Monday, April 22, 2024

విద్యుత్ రంగంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం సరైనదేనా?

కె. రామచంద్రమూర్తి

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు వంటిదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీ ఆర్) అభివర్ణించారు. ఇది ప్రజలకూ, రైతులకూ, విద్యుచ్చక్తి సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకూ నష్టదాయకమని మంగళవారంనాడు శాసనసభలో అన్నారు. 2003 ఎన్నికల చట్టాన్ని సవరించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రం చేసిన ప్రతిపాదన సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందనీ, ఇప్పుడే కోలుకుంటున్న రైతుకు విద్యుదాఘాతంగా పరిణమిస్తుందనీ కేసీఆర్ విమర్శించారు.

చట్టాన్ని సవరిస్తే ఏమి జరుగుతుంది?

కేంద్రం ప్రతిపాదించిన సవరణ ప్రకారం విద్యుత్ నియంత్రణకు ఒక సంస్థను కేంద్రం నియమిస్తుంది. లోడ్ డిశ్సాచ్ సెంటర్ ను కేంద్రానికి తరలిస్తారు. ఓపెన్ యాక్సిస్ పద్ధతి ద్వారా వినియోగదారులు విద్యుత్తును ఎక్కడి నుంచైనా స్వీకరించవచ్చు.  రాప్ట్రాలలో రైతులకూ, వినియోగదారులకూ, పరిశ్రమలకూ విద్యుచ్ఛక్తి చార్జీలను ఎట్లా విధించాలనో కేంద్రమే నిర్ణయిస్తుంది. వ్యవసాయవిద్యుత్తును కొలిచేందుకు ప్రతి బోరుబావి దగ్గరా మీటరు బిగించాలని చెబుతున్నది. కేంద్ర ముసాయిదా బిల్లు కనుక చట్టం అయితే తెలంగాణలో 25 లక్షల పంపుసెట్లకూ మీటర్లు బిగించాలి. సబ్సిడీ లేకుండా బిల్లులు చెల్లించాలి. కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటే విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు) రూ.700 కోట్లు ఖర్చు చేయాలి. మీటర్ల రీడింగ్ నమోదు చేసేందుకు 2,500 మంది ఉద్యోగులను నియమించాలి. వారి జీతాల కింద నెలకు రూ.7.5 కోట్లు ఖర్చు చేయాలి. రైతులకు పంపిణీ చేస్తున్న విద్యుత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం సాలీనా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది.

కేంద్రం పరిధిలోకి పీపీఏలు  

కొత్త చట్టం వస్తే విద్యుచ్ఛక్తి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు (పవర్ పర్చేజి ఎగ్రిమెంట్స్) ఇకపైన రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండవు. కేంద్రం నిర్ణయిస్తుంది. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ విద్యుచ్ఛక్తి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం, అమలు చేయడం, విద్యుచ్ఛక్తి కొనుగోలు చేసుకోవడం వంటి నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఏమీ ఉండదు.  ఏ విద్యుచ్ఛక్తి కేంద్రంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి కావాలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మెరిట్ ఆర్డర్ ప్రకారం ఈ నిర్ణయం ఉంటుంది. క్రాస్ సబ్సిడీ అవకాశం ఉండదు. అంటే వ్యవసాయదారులకు ఉచితంగా సరఫరా చేసే కరెంటు ఖర్చును వినియోగదారుల నుంచీ లేదా పరిశ్రమల నుంచీ వసూలు చేయడం కుదరదు.

రాష్ట్రంలో వినియోగించే విద్యుచ్ఛక్తిలో 20 శాతం నిరంతర విద్యుత్తు (రెన్యూవబుల్ ఎనర్జీ) ఉండాలని ఈ ముసాయిదా బిల్లు షరతు విధిస్తుంది. నిర్దేశిత శాతం మేరకు రెన్యూవబుల్ విద్యుత్తును కొనుగోలు చేయడంలో విఫలమైతే యూనిట్ కి యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకూ జరిమానా చెల్లించాలి. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ప్రపంచబ్యాంక్ అజెండా

రెండు దశాబ్దాల కింద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసి మధ్యలో విరమించుకున్న ప్రయత్నాన్ని ఇప్పుడు కేంద్రం తలకెత్తుకున్నది. చంద్రబాబునాయుడు ప్రపంచబ్యాంక్ సలహా ప్రకారం విద్యున్మండిలిని రెండుగా విభజించి జెన్కో, ట్రాన్స్ కోలను సృష్టించారు. ఆ తర్వాత ట్రాన్స్ కోలను ప్రైవేటీకరించాలని ఆలోచన. కానీ కాంగ్రెస్ పార్టీ, తొమ్మిది వామపక్షాలు కలిసి పెద్ద ఉద్యమం నడిపించాయి. 2000 ఆగస్టు 28న వేలాదిమంది ఉద్యమకారులు ఊరేంగిపుగా అసెంబ్లీకి వెడుతున్న సందర్భంలో వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో గుంపుపైన కాల్సులు జరిపారు. రామకృష్ణ, బాలస్వామి అనే ఇద్దరు యువకులు మరణించారు. కిసార్ అనే హెడ్ కానిస్టేబుల్ పైన నిరసనకారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతను కాక మరి 119 మంది పోలీసు ఉద్యోగులు ప్రదర్శకుల దాడులలో గాయపడ్డారు. దీంతో చంద్రబాబునాయుడు సంస్కరణలకు స్వస్తి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర తలపెట్టిన విద్యుత్ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయపంపుసెట్లకు మీటర్లు పెట్టడాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు.

సంస్కరణల బాటలో నరేంద్రుడు

ఇప్పుడు నరేంద్రమోదీ అదే సంస్కరణలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ మీటర్లను నెలకొల్పాలన్నది సంస్కరణాభిలాషుల వాదన. వ్యవసాయ విద్యుత్తు పేరుతో ట్రాన్స్ మిషన్ లో నష్టబోతున్న విద్యుత్తునూ, సిబ్బంది అసమర్థత వల్ల నష్టబోతున్న విద్యుత్తును వ్యవసాయదారుల ఖాతాలో కలిపివేస్తున్నారనీ, వ్యవసాయదారుల నుంచి విద్యుచ్ఛక్తి చార్జీలు వసూలు చేసినా, చేయకపోయినా వారు ఎంత విద్యుత్తుని వినియోగిస్తున్నారో లెక్కకట్టడం అవసరమని సంస్కరణవాదులు అంటున్నారు. సబ్సిడీ ఎత్తివేయడం కూడా సంస్కరణవాదుల అభిలాష. విద్యుచ్ఛక్తి రంగం నష్టాలలో నడుస్తున్నది. అన్ని రాష్ట్రాలలో విద్యున్మండులులూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో డిస్కంలూ నష్టాల ఊబిలో కూరుకొని పోయాయి. అన్ని రాష్ట్రాలలోని విద్యుత్ సంస్థల నష్టాలను కలిపితే లక్షల కోట్ల రూపాయలలో ఉంటుంది.  ఈ సంస్థలను నష్టాల బాట నుంచి తప్పించి గట్టెక్కించాలంటే సంస్కరణలు అవసరం. సబ్సిడీలు ఎత్తివేసి, నిర్వహణ సామర్థ్యం పెంచి, రవాణాలో నష్టాలను తగ్గించి విద్యుత్ రంగానికి స్వస్థత చేకూర్చవలసిన అవసరం ఉన్నది. ఈ పనులన్నీ సక్రమంగా చేయడాలంటే విద్యుత్ రంగంపైన కేంద్ర అజమాయిషీ అవసరమని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తున్నది.

చంద్రబాబునాయుడు హయాంలో…

అదే విధంగా విద్యుచ్ఛక్తి కొనుగోలులో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు హయాంలో ప్రైవేటు విద్యుదుత్పత్తి సంస్థలకు ఎక్కువ చార్జీలు చెల్లించడానికి అంగీకరించారని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది. విద్యుచ్ఛక్తి కొనుగోలు ఒప్పందాలను రద్దు కూడా చేసింది. ఆ విధంగా రద్దు చేయడాన్ని కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి కూడా ఆక్షేపించారు. ఆర్థికమంత్రి, వాణిజ్యమంత్రి కూడా అభ్యంతరం తెలిపారు. సంస్కరణవాదులు గగ్గోలు పెట్టారు. ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీలకు లబ్ధి చేకూర్చేవిధంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం జెన్ కో విద్యుచ్ఛక్తి కేంద్రాలలో ఉత్పత్తిని నిలిపివేసి, ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేశారనే అరోపణలు కూడా ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చత్తీస్ గఢ్ నుంచి యూనిట్ ఐదు రూపాయాల వంతున విద్యుచ్ఛక్తి  కొనుగోలు చేయడాన్ని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. మొత్తం మీద రాష్ట్రాల యజమాయిషీలో విద్యుచ్ఛక్తి రంగం సమర్థంగా నడవడం లేదు.

అంతమాత్రాన కేంద్రం హయాంలో విద్యుత్ వ్యవహారాలు సమర్థంగా సాగుతాయన్న పూచీ లేదు. కేంద్రం పర్యవేక్షణలో ఉన్న అనేక సంస్థలు కుంటినడక నడుస్తున్నాయి. విద్యుచ్ఛక్తి అనేది జనజీవనంలో అత్యంత కీలకమైన రంగం. పరిశ్రమల అభివృద్ధికీ, జనసంక్షేమానికీ, వ్యవసాయరంగం పురోగతికీ ఎంతో కీలకమైనది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఈ సంస్థను వినియోగించుకోవాలి. అవి కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వాలకే బాగా తెలుసు.  రాష్ట్రం అధినంలో ఉంటూ కొని స్వతంత్ర సంస్థల పర్యవేక్షణకు లోబడి పని చేయడం శ్రేయస్కరం. రాజకీయ నాయకులకు ఆదాయం తెచ్చిపెట్టే సాగునీటి రంగం, ఎక్సైజ్ వంటి రంగమే విద్యుత్ రంగం కూడా. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు విద్యుచ్ఛక్తిని స్వప్రయోజనాలకో, తమకు కావలసిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికో కాకుండా ప్రజల విస్తృత ప్రయోజనాలకు అనుగుణంగా నడిపించడం ఉత్తమం.

జనామోదం అవసరం

అసలు సమస్య ఏమంటే రాష్ట్రాలలో కేబినెట్ వ్యవస్థ, శాసనసభ వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదు. ముఖ్యమైన ఇటువంటి అంశాలపైన మంత్రివర్గంలో కానీ, శాసనసభలో కానీ చర్చలు జరగవు. ముఖ్యమంత్రులు సహచరుల సలహాలు స్వీకరించే సంప్రదాయం అడుగంటింది. ముఖ్యమంత్రులే ఆయా పార్టీల అధినాయకులు కూడా  కనుక వారే అన్ని నిర్ణయాలూ తీసుకుంటున్నారు.  చంద్రబాబునాయుడు హయాంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడూ తెలుగురాష్ట్రాలలో అదే ధోరణి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదీ అంటే దాని వెనుక సమాలోచన, అధ్యయనం ఉండాలి. ఉన్నట్టు ప్రజలకు నమ్మకం కలగాలి. అన్ని పనులూ ప్రజాప్రయోజనాలే పరమావధిగా జరగాలి. ఆ విధంగా జరిగినప్పుడు తెలంగాణ శాసనసభ ఆమోదించిన తీర్మానానికి జనబాహుళ్యం ఆమోదం కూడా విధిగా ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles