Thursday, December 8, 2022

సదవకాశాన్ని జారవిడిచిన టీఆర్ఎస్, సీపీఐ

  • మునుగోడులో పోటీపై చర్చ జరగవలసింది
  • కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్థి చేత పోటీ చేయించవలసింది
  • టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండవలసింది

మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ ను బలపరచాలని సీపీఐ నిర్ణయించడం వామపక్షాల అభిమానులకు మనస్తాపం కలిగించక మానదు. తెలంగాణలో సీపీఐ ఏ నియోజకవర్గంలోనైనా కొద్దో గొప్పో బలం ఉన్నదనుకుంటే అది మునుగోడు. అటువంటి మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నికలు అనివార్యమైన స్థితిలో సీపీఐ నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసానికి వెళ్ళి చర్చలు జరిపి బేషరతుగా అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు.

మునుగోడు ఉపఎన్నిక అసాధారణమైన ఎన్నికనీ, బీజేపీ తెచ్చిందనీ, తాము మామూలుగానైతే కాంగ్రెస్ పార్టీతో 2018 ఎన్నికలలో పొత్తు పెట్టుకున్నామనీ, కానీ కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందాన ఉన్నదనీ  సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. అందుకే బేషరతులగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను బలపరచాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

లోగడ మునుగోడులో అయిదు విడతల గెలిచినప్పటికీ ఆ విజయాలు ఏదో ఒక కూటమిలో భాగంగా పోటీ చేసినప్పుడే దక్కాయనీ, సొంతంగా మునుగోడును గెలుచుకునే శక్తి సీపీఐకి లేదనీ, అందుకే బీజేపీని నిలువరించే శక్తిగా టీఆర్ఎస్ ను గుర్తించి ఆ పార్టీకి అన్ని స్థాయిలలోనూ, అన్ని విధాలుగానూ బీజేపీ వ్యతిరేక పోరాటంలో మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.

2018 ఎన్నికలలో చంద్రబాబునాయుడు చొరవతో ఏర్పడిన కూటమిలో కాంగ్రెస్, టీడీపీలతో పాటు సీపీఐ భాగస్వామి. ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి కూడా ఈ కూటమిలో ఉంది.  మునుగోడు స్థానాన్ని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుచుకున్నారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకీ, శాసనసభకూ రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అవసరం ఏర్పడింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి లోక్ సభ సభ్యుడు. ఆయన కాంగ్రెస్ లో ఉంటారా, బీజేపీలోకి దూకుతారా అనే విషయం ఇతమిత్థంగా చెప్పడం కష్టం. దేశీయాంగమంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. కాంగ్రెస్ నాయకులను కూడా కలుసుకుంటున్నారు. ఆయన ఇంకా ఎటూ తేల్చుకోలేదు.

మునుగోడు టీఆర్ఎస్ స్థానం కాదు. అది అవుతే సీపీఐది లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పోటీ చేయకుండా విడిచిపెట్టినా ఆక్షేపణ లేదు. బీజేపీ గెలువకుండా చూడాలనే సూత్రబద్ధ వైఖరి అయితే సీపీఐ కానీ సీపీఎం కానీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వవలసిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం వామపక్షాల ఉనికి కాపాడుకోవడానికైనా సీపీఐ ప్రయత్నించాల్సిందని వారి అభిప్రాయం.

2018 నాటి ఎన్నికలలో కూటమిగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకరరెడ్డి టీఆర్ఎస్ ను విమర్శించారు. టీఆర్ఎస్ డబ్బులు గుమ్మరించిందనీ, ఆ ఎన్నికలలో టీఆర్ఎస్ సాంకేతికంగా విజయం సాధించింది కానీ నైతికంగా కాదనీ వ్యాఖ్యానించారు. అటువంటి టీఆర్ఎస్ ను బేషరతుగా సమర్థించడానికి నేటి సీపీఐ నాయకత్వం నిర్ణయించడం విశేషం. 2018 ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఒక్క సమీక్షా సమావేశమైనా నిర్వహించలేదని చాడా వెంకటరెడ్డి ఆక్షేపించారు. అది పొరపాటే. కానీ మునుగోడులో కొన్ని వారాల కిందటి వరకూ టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ. కాంగ్రెస్ కు సీపీఐ, సీపీఎంలు మద్దతు ఇవ్వడం సమంజసంగా ఉండేది. కాకపోతే టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే సూటిగా బీజేపీని విమర్శిస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీపైన నిప్పులు చెరుగుతున్నది. ‘ఏం చేసుకుంటావో చేసుకో పో’ అనే అర్థం వచ్చే విధంగా పరుషమైన పదజాలంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే మునుగోడులో ఆగస్టు 20న జరిగిన భారీ బహిరంగ సభలో సవాలు చేశారు. ఒక్క తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీతో పోరాడుతామని టీఆర్ఎస్ అధినేత చెబుతున్నారు కనుక బీజేపీని నిలువరించే శక్తి కేసీఆర్ కే ఉన్నదని తీర్మానించామని సీపీఐ నాయకులు అంటున్నారు. వామపక్షాల మద్దతు కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక కారణం కావచ్చు.

టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం కంటే టీఆర్ఎస్ మద్దతు తీసుకొని మునుగోడులో సీపీఐ అభ్యర్థిని నిలబెట్టి ఉన్నట్లయితే వామపక్షం ఉనికిని కాపాడుకునే అవకాశం ఉండేది. బీజేపీని వ్యతిరేకించి పోరాడటానికి కేసీఆర్ కూ, టీఆర్ఎస్ కూ అనేక వేదికలుంటాయి. అనేక సందర్భాలు ఉంటాయి. కానీ సీపీఐకి మునుగోడు ఒక్కటే మంచి అవకాశం. ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలుసుకున్నప్పుడే సీపీఐ అభ్యర్థికి అన్ని రకాలా మద్దతు ఇవ్వండి, మీతో జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఉద్యమంలో తోడుగా ఉంటామని ప్రతిపాదించి ఉండవలసింది. మునుగోడు స్థానాన్ని కాంగ్రెస్ కు కానీ సీపీఐకి కానీ వదిలివేస్తే టీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ లేదు. పరువు తక్కువ పని కాదు. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, లేదా టీఆర్ఎస్ అభ్యర్థిని బలపర్చుతున్నామని టీఆర్ఎస్ నాయకత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పుకోవచ్చు. అసలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను కూర్చోబెట్టి కేసీఆర్ భేటి జరపవలసింది. కాంగ్రెస్ లేదా సీపీఐ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించవలసింది. ప్రగతిశక్తులన్నీఏకం కావడం  అంటే అదే. బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసి బీజేపీ అభ్యర్థిని ఓడిస్తే రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వ పటిమ చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. అట్లా చేయకపోగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే నీటిపాలు చేసినట్టేననీ, వృథా చేసినట్టేననీ వ్యాఖ్యానించడం ద్వారా కేసీఆర్ ఒక అవకాశాన్ని జారవిడిచారు.

జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించి పోరాడదలచిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని తగ్గించి, బీజేపీని పెంచడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కొన్ని మాసాలపాటు తన విమర్శనాస్త్రాలను బండి సంజయ్ పైనా, కిషన్ రెడ్డిపైనా, ఈటల రాజేంద్రపైనా ఎక్కుపెట్టి వారి ప్రాధాన్యతను పెంచారు. కాంగ్రెస్ ప్రాధాన్యం తగ్గించారు. ప్రస్తుత పరిస్థితులలో రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ఏ ఒక్క పార్టీకి కూడా సొంతంగా సంపూర్ణ మెజారిటీ వస్తుందని చెప్పే సాహసం చేయలేము. కాంగ్రెస్, బీజేపీలను ఎదిరించి మొత్తం మీద మెజారిటీ స్థానాలు సాధించడం టీఆర్ఎస్ కు అంత సులువు కాదు. కాంగ్రెస్ ఒంటరిగా మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం అంతకంటే కష్టం. బీజేపీ సంగతీ అంతే. ఒక్క తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీ ఆట కట్టించాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐల మధ్య సామరస్యం అవసరం.

తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి ఉపఎన్నికలు తోడైనాయి. బీజేపీ ధనబలం ఉంది. నాయకగణం ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి చేరే నాయకుల తోడ్పాటు ఉంది. జాతీయ స్థాయి పార్టీ నాయకులు వెన్నుదన్నుగా ఉన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెక్కలు కట్టుకొని తెలంగాణలో వాలుతున్నారు.  హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ తమ కైవసం కావాలనే స్వప్న సాకారం కోసం బీజేపీ నేతలు జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిలలో ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలలో హడావిడిని గుర్తు చేస్తున్నారు.

జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్ తొలుత బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని, మూడో ఫ్రంట్(ఫెడరల్ ఫ్రంట్)ను ఏర్పాటు చేస్తానంటూ బయలుదేరారు. ఆ ప్రయాణం ఎక్కువ దూరం సాగలేదు. తాను కలుసుకున్న ముఖ్యనాయకులలో అధిక సంఖ్యాకులు కాంగ్రెస్ తో సంపర్కంలో ఉన్నవారే. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్ష కూటమి అసాధ్యం అన్నవారే. దాంతో కొంతకాలం విరామం ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల ప్రవీణుడితో రోజుల తరబడి చర్చలు జరిపారు. అంతకంటే ముందుకు వెళ్ళలేదు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిని నిర్ణయించేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దిల్లీలో సమావేశం నిర్వహిస్తే దానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారనే కారణంపైన టీఆర్ఎస్ హాజరుకాలేదు. ఆ సమావేశంలో రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నిర్ణయించారు. అదే విధంగా  ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ ఆధ్వర్యంలో దిల్లీలోనే ప్రతిపక్షాల సమావేశం నిర్వహించారు. దానికి కూడా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు. ఈ సారి టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు హాజరైనారు. తృణమూల్ కాంగ్రెస్ గైర్ హాజరైంది. ఆ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను నిర్ణయించారు. దరిమిలా జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష అభ్యర్థులు ఇద్దరూ ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీపైన విమర్శల జోరును పెంచిన కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శలు తగ్గించారు. ఇది మంచి నిర్ణయమేననీ, కాంగ్రెస్ తో కూడిన ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కేసీఆర్ వంటి గట్టి నాయకుల సహకారం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అనుకున్నారు.

దీనికి కొనసాగింపుగా కాంగ్రెస్ అభ్యర్థినో, సీపీఐ అభ్యర్థినో మునుగోడులో నిలబెట్టి గెలిపించి ఉంటే కేసీఆర్ ప్రతిష్ఠ పెరిగేది. సోనియాగాంధీతో, రాహుల్ గాంధీతో, రేవంత్ రెడ్డితో కేసీఆర్ కి ప్రస్తుతం సయోధ్య లేని విషయం వాస్తవం. ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్లులో జరిగిన బహిరంగసభలో మట్లాడుతూ కేసీఆర్ పైన విమర్శలు చేసిన మాటా నిజమే. కాంగ్రెస్ లో పుట్టిపెరిగి, తెలుగుదేశం పార్టీలో చేరి, మూడున్నర దశాబ్దాలపాటు  కాంగ్రెస్ ను అవహేళన చేయడమే, ఓడించడమే లక్ష్యంగా రాజకీయాలు  నెరపిన చంద్రబాబునాయుడితో వ్యవహారం చేయడానికి  సోనియా, రాహుల్ లకు అభ్యంతరం లేదు. 2018, 2019 ఎన్నికలలో నిధులూ, విధులూ ఇచ్చిపుచ్చుకున్నారు.  2014లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న వాగ్దానాన్ని అమలు చేయని నాయకుడుగా, దరిమిలా కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీని బలహీనపరచిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ పట్ల శత్రుభావం ఉన్నప్పటికీ దానిని  జాతీయ రాజకీయాల దృష్ట్యా విస్మరించవలసిన అవసరం, విస్మరించగల సంస్కారం కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి లేకపోలేదు. సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ వైఖరి ఏమిటో తెలంగాణ శాసనసభకు వచ్చే డిసెంబర్ లో జరిగే ఎన్నికలలో సూచనప్రాయంగా వ్యక్తం కావాలి. రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో అమలు చేయబోయే వ్యూహం మునుగోడు ఉపఎన్నికలలో ప్రతిఫలించాలి. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐలు మునుగోడులో ప్రదర్శించే వైఖరులు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం కావాలి. అంత దూరదృష్టితో, ఏకాగ్రతతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తే కానీ జాతీయ స్థాయిలో బీజేపీ రథాన్ని నిలువరించడం సాధ్యం కాదు.  ఇదే ధోరణిలో కాంగ్రెస్, వామపక్షాల నేతలు సైతం ఆలోచించగలగాలి. మునుగోడులో, తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు సమన్వయం చేసుకుంటేనే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటం సార్థకం అవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles