Tuesday, November 5, 2024

తార ఆక్రందన, సుగ్రీవునికి వాలి విజ్ఞాపన

రామాయణమ్ 106

వాలి శరీరమంతా రక్తసిక్తమై ఉన్నది. దెబ్బలతో నలిగి పోయిఉంది. గాయములు విపరీతముగా బాధ పెడుతూ ఉన్నాయి. రాళ్ళ దెబ్బలు చెట్ల దెబ్బలు కూడా బాగా  తగిలి ఉన్నాయి ఆయనకు. చివరకు రాముడి బాణము ప్రాణాంతకమయ్యింది. ప్రాణములు విడిచే సమయములో స్పృహ మాటిమాటికీ వస్తూ పోతూ ఉన్నట్లుగా ఉన్నది.

రామబాణము వాలిని నేలకూల్చివేసిన వార్త కిష్కింధలో దావానలము లాగా వ్యాపించింది. వెంటనే తార పరుగుపరుగున వానరులందరితో కూడి అంగదుడు వెంట రాగా రణస్థలికి వచ్చింది.

Also read: రాముడు తనను చంపడం అధర్మం కాదని అంగీకరించిన వాలి

ధనుర్బాణములు ధరించిన రాముని చూడగానే వానరులందరూ భయముతో చెల్లాచెదురు అయిపొయినారు. వాలిని సమీపించే ధైర్యమెవరూ చేయలేకపోయ్యారు. తమ నాయకుడి మరణము వారిని తీవ్రమైన భయభ్రాంతులకు గురిచేసింది. పారిపోతున్న వారందరినీ చూసి తార, ‘‘మీరందరూ ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఇదుగో మీ రాజు వాలి. ఇంతకు ముందు వరకు మీరంతా ఆయన ముందు నడిచేవారు. ఇప్పుడెందుకు భయము?

ఇలా అంటున్న తారను చూసి సమయానుగుణముగా వానరులంతా భయముతో “ఓ తారా, వెనుకకు వెళ్ళు. నీ పుత్రుడైన అంగదుని రక్షించుకో. యమధర్మరాజు రాముని రూపములో వచ్చినాడు. పారిపో పారిపో. సుగ్రీవుడు మన దుర్గములను ఆక్రమించుకొనును” అని గట్టిగా అరవసాగారు.

Also read: మోదుగువృక్షంలాగా నేలవాలిన వాలి

వారి మాటలు విన్న తార, ‘‘వానర శ్రేష్టుడైన మహానుభావుడు నా భర్త వాలి ఇలా నేలకొరిగిన పిదప నాకు పుత్రునితో ఏమి ప్రయోజనము? రాజ్యముతో ఏమి ప్రయోజనము?  నా భర్త పాదముల వద్దకే వెళ్ళగల దానను’’ అని గుండెలు బాదుకొంటూ ఏడ్చుకుంటూ పరుగెత్తుతూ వెళ్లి యుద్ధములో ఎన్నడూ వెన్ను చూపని వీరాధివీరుడైన తన భర్త నేలపై పడి ఉన్న చోటుకు చేరుకొన్నది.

ఆ ప్రదేశములో ధనుస్సును ఆనుకొని నిలుచున్న శ్రీరాముని, లక్ష్మణుని, వాలి తమ్ముడైన సుగ్రీవునీ చూసింది తార. వారి ప్రక్కనే పడిి వున్న వాలిని చూసి ఆపుకోలేని దుఃఖముతో ‘ఆర్యపుత్రా’ టూ ఆయనను సమీపించింది.

Also read: సుగ్రీవుడితో సంధి చేసుకోవాలంటూ వాలికి తార హితోక్తులు

రామ బాణము చేత కొట్టబడి నేలబడియున్న భర్తను చూడగానే దుఃఖము వెల్లువలా పొంగుకుంటూ వచ్చి ఆర్యపుత్రా అంటూ అరుస్తూ వాలి మీదబడి కౌగలించుకుంది తార.

ఆ స్పర్శకు మెల్లగా కళ్ళు విప్పాడు వాలి.

‘‘ఏల నన్ను పలుకరింపవు? తారా, అంటూ ఏల దగ్గరకు తీసుకొనవు? మెత్తటి పట్టుపరుపులమీద పవ్వళించు నా స్వామీ నీకు ఇట్టి కఠినశిలలె పానుపుగా అమరినవా ప్రభూ! నాకన్నా నీకు భూమియే గొప్ప ప్రియురాలైనదా? ఎంత కఠినమైనది నా హృదయము, నేల మీద పడియున్న నిన్ను చూసికూడా వేయి వ్రక్కలు కాలేదు.

‘‘సుగ్రీవుని భార్యను అపహరించి అతనిని రాజ్యమునుండి వెడలగోట్టినావు. నేను చెప్పిన హిత వచనములు చెవికెక్కించుకొనకపోతివి కదా. ఈ దురవస్థ నీకు ప్రాప్తించినది గదా!

Also read: ఏడు సాల వృక్షములనూ ఒకే బాణముతో పడగొట్టిన రాముడు

‘‘నాయనా అంగదా! నీ తండ్రిని బాగుగా చూడుము. ఇకపై ఆయన దర్శనము నీకు దొరకదు.

‘‘నాధా, నీ కుమారుని ఓదార్చవయ్యా. వాడి శిరస్సుమీద ఎప్పటివలెనే ముద్దుపెట్టుకోవయ్యా’’ పరిపరి విధములుగాదీనముగా విలపిస్తున్న తారను సమీపించి హనుమంతుడు ఓదార్చసాగాడు.

బలహీనమైన ప్రాణముతో నెమ్మదిగా శ్వాస పీలుస్తున్న వాలి ,తన ఎదుట ఉన్న తమ్ముని చూసి …..‘‘సుగ్రీవా, నేను నీకు చేసిన దోషములను  లెక్కచేయకుము.

మనమిరువురము కలిసి సుఖపడటము విధాత రాయలేదు.  కావుననే ఈ విధముగా జరిగినది. నీవు ఇప్పుడే వానర రాజ్య పట్టాభిషిక్తుడవు కమ్ము. ఒక్క మాట.ఈ అంగదుడు సుకుమారుడు. వీడికి ఏ కష్టము కలుగకుండా పెంచుకున్నాను. వీడికి ఏ లోపము రాకుండా చూసుకోగలవా? ఇది నా చివరి కోరిక.

Also read: సుగ్రీవునికి రాజ్యబహిష్కారం, వాలికి రాజ్యాధికారం

‘‘సుగ్రీవా, సుషేణుని కుమార్తె ఈమె. చాలా సునిశితమైన ప్రజ్ఞకల ఈ తార అకస్మాత్తుగా వచ్చు ఉపద్రవముల విషయములలో ఎల్లప్పుడూ చేయవలసిన కర్తవ్యాన్ని గురించి చక్కగా బోధించగలదు. గురి తప్పని బుద్ది కలది. సుగ్రీవా, నీవు ఆయన కిచ్చిన మాట నిలబెట్టుకోలేని పక్షములో రామ బాణము నీ ప్రాణము కూడా నిస్సందేహముగా హరించగలదు ,కావున రాముని కార్యము నెరవేర్చుము.

‘‘ఇదుగో ఈ బంగరుమాలను తీసుకో. ఇది సదా జయలక్ష్మినిచ్చే ప్రశస్తమైన మాల. నేను మరణించకముందే తీసుకో’’ అని సుగ్రీవునకు మాల ఇచ్చి అంగదునివైపునకు తిరిగి, నాయనా నీవు ఎట్లు ప్రవర్తించిననూ నేను నిన్ను సదాసర్వదా లాలించు చుంటిని. ఇప్పుడు నీవు మునుపటివలె ప్రవర్తించినచో చిన్నాన్న ఇష్టపడడు……….’’

Also read: వాలికీ, తనకూ మధ్య వైరం ఎట్లా వచ్చిందో వివరించిన సుగ్రీవుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles