Monday, January 30, 2023

దశరథుడి సమక్షంలో కైకకు సుమంత్రుడి ఉద్బోధ

రామాయణమ్ 32

రాముడొచ్చాడని తనకు తెలిపిన సుమంత్రునితో రాణులకు కూడా కబురుచేయించాడు దశరథుడు. దశరథుడి రాణులందరూ కౌసల్యతో కలిసి వచ్చారు.

దశరథుడి భవన ప్రాంగణం మూడువందల యాభయిమంది రాణులతో ,ఆయన మంత్రులతో కిక్కిరిసి ఉన్నది. రాణులందరూ వచ్చిన తరువాత రాముని ప్రవేశపెట్టమన్నాడు దశరథుడు.

రాముడు అల్లంతదూరంనుండే తండ్రికి నమస్కారం చేసుకుంటూ వస్తున్నాడు.

Also read: అడవికి బయలు దేరిన సీతారామలక్ష్మణులు

కొడుకును చూడగనే ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెగింది. ఎదురు వెళుతూ వెళుతూ దుఃఖభారంతో కూలబడిపోతున్నాడు. చప్పున వచ్చి ఆయన పడకుండా చెరోవైపు పట్టుకున్నారు రామలక్ష్మణులు.

మూర్ఛపోయిన తండ్రికి పరిచర్యలు చేశారిరువురూ. తేరుకున్నపిదప దశరథుడు  ‘‘రామా నన్ను చంపివేసి అయినా సరే నీ రాజ్యము నీవు దక్కించుకో నాయనా!’’ అంటూ ఏడ్వసాగాడు.

ఏమాత్రము మనో వైకల్యము లేని రాముడు ‘‘తండ్రీ! పదునాలుగేండ్లు ఎంతసేపు. మరల తిరిగివచ్చి నీ పదములపై వ్రాలనా! నీవు చక్రవర్తివి. ఇలా బేలకావలదు. లోకం నిన్ను అసత్యవాది అని అనటం నేను భరించలేను తండ్రీ!  నీవిచ్చిన మాటను చెల్లించటం నా కర్తవ్యము కాదా! అసలు అదే నా కర్తవ్యము. నా ధర్మము.’’

రాముడి మాటలకు దశరథుడు మారుమాటాడలేక ‘‘నాయనా పోనీ ఈ ఒక్కరాత్రి ఉండిపోరా. నీకిష్టమయినవన్నీ అనుభవించి వెళ్ళు తండ్రీ’’ అని దీనంగా బ్రతిమిలాడాడు. కైకను దూషించాడు.

‘‘లోపల ఇంత విషము దాచుకొన్న ఈ స్త్రీ నేడు దానిని బయల్పరచినది. నివురుగప్పిన నిప్పు అని నా కిన్నినాళ్ళు తెలవలేదురా రామా!’’

‘‘తండ్రీ ఈ రోజు నీ విచ్చే ఈ భోగాలనుభవిస్తాను. కానీ రేపటినుండీఎవరిస్తారు?. కోరికలన్నింటినీ విడిచి ఇప్పుడే అడవికి బయలుదేరతాను. అనుమతించండి’’ అని దోసిలి ఒగ్గి నిలుచున్న కొడుకును గాఢంగా కౌగలించుకొని మరల మూర్ఛితుడయ్యాడు దశరథుడు.

Also read: రాముడితో అడవికి వెళ్ళడానికి సీతాలక్ష్మణులు సిద్ధం

ఈ వ్యధలకు కారణమైన కైకను చూసి పట్టరాని కోపమొచ్చింది సారధి సుమంత్రునకు.

‘‘కైకమ్మా! ఏ ఆడుదీ చేయకూడని పనిచేశావు. నీ భర్తను క్షోభపెడుతున్నావు. అంతటి దశరథ మహారాజుకు ఇంతటి వేదనరగిలించావు. నీవు కులఘ్నివి! రాముడులేని ఈ రాజ్యములో మేమెవరమూ నివసింపము.  ఆయనతోటే వెళ్లిపోతాము. నీవే ఎవరూలేని మరుభూములను తలపించే అయోధ్యను నీ కొడుకుతో కలిసి ఏలుకో! భూమి ఎందుకు బ్రద్దలుకాలేదో నాకు అర్ధం కావడంలేదు. లోకమంతా నిన్ను ఛీత్కరిస్తున్నది. అయినా ఆడపిల్లకు తల్లిబుద్ధులు వస్తాయంటారు. ఆ తల్లికడుపున పుట్టిన నీకు ఇంతకన్నా మంచి బుద్ధి ఎలా వస్తుందిలే! వేప చెట్టునుండి మధురమైనతేనె వస్తుందా? నీ తల్లి గూర్చి చెపుతాను విను’’ అంటూ సుమంత్రుడు పలికాడు. ‘‘నా అహంకారము నాదే. కట్టుకున్నవాడు కాటికిపోయినా ఫరవాలేదు…….ఇది నీ తల్లి బుద్ధి. నీకూ అదే సంక్రమించినది. ఒక మహాపురుషుడు నీ తండ్రికి ఒక వరమిచ్చాడు. ఆ వర ప్రభావమువల్ల నీ తండ్రి సకలప్రాణుల సంభాషణ అర్ధం చేసుకోగలడు. వరమిచ్చిన మహానుభావుడే ఇంకొక విషయము కూడా చెప్పాడు. తను విన్న సంభాషణ ఎవరికైనాసరే తెలియచేస్తే తనకు మరణం కలుగుతుంది. సంభాషణ వినటం వరకే అధికారం కానీ విన్నదానిని బయటపెట్టరాదన్నమాట.

‘‘నీ తల్లీ తండ్రి ఏకాంతంగా ఉన్న సమయమది. మంచము మీద ప్రాకుతున్న” జృంభ” అనే చీమ మాటలాడింది. దాని అర్ధము తెలుసుకొన్న నీ తండ్రికి నవ్వువచ్చి బిగ్గరగా నవ్వాడు .. ఆ నవ్వు తనను గురించే పరిహసిస్తూ నవ్వాడనకొని నీ తల్లి ఆ పరిహాసాన్ని సహించలేక కారణమడిగింది. నిన్ను చూసి కాదులే. చీమ బలే తమాషాగా మాట్లాడింది. అందుకు నవ్వు వచ్చింది అని అన్నాడు నీ తండ్రి. చీమ మాట్లాడిన మాటలు తనకు చెప్పమంది మీ అమ్మ. చెబితే తనకు ప్రాణగండమున్నది కావున నీ తండ్రి నిరాకరించాడు. అప్పుడు నీ తల్లి పట్టినపట్టు వీడక  ….నీవు బ్రతికి తే నాకేమిటి చస్తే నాకేమిటి ? ఆ సంభాషణ నాకు నీవు చెప్పి తీరవలసిందే అని అహంకారపూరితంగా మాట్లాడింది.. నీ తల్లి మంకుపట్టు మానలేదు. మీ నాన్నకు ఏమిచేయాలో తోచక తనకు వరమిచ్చిన మహానుభావుడి సలహా కోరాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు ఏమైనా కానీ అని మరల చెప్పాడు. స్త్రీ కి భర్తక్షేమము కన్న ముఖ్యమైనదేదీ లేదు. భర్తకన్నా తన అహంకారమే ముఖ్యమనుకొన్న స్త్రీ నీ తల్లి. అట్టి నీ తల్లిని మూర్ఖపు ప్రవర్తన వల్ల నీ తండ్రి తిరస్కరించాడు. తిరస్కరించి తను క్షేమంగా ఉన్నాడు.

Also read: సీతారాముల సంభాషణ

‘‘మరల నీవిపుడు దానిని పునారావృతము గావించుచున్నావు! దశరథ మహారాజు ఏ దోషములూ లేని ఉత్తముడు. నీ కోరిక ఆయనను క్షోభపెడుతున్నది. అది ఆయన పాలిటి మృత్యుపాశము. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొన్నది. ఆ పాశములు నీవు విసరినవే. వాటిని వెనుకకు తీసుకో.

‘‘రాముడు అన్నదమ్ములలో జ్యేష్ఠుడు. ఉదారుడు!  ఎంతటి క్లిష్టతరమైన కార్యములనయినా నిర్వహింపగల సమర్ధుడు. కాపాడుకొనేవాడు. ప్రాణులను అందరినీ రక్షించేవాడు. మహాబలశాలి!  అటువంటి రామునికి పట్టాభిషేకము జరిగేటట్లుగా చూడు! అనవసరమైన అపవాదులు, చెడ్డపేర్లు మోయకమ్మా!’’ అని  పలికి సుమంత్రుడు మరల నమస్కరిస్తూ నిలబడ్డాడు.

Also read: రామునికి లభించిన కౌసల్య అనుమతి

ఇంత పలికినా సుంతకూడా మార్పురాలేదు కైక ముఖకవళికలలో,

జనులేమనుకొన్న నాకేమి? నా పంతమే నాదిగానీ! అన్నట్లుగా నిశ్చలంగా బెల్లంకొట్టిన రాయిలాగ నిలబడి ఉన్నది.

దశరథుడది చూసి దీర్ఘంగా నిశ్వసిస్తూ, ‘‘సుమంత్రా! రాముని వెంట సకలసంభారాలు పంపించు. చతురంగబలాలు అతనిని . కోశాగారము సమస్తమూ రాముని వెంటే! గీత, నృత్త, వాద్య బృందాలన్నీ రాముని తోటే వెళ్ళాలి . సకల భోగవస్తువులన్నీ నా రాముడి వెంటే ఉండాలి. వనవాసము పదునాలుగేండ్లు విహారయాత్రకావాలి. వెంటనే ఏర్పాట్లుగావించు’’ అని ఆజ్ఞాపించాడు.

Also read: మర్యాదపురుషోత్తముడు రాముడొక్కడే!

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles