Thursday, April 25, 2024

ఏవీఎస్…..ఆయ‌న్ను చూస్తేనే అదో తుత్తి

‘తుత్తి’ పదంతో చిరపరిచితులై,  తెలుగు చలనచిత్ర సీమలో ఏ.వి.ఎస్ గా పేరొందిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (జనవరి 2, 1957 – నవంబర్ 8, 2013) తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రచయిత, రాజకీయ నాయకుడు, మిమిక్రీ కళాకారుడు, జర్నలిస్టు,  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి.

ఎ. వి. ఎస్  గుంటూరు జిల్లా తెనాలిలో 1957, జనవరి 2 న వీర రాఘవయ్య, శివ కామేశ్వరి దంపతులకు జన్మించారు. వీఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశారు. ఆ కళాశాల లెక్చరర్ నఫీజుద్దిన్ /ఎం.డి.సౌజన్య రాసిన నాటకాల్లో ఏవీఎస్ నటిస్తుండేవారు. రసమయి సంస్థను రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండే వారు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించారు. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన ఏవీఎస్ మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఏవీఎస్ నటించిన ఆఖరి చిత్రం పవిత్ర.

500  చిత్రాల ప్ర‌స్థానం

19 ఏళ్లలో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఏవీఎస్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏవీఎస్‌కు 1980లో ఆశాకిరణ్మయి తో వివాహం జరిగింది. తెనాలిలో స్టేజి కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శ్రీప్రశాంతి, కుమారుడు ప్రదీప్.

తొలి చిత్రం శ్రీ‌నాథ క‌వి సార్వ‌భౌముడు

ఎన్టీఆర్ నిర్మించిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లో మొదట నటించినప్పటికీ ‘మిస్టర్ పెళ్లాం’ ముందుగా విడుదలైంది. ఈ రెండు సినిమాలకూ బాపు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికే నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ‘మిస్టర్ పెళ్లాం’ ఘన విజయం సాధించడంతో ఏవిఎస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది. హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా సుమారు 500 సినిమాల్లో నటించారు. ‘మిస్టర్ పెళ్లాం’లో ‘తుత్తి’ పదంతో ఆయన పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది. ‘సూపర్ హీరోస్’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కానూ’, ‘రూమ్‌మేట్స్’, ‘అంకుల్’, ‘కోతిమూక’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయక తరహా పాత్రల్లోనూ మెప్పించారు.  మాయలోడు, మేడమ్, ఆమె, శభమస్తు, ఓహో నా పెళ్లంట, ధర్మ చక్రం, మా విడాకులు ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’, ‘కంటే కూతుర్నే కను’, ‘వినోదం’ వంటి అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షక జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. టీవీ నటుడిగా, వ్యాఖ్యాతగానూ రాణించారు.  ఎ.వి.ఎస్ తన నటనప్రతిభకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బహుమతులు అందుకున్నారు. అంకుల్ , ఓరి నీ ప్రేమ బంగారం కానూ అనే రెండు సినిమాలు నిర్మించారు.

ఉద్దండుల‌ను తెనాలికి ర‌ప్పించిన ఘ‌న‌త‌

చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను, చదువు చెప్పిన గురువులను, నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదికపైనా స్మరించుకునే వారు. తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపనపడ్డారు. ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ను అత్యంత వైభవంగా తెనాలిలో నిర్వ‌హించేందుకు ఏవీఎస్‌ చేసిన కృషి మరువలేనిది. చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ఆంధ్రా ప్యారిస్‌ గొప్పతనాన్ని చాటారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌, నటుడు మురళీ మోహన్‌ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అంద జేయడంలో భాగస్వాము లయ్యారు. రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఏవీఎస్‌ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు. పట్టణంలో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు.

‘తుత్తి’ మ్యానరిజం చేసినా, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’, శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

ఉద‌యం రిపోర్ట‌ర్‌గా పాత్రికేయం

తెనాలిలో ‘ఉదయం’ పత్రికలో రిపోర్టరుగా చేరారు. ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దాదాపు 500 సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరు సంపాదించారు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్, కోతిమూకలు సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు. ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని, నటుడు కమలహాసన్, కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవీఎస్ చెపుతుండేవారు.

ప్ర‌ముఖ చిత్రాలు

చిన్నబ్బాయి, దాసన్నా , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, పవిత్ర ,  ఆలస్యం అమృతం, దేనికైనా రెడీ, లక్కీ,  తూనీగ తూనీగ, శుభప్రదం, ఝుమ్మంది నాదం, ఆలస్యం అమృతం, బెండు అప్పారావు , కింగ్, యమగోల మళ్ళీ మొదలైంది, మధుమాసం, గొడవ, బంగారం,  శ్రీరామదాసు, జై చిరంజీవ, మహానంది, వీరి వీరి గుమ్మడి పండు, రాధా గోపాళం, సంక్రాంతి, అదిరిందయ్యా చంద్రం,  శివశంకర్, వెంకీ, దొంగ దొంగది, ఆయుధం, గంగోత్రి, శివమణి, విజయం, ఎంత బావుందో, ముత్యం, ఆవారాగాడు, జాబిలమ్మ పెళ్ళి తదితర చిత్రాలలో విభిన్న పాత్రలలో రాణించారు.

మొద‌టి సినిమాతోనే నంది అవార్డు

మొదటి సినిమా మిస్టర్ పెళ్ళాం (1993) లో నంది ఉత్తమ హాస్యనటుడు, కోతి మూక చిత్రానికి ఉత్తమ నంది ఉత్తమ కథా రచయితగా, అంకుల్ చిత్రానికి ఉత్తమ నంది ఉత్తమ సహాయ నటులుగా  పురస్కారాలు అందుకున్నారు. పలు సాంస్కృతిక సంఘాల నుంచి అనేక అవార్డులు, ఘన సన్మానాలు పొందారు. 2008లో ఆయన కుమార్తె దానం చేయడంవల్ల కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. రాజకీయ రంగంపైనా ఆసక్తి ఉండటంతో ఏవిఎస్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ బలోపేత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. కాలేయం వ్యాధి మళ్ళీ ముదరడంతో మణికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో 8 నవంబరు 2013 రాత్రి కన్ను మూశారు.

(న‌వంబ‌ర్ 8న ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం వర్ధంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles