Thursday, April 25, 2024

రజని జయంతి

రజనిగా ప్రఖ్యాతులైన బాలాంత్రపు రజనీ కాంతరావు ఈ తరానికి ఆకాశవాణి విశ్రాంత అధికారిగా మాత్రమే తెలిసి ఉండవచ్చు కానీ  అలనాటి ఆ`పాత`మధురాలు `ఓహోహో పాపురమా`లాంటి పాటలు వింటే పాతతరం  సినిమా ప్రేక్షకులకు  ఒళ్లు పులకరిస్తుంది. తెలుగు సాహిత్యంలో  ప్రాత:  స్మరణీయ వేంకట పార్వతీశ్వర జంట కవులలో వెంకటరావు గారి  రెండవ కుమారుడు రజని. తండ్రి గారి వారసత్వంగా తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, బెంగాలీ తదితర భాషలతో  పాటు  సంగీత విద్య అబ్బింది. ఇదే అనంతర కాలంలో ఉద్యోగ పర్వంలోనూ, అటు చలనచిత్ర రంగంలోనూ ఎన్నో విశిష్ట  ప్రయోగాలకు పట్టుగొమ్మ అయ్యింది.పాడడం, సందర్భానుగుణంగా గీతాలు, సంగీత శ్రవ్య  రూపకాలు రాయడంతో పాటు దేవులపల్లి,  శ్రీశ్రీ, మల్లవరపు విశ్వేశ్వరరావు  లాంటి  వారితో రాయించారు.  దేశం మొత్తం మీద కేంద్ర సాహిత్య, సంగీత నాటక అకాడమీల  పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు.

రజనీయే` `రేడియో`

రజని అంటే రేడియో, రేడియో అంటే  రజని అనేంతగా  మమేకమయ్యారు.ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో పాఠాలు చెప్పిన ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, గురుతుల్యులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లతో  ఆకాశవాణిలో కలసి పనిచేయడం అధృష్టంగా చెప్పేవారు.  ఆ కాలంలో రజనీ  సహా ఎందరో ప్రముఖులు ఆకాశవాణికి సేవలు అందించారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదని, ఉద్యమమని ప్రసిద్ధ రచయిత గొల్లపూడి మారుతీరావు వ్యాఖ్యానించారు. దేశానికి  స్వరాజ్యం వచ్చిన నాడు జవహార్ లాల్ నెహ్రూ ప్రసంగం తరువాత, రజనీ రాసిన `మాదీ స్వతంత్ర దేశం..`గీతం (గాయని టంగుటూరి సూర్యకుమారి) ప్రసారమైంది. ఆయన మొదటి రేడియో సంగీత నాటకం (చండీదాసు) ఆయన 21వ ఏట  మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. అప్పటి నుంచి ఆయన కళా జీవితం ఉరకలెత్తింది.

రజనీ  ఆకాశవాణి ప్రసారాల్లో అనేక శీర్షికలతో కార్యక్రమాలు ప్రారంభించారు. అందులో `భక్తి రంజని` అత్యంత మిన్నగా  శ్రోతలను అలరించింది..నేటికీ కొనసాగుతోంది.`భక్తి రంజని`కార్యక్రమాన్ని `భక్తి రజని`అనాలని చాలా మంది  అభిప్రాయపడేవారని గొల్లపూడి  ఒక సందర్భంలో చెప్పారు. తెలవారుతుండగా ప్రతి ఇంట్లో  `భక్తి రంజని` పాటలే గింగుర్లేత్తేవి. శ్రోతలను విశేషంగా అలరించిన ఉష:శ్రీ `ధర్మ సందేహాలు`  కార్యక్రమం కూడా రజనీ ప్రయోగమే.  లలిత సంగీత విభాగాన్ని సుసంపన్నం చేశారు. పిల్లల కోసం ’జేజీ మామయ్య పాటలు` పాటలు కూర్చి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్నారు.

రేడియో అధికారిగా ఆయన ఎందరో కళాకారులను ప్రోత్సహించారు. `రజని కోకిలల్ని,  తుమ్మెదల్ని రేడియో స్టేషన్ కు తోలుకు పోయారు`అన్న చలం చలోక్తిని పెద్ద  కితాబుగా భావించారు. రజనీ ఆకాశవాణిలో  అధికారిగా కంటే కళాకారుడు  (ఆర్టిస్ట్) ఉండేందుకు ఇష్టపడేవారు. 

`కొండనుంచి కడలి దాకా`      

రజనీ చేసిన శతాధిక రచనల్లో `కొండ నుంచి  కడలిదాకా` సంగీత రూపకం విశేష మన్ననలు అందుకుంది. జపాన్ దేశ ప్రసారాల ఉత్తమరూపక అంతర్జాతీయ బహుమతి పొందింది. సంస్కృతంలో రాసిన  `మేఘసందేశం`సంగీత రూపకానికి ఆకాశవాణి జాతీయ పురస్కారం  లభించింది.  దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో రచించిన `క్షీరసాగర మథనం, విప్రనారాయణ`రచనలు ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. `సంస్కృత చతుర్భాణి` భాణ రచనలను  తెలుగులో రేడియో రూపకాలుగా మలచడాన్ని విశిష్ట  ప్రయోగంగా మన్ననలు అందుకుంది.

అన్నమయ్య కీర్తనల ప్రసారకర్త….

అన్నమాచార్య కీర్తనల  ప్రచార ఉద్యమంలో ముందువరుసలో నిలిచారు. కొన్నిటిని స్వయంగా బాణీలు కట్టి  విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం చేశారు.  మరో వాగ్గేయకారుడు క్షేత్రయ్య రచనలపై పరిశోధన చేసి కొన్నింటిని  ఆంగ్లంలోకి అనువదించారు.కూచిపూడి యక్షగానానికి జాతీయ స్థాయి  నృత్యంగా గుర్తింపు పొందడంలో తనవంతు  కృషి చేశారు.  బందా కనకలింగేశ్వరరావు, ఓలేటి వేంకటేశ్వర్లు తదితరుల సహకారంతో  ప్రసిద్ధ యక్షగానాలను  ప్రసారం చేశారు.

చలనచిత్ర ప్రస్థానం

రజనీ గారు తొలి తరం సినీ ప్రముఖుల్లో ఒకరిగా కొన్ని  చలన చిత్రాలకు  గీతాలు రాసి బాణీలు కట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనల మేరకు  ఆయన పేరు వేసుకునేందుకు అవకాశం కలగలేదు. సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకొని అనుమతి పొందితే పర్వాలేదు కానీ అప్పట్లో అదంతా  సులభ సాధ్యం కాకపోయింది. ఫలితంగా పాటల రచన తమ అన్నగారు నళినీ కాంతరావు గారుగా, పాటలకు మెరుగులు పెట్టిన చిత్తూరు నాగయ్య పేరును సంగీత దర్శకుడుగా తెరమీద పేర్లు వచ్చాయి. శోభనాచల వారి  `లక్ష్మమ్మ`చిత్రానికి  పాటలు, సంగీతం ఆయనే సమకూర్చినా, అటు సర్కార్ నిబంధనలు, ఇటు కొంత అనారోగ్యం కారణంగా ఘంటసాల గారు స్వరాలు రాసుకొని స్వరపరిచినందుకు ఆయన పేరు సంగీత దర్శకుడిగా మొదటి సారిగా తెరపై కనిపించింది. పాటల రచన మాత్రం కలంపేరుతో `తారానాథ్`అని వేశారు.  వైవీరావు నిర్మించిన `మానవతి` చిత్రానికి  పాటలు,సంగీతం `రజని`అని టైటిల్స్ లో ఉంటుంది.

 1941లో `తారుమారు, భలేపెళ్లి` చిత్రాలకు పాటలు రాసి సంగీతం సమకూర్చారు. `తారుమారు`లో ఒక జోలపాటను వారి సహధర్మచారిణి సుభద్రాదేవి పాడారు. `భలేపెళ్లి` తరువాత `స్వర్గసీమ`కు సంగీత దర్శకత్వం వహించారు. ఇందులో ఒక పాట  (ఎవనిరాకకై ఎదురు చూచెదవో ఏకాకివే బేలా) పాడడం మరో విశేషం. `తారుమారు, భలేపెళ్లి, స్వర్గసీమ, గృహప్రవేశం,  లక్ష్మమ్మ, పేరంటాలు, మానవతి. సౌదామిని` తదితర చిత్రాలకు పాటలు, సంగీతం అందించారు . కొన్ని చిత్రాలకు పాటలు రాశారు.

రేడియోనే ముద్దు

రజని  గారికి  సినిమాలలో ఎన్నో అవకాశాలు వచ్చినా మాతృసంస్థ రేడియోను వదలలేకపోయారు. `సినిమా అవకాశాలు బాగానే  వచ్చాయి.  కానీ అటు వెళ్లలేకపోయాను.  అప్పటికే రేడియోకి అలవాటు పడిపోయాను. పైగా రేడియో అధికారిగా  చాలా సంతోషాన్ని, గౌరవాన్ని అనుభవించాను. అందుకే రేడియోని వదిలిపెట్టబుద్ధికాలేదు`అని  ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్ర మూర్తికి  ఇచ్చిన ప్రత్యేక  ఇంటర్వ్యూలో వివరించారు.  దేశం మొత్తం మీద కేంద్ర సాహిత్య, సంగీత నాటక అకాడమీల  పురస్కారాలు అందుకున్న ఏకైక వ్యక్తిగా స్పందన కోరినప్పుడు `అది సంతోషదాయకమే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాను. ఆయన సాహిత్య ప్రియుడు. ఆయన నివాసం వరండాలోని అరల నిండా పుస్తకాలే. అన్నీ పుస్తకాలు ఉన్నా  నా చేతిలోని పుస్తకం ఏమిటా? అని ఆయన ఆసక్తిగా  చూసిన చూపును మరువలేను. నా వద్ద ఉన్న `ఆంధ్ర వాగ్గేయకారుల చరితము` తీసుకొని  అందులోని ఒక పాటను పాడడం మొదలుపెట్టడం చాలా ఆనందం కలిగించింది. అదో మర్చిపోలేని అనుభవం. ఆ తర్వాత సంగీత నాటక అకడమీ  పురస్కారం లభించింది` అని  వివరించారు.

ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఆయనను  కళాప్రపూర్ణతో సత్కరించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి  `కళారత్న` పురస్కారం,  విభజిత ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విశిష్ట జీవిత సాఫల్య పురస్కారం అప్పాజోస్యుల విష్ణుభొట్ల జీవిత సాఫల్య పురస్కారం,రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. వివిధ  సాంస్కృతిక సంస్థలు  నాదసుధార్ణవ,  పుంభావ  సరస్వతి, నవీనీ వాగ్గేయకార  తదితరల బిరుదులతో సత్కరించాయి.

రజని మూర్తిమత్వం

రజనీ గారు మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో  పనిచేస్తున్నప్పుడు `ఈ లేఖ తెచ్చిన వ్యక్తికి  వీలైనంత సహాయం చేయగలరు.అది నాకు చేసినట్లే` అని అప్పటికే ప్రసిద్ధ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యులు రాసిన లేఖతో  వచ్చిన యువకుడిని సాదరంగా ఆహ్వానించి  కార్యక్రమ నిర్వాహకుడి హోదాలో ఆయనకు గాత్రపరీక్ష (ఆడిషన్) నిర్వహించి  రేడియోలో  పాడే అవకాశం కల్పించారు. ఆ అవకాశం దక్కించుకున్న యువకుడు  అనంతరకాలంలో  సినీ నేపథ్య గానానికి చిరునామాగా నిలిచిన అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు. అలా రజని గారి  సహకారంతో ఆకాశవాణి గాయకుడిగా పరిచయమై, చలనచిత్ర సంగీత దర్శకునిగా తెరమీద మొదటిసారిగా కనిపించిన (లక్షమ్మ) ఘంటసాల ఆయనను కడకంటా పిత్రుతుల్యుగా భావించారు. `నాన్నగారూ`అని అప్యాయంగా పిలిచేవారు.

ఘంటసాల గారు పరమపదించిన వేళ రజనీ గారి వేదన వర్ణనాతీతం. తన కంటి ముందు  సవరించుకున్న గాత్రం  అంత త్వరగా మూగపోవడం పెనువిషాదమని  ఈ వ్యాసకర్తతో అనేవారు. `రజనీ సంగీతం, సాహిత్యం, యక్షగానాలు, సంగీత రూపకాలు మొదలైన వాటిలో పాల్గొని  వారికి తృప్తి  కలిగించేలా పాడ గలిగినందుకు  గర్వపడుతున్నాను. అయన సానిహిత్యం, అప్పటి పునాదులే  నన్ను వాగ్గేయకారునిగా  చేశాయి`అని ప్రఖ్యాత వాగ్గేయకారుడు  మంగళంపల్లి బాలమురళీకృష్ణ సవినయంగా అన్నారు. కొన్నేళ్ల క్రితం విజయవాడ వెళ్లిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఇప్పుడు దివంగతులు)తమ చిన్ననాటి మిత్రులు ఎంవీఎస్ ప్రసాద్ తో  రజనిగారి కుశలం గురించి వాకబు చేశారు. ఆయన బాగున్నారని,కలవాలనుకుంటే మీరు బస చేసిన హోటల్ కు తీసుకువస్తానని మిత్రుడు చెప్పగా కోప్పడ్డారట. `రజనీ వద్దకు బాలు స్వయంగా వెళ్లాలి కానీ  తద్విరుద్ధంగా కాదని  సరిదిద్దారు. పైగా, వారి పాదాల చెంత కూర్చోవడానికి కూడా మనకు అర్హత లేదని ముక్తాయించారు. అదీ రజనీ మూర్తమత్వం అంటే` అని నాటి అనుభవాన్ని  ఎమ్వీఎస్ అక్షరబద్ధం చేశారు. డీకే పట్టమ్మాళ్, టంగులూరి సూర్యకుమారి లాంటి ప్రముఖులు రజని  ఆయన ఆధ్వర్యంలో పాడారు. `వారంతా ఎంతో ప్రతిభావంతులు. తర్వాత చాలా ఖ్యాతి గడించడం నాకు గర్వకారణం. నేను వారితో పాడించడం కాదు. వారు పాడడమే విశేషం. అందరితోనూ  సత్సంబంధాలు ఉన్నాయి`అని చెప్పేవారు రజని.

మహానటి భానుమతికి పద్మశ్రీ పురస్కార ప్రదానం సందర్భంగా ఏర్పాటైన సభలో `ఓహోహో పావురమా`పాటలోని పదాలను  `ఓహోహో భానుమతీ` అని అప్పటికప్పుడు మార్చి అభినందపూర్వకంగా పాడితే భానుమతి ఆనందాశ్రువులు రాల్చారు.

జీవిత విశేషాలు

1920 జనవరి 29న జన్మించిన రజని  ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో స్నాతకోత్తర పట్టాను ప్రథమ శ్రేణిలో పొంది,  1941లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వామకుడిగా  నియమితులయ్యారు. పదోన్నతులపై వివిధ  ఆకాశవాణి కేంద్రాలలో సేవలు అందించి  1978 జనవరిలో బెంగళూరు ఆకాశవాణి సంచాలకుడిగా పదవీ విరమణ చేశారు. 1979 నుంచి మూడేళ్లపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వర కళాపీఠం సంచాలకుడిగా, 1988 నుంచి రెండేళ్ల పాటు తెలుగు విశ్వ విద్యాలయం రాజమహేంద్రవరం పీఠంలో గౌరవాచార్యులుగా, 1982 నుంచి మూడేళ్లు  ఆకాశవాణి, దూరదర్శన్  ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా  సేవలు అందించారు. `జీవితంలో  చేయాలనుకున్నవన్నీ చేశాను. ఏ వెలితి, అసంతృప్తి లేదు. కాకపోతే  నా పేరుతో సంగీత సాహిత్య పరిషత్తు పెట్టాలని ఉంది. పింఛన్  మొత్తంతో , ఠాగూర్ అవార్డుతో వచ్చిన నగదు పురస్కారంతో నిధిని ఏర్పాటు చేయాలి.  భవిష్యత్తులో సంగీత సాహిత్యాల అభివృద్ధికి ఉపయోగపడాలనేది నా కోరిక` అని చెప్పేవారు. ఆయన  కల సాకారం కాకుండానే

 అస్వస్థతతో  98వ ఏట  (తెలుగు  సంవత్సరం ప్రకారం  అధిక మాసాలతో  నూరేళ్ల పండుగ చేసుకున్నారు) సెలవంటూ వెళ్లిపోయారు.

( ఈ నెల 29న రజని గారి జయంతి సందర్భంగా….)                

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles