Thursday, April 25, 2024

దేశ విదేశాల్లో రాణించిన టంగుటూరి

భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె నాట్యకారిణి, నటి, గాయని మాత్రమే కాదు మంచి వక్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు పాటనకి, తెలుగు భాషకి, భారతీయ నృత్యాలకి స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందడానికి ఆవిడ చేసిన కృషి అపూర్వం. అనన్య సామాన్యం. ప్రాచ్య, పాశ్చాత్య నృత్య, సంగీతాలకు మధ్య సుహృద్భావ సేతువుగా అంతర్జాతీయ కీర్తినందిన మధురగాయని ఆమె.

నటి, గాయకురాలు

టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఆమె నవంబర్13,1925లో రాజమండ్రిలో జన్మించారు.  ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు  తమ్ముడు టంగుటూరి శ్రీరాములు కూతురు. మూడో ఏటనుంచే పాటలుపాడేది. 1937లో మద్రాసు చేరుకుని, పన్నెండు, పదమూడేళ్ళ ప్రాయంలోనే సినీరంగ ప్రవేశము చేసి, ‘రైతుబిడ్డ’ సినిమాలో నటించారు. 1952లో ఆమె తొలి మద్రాసు అందాల సుందరి (మిస్ మద్రాసు)గా ఎంపికైనారు. సూర్యకుమారి రూపం, కంఠస్వరం రెండూ బాగా ఉండడంచేత, అప్పటికే పెదనాన్న ప్రకాశం సభల్లో ప్రార్థన గీతాలు పాడుతూండడం చేత సినిమావారి పిలుపు వచ్చింది.

telugu old actress tanguturi suryakumari birth anniversary

పొట్టి హీరోల వల్ల సమస్య

సాంప్రదాయ నియమ, నిష్టలుగల కుటుంబం కావడం చేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. సూర్యకుమారి కంఠం, రంగూ, రూపం ఆకర్షణీయంగా ఉన్నా, మామూలు అమ్మాయిల కంటే కొంచెం పొడవుగా ఉండటం చేత సినిమా రంగంలో సమస్య ఎదురైంది. ఆనాటి సగటు హీరోలు ఆమె కంటే పొట్టిగా ఉండటం కారణం. అదీ కాక ఆమె బ్రాహ్మణ,   పేరుపొందిన రాజకీయ కుటుంబం నుంచి రావటమే కాదు, ప్రేమ సన్నివేశాలలో హీరోయిన్ మీద హీరో చెయ్యి వెయ్యడం, ఇత్యాదివి ఒప్పుకొనేవారు కాదు. గొప్ప చాతుర్యం ఉండి కూడా ఆమె  సినిమాల్లో సుస్థిరత పొందలేక పోయింది.

24 సినిమాలో నటించిన విదుషీమణి

అయినా సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ  మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది. విప్రనారాయణ’ ఆమె తొలిచిత్రం. అదృష్టం, జయప్రద దేవత, చంద్రహాసన, దీనబంధు. భక్తపోతన, భాగ్యలక్ష్మి, కృష్ణప్రేమ, గీతాంజలి, అదృష్టదీపుడు,  మరదలి పెళ్లి, భక్త రామదాసు తదితర తెలుగు చిత్రాల్లో ఉడన్’, ‘ఖటోలా’ తదితర హిందీ చిత్రాల్లో, ‘కటకం’, ‘నేంసారనౌక మొదలైన తమిళ చిత్రాల్లో నటించింది. అలాగే కన్నడ చిత్రం భారతి’లో, ఆంగ్ల చిత్రం ‘బాంటే వయిటి లోనూ నటించింది. సూర్యకుమారి, లండన్లో నాట్య ప్రదర్శనలు నిర్వహిస్తూ, కాళికాదేవిగా నాటకాల్లో నటించేది.

వంద గ్రామఫోను రికార్డులు

లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి. నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేది. ఆంధ్రలోని చాలా ఊళ్ళలో లలిత సంగీత కచ్చేరీలు చేశారు. పేరు ప్రతిస్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్ళపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువుమీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి, ప్రథమశ్రేణిలో పాసైనారు. 

telugu old actress tanguturi suryakumari birth anniversary

మా తెలుగు తల్లికి మల్లెపూదండ…

పలు భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఆమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించి,  శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. ఆయన ఏ సభకు వెళ్ళినా ఆమెను  తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో, వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లె పూదండ పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.

రావోయి చిన్నవాడా…

వీటితో పాటు ‘స్వప్నజగతిలో ఛాయావీణ’ మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు  ‘ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ’, ‘రావోయి చిన్నవాడా’ మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ఆమె  పాడిన పాటలు గ్రాంఫోన్ రికార్డులుగా వెలువడి విరివిగా అమ్ముడు పోయేవి. ప్రత్యేకంగా రాయించుకున్న పాటలు ఆమెతో పాడించి మరీ గ్రామఫోన్ రికార్డులుగా తీసుకురావడానికి అప్పటి గ్రాంఫోన్ కంపెనీ హెచ్.ఎం.వి. విశేష ఆసక్తి ప్రదర్శించేది, అలా ఆమె పాడిన పాటల్లో జాతీయ గీతాలు, భావగీతాలు, అష్టపదులు ఇలా చాలా రకాలు ఉన్నాయి.

మంచి వక్త

శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగుతల్లికి మల్లె పూదండ..’ పాటని ఆమె పెదతండ్రి టంగుటూరి ప్రకాశం పంతులుతో వివిధ రాజకీయ సభల్లో పాడి ప్రాచుర్యం తెచ్చింది. ఆ సభల్లో వక్తగానూ ఆమెకు పేరుండేది.  వెండి కంచాలలో వేడి బువ్వుందోయ్, పసిడి కంచాలలో పాల బువ్వుందోయ్, తిందాము రావోయ్ జాబిలి, ఆడుకుందాము రావోయ్ జాబిలీ’ అంటూ నటిస్తూ పాడిన ‘దేవత’ చిత్రంలోని పాట,  నారదుడుగా ‘శ్రీకృష్ణ ప్రేమ’లో నటిస్తూ ‘రేపే వస్తాడంట గోపాలుడు మాపే వస్తాడంట గోపాలుడు…’ ఇలా చాలా పాటలు ప్రజాదరణ పొందాయి. 1958లో భారత చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధుల బృందంలో ఒక ప్రతినిధిగా అమెరికాను సందర్శించి, తన ఉపన్యాసాలతో ఆకట్టుకుంది. అలా వారితో ఏర్పడిన సంబంధాలు 1959లో కొలంబియా యూనివర్సిటీ ట్యూటర్ గా వెళ్లి, పాశ్చాత్య సంగీతం, పాశ్చాత్య నృత్యాల్లో శిక్షణ పొంది వచ్చారు. 

ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తో కలసి పని,  పెయింటర్ తో వివాహం

సూర్యకుమారి ఆరోజుల్లోనే హాలీవుడ్ కి వెళ్లి ప్రముఖ దర్శకుడు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ వద్ద పని చేసింది. ఇంగ్లండ్లో సిరపడి ప్రముఖ పెయింటర్ హెరాల్డ్ ఎల్విన్ ను వివాహం చేసుకుని ఇండియా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ అనే సంగీత నాట్య పాఠశాలను నిర్వహించారు.

telugu old actress tanguturi suryakumari birth anniversary

ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను, కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పరస్పర సదవగాహన పెంపొందించం ముఖ్య ఆశయం. 1968లో ఆమె కృషిని బ్రిటిషు రాణి గుర్తించింది. 1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ సెయింట్ పాల్ కెథెడ్రల్ లో గానం చేసిన ప్రథమ భారతీయ వనిత ఆమె.  నార్వే, స్వీడన్, హాలెండ్, స్పెయిన్, కెనడా, అమెరికా మొదలైన పలు దేశాలలో భారతీయ సంగీత శిక్షణాలయాలు నెలకొల్పి, వందలాది కళాకారులను తయారు చేశారు.

బ్రాడ్వేలో ప్రదర్శన

అమెరికాలో బ్రాడ్వే థియేటరులో విశ్వకవి రవీంద్రుని ‘కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్’ నాటకంలో రాణి పాత్ర ధరించి, బ్రాడ్వే అవార్డు పొందిన మొదటి భారతీయ నటి. ఆ నాటకాన్ని న్యూయార్కులో ఎనిమిది నెలలపాటు ప్రదర్శించి, అటు తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసి ‘ది కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంజర్’ నాటకంలో నటించారు. ఆ నాటకానికి  దేశ విదేశాలలో విశేష ఆదరణ లభించడమే కాకుండా విదేశీయుల అభిమానాన్ని కూడా చూర గొ నే అవకాశం కలిగింది.  కొలంబియా యూనివర్సిటీలో, లండను యూనివర్సిటీ విద్యాసంస్థలలో, బ్లాక్ థియేటరులోను భారతీయ నృత్యకళ సంగీతంపై వర్క్ షాపులు నిర్వహించారు. 

1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఆమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో ఆమెను గౌరవించింది.  ఆమె ఏప్రిల్ 25, 2005 న లండనులో మరణించారు.

(నవంబర్ 13, సూర్య కుమారి జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles