Wednesday, September 18, 2024

ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం

పరవశ దైన్యమాడుకొను ప్రౌఢల గానదు, ఘర్మవారిచే

కరగి స్రవించు చిత్రకము గానద నాదృత వీటి, పాటలా

ధరమున, సున్నమంటిన

విధంబును గానదు, నవ్వులాటకా

భరణము గొన్న కానదొక

బాల నృపాలుని చూచి నివ్వెరన్!

అల్లసాని పెద్దన

(మనుచరిత్ర పంచమాశ్వాసం)

తిక్కన సోమయాజి విరాట పర్వంలో ఉత్తరాభిమన్యుల వివాహఘట్టమెంత రమణీయమైనదో, అల్లసాని పెద్దన మను చరిత్ర పంచమాశ్వాసంలోని  స్వరోచి, మనోరమల పెళ్ళి ఘట్టం కూడా అంతే మనోహరమైనది. ఒకటి మహాభారత యుగం నాటిది. మరొక్కటి స్వారోచిష మనువు పుట్టుక కన్నా ముందరిది.

Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం

కాకపోతే, తిక్కనగారి విరాటపర్వపు ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంలో మహాభారత యుగం బదులు, మనుమసిద్ధి  నాటి తెలుగుదనమే స్ఫురిస్తుంది. అట్లే, మనోరమా స్వరోచి వివాహ వృత్తాంతంలో సైతం స్వారోచిష మనువు యుగం బదులు శ్రీకృష్ఢరాయల కాలం నాటి తెలుగు సమాజమే కొట్టొచ్చినట్లు కనబడడం విశేషం.

పెండ్లి కుమారుడు, స్వరోచి, నగరవీధుల గుండా పెద్ద ఊరేగింపుతో వివాహ వేదికకు తరలి వస్తున్నాడు. త్రోవకు ఇరువైపులా నిలిచి, ఒకరినొకరు తోసుకుంటూ, బుజంబుజం రాసుకుంటూ, పెల్లుబికిన ఉత్కంఠతో, పురజనులా ఊరేగింపును  కన్నార్పకుండా చూస్తున్నారు. ఈ ఘట్టంలో వివిధ పురజనుల కుతూహలాన్నీ, హర్షాతిరేకాన్నీ, వర్ణించే ఎనిమిది, తొమ్మిది పద్యాల్లో, నేటి పద్యం కూడా ఒకటి.

Also read: తుం గ భ ద్రా న ది

నేటి పద్యంలో ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలో వున్న స్త్రీలు కొందరు,  రాచవీధిలోని ఒక ఇంటి గుమ్మం ముందు గుమిగూడి, నూనూగు మీసాల నూత్న యవ్వనంతో మెరిసిపోతున్న స్వరోచి అందచందాలను, అతని రాచఠీవినీ, తన్మయత్వంతో వీక్షిస్తున్నారు.

ఆ ప్రౌఢవనితల నడుమ మౌగ్ధ్యం తొనకిసలాడే ఒక బాల కూడా వున్నది.

ఊరేగింపుగా వస్తున్న స్వరోచిని తప్ప, తన స్వంత ఉనికినీ, తనతో బాటు అక్కడ వున్న ప్రౌఢవనితల ఉనికినీ, చుట్టూరా వున్న ప్రపంచం ఉనికినీ విస్మరించి, పరవశదీనయైన ఆ బాలామణి, స్వరోచినే, కేవలం స్వరోచినే, అనిమిష నేత్రయై వీక్షిస్తున్నది.  తనకు ఈడూ జోడైన ఆ రాచకొడుకులో తన ప్రేమలోకపు రాజకుమారుణ్ణే బహుశా ఊహించుకొంటున్నది కాబోలు!

Also read: సంధ్య

ఆ ముద్దరాలి “పరవశదైన్యం” ఆమెతో పాటు అక్కడ గుమిగూడిన గల పురంధ్రీ రత్నాలకు జాలి కలిగిస్తున్నది. ఆమె మౌగ్ధ్యాన్ని చూసి  ఎగతాళిగా వారు నవ్వుకుంటున్నారు.

తన అమాయకత్వంతో ఈ విధంగా ఆడుకొంటున్న ప్రౌఢ మహిళలను  గమనించే స్ధితిలో లేదా బాల. తన నొసట గల తిలకం చెమటచే “కరగి స్రవించడం” కూడా పట్టించుకునే స్ధితిలో లేదు.  తాంబూల చర్వణంచే ఎఱ్ఱవారిన తన పెదవిపై “సున్నమంటిన విధంబును” కూడా కనిపెట్టలేదా మై మరచిన దీనురాలు.

చిట్టచివరకు, నవ్వులాట కోసం, అక్కడి ప్రౌఢాంగనలు తన మెడలోని ఆభరణాన్ని  తస్కరించడం కూడా కనుక్కోలేని గాటపు తన్మయత్వంలో ఆ పరాధీన యువతి వున్నది.

సమస్తం మరచి,  నివ్వెర పాటుతో ఆ “బాల”, “బాల” నృపాలుడైన స్వరోచినే కన్నార్పకుండా చూస్తున్నది.

దాదాపు ముప్పై నలభై ఏండ్ల క్రిందట ఆంధ్రప్రభ వారపత్రికలో “సాహితీసౌరభం” శీర్షికన ప్రముఖ కవులు కొందరు,  ప్రాచీన పద్యాలను పాఠక లోకానికి పరిచయం చేసేవారు. అట్లా పరిచయం చేయబడిన వాటిలో నేటి పద్యం కూడా ఒకటి.  పరిచయం చేసిన వారు సరస్వతీపుత్రులు కీశే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు.

Also read: అమృతోత్సవ వేళ ఆప్తవాక్యం

వరూధినీ, ప్రవరాఖ్యుల ఘట్టంతో “మనుచరిత్ర” కావ్యం ముగిసిపోలేదనీ, ఈ ఘట్టానికి అతీతమైన అద్భుతకవిత్వం పెద్దన కావ్యంలో వున్నదనీ, నారాయణా చార్యుల వారి పరిచయ వ్యాఖ్య నా మనస్సుకు తెలియజెప్పింది.

ఆముక్తమాల్యద” కావ్యం బెనారస్ పట్టు చీర వంటిదని ఒకసారి విశ్వనాథవారు

అన్నారు. అట్లా వారెందుకు అన్నారు? బెనారస్ సిల్క్ చీరలో వేయి అల్లికలు వుంటాయి. ఒక్కొక్క అల్లిక ఒక్కొక్క రకంగా వుంటుంది. ఒక అల్లిక (డిజైన్) వున్నట్లు మరొక అల్లిక వుండదు. అట్లే “ఆముక్తమాల్యద” పద్యాలు. అట్లే “మనుచరిత్ర” పద్యాలు. ఆ రెండు కావ్యాల్లోని అనేక పద్యాలు  కావ్యేతివృత్తంతో సంబంధంలేని స్వయం ప్రతిపత్తితో, రసాత్మకతతో విరాజిల్లుతాయి.

కొచ్చిన్ నగరంలో యూదుమతస్థుల దేవళం (సినగాగ్) వున్నది. ఈ సినగాగ్ లో వున్న బండపరుపు రాళ్లు (ఫ్లోర్ టైల్స్) ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో కాంతులు విరజిమ్ముతూ, చూచేవారికి విస్మయం కలిగిస్తాయి.

ఐదు వందల యేండ్ల క్రిందట వెలువడిన కావ్యం మనుచరిత్ర. ఆ నాడు రక్తమాంసాలతో జీవించిన ఏ చిన్నదాని పరవశదైన్యం పెద్దనార్యుణ్ఢి నేటి పద్యం రచించడానికి ప్రేరేపించిందో తెలియదు. పెద్దనతో బాటు ఆ చిన్నది కూడా కాలగర్బంలో కలిసిపోయింది. శిథిలమై, నామమాత్రావశిష్టమై పోయిన విజయనగరంలో ఆమె ఇంటి చిరునామా తెలుసుకునే అవకాశమే లేదు. కేవలం “స్వారోచిష మనుసంభవ” కావ్యం పుటలే ఆమె ఉనికికి  ఆధారం.

“Thou wert not born for death, immortal Bird! Generations to come will hear thy voice!” అంటాడు మహాకవి జాన్ కీట్స్, తన “ఓడ్ టు నైటింగేల్” ఖండికలో.

నేటి పద్యానికి, ఆ పద్యపు గవాక్షాలనుండి వెలుపలికి వచ్చి, తన మౌగ్ధ్యంతో చదువరులను మైమరపించే కోమలాంగికి, జరామరణాలు లేవు. తరతరాల పాఠకులీ పద్యం లోని ముగ్ధబాలను స్మరించి, తమ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకొని, పరవశిస్తూనే వుంటారు.

Also read: నర్మగర్భితమైన జవరాలి పలకరింపు

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles