Saturday, April 20, 2024

హేతువాద ప్రచారకుడు నార్నె వెంకటసుబ్బయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం

సెప్టెంబర్ 22న ప్రదానం

తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన కీర్తి పురస్కార గ్రహీతలలో హేతువాద ప్రచారం చేస్తున్న నార్నె వెంకటసుబ్బయ్య ఉన్నారు. ఆయనను అభినందించడానికి ఫోన్ చేస్తే ‘ఇది నలభై ఏళ్ళుగా చేస్తున్నపని’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. అంతకు ముందు జాతీయ హేతువాద సంఘం సహాయ కార్యదర్శిగా పదేళ్ళూ, ప్రకాశంజిల్లా హేతువాద సంఘం అధ్యక్షుడిగా 1992 నుంచి పదేళ్ళూ పని చేశారు.

కావలి  జవహర్ భారతిలో విద్యాభ్యాసం

నార్నెవెంకటసుబ్బయ్య పుట్టింది ప్రకాశం జిల్లా రుద్రవరం గ్రామం. తండ్రి నారాయణ. 01జనవరి 1950లో పుట్టిన వెంకటసుబ్బయ్య కావలి జవాహర్ భారతిలో పీయూసీ 1966లో  చదువుకున్నారు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆరేడు తరగతులు చదువుతూ ఉండగానే ఆంధ్రప్రభ వారపత్రికలలో రంగనాయకమ్మ రచించిన బలిపీఠం సీరియల్ గా వచ్చేది. ఆ సీరియల్ ను చదివేవారు. ఆ నవల ఆయన జీవితంపైన ప్రగాఢమైన ప్రభావం వేసింది. వారి గ్రామంలో గ్రంధాలయం ఉంది. త్రిపురనేని గోపీచంద్ నవల అసమర్థుని జీవిత యాత్ర చదివారు. అది కూడా ఆయనను ప్రభావితం చేసింది. శరత్ బడదీది చదివారు. డిక్టెటీవ్ నవలలు చదివేవారు. వ్యవసాయ కుటుంబం కనుక ఇంట్లో పూజలూపునస్కారాలు తక్కువే. దేవుడి భక్తి బాగా తక్కువ.

శ్రీలంకకు చెందిన హేతువాది డాక్టర్ కోవూరు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు ఆయన ప్రసంగాలు విన్నారు. సీవీ సాహిత్యం చదివారు. తోటకూర వెంకటేశ్వరరావు నిర్వహణలో ‘చార్వాక’ పత్రికలోని వ్యాసాలు చదివాను. ఆ పత్రిక నాబోటి హేతువాదులను చాలామందిని తయారు చేసింది. వెంకటసుబ్బయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ హేతువాదం ప్రకారం ముహుర్తాలూ గట్రా చూడకుండా పెళ్ళిళ్ళు చేశారు.  

మూఢనమ్మకాలు రూపుమాపడం కోసం పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉంటారు. రకరకాల సమస్యలపైన విలేఖరుల గోష్ఠులు ఏర్పాటు చేసి మాట్లాడతారు. ఎన్నో రౌండ్ టేబిల్ సమావేశాలు, సభలూ ఏర్పాటు చేశారు.

హేతువాద ప్రచారంకోసం, మూఢనమ్మకాల నిర్మూలనకోసం చట్టం తేవాలని కోరుతూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో పదేళ్ళుగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే అంశంపైన టీవీ చర్చలలో పాల్గొంటూ ఉంటారు. జ్యోతిషం నిజమని నిరూపించవలసిందిగా జ్యోతిష్కులను సవాలు చేశారు. ఎవ్వరూ ఇంతవరకూ వారి సవాలును స్వీకరించి జ్యోతిషం నిజమని నిరూపించలేకపోయారు.  

  హేతువాదసంఘం సాధించిన విజయం

ప్రకాశం జిల్లాలో రామదూత అని ఒక దొంగస్వామి ప్రభుత్వభూములు అక్రమించి ఆశ్రమం పేరుతొ మోసం చేస్తుంటే, పది సంవత్సరాల క్రితం  లోకాయుక్తలో కేసువేయ్యగా,  28 మే 2021 నాడు ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరి ఉషారాణి  దొంగస్వామి ఆక్రమించిన భూమిని స్వాదీనం చేసుకోవాలని ఆదేశించారు.  ఒకదొంగస్వామి ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొవాలని చెప్పటం మనరాష్ట్రంలో మొదటిసారి కావచ్చు. ఇది హేతువాదుల విజయంగా ఆయన పరిగణిస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఈ నెల 22న జరుగుతుంది. రూ. 5116లతో పాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles