Friday, December 9, 2022

రాష్ట్రాల నుంచి నదులను కేంద్రం దోచుకోవచ్చునా?

  • ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య వివాదం పరిష్కరించే ప్రయత్నం లేదు
  • వివాదం వల్ల కలిగిన ఉద్దిక్తత నివారణకోసం నోటిఫికేషన్ జారీ చేశామంటున్న కేంద్ర మంత్రి
  • రాష్ట్రాల నుంచి నదీజలాలకు సంబంధించి సర్వం స్వాహా చేసే ఎత్తుగడ

జలశక్తి మంత్రిత్వ శాఖ (నీటి వనరులు, నదుల అభివృద్ది, గంగానదీ ప్రక్షాళన) దిల్లీ నుంచి 15 జులై 2021నాడు ఎస్.ఓ. 2842 (ఇ) నంబరు కలిగిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ చిక్కులు తప్పవు. నదీజలాల మండళ్ళను ఏర్పాటు చేసిన తర్వాత ఏడేళ్ళకు వాటి పరిధుల గురించి కేంద్రం ఇప్పుడు ఆలోచించింది. పరిధులు నిర్ణయించడం అంటే రెండు రాష్ట్రాలలోని నదులనూ, వాటిపైన ఉన్న ప్రాజెక్టులనూ, జలవిద్యుత్ కేంద్రాలనూ, వాటి విధులనూ అన్నీ కేంద్రం స్వీకరించినట్టు అన్నమాట. నియంత్రణను మాత్రమే బదిలీ చేయడం కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏమీ మిగలకుండా నదీజలాల నిర్వహణ మండళ్ళ పేరుతో సర్వస్వం కేంద్రానికి దఖలు పరచడం.

కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ మండళ్ళ (కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్స్ – కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ)కు పరిధిలు నిర్ణయించడం పేరు మీద కేంద్రం ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రాలకు పరిధులు లేకుండా, అధికారాలు లేకుండా వాటన్నిటినీ బోర్డులకు (మండళ్ళకు) అప్పగించింది. అన్ని (35 కృష్ణా బేసిన్ లోనూ, 71 గోదావరి బేసిన్ లోనూ) ఇరిగేషన్ ప్రాజెక్టులపైన నిర్వహణాధికారాలన్నిటినీ రాష్ట్రాల చేతుల్లో నుంచి కేంద్రం లాగివేసుకున్నదనే విమర్శను ఎదుర్కొంటున్నది. విచిత్రం ఏమిటంటే ఈ ప్రాజెక్టుల నిర్వహణకు అయ్యే వ్యయాన్నీ, ఇతర సాధకబాధకాలను అన్నింటినీ రాష్ట్రాల నెత్తిపైన రుద్దడం. ఈ బోర్డుల చైర్మన్ పదవులకు రెండు  రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లూ, ఇతరులూ అనర్హులని ప్రకటించింది. కేంద్రం ఇష్టం వచ్చిన అధికారులను నియమించే అధికారాన్ని కేంద్రానికి ఇచ్చింది. కేంద్రం బాబులు (అధికారులు) కృష్ణా, గోదావరి నదులను నిజంగా సొంతం చేసుకొని వారి రాజకీయ యజమానుల ఇష్టాయిష్టాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రెండు రాష్ట్రాల నుంచీ రెండు ప్రధాన నదులనూ కేంద్రం పూర్తిగా తీసుకున్నట్టే లెక్క.

రాష్ట్రాలు చెల్లించాలి

సమర్థ నిర్వహణకోసం ఒక్కొక్క బోర్డుకు రూ. 400 కోట్ల చొప్పున బీజధనం చెల్లించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.  అదనంగా నిధులను బోర్డులు అడిగిన పక్షంలో అడిగిన పక్షం రోజులలోపు జమచేయాలని కూడా ఆదేశించింది. తమ నిధులనూ, సిబ్బందినీ, ఆస్తులనూ, ప్రాజెక్టులనూ, నిర్వహణాధికారాలనూ, నియంత్రణనూ రాష్ట్రాలు మొత్తంగా బోర్డులకు అప్పగించాలి. ఈ ప్రాజెక్టులపైన ఎంతో కాలంగా లక్షల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రాలకు వాటిపైన అధికారాలు లేకుండా వాటిని కేంద్రం చెప్పుచేతలలో ఉండే మండళ్ళకు (బోర్డులకు) అప్పగిస్తామని నోటిఫికేషన్ అంతరార్థం. అన్ని అధికారాలు కేంద్రం స్వీకరించి అన్ని ఖర్చులనూ, భారాలనూ రాష్ట్రాల నెత్తిమీద రుద్దడం ఉద్దేశం.

ప్రాజెక్టుల నిర్వహణలో రెండు రాష్ట్రాలకూ బోర్డులు ఎటువంటి ఆదేశాలైనా ఇవ్వవచ్చు. వాటిని రాష్ట్రాలు శిరసావహించి తీరాలి. తమ ఆదేశాలను అమలు చేయించుకునేందుకు బోర్డులకు పూర్తి అధికారం ఇచ్చారు. నోటిఫికేషన్ ఇంకా ఇలా ఆదేశిస్తుంది: ఒక విద్యుదుత్పత్తి కేంద్రంలో యంత్రాలూ, స్టోర్ లూ, వాహనాలూ, ఇతర ఆస్తులన్నీ కేఆర్ఎంబీకీ లేదా జీఆర్ఎంబీకి చెందుతాయి. కేఆర్ఎంబీకి లేదా జీఆర్ఎంబీకి పరిధి ఉన్నదా లేదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు కేంద్రానిదే ఖరారు నిర్ణయం (పేరాగ్రాఫ్ (0)), అనుమతి పొందని ప్రాజెక్టులకు ఆరు మాసాలలోగా అనుమతులు రాష్ట్రాలు పొందాలి. అనుమతులు లేని ప్రాజెక్టులపైన పనులన్నిటినీ నోటిఫికేషన్ ప్రచురించే తేదీ నుంచి ఆపుచేయాలి. ఆరు మాసాలలోఅనుమతులు రాకపోతే ప్రాజెక్టుల నిర్వహణ ఆగిపోతుంది.

రాష్ట్రాలకు ఆర్థికంగా సంక్షోభం ఏర్పడినా సరే అనుమతిలేని ప్రాజెక్టులన్నిటిపైనా పనులు నిలిపివేయాలి. కానీ కేంద్రం ఎటువంటి బాధ్యతా స్వీకరించదు. ఈ నోటిఫికేషన్ అమలులోకి రావడానికి ముందు కాంట్రాక్టుకు సంబంధించిన ఏమైనా భారాలనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులలో కానీ, ఇతర కోర్టులలో కానీ, ట్రిబ్యూనళ్ళలో కానీ ప్రాజెక్టుల గురించి కానీ రెండవ షెడ్యూల్ లో పేర్కొన్న ఇతర అంశాలపైన కానీ వచ్చే కేసుల తాలూకు వ్యవహారాలనూ చూసుకోవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలదే అని స్పష్టం చేసింది.

అనుమతులు పొందిన ప్రాజెక్టులు కానీ నిర్మాణంలో ఉంటూ అనుమతులు పొందే ప్రాజెక్టులు కానీ రాష్ట్రాల పరిధిలో కొనసాగుతాయా అంటే అదీ లేదు.  వాటిని కూడా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుల పరిధిలోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్రమైన వివాదం చెలరేగుతున్నదనే విషయంలో అనుమానం లేదు. కానీ ఈ నోటిఫికేషన్ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఉద్దేశించింది కాదు. 2014లో తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి వచ్చింది కనుక మొదటి సారిగా నదీజలాలలో తన వాటా తేల్చమంటూ తెలంగాణ అడుగుతున్నది. ఈ వివాదం వల్ల కలిగిన ఉద్రిక్తలను సడలించేందుకే నోటిఫికేషన్ జారీ చేశామంటూ కేంద్రమంత్రి అనడం ఆశ్చర్యకరం. కానీ వివాదం పరిష్కరించే ఉద్దేశం కానీ ప్రయత్నం కానీ లేదు.     

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles