Friday, June 14, 2024

పేదప్రజల రాకుమారుడు కాంతారావు

తెలుగు సినీరంగంలో నందమూరి, అక్కినేనిల హవా నడుస్తున్న రోజుల్లో, సినిమాలు పరిమితంగా నిర్మి స్తున్న కాలంలో మరో హీరోకి అవసరం ఉందన్న ఆలోచన సినీ పరిశ్రమ చేయని వేళ ఆ టాప్ హీరోల తర్వాత హీరోగా గుర్తింపు పొందిన అందాల నటుడు, జానపద హీరో, నాటి యువతుల కలల రాకుమారుడు కాంతారావు.

అస‌లు పేరు తాడేప‌ల్లి ల‌క్ష్మీ కాంతారావు

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే  వెంటనే స్ఫురణకు రాక పోవచ్చు. కానీ కత్తి కాంతారావంటే తెలుగు నాట తెలియని వారుండరు. వెండితెరపై జానపద కథానాయకుడిగా టి.ఎల్.కాంతారావు వేసిన ముద్ర అలాంటిది. కత్తి పట్టిన జానపద వీరుడు అంటే ఇప్పటికీ కూడా మొదటగా గుర్తుకు వచ్చేది కాంతారావే. విఠలాచార్య, కాంతారావుల కలయిక అపూర్వం. ప్రేక్షకులకు గుర్తుండి పోయిన హీరో. ఆయన పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో సైతం మంచి పాత్రల ద్వారా అరుదైన అభినయాన్ని ప్రదర్శించారు. నారదుడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా కూడా నటించారు. ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన ‘లవకుశ’ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన కాంతారావు రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. ఆయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర శీర్షిక “అనగనగా ఒక రాకుమారుడు”.

న‌ట‌న‌పై మ‌క్కువ ఎక్కువ‌

తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడ ప్రాంతంలో  గుడిబండ గ్రామంలో 1923లో ఒక కరిణీకపు కుటుంబంలో పుట్టి, వంశపారంపర్య పట్వారీ వృత్తిమీద కన్నా ముఖానికి రంగువేసుకుని నటించటంమీద మక్కువ పెంచుకున్నాడు కాంతారావు.   ఏడాది వయసులోనే తండ్రిని కోల్పోయారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆపై వెండితెరపైకి వచ్చి నటుడిగా, నిర్మాతగా కూడా మరపురాని సినిమాలను అందించారు. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు ‘నిర్దోషి’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. హెచ్‌.ఎం. రెడ్డి తీసిన ‘నిర్దోషి’ (1951), ‘ప్రతిజ్ఞ’ (1953) మొదలుకుని 450కి పైగా సినిమాల్లో నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల్లో కథానాయకుడిగా ధీరోదాత్తంగా నటించి పేరు సంపాదించారు. నిర్మాతగా ‘సప్తస్వరాలు’, ‘గండరగండడు’, ‘ప్రేమజీవులు’, ‘గుండెలు తీసిన మొనగాడు’ సినిమాలు తీశారు.

అగ్ర‌నటుల‌తో స‌మాన గుర్తింపు

 రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు మాటల్లో “తెలుగు చలనచిత్ర సీమకు రామారావు నాగేశ్వరరావులు రెండు కళ్ళైతే , వాటి మధ్య తిలకం వంటివారు కాంతారావు. ఒక దశాబ్దంపాటు హీరోగా, రెండవ హీరోగా ఎన్నెన్నో పాత్రలు పోషించారు. ‘నారదుడి’ పాత్రకు కాంతారావును తప్పించి మరెవరినీ ఊహించు కోలేనంతగా మెప్పించాడు. పౌరాణిక పాత్రలైన రాముడు, కృష్ణుడు పాత్ర ల్లోనూ ఎన్టీఆర్ తరువాత కాంతారావు గుర్తింపు పొందారు.  జానపద హీరోగా కాంతారావుకి తిరుగులేదు.

yesteryear actor kantha rao birth anniversary

చిత్ర నిర్మాణంలో న‌ష్ట‌పోయిన న‌టుడు

కాంతారావు కుమారుడు రాజా సుడిగుండాలు సినిమాలో నటించాడు. ఆ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. యువ నటులు రావడం,  జానపద చిత్రాలు తగ్గిన క్రమంలో, స్వయంగా సప్తస్వరాలు (1969); గండర గండడు (1969); ప్రేమ జీవులు (1971); గుండెలు తీసిన మొనగాడు (1974);  స్వాతి చినుకులు (1989) తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినీ ప్రొడక్షన్ లో ఏమాత్రం అనుభవం లేని కాంతారావు స్వయంగా సినిమాలు తీసిన సమయాన 1969 నాటికి తెలంగాణ రాష్ట్ర సాధన తొలిదశ ఉద్యమం సాగుతోంది. సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ‘సప్తస్వరాలు,’ ‘గండరగండడు’ వంటి సినిమాలు బాగున్నా ఆయన్ని ఆర్థికంగా ఆదుకోలేక పోయాయి. ‘ప్రేమజీవులు’ సినిమా ఫ్లాప్. భారీ నష్టం. అయినా సినీరంగంలోనే వెతుక్కోవాలని ఆ తర్వాత తీసిన మరో రెండు సినిమాలు కూడా లాభాలను చేతికి అందివ్వలేదు.

అప్పుల ఒత్తిడి త‌ట్టుకోలేక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అవ‌తారం

అప్పులవారికి వడ్డీలు కట్టటంతో కాంతారావు పని సరిపోయింది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవతారం ఎత్తాల్సివచ్చింది. ఈలోగా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలింది. పెరిగిన అప్పుల వల్ల చివరికి కట్టుకున్న ఇల్లు అమ్ముకుని, అప్పులు తీర్చి, ఒక చిన్న పెట్టెతో హైదరాబాద్ చేరారు. చిరుపాత్రలు, టి.వి. సీరియళ్ళు చేశారు. నటుడిగా కాక,  వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఏమైనా సభలకు పిలిస్తే ఇచ్చే డబ్బులు, సన్మానాలు చేసి ఇచ్చే డబ్బుల కోసం ఆశగా ఎదురుచూసే పరిస్థితి. ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదు. అతికష్టం మీద ఇచ్చిన రఘుపతి వెంకయ్య అవార్డు తప్పించి మరేమీ లేదు. అన్నీ నిరాశలే. చిట్టచివరి వరకు సొంత ఇంటికల కంటూనేవున్నారు.

క‌బ‌ళించిన క్యాన్స‌ర్‌

అడపాదడపా సినీ పెద్దలు ఎవరయినా సహాయం అందించినా అది ఇంటికి సరిపోయేంత కాదు. ఇల్లు గడవటానికి సరిపోయేంత మాత్రమే. చివరికి క్యాన్సర్ బారిన పడ్డారు. అదీ ఆలస్యంగా గుర్తింపు. ఏ దురలవాట్లూ లేక, ఎవరికీ హాని చేయని మనిషి.

ఒక్క సంవత్సరంలో శరీరాన్ని తినేసిన క్యాన్సర్ దెబ్బకు 2009లో మరణించారు.  సినీరంగానికి వెలుపల స్నేహితులు ఉన్న వాడు కాదు కాంతారావు. తాను పుట్టి పెరిగిన సముద్రమే చేపను ఎత్తి అవతల వేస్తే అది ఎలా విలవిలా కొట్టుకుంటుందో,  అలా సినీరంగమనే సముద్రపు ఆటు పోట్లకు బలైన రాకుమారుడు కాంతారావు. ప్రేక్షకుల మనసులో చెరగిపోని ముద్ర వేసిన కాంతారావు, తన 85వ ఏట, 2009 మార్చి 22నక్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాద్‌లో మరణించారు.

నవంబర్ 16 నటుడు కాంతారావు జయంతి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles