Friday, April 19, 2024

ఆస్తులు కేంద్రానికీ, అప్పులు రాష్ట్రాలకా? నదులపై కేంద్ర పెత్తనం రాజ్యాంగవిరుద్ధం

మాడభూషి శ్రీధర్

‘మా ప్రాజెక్టులపై మీ పెత్తనమేంటి? దేశీయ, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి వందల కోట్ల రుణాలు తెచ్చి మరీ నిర్మాణాలు చేపట్టాం. ఇందుకోసం రాష్ట్ర జలవనరుల శాఖ ఆస్తులను కుదువపెట్టాం. మరి వాటిని స్వాధీనం చేసుకునేటట్లయితే.. ఆ అప్పులను కేంద్రమే తీరుస్తుందా’ అని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిలదీసింది. జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులను మీకెందుకు స్వాధీనం చేయాలి? మీకు 200 కోట్లరూపాయలు ఎందుకివ్వాలి? లెక్క చెప్పండి అని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.

గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనపరచుకుంటే.. వాటి నిర్మాణాల బాధ్యతను బోర్డు తీసుకుంటుందా? అని ప్రభుత్వాలు  ప్రశ్నించాయని పత్రికలు వార్తలు ప్రచురించాయి. కేవలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపైనే యాజమాన్య నియంత్రణ చేస్తారా.. ప్రాజెక్టులపైనా అజమాయిషీ చేస్తారా? అని కూడా అడిగారు. గోదావరి, కృష్ణా నదులపై ఆంధ్ర, తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులను, రిజర్వాయర్లు, కాలువలు, చెక్‌డ్యాములను ఈ నెల 14 నుంచి కేంద్ర అధీనంలో ఉన్న బోర్డులు స్వాధీనం చేసుకోవడానికి జరిగిన సమావేశాల్లో ఈ ప్రశ్నలు తలెత్తాయి.

పెద్దవాగు మీ ఇష్టం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు, సీఈ మోహన్‌రావు, తదితరులు హాజరయ్యారు. గోదావరిపై నిర్మించిన పెద్దవాగు రిజర్వాయరును మొదట స్వాధీనం చేసుకుంటున్నామని అయ్యర్‌ ప్రకటించారనీ దానిని తీసుకున్నా.. తీసుకోకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని రెండు రాష్ట్రాలూ పేర్కొన్నాయనీ వార్తలు వచ్చాయి. ఏపీకి చెందిన పోలవరం, సీలేరును స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కోరింది. దానికి ఎపి తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. గోదావరిపై కాళేళ్వరం సహా పలు ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా నిర్మించి.. లెక్కకు మిక్కిలిగా నీటిని వాడుకుంటోందని చెప్పారు. ప్రధానంగా కాళేళ్వరం, ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లిస్తోందని.. ఫలితంగా దిగువన గోదావరి డెల్టాకు రబీలో సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోపించింది. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే ముందు తెలంగాణను కట్టడి చేయాలని.. అప్పుడు తమ రాష్ట్రానికి సజావుగా నీళ్లు వస్తాయని ఆంధ్ర చేసిన వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. సీలేరు కరెంటుపై తమకు అధికారం ఉందని, ఆ మేరకు విద్యుత్‌ రావడం లేదని, దీనిని బోర్డు స్వాధీనపరచుకోవాలని ఆంధ్ర కోరింది.

ఆస్తులు కేంద్రానికీ, అప్పులు రాష్ట్రాలకా?

గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులను క్రమంగా స్వాధీనం చేసుకుంటామని.. వాటి యాజమాన్య నిర్వహణకు ఉభయ రాష్ట్రాలూ చెరో రూ.200 కోట్లు ఇవ్వాలని బోర్డు చేసిన డిమాండ్ కు వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రాజెక్టులకు సంబంధించిన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుంటామన్న సూచనను ఏపీ వ్యతిరేకించింది. ముందు రుణాల మాటేంటో చెప్పాలని రెండు రాష్ట్రాలు అడిగాయి. ‘ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీ స్వాధీనం చేసుకుంటే.. వాటికోసం తీసుకున్న రుణాలు మేమెందుకు చెల్లిస్తాం. బ్యాంకులు రుణాల వసూలు కోసం ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుంటే బాధ్యుత ఎవరిది? ఆర్బిట్రేషన్‌ వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? ఆ రుణాలను కేంద్రమే తీర్చుతుందా?’ అని రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నలవర్షం కురిపించించారు.  ప్రాజెక్టులను తీసుకుంటామే గాని.. అప్పుల భారాన్ని తీసుకోబోమని బోర్డు వ్యాఖ్యానించింది. ప్రపంచంలో ఎక్కడైనా ఏ న్యాయశాస్త్రంలోనైనా ఆస్తులతోనే అప్పులు బాకీలు తరలి వెళ్తాయి. ప్రాజెక్టులు స్వాధీనం చేసుకుంటూ, పెత్తనం చేస్తామని చెబుతూ, ఆ పెత్తనానికి నిర్వహణకు కూడా రాష్ట్రాలనే డబ్బు అడుగుతూ బాకీల బాధ్యత తమకు లేదనడం చట్ట విరుద్ధం. అసలు ప్రాజెక్టులు ఈ విధంగా స్వాధీనం చేసుకోవడమే రాజ్యాంగ విరుద్ధం. అన్యాయం, నియంతృత్వ పోకడ.

సీడ్ మనీ ఎందుకు, ఏ చేస్తారు?

అసలు ఈ సీడ్‌ మనీ ఏమిటి? కేంద్రానికి రెండు రాష్ట్రాలు చెరో రూ.200 కోట్లు ఎందుకు ఇవ్వాలి? దేనికి దీన్ని ఖర్చు చేస్తారు? అని రెండు రాష్ట్రాలూ ప్రశ్నించడం సంతోషదాయకం.

గోదావరి బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి మూడు నెలలు గడువు కావాలని తెలంగాణ కోరడం,  జీఆర్‌ఎంబీ దాన్ని తోసి పుచ్చడం చూస్తే అసలు మనం ఎవరి పాలనలో ఉన్నాం? ఇది ఎవరి నియంతృత్వం? ప్రజాస్వామ్యం ఉందా, పోయిందా? రాష్ట్రాలు కేంద్రానికి లొంగిపోయి ఉండాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణా బోర్డు సమావేశం కూడా మంగళవారం జరుగనుంది. ఆంధ్రలో 22 తెలంగాణలో 7 ప్రాజెక్టుల స్వాధీనంపై ఇటువంటి అభ్యంతరాలు లేవనెత్తడం రాష్ట్రాల బాధ్యత.

గెజిట్ లో నిబంధనల ప్రకారం ఈ నెల 14 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరిపై గెజిట్ లోని షెడ్యూల్ 2లో ఉన్న ప్రాజెక్టులు బోర్డుల అధీనంలోకి వెళ్ళాలని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగిస్తేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేకుండా బో్ర్డులు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేకుండా కేంద్రం విడుదల చేసిన గెజెట్ లోని క్లాజులు స్పష్టంగా ఉన్నాయి కనుక అనుమతులు ఇవ్వకుండా షరతులను విధించాలని రాష్ట్రాలు ప్రయత్నించడం తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగానూ కేంద్ర నియంతృత్వానికి ప్రతిబంధకంగానూ ఉన్నాయి. ‘‘గెజిట్ ప్రకారం ఆయా ప్రాజెక్టులను తమకు అప్పగించాలంటూ బోర్డులు ప్రభుత్వానికి లేఖలు రాయాలి. వాటిని ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది.’

నాగం జనార్దనరెడ్డి సూచన సమంజసం

ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విజ్ణప్తి సమంజసమైంది. జాతీయ జల విధానానికి విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు అనీ, రుణం ఇవ్వవద్దనీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీకి రాసిన లేఖలో కోరారు.

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles