Thursday, April 25, 2024

హాస్యానికి చిరునామా రమణారెడ్డి

తెలుగులో తొలి తరం హాస్య నటన లో సాటి లేని మేటి,  బహుముఖ కళాకారుడు, ఇంద్ర జాలికుడు, రంగస్థల నటుడు, సమాజ సేవకుడు, ఉదారుడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రాణించిన హాస్య రత్నం తిక్కవరపు వెంకటరమణారెడ్డి. ఒకనాడు తెలుగునాట ప్రతి ఇంటా నవ్వుల పువ్వులు పూయించి, ముప్పై ఏళ్ల క్రితం హాస్య నటుడుగా ఒక వెలుగు వెలిగిన మహా నటుడు రమణారెడ్డి. అప్పట్లో సన్నగా, బక్క పల్చగా ఎత్తుగా ఉన్న వాళ్లని   రమణారెడ్డి లా ఉన్నావని పోలుస్తుండేవారు. నేటికీ  రమణారెడ్డి ఆట, పాట, నటన టీవీలలో చూసి ఆనందించటమే కాకుండా నేటి యువ కళాకారులు కూడా ఆదర్శ ప్రాయంగా తీసుకునే గొప్ప నటుడుగా నిలిచి పోయాడు.  నేటి తరానికి కూడా ఆయన నటనా నిఘంటవు.

ప్ర‌భుత్వోద్యోగాన్ని వ‌దిలి సినీ రంగానికి..

ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సినీ రంగప్రవేశం చేశారు. మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు. మానవతా గుణంతో ఉచితంగా మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చారు. సమాజ సేవలో ఉదార స్వభావాన్ని చూపారు రమణారెడ్డి.
నెల్లూరు జిల్లా జగదేవిపేట గ్రామంలో అక్టోబరు 1, 1921లో తండ్రి సుబ్బరామిరెడ్డి, తల్లి కోటమ్మలకు రెండో సంతానంగా జన్మించారు. ప్రాథమిక విద్యను అభ్యసించే రోజుల నుంచే ఆయన నాటకాలలో నటించటం మొదలు పెట్టారు. నెల్లూరు వీఆర్ కాలేజీలో ఎఫ్ఏ చదివేటప్పుడు మన మససు కవి ఆచార్య ఆత్రేయ, డాక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఊరూర నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆత్రేయ రాసిన ఎన్జీవో నాటకంలో రమణారెడ్డి తండ్రి పాత్ర పోషించి తాను ఏడవకుండా ప్రేక్షకులను కంట తడిపెట్టించటమే ఆయనను సహజ నటుడుగా చేసింది.

రమణారెడ్డి కేవలం నటుడే కాకుండా ఒక రచయితగా కూడా సుప్రసిద్ధుడు. ఆ రోజుల్లో నెల్లూరులో నారపరెడ్డి రామిరెడ్డి నడిపిన మెరుపు సాహిత్య పత్రికలో మరణరే కలం పేరుతో రమణారెడ్డి ఒక ప్రత్యేక కాలం రాశారు. సినిమా రంగానికి రాక ముందు గుంటూరు మున్సిపాలిటీలో శానిటరీ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తూ మంచి మెజీషియన్ గా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఆ తరువాతనే సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు. సినిమా పరిశ్రమలో కూడా ఆ విద్యను హాబీగా ప్రదర్శిస్తూ ఉండేవారు. లవకుశ చిత్ర నిర్మాత నెల్లూరు జిల్లా వాసి అయిన శంకర్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన మద్రాసుకు వెళ్లేందుకు మార్గం సులువైయింది. మొదటి నుంచి మ్యాజిక్ చేయటం సరదా అయినా దానిని అతి కొద్ది కాలంలోనే అభ్యసించారు. తీరిక దొరికినప్పుడల్లా మ్యాజిక్ విద్యలో మరింత మెలకువలు నేర్చుకుంటూ కడుపుబ్బా నవ్వించేవారు.

ఉచితంగా మ్యాజిక్ ప్ర‌ద‌ర్శ‌న‌లు

 సేవా సంఘాల సహాయ నిధికి  ఉచితంగా ప్రదర్శనలు ఇచ్చేవారు. డబ్బు సంపాదించేందుకు సినిమా ఉంది కదా, ఇది సమాజ సేవ కోసం అంటూ తన ఉదార స్వభావాన్ని చాటుకునేవారు. నా మ్యాజిక్ పేదలకు ఏ మాత్రం ఉపయోగ పడినా తనకు ఆనందమే. అనటమే కాకుండా ఇందులో అనేక మంది వారసులను కూడా తీసుకు రాగలిగారు. కొన్ని తెలుగు చిత్రాల షూటింగ్ విరామం సమయంలో అనేక గమ్మత్తులు ప్రదర్శించేవారు. ఆ సమయంలోనే కవి రచయిత ఆరుద్ర కూడా చిన్న చిన్న మ్యాజికు చేస్తూ కలిసి మెలసి ఉండేవారు. సినిమా పరిశ్రమలో ఏ పర్సనాల్టీతో మొదలయ్యారో ఆదే శరీర ఆకృతితో ఉండేవారు. రబ్బరు బొమ్మలాగా చేతులు, కాళ్లు శరీరాన్ని తిప్పుతూ అత్యంత చలాకీగా ఉండేవారు. కొన్ని సమయాల్లో ఉన్నట్టుండి కూలిపోవటం, దబాలమని పడిపోవడం, జరుగుతుండేది. ఆయన తొలిచిత్రం మానవతి. దర్శకులు వైవీ రావు. జంగం దేవర పాత్ర పోషించి తొలి ప్రయత్నంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. పరిశ్రమలో రేలంగి, రమణారెడ్డి జంట హాస్యం చాలా కాలం గొప్ప స్థాయిలో నడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేది. అటు జానపదాలైన, సాంఘికమైన, పౌరాణికమైనా నెల్లూరు యాస ఆయన మాటల్లో దోబూచలాడు తుండేది. నీ పాసుగూల.. అనే పదం రమణారెడ్డి నోట ప్రత్యేకంగా విన‌బ‌డేది. పైకి తమాషాగా కనిపిస్తూ ప్రదర్శించే  విలన్ పాత్రకు పెట్టింది పేరు. ముఖ్యంగా హాస్యం కోసం కోతి చేష్టలు వేయటం, వెలికి వేషాలు వేయటం ఆయన పాత్రలలో మచ్చుకైనా కనిపించేది కాదు. కేఎస్ ప్రకాష్ రావు, తిలక్ వంటి ప్రసిద్ధ దర్శకుల చిత్రాలలో రమణారెడ్డి ఉండి తీరాల్సిందే రోజుల్లో ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలు ఎక్కువగా రమణారెడ్డి హాస్యాన్ని కోరుకునే విషయం అక్షర సత్యం. డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలుదారులు రమణారెడ్డి ఉన్నారా అని అడిగి వ్యాపారం చేసుకునే వారు.

ఎంత హ‌స్య చ‌తురుడో అంత‌టి గంభీరుడు

వ్యక్తిగా ఆయన సౌమ్యుడు. తెరమీద ఎంత అల్లరి ఆర్భాటాలు చేసి నవ్వించేవాడో బయట అంత సీరియస్ గా ఉంటారు ఏమైన జోకు వేసినా సైలెంట్ గా ఉండేది. గట్టిగా కూడా మాట్లాడేవారు కాదు. ఆయన సున్నిత  మనస్కుడు. ఏనాడు ఏ ఒక్కరి గురించి చెడుగా గానీ, విమర్శలు కానీ చేయరనేది పరిశ్రమలో ఆయనకు ఉన్న మంచి పేరు. ఆయన నటించిన ఒక చిత్రానికి రఘుపతి వెంకయ్య కుమారుడు  ప్రకాష్ దర్శకత్వం వహించాడు. వాహిని వాని సుమంగళి, దేవత చిత్రాలతో పాటు బంగారు పాప, మిస్సమ్మ చిత్రాలలో ముఖ్య భూమికలు పోషించారు. ముఖ్యంగా మిస్సమ్మ, బంగారు పాప చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా  దగ్గరయ్యారు. కేవీ రెడ్డి పౌరాణిక చిత్రం మాయాబజారులో రమణారెడ్డి పోషించిన చిన్మయ పాత్ర గుర్తుండి పోయేదిగా ఉండేది.  తొలి రోజుల్లో వేషాల వేటలో అనుభవం కోసం డబ్బింగ్ చిత్రాలకు గాత్ర దానం కూడా చేశారు. నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాలలో,  తన గాత్రం, దానంగానే మిగిలి పోయిందని, సరదాగా అనేవారు. గుండమ్మ కథ చిత్రంలో సూర్యకాంతం అన్న గరటయ్యగా ఆయన పోషించిన పాత్ర గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆ చిత్రం యావత్తు ఆయన ఒకే ఒక కోటుతో కనిపించడం ఆశ్చర్యం. కులగోత్రాలు చిత్రంలో పేకాట ప్రియుడుగా ప్రేక్షకులను మెప్పించారు. అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే పాటలో నటన అతి సహజంగా అభిమానాన్ని పొందింది. అలాగే మిస్సమ్మలో డేవిడ్ పాత్ర కూడా అంతే సహజంగా నిలిచింది. కేఎస్ ప్రకాష్ రావు ఒక సినిమాలో నారదుడి వేషం వేయించటం, ముందుగా రమణారెడ్డి నేను నారదుడుని ఏమిటని, ఈ రోజు నారదుడు అంటారు.. రేపు హనుమంతుడు అంటారని ప్రకాష్ రావుతో వాదించినా దర్శకుడైన ప్రకాష్ రావు వినలేదు. రమణారెడ్డి నటన పట్ల ఆయనకు ఉన్న నమ్మకం అటువంటిది. అందువలనే ప్రకాష్ రావు నారదుడి వేషం వేయించి ఆయన ఎముకలు కూడా కనిపించకుండా జుబ్బా తొడిగి నటింప చేసిన ఘనత ఆయనకే దక్కింది. బంగారు పాపలో కూడా ముక్కు, గొంతుతో మాట్లాడినట్లు అత్యంత వెరైటీగా పాత్రను మలిచాడు. భానుమతితో అంతస్తులులో నటిస్తూ దులపర బుల్లోడా.. పాటలో నటించటం అప్పట్లో సంచలనంగా మారింది. శంకర్ రెడ్డి లవకుశలో సూర్యకాంతం ఆయనకు అర్ధాంగిగా నటించింది. ఇందులో వీరి హాస్యం ప్రేక్షకులను తెలిగింతులు పెడుతుంది. ఇంకా ఎన్నో చిత్రాల్లో ఎన్నో జిమ్మిక్స్ మ్యాజిక్స్ చేసి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందారు.

న‌ట‌న‌లో మూడు ద‌శాబ్దాలు

కొంగ కాళ్ల వంటి చేతుల విసుర్లు, స్పీడ్ నటన రమణారెడ్డి పేరు వినగానే గుర్తుకొస్తాయి. మనసారా నవ్వు పుట్టిస్తాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా స్టేజి, సినిమా, ప్రదర్శనలతో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించి, చిరస్మణీయుడుగా నిలిచి పోయాడు. అనారోగ్యానికి గు రైన ఆయన 1974 నవంబరు 11న శాశ్వతంగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన నటన ముఖ్యంగా హాస్యం, పెద్దరికం పాత్రలు, సాఫ్ట్ విలనిజం లాంటి పలు అంశాల పాత్రలకు ఆయన మోడల్ గా నిలుస్తూ ఎందరికో ఆధ్యయనం కలిగిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నేటికీ, రేపటికి కూడా చిరస్మరణీయుడుగా మిగిలిపోయిన మహానటుడు.

(న‌వంబ‌ర్ 11 ర‌మ‌ణారెడ్డి వ‌ర్థంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles