Tuesday, September 17, 2024

నదీజలాలపైన రాజకీయ నాయకుల నిష్క్రియాపరత్వం

  • రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి గైర్ హాజర్
  • గ్రీన్ ట్రిబ్యూనల్ అడ్డు తొలగించుకునే ప్రయత్నం లేదు
  • పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనులు నిలిపివేత
  • కృష్ణా, గోదావరి నదులపైన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకున్న కేంద్రం

కృష్ణా,గోదావరి నదులపైన ప్రాజెక్టులన్నిటినీ స్వాధీనం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వశాఖ ఏకపక్షంగా జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం నాయకత్వంలో ఉద్యమం మొగ్గలు తొడుగుతోంది. మరోవైపు కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ ట్రిబ్యూనల్ అనుమతి నిరాకరించిన కారణంగా గెజిట్ నోటిఫికేషన్ వెలువడటానికి ముందే రెండు ప్రధాన ప్రాజెక్టులపైన పనులు నిలిచిపోయి ఉన్నాయి.

తెలుగు రాజకీయ నాయకులకు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నాయకులకు ఏ రోజుకారోజు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, అతిశయోక్తులు చెప్పుకోవడం, ఎత్తులు పైఎత్తులు వేసుకోవడం, ప్రచారం చేసుకోవడం తప్పితే అసలు ప్రజా సమస్యలు పట్టవు. పార్టీల కతీతంగా పోరాడవలసిన సమస్య జలవివాదం. దీనిపైన ఎవ్వరూ పట్టించుకోకపోవడం విషాదం. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని బేఖాతరు చేస్తూ కృష్ణా, గోదావరి నదులపైన  జలవిద్యుత్ కర్మాగారాలనూ,ఆనకట్టలనూ స్వాధీనం చేసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి తొమ్మిది నెలలు గడిచిపోయినా రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ నోరెత్తిన జాడ లేదు. సమాఖ్య స్ఫూర్తికోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విషయంలో ఏమి చేశారో, ఏమి చేస్తున్నారో, ఏమి చేయబోతున్నారో తెలంగాణ ప్రజలకు తెలియదు.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల తనిఖీ

29అక్టోబర్ 2021నాడు గ్రీన్ ట్రిబ్యూనల్ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వాటిని ఉల్లంఘిస్తూ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను పురస్కరించుకొని ట్రిబ్యూనల్ క్షేత్రపరిస్థితిని తెలుసుకునేందుకు ఒక తనిఖీ బృందాన్ని పంపింది. ఎగ్జిక్యుటీవ్ ఇంజనీర్ వై రఘునాథరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ టి అజయ్ యాదవ్ 23, 24 ఫిబ్రవరి 2022న రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించారు. 29 అక్టోబర్ 2021 వరకూ జరిగిన పనులు తెలంగాణ సర్కార్, ఇంజనీర్లూ చెబుతున్నట్టు ప్రమాదాలను నివారించడానికీ, ఒక స్థాయికి నీటిని తీసుకురావడానికీ ఉద్దేశించినవా లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించినట్టు ఇతర ఉద్దేశాలతో చేసినవా పరిశీలించవలసిందిగా కృష్ణ నదీ అజమాయిషీ మండలిని ట్రిబ్యూనల్ ఆదేశించింది.

తాము పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇంజనీర్ల బృందం పరిశీలించిన నాడు ఏ పనులూ జరగడం లేదు. ఆ ప్రదేశంలో ఇసుక, సిమెంటు కొంత కుప్పగా పోసి ఉంది. పనిలేకుండా కొన్నిట్రిప్పర్లు పడి ఉన్నాయి. కార్మికులు కొన్ని చోట్ల కనిపించారు. కొంత పని జరుగుతున్నట్టు వారిని చూస్తే అనిపించినప్పటికీ ప్రాజెక్టు పని జరుగుతున్నట్టు చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు.

ప్రాజెక్టులపైన పనులు నిలిచిపోయిన మాట వాస్తవం

ఈ నివేదిక పరిశీలించిన తర్వాత నివేదికలోని అంశాలు నిజమేననీ, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కు అనుగుణంగానే ఉన్నాయనీ ట్రిబ్యూనల్ భావించింది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి 24 ఫిబ్రవరి 2022న తనిఖీ చేసిన ఇంజనీర్ల బృందం తాము అక్కడికి వెళ్ళిన రోజు పనులేవీ జరగడం లేదనీ తెలిపింది. ప్రాజెక్టు పనులు వివిధ స్థాయిలలో ఆగి ఉన్నాయి.

భూసేకరణలో సమస్యల వల్ల చాలా చోట్ల పనులు చేయలేకపోయామనీ, చాలా చోట్ల కొన్ని సంవత్సరాల తరబడి పనులు ఆగిపోయి ఉన్నాయనీ ప్రాజెక్టు అధికారులు తెలియజేశారు. 29 అక్టోబర్ 2021 నాటికి ఎంతవరకూ ఏయే పనులు పూర్తయ్యాయో వివరంగా 24 మార్చి 2022 నాటికి నివేదిక మరోసారి సమర్పించాలని 9 మార్చి 2022 న మొత్తం కేసుపైన జరిగిన విచారణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. ఆ ట్రిబ్యూనల్ బెంచ్ లో జస్టిస్ కె. రామకృష్ణన్, ప్రవీణుడు కె. సత్యగోపాల్ ఉన్నారు. ట్రిబ్యూనల్ తదుపరి విచారణ మార్చి 25కి వాయిదా పడింది.

గెజిట్ నోటిఫికేషన్ ఉపసంహరణకు పోరాటం చేయడం అవసరమే. కానీ అంతకంటే ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అభ్యంతరాలను తొలగించుకోవలసిన అవసరం ఉన్నది. గెజిట్ నోటిఫికేషన్ విషయంలో కానీ గ్రీన్ ట్రిబ్యూనల్ విషయంలో కానీ అధికార పార్టీ ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఏమి చర్యలు తీసుకుంటున్నదో తెలియదు. ఇంజనీర్లూ, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజలకు సమాచారం తెలియజేసే అలవాటు లేదు. పారదర్శకత లేదు.

గెజిట్ నోటిఫికేషన్ విషయంలో వినతి పత్రాన్ని రాష్ట్రపతికీ, ప్రధానికీ, కేంద్ర మంత్రులకూ, ముఖ్యమంత్రికీ, పార్లమెంటు సభ్యులకూ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో సమర్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులకు టీడీఎఫ్ బృందం గెజిట్ నోటిఫికేషన్ వ్యవహారం సవివరంగా చెప్పింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కానున్నాయి. పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమైనాయి. పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ గొంతు ఎత్తి మాట్లాడవలసిన కనీస బాధ్యత తెలుగు ప్రజల ప్రతినిధులకు ఉన్నది. అటువంటి ప్రయత్నం ఏదీ జరగకపోవడం దౌర్భాగ్యం.

రాజకీయ నాయకుల నిర్వాకం

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల సాగయ్యే ప్రాంతానికి చెందిన ప్రతినిధులు ఇద్దరు పార్లమెంటులో ఉన్నారు. ముగ్గురు ప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులే. ఇటువంటి సమస్యను భుజానికి ఎత్తుకుంటే పార్టీకి మంచి పేరు వస్తుందన్న ధ్యాస కూడా కాంగ్రెస్ నాయకత్వానికి లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ సమస్యపైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినప్పుడు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున ప్రతినిధులు హాజరైనారు. టీఆర్ ఎస్ నాయకులనూ, బీజేపీ నాయకులనూ ఆహ్వానించినా వారెవ్వరూ హాజరు కాలేదు. ఇటువంటి ముఖ్యమైన సమస్యపైన బాధ్యత కలిగిన పౌరసమాజం ప్రతినిధులు సమావేశం నిర్వహించినప్పుడు దానికి హాజరై తమ వైఖరిని వివరించాలన్న కనీస మర్యాద కూడా టీఆర్ఎస్, బీజేపీలో ప్రదర్శించలేదు. వారి ఆధిక్యపోరాటంలో నిర్విరామంగా ఉన్నారు కాబోలు. కాంగ్రెస్ పార్టీ తరఫున కోదండ్ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రవణ్ హాజరై అవగాహనతో మాట్లాడారు. గాంధీభవన్ లో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వివరించి, దీన్ని ప్రధాన ఎజెండాగా స్వీకరించవలసిందిగా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తామని వారు ముగ్గురూ అన్నారు. కానీ ఇంతవరకూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. అసెంబ్లీలో చర్చించలేదు. పార్లమెంటులో ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంపైన గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ ఆ పని ఇంతవరకూ జరచలేదు. ఇకమీదట జరుగుతుందని ఆశిద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల సమస్య ఏమిటో తెలియదు. వారికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నుంచి అనుమతి కావాల్సి రావచ్చు. అందుకు ప్రయత్నించాలి. అనుమతి కోరాలి. తాము కేవలం కేసీఆర్ విధేయులు మాత్రమే కాదనీ, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత తమపైన ఉన్నదనీ గుర్తించాలి. రెండు ప్రధాన నదులపైన ప్రాజెక్టులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం కాజేస్తున్నా, రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు గ్రీన్ ట్రిబ్యూనల్ అడ్డుపడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండే ప్రజాప్రతినిధులు నిజమైన ప్రజాప్రతినిధులు కాదు. తెలంగాణ ఉద్యమంలోని మూడు ప్రధాన అంశాలలో ఒకటైన నీటి గురించి పోరాడకపోతే తెలంగాణ రాష్ట్ర సాకారంలో అర్థం ఏమున్నది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles