Wednesday, April 24, 2024

కౌశల్యకు సుమిత్రాదేవి ఉద్బోధ

రామాయణమ్36

 ‘‘కౌసల్యా! నా కంటిచూపు తిరిగి రావడంలేదు. నా రాముడి వెనుకనే అదీ వెళ్ళిపోయింది! రాముడి రధం వెనుక పిచ్చివాడిలా పరుగెత్తి పరుగెత్తి అలసి సొలసిన దశరధుడి ఆక్రందన అది.

అంతకు మునుపు సుమంత్రుడు తెచ్చిన రధమెక్కి సీతారామలక్ష్మణులు మువ్వురూ పయనమయ్యారు.

ఆబాలగోపాలమూ రధమువెంట పరుగులుతీసింది.

కాసేపు ఆపు సుమంత్రా! ఆ సుందర, సుమనోహర రూపాన్ని మరల ఎన్నాళ్ళకు చూస్తామో. అప్పటికి మేము బ్రతికి ఉంటామో లేదో. కాస్త ఆపవయ్యా నీవు. మరొక్కమారు కనులారా కాంచుతాము ఆ కమనీయ విగ్రహాన్ని రమణీయరూపాన్ని.

Also read: తండ్రికీ, తల్లులకూ ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్న రామలక్ష్మణులు, సీత

ఆ కైకకు అదేం పోయే కాలమొచ్చిందిరా తండ్రీ! మా బంగారుకొండను అడవులపాలు చేస్తున్నది. రాముడులేని అయోధ్యానగరం, అరణ్యం ఒకటే! మాకీ నగరమొద్దు! ఈ రాజూ వద్దు!

‘‘రామా! నీవెక్కడుంటే అదే మా నివాసము ,మా రాజ్యము. రామయ్యా ! ఒక్కసారి మాకేసి చూడయ్యా ! సీతమ్మతల్లీ నీవయినా చెప్పవమ్మా తన కరుణార్ద్రదృక్కులు మాపై ప్రసరించనీయమని!’’ 

రధం రేపుతున్న దుమ్ము చిత్రంగా అణిగిపోతున్నది పురజనుల కన్నీళ్ళు కాలువలై ప్రవహిస్తున్నాయి. ఇంతలో ఎక్కడినుండో వచ్చినట్లుగా ఆజ్ఞ ఇచ్చేస్వరము, దీనరవము కలగలసి ఒక ఆర్తుడు పెట్టిన కేక అది ! సుమంత్రా రధమాపు! రధమాపు! గుర్తుపట్టాడు రాముడు. అది తనతండ్రిది!

‘‘సుమంత్రా ఇంకా వేగంగా తోలు. నీవు తిరిగి వచ్చినప్పుడు నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదని మహారాజడిగితే జనఘోషలో వినపడలేదని చెప్పు.’’

రధంవెనుక పరుగెత్తి, పరుగెత్తి కూలపడిపోయాడా కన్నతండ్రి!

Also read: మరో కోణం నుంచి చూస్తే కైక అమృతమూర్తి

పడిపోయిన రాజు కుడిరెక్క పట్టుకొని కౌసల్య లేపుతుండగా ఇంతలో కైక ఎడమ భుజము పట్టుకోపోయింది! పాము వంటిమీద ప్రాకినంత జలదరింపుతో ‘‘ఛీ! దుర్మార్గురాలా! నేటి నుండీ నీవు నా భార్యవూకావు, నేను నీ భర్తనూ కాను. పెళ్ళినాటి ప్రమాణాలకు నేటితో చెల్లు. నీ విచ్చే రాజ్యం తీసుకుంటే భరతుడు వదిలే తర్పణాలు కూడా నాకు చెందవు’’ అని కోపావేశంతో కళ్ళెర్ర చేసి కౌసల్యాదేవి మందిరానికి చేరుకున్నాడు మహారాజు.

రాముడే లక్ష్యంగా, రాముని మీదే చూపుగా రొప్పుతూ పరిగెడుతున్నారు రధం వెంట జానపదులు. దయాసాగరుడు వారిని చూశాడు. సుమంత్రుని రధం ఆపమన్నాడు. రధం దిగారు మువ్వురూ! జానపదుల పదంలో పదం కలిపి నడవడం మొదలుపెట్టి సాగుతున్నాడు రాఘవుడు.

దశరథుడు కౌసల్య గృహము చేరి పరిపరివిధాలుగా ఆలోచిస్తూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు. శోకంతో కృశించిపోయిన భర్తను చూస్తూ కౌసల్య కూడా దుఃఖము ఆపుకోలేక బిగ్గరగా ఏడ్వసాగింది. అడవిలో వారి అవస్థలు తలుచుకుంటున్నప్పుడల్లా వారి గుండె కరిగి కన్నీరై కాల్వలై ప్రవహించసాగింది.

అంతులేని వేదన. అలపులేని రోదన. అలుపుసొలుపూలేకుండా ఒకటే దుఃఖము! కౌసల్యాదేవి భవనమంతా రోదనధ్వనులతో నిండిపోయి ఉన్నది.

Also read: నారవస్త్రాలు ధరించిన సీతారామలక్ష్మణులు

సుమిత్రాదేవి ఈ ఏడుపులు పెడబొబ్బలు చూసింది! ‘‘ఏమైందని ఏడుస్తున్నారు మీరంతా? రాముడంటే ఎవరనుకున్నారు? పురుషులలో శ్రేష్ఠుడు, సకల సద్గుణసంపన్నుడు, మహాబలశాలి. అతడు అనుసరించేది ధర్మమార్గము. ఆ మార్గములో స్థిరంగా నిలిచి వున్నవాడి గురించి ఆందోళన ఎందుకు? అన్నతోటి లక్ష్మణుడున్నాడు. సీతకూడా అరణ్యవాసములోని కష్టాలన్నీ తెలిసే స్వయంగా వెళ్ళింది. రాముడు ధర్మమూర్తి. ఆయనను సూర్యుడు తనకిరణములతో బాధింపడు. వాయువు ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఆహ్లాదకరంగానే తాకుతుంది రాత్రిపూట నిద్రించే రామునికి చంద్రుడి కిరణస్పర్శ ఆయన కన్నతండ్రి స్పర్శ అంత ఆనందంగా వుంటుంది. లోకంలో అలాంటి వీరుడింకొకడు లేడు. అంతటి మహావీరుడు అరణ్యంలో కూడా స్వంత ఇంటిలో ఉన్నట్లు ఉండగలడు! రాముడి యందు లక్ష్మి, శౌర్యము, మంగళప్రదమైన బలము ఉన్నాయి.  అరణ్యవాసాన్ని ఏ విధమైన శ్రమలేకుండా పూర్తిచేసుకుని హాయిగా తిరిగివస్తాడు.

‘‘ఓ కౌసల్యా! రాముడెవరనుకున్నావు? సూర్యుడికి సూర్యుడు. అగ్నికి అగ్ని. ప్రభువులకు ప్రభువు. సంపదలకు సంపద. కీర్తికి శ్రేష్టమైన కీర్తి. ఓర్పుకు ఓర్పు దేవతలకు దేవత. సకల భూతములకు భూతశ్రేష్ఠుడు. అనన్య సామాన్యము, అనితరసాధ్యమూ అయిన సామర్ధ్యము కలవాడు! అట్టి రాముడు అరణ్యములో ఉంటేనేమి?  అయోధ్యలో ఉంటేనేమి?  ఎక్కడైనా ఒకటే ఆయనకు!

Also read: దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ

‘‘ఓ కౌసల్యా! రాముడు తిరిగి వచ్చి నీ పాదాలకు నమస్కరించి  రాజ్యలక్ష్మితో, సీతాలక్ష్మితో, మహాలక్ష్మితో అత్యంత వైభవంగా ఉండటాన్ని నీవు కనులారా కాంచుతావు! ఏడవకు,ఏడవకు. రామమాతా ఏడవకు ! రాబోయే రోజులలో రాముడే అయోధ్యకు ఏడుగడ!’’

NB.

రాముడి గురించి సంపూర్ణముగా తెలుసుకొన్న మహాతపస్విని సుమిత్రామాత! అందుకే మారుమాటాడకుండా చిరునవ్వుతో కొడుకును  రామునివెంట పంపింది. రాముడి సామర్ధ్యం తెలిసి విలపించకుండా ప్రశాంతంగా ఉన్న ధీరోదాత్తురాలైన వనిత సుమిత్రాదేవి.

Also read: అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles