనంతపురం జిల్లా అవుతుంది. హిందూపురం,  కదిరి, గుంతకల్లు, రాయదుర్గం వంటి పట్టణాలు వేర్వేరు దిశలలో జిల్లా కేంద్రానికి వంద  కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇంకా ధర్మవరం, కళ్యాణదుర్గం, గుత్తి, తాడిపత్రి వంటి ఊళ్ళు నలభై, యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పలు కారణాలతో  వైవిధ్యమైన వాతావరణం, పంటలు, భోజనం, సంస్కృతి, భాష – ఇలా చాలా వేర్వేరుగా ఉంటాయి. రాయదుర్గం  కర్ణాటక రాష్ట సరిహద్దుల్లో ఉంటుంది.  బళ్ళారి, చెళకెర పట్టణాలకు దగ్గర. 

అది భూపతి రాయదుర్గం

1517లో అల్లర్లు అణిచివేసి, శాంతిని నెలకొల్పిన వాడు కృష్ణదేవరాయల సేనాని భూపతి రాయలు. తర్వాత వారే సామంత రాజుగా జనరంజకంగా పరిపాలన చేశారు కనుక అది భూపతి రాయదుర్గం అయ్యింది! క్రమంగా రాయదుర్గంగా మారింది. దుర్గం, కొండ, గుడులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పట్టాభిరామ ఆలయం చాలా బాగుంటుంది. థామస్ మన్రో దొర 1800 లో చివరి పాళేగాడిని దండించి మన్నన పొందారు. వారికి ఇక్కడ ఉండే శ్రీ వేంకటేశ్వర స్వామి బాలకుడుగా ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం సింహద్వారం పైనుంచి మన్రోదొరకు దర్శనం ఇచ్చారంటారు. 

హైదరాలీ, టిప్పుసుల్తాన్ దోపిడీకి రాయదుర్గం గురైందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఎంతో కాలంగా ఉర్దూ, పర్షియన్ బోధించే కళాశాల ఉంది. రాయదుర్గం ప్రాంతాన్ని1953లో బళ్ళారి జిల్లా నుంచి అనంతపురం జిల్లా లో కలిపారు. ఈ ఊరు తెలుగు, కన్నడ, ఉర్దూ భాషల కూడలి. రాయల కాలపు నిర్మాణశైలి కి అద్దం పట్టే రీతిలో చిత్రించిన రాయదుర్గం కోట చిత్రం ఇటీవలే లండన్ లోని బ్రిటిష్ లైబ్రరీలో గుర్తించడం విశేషం. ఊరు వాకిలి ఇప్పుడు పతనావస్థలో ఉంది. 

జీన్స్ తయారీలో ప్రసిద్ధి

మూడు దశాబ్దాల క్రితం దాకా రాయదుర్గం చీరలు పేరుతో సిల్క్ చీరలకు ప్రసిద్ధి.  ఆ నేత నేర్పరితనపు ఉపాధి క్రమంగా నేడు ‘జీన్స్’ వస్త్రాల తయారీలో దిగి ఈ వస్త్రాలకు పేరుగాంచింది. మీరు వాడే అన్ని జీన్స్ బ్రాండ్ల స్టిక్కర్లు అక్కడ తయారిలో కనపడతాయి. అక్కడి జీన్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాక, చాలా ప్రాంతాలలో అమ్ముడుపోతాయి.

కోదండరామస్వామి ఆలయం, శిధిలావస్థలో ఉన్న చారిత్రక కట్టడం

 ఇంకా అక్కడ వాతావరణం బావుంటుంది. హార్టీకల్చర్ కు, ఫ్లోరీ కల్చర్ కు అనువు. అన్నట్టు రాయదుర్గం వంకాయలు కూడా ప్రసిద్ధి! అలాగే బొరుగులకు, ఉగ్గాణి వంటకానికి పేరు. ఇంకా మంచి సీతాఫలాలకూ పేరు గాంచింది. 

ఇంతకూ రాయదుర్గం గురించి ఇలా  చెప్పడమెందుకు?  1993 జూలై 25న ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఒక కథా సమ్మేళనాన్ని నిర్వహించింది. ‘కథాతోరణం’ ఆ కార్యక్రమం పేరు.  మామూలుగా ప్రసంగకర్తలు; హరికథ, బుర్రకథ, నాటకం ఇలా అన్ని రకాల  కళాకారులు తప్పక ఆకాశవాణికి వచ్చి రికార్డింగు కార్యక్రమంలో పాల్గోవడం ఆనవాయితీ. బయటి చప్పుళ్ళు మొదలైనవి లేకుండా కార్యక్రమం బావుండడానికి ఈ స్టూడియో ఏర్పాటు.

అయితే కొన్నిసార్లు ఆయా ప్రదేశాలకు వెళ్ళి కార్మికులు, శ్రామికులు, రైతులు, విద్యార్థులు వంటి వారిని కూడా రికార్డు చేస్తారు. ఇవి ముందుగా నిర్ణయించుకోకుండా స్పాట్ ఇంటర్వ్యూలు కావచ్చు. అందులో విషయం ముఖ్యం, ఏ ఫలానా వ్యక్తి అనేది ప్రధానం కాదు. అయితే, కొన్నిసార్లు పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని ఆహుతులైన శ్రోతల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించి, పిమ్మట వాటి రికార్డింగులు, ప్రసారం చేయడం కూడా ఉంది. అలా రూపొందించినదే ఈ ‘కథా తోరణం’!

సాహిత్యాంశాల పర్యవేక్షకుడిగా నా పాత్ర 

1991 నుంచి 1996  దాకా అనంతపురం ఆకాశవాణిలో చాలా కార్యక్రమాలతో పాటు సాహిత్య అంశాలను కూడా నేను పర్యవేక్షిస్తూ వుండేవాడిని. పత్రికలలో ఎడిట్ పేజీకి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, రేడియోలో స్పోకెన్ వర్డ్స్ సెక్షన్ కు అంత గుర్తింపు వుంటుంది. వర్తమాన అంశాలు కూడా కలగలసిన విభాగం అది. ఈ విభాగం పర్యవేక్షణను సాధారణంగా వయోవృద్ధుడికి, కాస్తా హోం వర్క్ చేసే అభిలాష ఉన్న వారికి ఇస్తుంటారు. నా వరకు 1991 ఏప్రిల్ నుంచే ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అదే  దాదాపు ప్రతి ఆకాశవాణి కేంద్రంలో కొనసాగింది. 

అనంతపురం ఆకాశవాణి ప్రతివారం ఒక కథానిక, ఒక కవిత, ఒక సైన్స్ ప్రసంగం, ఒక ఆర్థిక, సామాజిక విషయం, ఒక సాహిత్య ప్రసంగం ఉండేవి. తొంభైశాతం ప్రతివారం కొత్త కార్యక్రమం, ప్రతి నెలా సుమారు 25 శాతం కొత్త కళాకారులతో కార్యక్రమాలు చేస్తూవచ్చాను. ఇదే విధంగా మిగతా చోట్ల కూడా కృషి చేస్తూవచ్చాను. కనుకనే నాకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో, మద్రాసులో ఎంతోమంది పెద్దలను ఆకాశవాణి వేదిక ద్వారా కలవగలిగాను, మంచి కార్యక్రమాల ప్రయోక్త గా మొన్న పొందగలిగాను.  

కథా సమర్పణలో నిష్ణాతులు కొందరే

‘కథాతోరణం’ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేను. అయితే స్థూలంగా సమాచారం ఇవ్వగలను.  అది 1993 జూలై 25న రాయదుర్గం మునిసిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎంతో మంది సభికుల ఎదుట జరిగింది.  అనంతపురం జిల్లాకు చెందిన కె.ఎం. రాయుడు, పోలిశెట్టి ఓబయ్య,  బాలకొండ ఆంజనేయులు, ఎన్. కేశవరెడ్డి, కృష్ణవాణి, సడ్లపల్లి చిదంబర రెడ్డి ఇంకా ఇటీవలే కను మూసిన రాయదుర్గం రచయిత కెరె జగదీష్ తమ కథలు చదివారు. 

నిజానికి ఇలా ‘చదివారు’ అనడం సరిపోదు. రేడియోకు సమర్పించారు అని చెప్పాలి.  ఎందుకంటే హావభావాలు, నాటకీయత, గొంతులోని హెచ్చు , తగ్గులు మొత్తంగా కథానిక చిత్రించే భావుకతనూ, వాస్తవికతనూ అందించడం అని చెప్పాలి.  అందరూ నిష్ణాతులు కాదు ఈ రేడియో ప్రెజెంటేషన్ కళలో, అయితే మధురాంతకం రాజారాం, సింగమనేని నారాయణ, నగ్నముని, యార్లగడ్డ బాలగంగాధరరావు, ఎస్వీ భుజంగరాయ శర్మ,  పులికంటి కృష్ణారెడ్డి వంటి కొందరు ఈ నైపుణ్యంలో రాటుదేలారు! ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు ఏకాంతంగా, కళ్ళు మూసుకుని రేడియోను మనోఫలకం మీద అందుకుంటే – మీకు మీరు చాలా విషయాలు గమనించవచ్చు! 

అలా రికార్డు చేసిన కథలు రోజుకొకటి చొప్పున నిర్దిష్ట సమయంలో ప్రసారం చేశాం. ఆనాటి సభలో స్థానిక పెద్దలు పాటిల్  వేణుగోపాల్ రెడ్డి, బి. హులికుంటప్ప, శాంతినారాయణ, బి. గంగిరెడ్డి వంటివారే కాకుండా విజయవాడ నుంచి కథారచయిత్రి డి. సుజాతాదేవి అనుకోకుండా ఆ సభలో పాల్గోవడం విశేషం. ఆ రోజు మా బృంద సభ్యులతోపాటు ఇంజనీరు కె.ఎస్. శాస్త్రి ఉత్సాహంగా పాల్గోవడం  గుర్తుంది. 

పక్కా ప్రణాళిక అత్యవసరం

ఇలాంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించే సమయంలో కొందరు స్థానిక కళాకారులతో పాటు మరికొందరు ‘స్టార్ అట్రాక్షన్’ ఉండే కళాకారులు ఉండేలా జాగ్రత్త పడటం చాలా అవసరం. అన్ని రకాల మేళవింపులతో కార్యక్రమం రక్తికట్టి, విజయవంతం కావాలని ప్రయత్నించడం ముఖ్యం. ఇలాంటివి విజయవంతమైనా, బెడిసి కొట్టినా .. దానికి నేపథ్యంగా ఎన్నో  కారణాలు ఉంటాయి. కనుక చక్కని ప్రణాళిక కీలకం!

ఈ ‘కథాతోరణం’ ఎందుకు బాగా గుర్తు అంటే అది పూర్తిగా నేను ప్రణాళిక చేసినది కావడం. ఇంకోటి ఈ ‘కథాతోరణం’ కథలతో ఒక సంకలనం తీసుకురావాలనే ప్రయత్నం చివరికి విజయవంతం కాకపోవడం కొసవిరుపు! కానీ అనంతపురం ఆకాశవాణి విలక్షణ రేడియో కార్యక్రమంగా గౌరవం పొందింది. మరీ ముఖ్యంగా ఇలా వేరే ఊర్లకు వెళ్ళడం ఆకాశవాణికి మంచి ప్రచార వ్యూహం కూడా ! 

 డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 

 ఆకాశవాణి తిరుపతి పూర్వ సంచాలకులు

 ప్రసారభారతి రీజనల్ అకాడమీ పూర్వ సంచాలకులు

మొబైల్: 9440732392

Also read: అనంత వారసత్వ కళా విజ్ఞాన వాహిని!

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles