Sunday, November 10, 2024

భారత గడ్డపై అతిపెద్ద టెస్ట్ సమరం

  • విరాట్ సేనకు రూట్ ఆర్మీ సవాల్
  • చెపాక్ వేదికగా ధూమ్ ధామ్ ఫైట్

క్రికెట్టే ఊపిరిగా భావించే కోట్లాదిమంది అభిమానులున్న భారత గడ్డపై కొత్తసంవత్సరంలో అతిపెద్ద టెస్టుసిరీస్ సమరానికి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే తొలిటెస్టులో టెస్ట్ క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్ కు నాలుగో ర్యాంకర్ ఇంగ్లండ్ సవాలు విసురుతోంది.

కరోనా విరామం తర్వాత

కరోనా విలయంతో భారతగడ్డపై గత ఏడాది మార్చినెల నుంచి స్తంభించిపోయిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు..ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ తొలి టెస్టుమ్యాచ్ తో తిరిగి ప్రారంభంకానున్నాయి. 10 మాసాల 26 రోజుల సుదీర్ఘవిరామం తర్వాత భారత క్రికెట్ బోర్డు ఓ అంతర్జాతీయ టెస్టుసిరీస్ కు ఆతిథ్యమిస్తోంది. ఆస్ట్ర్రేలియా గడ్డపై ఆస్ట్ర్రేలియాను 2-1తో కంగుతినిపించిన జోరు మీదున్న భారత్ తో…శ్రీలంకను శ్రీలంక గడ్డపై 2-0తో చిత్తు చేసిన ఇంగ్లండ్ ఢీ కొనబోతోంది.

ఇటు విరాట్- అటు రూట్

అంతర్జాతీయ క్రికెట్ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం మూడోర్యాంకులో ఉన్నవిరాట్ కొహ్లీ భారత్ కు నాయకత్వం వహిస్తుంటే….నాలుగో ర్యాంక్ ఆటగాడు జో రూట్..ఇంగ్లండ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్ర్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ కు పితృత్వపు సెలవు మీద విరాట్ కొహ్లీ దూరమైతే….శ్రీలంక సిరీస్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ, సెంచరీలతో చెలరేగిపోయాడు. పైగా భారత గడ్డపైనే తన వందో టెస్టు మ్యాచ్ ను చెన్నై వేదికగా ఆడనున్నాడు. అయితే…త్వరలో జరిగే ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనటానికి అర్హత సాధించాలంటే…ఈ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ ను భారత్ 2-1, లేదా 2-0తో ఓడించినా సరిపోతుంది. అదే ఇంగ్లండ్ జట్టు ఫైనల్స్ చేరాలంటే మాత్రం భారత్ పై 3-0తో నెగ్గితీరాల్సి ఉంది.

ఇదీ చదవండి:సిరీస్ నెగ్గితేనే భారత్ కు ఫైనల్స్ బెర్త్

ఇంగ్లండ్ కు అంత సత్తా ఉందా?

భారత గడ్డపై జరిగిన గత సిరీస్ లో 0-4తో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ జట్టు…ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో మాత్రం గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఇంగ్లండ్ అత్యంత సమతూకంతో కనిపిస్తోంది. కెప్టెన్ రూట్ ,జోస్ బట్లర్, సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, స్వింగ్ ఆల్ రౌండర్ సామ్ కరెన్, స్టువర్ట్ బ్రాడ్,మోయిన్ అలీ, స్వింగ్ స్పెషలిస్ట్ జిమ్మీ యాండర్సన్ , బర్న్స్ ,సిల్బే లాంటి మేటి ఆటగాళ్లతో ఇంగ్లండ్ జట్టు అత్యంత పటిష్టంగా తయారయ్యింది. అయితే…భారత స్పిన్ పిచ్ లపైన రవిచంద్రన్ అశ్విన్ అండ్ కోను ఏ మేరకు ఎదుర్కొనగలదన్నది అనుమానమే.

ముగ్గురు స్పిన్నర్లతో భారత్:

స్వదేశీ స్పిన్ పిచ్ లపైన భారత్ ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ఇంగ్లండ్ పని పట్టడానికి సిద్ధమయ్యింది. అశ్విన్,కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కొహ్లీ,పూజారా,రహానే, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలతో భారత బ్యాటింగ్ ఆర్డర్.. ఇంగ్లండ్ బౌలర్ల సత్తాకు పరీక్షకానుంది. తొలిటెస్టు కోసం సిద్ధం చేసిన చెపాక్ పిచ్ …ఆట మూడోరోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలించనుంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచనలేకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 450కి పైగా స్కోరు సాధించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ వికెట్ తీయటానికి ఇంగ్లండ్ పలు రకాల వ్యూహాలతో వస్తే భారతజట్టు సైతం ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ను పడగొట్టడానికి తనవంతుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.                  

చెన్నై వేదికగా రికార్డులే రికార్డులు

సిరీస్ లోని ఈ తొలిటెస్టుమ్యాచ్ పలు రికార్డులకు ఆలవాలం కానుంది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కెరియర్ లో ఇది వందోటెస్టుమ్యాచ్ కానుంది. ఈ సందర్భంగా తమిళనాడు క్రికెట్ సంఘం ప్రత్యేక జ్ఞాపికతో వంద టెస్టుల హీరో రూట్ ను సత్కరించనుంది. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ఈ మ్యాచ్ లో సెంచరీ సాధించగలిగితే…క్రికెట్ చరిత్రలోనే కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పగలుగుతాడు.  అంతేకాదు భారత లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ మరో మూడు వికెట్లు పడగొట్టగలిగితే…300 వికెట్ల క్లబ్ లో చోటు సంపాదిగలుగుతాడు. గతంలో ఇదే ఘనత సాధించిన కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ల సరసన నిలిచే అవకాశం ఉంది.

అభిమానులు లేకుండానే మ్యాచ్

నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఈ తొలిటెస్టు సమరాన్ని స్టేడియం గేట్లు మూసి…అభిమానులు లేకుండానే నిర్వహించబోతున్నారు. శుక్రవారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ తొలిటెస్టు మ్యాచ్ ను నూటికి నూరుశాతం బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. సిరీస్ లోని ఆఖరి మూడుటెస్టులకు మాత్రమే 50 శాతం మంది అభిమానులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. సిరీస్ లోని ఈ తొలిటెస్టులోనెగ్గి తొలి దెబ్బ ఏ జట్టు కొడుతుందన్నదే ఇక్కడి అసలు పాయింటు.

ఇదీ చదవండి:జో రూటే సెపరేటు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles