Tuesday, November 12, 2024

ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత, కేసీఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం

తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని తనయుడు కల్వకుంట తారకరామారావు (కేటీఆర్ )ని ఆ పదవిలో కూర్చోబెట్టడం పార్టీకి నష్టదాయకమనే నిర్ణయానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవికి తన వారసుడిగా కేటీఆర్ ని నియమించాలనే ఆలోచనకు కార్యరూపం ఇస్తే ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి ఈగను వదిలినట్టు తన మంత్రులూ, పార్టీ నాయకులూ ప్రకటనలు చేసినప్పుడు మిన్నకున్నారు. పత్రికలు కూడా అదే విధంగా వార్తలూ,వ్యాఖ్యలూ వడ్డించాయి. ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు.  సోషల్ మీడియా ఎప్పటిలాగే ఊదరగొట్టింది. కానీ ప్రజల స్పందన అంత అనుకూలంగా కనిపించలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే పార్టీ, ప్రభుత్వం రకరకాల సవాళ్ళను ఎదుర్కొంటుంటే తాను పదవి నుంచి తప్పుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి పని కుదేలు అవుతుందన్న నిర్ణయాలనికి కేసీఆర్ వచ్చినట్టు ఆదివారంనాడు పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన తీరు స్పష్టం చేసింది. కనీసం కొంతకాలం వరకూ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదనను వాయిదా వేసినట్టు భావించాలి.

Also Read : కేసీఆర్ కి మార్చి పిదప మహర్దశ?

గాంధీ పక్కనే నా ఫోటో

మరో పదేళ్ళకాలం తాను ముఖ్యమంత్రిగా ఉంటాననీ, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నాననీ కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీలాగా తాను సైతం పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననీ, ఆ విధంగా చేసినట్లయితే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయంతో పదవిని స్వీకరించాననీ అన్నారు. ఇప్పటికీ తెలంగాణ సాధకుడిగా తన పేరు ఉంటుందనీ, ఈ కారణంగానే గాంధీ మహాత్ముడి ఫోటో పక్కన తన ఫోటో పెట్టుకొని ప్రజలు పూజించేవారనీ అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు తన ఎడమకాలి చెప్పుతో, గడ్డిపోచతో సమానమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆగం కావద్దనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని చెప్పారు. ఈ నేల కోసం ఎన్నో తిట్లు తిన్నాననీ, తింటున్నాననీ అన్నారు. సీఎం పదవిలో మార్పు గురించి ఇక ఎవ్వరూ మాట్లాడవద్దనీ, ఒళ్లు దగ్గరపెట్టుకొని ఎవరైనా మాట్లాడాలనీ, లేకపోతే వేటు తప్పదనీ, పూర్తిగా చెడిపోయనోళ్ళను సస్పెండ్ చేస్తాననీ, ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదనీ హెచ్చరించారు. ఎంఎల్ఏ పదవులలో ఉన్నవారు అభద్రతాభావానికి లోనుకావలసిన అవసరం లేదనీ, పదవులలో ఉన్నవారికే తిరిగి పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు.

‘‘మనం పోరాటాల్లోనుంచి పుట్టినం.  రాష్ట్ర సాధనకోసం పుట్టి, రాష్ట్ర అభివృద్ధికోసం పనిచేస్తున్నవాళ్ళం. అనేక ఒడిదుడుకులను చూశాం. అన్నింటినీ తట్టుకొని నిలబడ్డవాళ్ళం. మనకు కష్టాలంటే ఏమిటో తెలుసు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక పార్టీ టీఆర్ఎస్. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ మనపైనే ఉన్నాయి,’’ అంటూ కేసీఆర్ పార్టీ నాయకులకు ఉద్బోధించారు.

Also Read : కేటీఆర్ పట్టాభిషేకమా? కేసీఆర్ అస్త్ర సన్యాసమా?

మరో మూడు మాసాలలో 20 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. ఆ పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గతం, వర్తమానం ప్రాతిపదికగా పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండాలనే విషయంపైన స్పష్టత ఇచ్చారు. పార్టీ నేతలూ, శ్రేణులూ నడుచుకోవలసిన రీతిపైనా, పాటించవలసిన నీతిపైనా కార్యవర్గ సమావేశంలో హితబోధ చేశారు.

మంత్రులే నాయకత్వం మార్పు గురించి మాట్లాడారు

ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి పదవిలో మార్పు గురించి గతంలో మాట్లాడారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన శ్రీనివాస్ గౌడ్ అదే మాట మాట్లాడారు. శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి అదే అభిప్రాయం వెలిబుచ్చారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రికి కావలసిన అన్ని అర్హతలూ ఉన్నాయంటూ కేసీఆర్ తనయ కవిత మాట్లాడారు. సభలలో, సమావేశాలలో భావిముఖ్యమంత్రిగా కేటీఆర్ ని నాయకులు సంబోధించినా ఆయన చిరునవ్వు నవ్వారే కానీ అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని కానీ, అటువంటి వ్యాఖ్యాలు చేయవద్దని కానీ కేటీఆర్ ఎన్నడూ గట్టిగా అభ్యంతరం చెప్పలేదు. అయితే, కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యం ఉన్నారనీ, ఆయనే పదవిలో కొనసాగుతారనీ కేటీఆర్ చాలా సందర్భాలలో అన్న మాట వాస్తవం. అది మర్యాదగా ఆయన మాట్లాడిన  మాటే కానీ కుంటుంబ  సభ్యుల ఒత్తిడి కారణంగా కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చి ఉంటారనీ, అందుకే సీనియర్ మంత్రులూ, నాయకులూ ఆ విధంగా కేటీఆర్ ని భావి ముఖ్యమంత్రిగా సంబోధిస్తున్నారనీ మీడియా ప్రతినిధులూ, ప్రజలు కూడా భావించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంపైన చర్చ తెలంగాణ సమాజంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా కొంతకాలంగా సాగుతున్నదే.  కానీ కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తే పార్టీకి నష్టం జరుగుతుందనీ, జోరుమీద ఉన్న బీజేపీ విసురుతున్న సవాళ్ళను ఎదుర్కోవాలంటే తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం అవసరమనీ, పార్టీని సమైక్యంగా ముందుకు నడిపించడం అత్యవసరమనీ కేసీఆర్ భావించినట్టు అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో తన కుటుంబ సభ్యుల హవా సాగుతున్న సంగతి, కేటీఆర్, హరీష్, సంతోష్, కవితలు పార్టీలో, ప్రభుత్వంలో సకారాత్మకమైన పాత్రలు పోషిస్తున్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు. కుటుంబ పాలన అంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న విమర్శకు ముఖ్యమంత్రి పదవి మార్పిడి బలం చేకూర్చుతుందనీ, కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అతడిపైన దాడి చేయడం, తప్పులు ఎన్నడం, ఒత్తిడికి గురి చేయడం బీజేపీకి సులువు అవుతుందనీ కేసీఆర్ భావిస్తున్నారని అనుకోవాలి.

Also Read : స్వామి భక్తిలో తరిస్తున్న టీఆర్ఎస్ నేతలు

జర్నలిజంలో ‘కైట్ ఫ్లయింగ్’ అనే మాట ఉంది. దానినే తెలుగులో ఈగను వదలడం అంటారు. తాను అమలు చేయడానికి సంకల్పించిన నిర్ణయాన్ని ముందుగానే ప్రజలలో చర్చకు పెట్టడం,దాని పట్ల ప్రజలు ఎట్లా స్పందిస్తారో తెలుసుకోవడం, స్పందన అనుకూలంగా ఉంటే నిర్ణయాన్ని అమలు చేయడం, ప్రతికూలంగా ఉంటే నిర్ణయాల్ని వాయిదా వేయడం లేదా రద్దు చేసుకోవడం అనేది ఈ ప్రక్రియలో పరమార్థం. ఒక వేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే తాను ఏమి చేయాలి?  అందుకే తాను దిల్లీ వెళ్ళవలసి వస్తే ఏమి చేయాలో పార్టీ నాయకులతో చెప్పి, వారిని సంప్రదించి చేస్తానని అన్నారు.

కేటీఆర్ కి అధికారం కొదవలేదు

పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడుగా ఉన్న కేటీఆర్ ముఖ్యమైన మూడు శాఖలకు మంత్రిగా ఉంటూ తన తర్వాత తనయుడే అన్నట్టు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యవహారం సాగుతున్న సంగతి కూడా కేసీఆర్ కి తెలుసు.  ఇప్పుడు కేటీఆర్ కి వచ్చిన లోటు ఏమీ లేదు. కీలకమైన పదవులు ఉన్నాయి. అధికారం ఉంది. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారు. ఒక వేళ  కేటీఆర్ ని ముఖ్యమంత్రి గద్దెపైన కూర్చోబెడితే ఆయన కంటే రాజకీయాలలో సీనియర్, సమర్థుడైన నాయకుడిగా పేరున్న హరీష్ రావు స్పందన ఎట్లా ఉంటుందోననే ఆలోచన సైతం కేసీఆర్ తప్పక  చేసి ఉంటారు. ఆ విషయంపైన పార్టీలోనూ, పార్టీ వెలుపలా చర్చ జరుగుతున్న మాట నిజం.

Also Read : ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక

సమైక్యం ప్రధానం

ప్రస్తుత పరిస్థితులలో పార్టీని సమైక్యంగా ముందుకు నడిపించేందుకూ, ప్రతిపక్షాలనుంచి ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కునేందుకూ, పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే గిరిజనులకోసం  సూర్యాపేట జిల్లా గుర్రంజోరు తండాలో కరసేవ ప్రారంభించినట్టు బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులపైన రాళ్లు రువ్వారు. బీజేపీ పోరుబాటలో ఉన్నదనీ, దుబ్బాకవిజయం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఘనవిజయం బీజేపీని పోరాట మార్గంలో ఇతోధిక వేగంగా ప్రయాణం చేయడానికి ప్రోత్సహించాయి. ఈ తరుణంలో ప్రభుత్వ సారథ్యంలో మార్పు చేయడం అంటే పార్టీలో అనైక్యతకు దారి తీయడమేననీ కేసీఆర్ గ్రహించారు. అందుకే కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం గురించి నడుస్తున్న చర్చకు స్వస్తి చెప్పాలని పార్టీ నాయకులకూ, కార్యకర్తలకూ స్పష్టం చేశారు.

ఫుల్ స్టాపా, కామానా?

కొత్తపార్టీ పెట్టడం అంటే అంత తేలిక కాదనీ, గతంలో పెట్టినోళ్లు ఏమయ్యారో తెలియదా అంటూ కేసీఆర్  ఎవరిని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించారో ఊహించడం కష్టం కాదు. ఇటీవల హరీష్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపినట్టు సమాచారం. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన మంత్రివర్గంలో పని చేయడానికి తాను సిద్ధమేనంటూ హరీష్ రావు గతంలో అనేక సందర్భాలలో స్పష్టమైన ప్రకటన చేశారు. అప్పుడు కూడా అటువంటి ప్రశ్న తాను జీవించి ఉన్నంతకాలం ఉత్పన్నం కాదని కేసీఆర్ ఎన్నడూ వ్యాఖ్యానించలేదు. ఇప్పుడు అందుకు సమయం ఆసన్నమైదని భావించినట్టున్నారు. పార్టీ సమైక్యతను పరిరక్షించుకోవలసిన బాధ్యత  తనదేనని అన్నారు. ఇది కేసీఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. చాలా సంవత్సరాలుగా ప్రజల మాటలలో, ఆలోచనలలో నలుగుతున్న అంశాన్ని ఆదివారంనాటి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించి ప్రస్తుతానికి అటువంటి వార్తలకూ, ఊహాగానాలకూ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇది ఫుల్ స్టాపో, కామానో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి.

Also Read : మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles