Thursday, September 29, 2022

ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, చింతన

 (డా.ఎమ్.భావనాచార్యులు పుస్తక పరిచయం)

“మాడభూషి చనిపోవడానికి ముందు హైదరాబాదులో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి సారధ్యంలో ‘ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, తత్వ శాస్త్రీయ పరిశీలన, గతితార్కిక భౌతికవాద దృక్పథం’ పేరిట బహుశా 1992లో ఒక చర్చా గోష్ఠి జరిగింది. ఆనాటి ప్రముఖ మార్క్సిస్టు చరిత్ర కారులందరూ నాతో సహా ఆ రెండు రోజుల్లో జరిగిన గోష్ఠిలో పాల్గొన్నారు. కామ్రేడ్ ఏటుకూరి బలరామ మూర్తి, డా. వకుళాభరణం రామకృష్ణ, కామ్రేడ్ గురువా రెడ్డి మొదలగు మేధావులు న్నారు. అందులో మాడభూషి భావనాచారి ఒకరు. ఆ చర్చా గోష్ఠి ప్రధాన ఉద్దేశం గురించి కామ్రేడ్ రాజేశ్వరరావు గారు ఏమి చెప్పారో వారి వారి మాటల లోనే చెబుతున్నాను, ” మన భారతదేశం చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రాలను మార్క్సిస్టు దృక్కోణం నుండి పరిశోధన చేయండి. అది పార్టీకి చాలా అవసరం. ఈ విషయాన్ని మనం అశ్రద్ధ చేశాం. అందుకే మనం భారత ప్రజల మనస్తత్వాన్ని, ఆలోచనా విధానాన్ని అవగాహన చేసుకోలేక పోయాము!”

Also read: సమానత్వమే సైన్సు ఉద్యమ లక్ష్యం!

సమానత్వమే సైన్సు ఉద్యమ లక్ష్యం!

డా. మాడభూషి భావనాచార్యులు రచన ‘ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి, తాత్విక చింతన’ గ్రంథానికి పరిచయం రాస్తూ ఆ పుస్తకం వెలువడ్డానికి కారణాల్ని చెబుతూ స్వాతంత్ర్య సమరయోధులు, సీనియర్ కమ్యూనిస్టు జర్నలిస్టు పరకాల పట్టాభి రామారావుగారు అన్న మాటలే పైనవి. భారతదేశంలో కులవ్యవస్థలు మొదలుకొని హిందూ మతం విశ్లేషణ వరకూ, మహాపండిత్ రాహుల్ సాంకృత్యాయన్ నుంచి మహాత్మాగాంధీ, వివేకానందల దాకా ప్రతీ అంశం గురించి విభిన్నమైన రీతిలో ఒక ప్రాథమిక పరిశోధన ఇందులో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా, పురాణేతి హాసాల్లోని విషయాల్ని సరికొత్తగా సమాజానికి అన్వయించిన తీరు, దాంతో మనం విభేదించవచ్చుకానీ ఆ విషయ సేకరణకి అబ్బుర పడక మానం. ఆ రకంగా ఇదో విలువైన పుస్తకం !

“కమ్యూనిజం భారతీయేతర సిద్ధాంతమనీ, భౌతికవాదంతో నిండి ఆస్తికతను నిరాకరి స్తుందనీ, కమ్యూనిస్టులు మాస్కో మానస పుత్రులనీ, వారి వేళ్ళు (Roots) స్వదేశంలో లేవనీ – ఇలాగే ఎన్నో విమర్శలుండేవి. భారతీయ సంస్కృతినీ, అందులోని తాత్వికతనూ అవగాహన చేసుకోవడంలో విఫలమయ్యారన్నది ఆ విమర్శల్లో ముఖ్యమైనది. ఈ విమర్శలకు సమాధానంగా దేవిప్రసాద్ ఛటోపాధ్యాయ, దామోదర్ ధర్మానంద కొశాంబి లాంటి తత్వవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు మార్క్సిస్టు సిద్ధాంతంలోని లోతుపాతులను సవివరంగా చర్చించారు. కమ్యూనిస్టు ఉద్యమం కూడా మేథోపరంగా ఎన్నో చర్చలను ప్రోత్సహించి, గ్రంథాలను ప్రచురించినా, చేయాల్సిన కృషి ఇంకా వుందని సి. ఆర్. లాంటి నాయకులు అభిప్రాయ పడుతుండేవారు. భారతీయ తాత్వికతలోని సామాజికాంశాలనూ, అభ్యుదయాంశాలనూ సులభంగా అర్థం చేసుకునే రీతిలో వేద, ఉపనిషత్, పురాణ, స్మృతి సాహిత్యాలనేగాక అరవిందులు, వివేకానంద మొదలగువారి రచనలను విశ్లేషించి పార్టీ కేడర్లతో పాటు, సామాన్య ప్రజానీకానికి అందించాలి. చరిత్ర, సంస్కృతు లతో పాటు వివిధ చారిత్రక విభాత సంధ్యల్లో జరిగిన ఆర్థిక సామాజిక మార్పులను విశ్లేషించాలన్నది సి. ఆర్. గారి సంకల్పం. సమావేశానంతరం సి.ఆర్. గారి ఆలోచనలకు స్పందించి రాసిన కమ్యూనిజం పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం ఈ గ్రంథం! “

Also read: ఆయన పేరలింగం కాదు, ప్రేరణ లింగం

ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రాలకి సంబంధించి సరిగ్గా 30 ఏళ్ళ క్రితం మగ్ధుం భవన్లో జరిగిన ఒక చారిత్రక సమావేశాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ చరిత్రకారులు వకుళాభరణం రామకృష్ణ గారు  ఈ చిన్న పుస్తకానికి తిరుగులేని సాక్షీభూతంగా రాసిన ముందుమాటలోని ప్రారంభ వాక్యాలే పైనవి. ఆయా అంశాల్లో జరగాల్సిన లోతైన కృషిని ఈ రోజు మరింత అవసరంగా గుర్తించడం అన్ని అభ్యుదయ వామపక్ష ప్రగతిశీల శ్రేణుల తక్షణ కర్తవ్యమని నా అభిప్రాయం. ఆ రకంగా మొదట కమ్యూనిజం పత్రికలో వచ్చిన ఇందులోని వ్యాసాలతో పాటుగా, పుస్తకంలో చేర్చిన రెండు అమూల్యమైన అనుబంధాలు  కూడా ఉన్నాయి. మొదటిది ప్రస్తావించబడిన ఆ చారిత్రక సమావేశంలో పాల్గొన్న సభ్యుల క్రమ సంఖ్య పేర్లైతే, రెండోది ఈ దేశ మేధావులు విస్మరించిన తొలితరం మార్క్సిస్టు పరిశోధకుడు, కుల వ్యతిరేక ప్రతిఘట నోద్యమాల తొలి అధ్యయనవేత్త, మహా మేధావి డా. కె. బి. కృష్ణ గారి “భగవద్గీత లో భౌతికవాద అంశాలు”కి సంబంధించిన సంక్షిప్త పరిచయం. సామాజిక ఉద్యమాలు, ముఖ్యంగా బౌద్ధ, భౌతికవాద, కులనిర్మూలన ఉద్యమాలు పట్టించుకుని అధ్యయనం చేసి తీరవలసిన విలువైన చరిత్ర ఇదని నా అభిప్రాయం!

Also read: మహామానవవాద మహత్తర దూత ‘మానవ గీత’

డా. మాడభూషి భావనాచా ర్యులు చిన్న వ్యక్తి కాదు. తొలితరం కమ్యూనిస్టు నాయకులు. ప్రజా పోరాటాలలో క్షేత్రస్థాయిలో పాలు పంచు కున్న వ్యక్తి. 1947 లో ప్రభుత్వం ఈయన ఆచూకీ తెలిపితే పదివేలు బహుమతి ప్రకటించింది. నాగులాపల్లనే చిన్న గ్రామంలో ఉన్న మాడభూషి ని పట్టుకునేందుకు ఏకంగా నాలుగు పెద్ద లారీలతో పోలీసులు రావాల్సి వచ్చిందంటే కమ్యూనిస్టుగా ఈయన స్థైర్యం ఏపాటిదో అర్దం అవుతుంది. దేశంలోని వివిధ జైళ్ళలో రాజకీయ ఖైదీగా ఉన్న మాడభూషి  తదనంతరం పార్టీతో విభేదించారు. “నాకు మార్క్సిజంలో అచంచల విశ్వాసం ఉంది. మన దేశానికి కమ్యూనిజంవచ్చి తీరుతుంది. అయితే దానిని మన భారతదేశ విశిష్ట తాత్విక చింతనకు జోడించాలి” అన్న ఉద్దేశంతో వేదాలు మొదలు కొని ఉపనిషత్తుల వరకూ లోతుగా అధ్యయనం చేసి, భారతీయ తత్వశాస్త్రాలపై డిప్లొమా పొందారు. ప్రజలతో సంబంధం లేకుండా కేవల అధ్యయనం చాలదనే ఉద్దేశంతో చెరకు రైతుల సమస్యలపై మూడు దశాబ్దాల పైబడి పోరాటాలు చేశారు. గోదావరి జిల్లా పీడిత జన పోరాటాలని ముందుండి నడిపించారు. అందుకే, “పిఠాపురంలో కవి పండిత కుటుంబీకులనందరినీ కమ్యూనిస్టు పార్టీ ఆకర్షించింది” అన్న మాడభూషి “నేను కమ్యూనిస్టు గానే పుట్టాను, కమ్యూనిస్టు గానే జీవించాను, కమ్యూనిస్టు గానే మరణిస్తాను.” అని ప్రకటించి ఇరవై ఏళ్ళ క్రితం 2002లో మరణించారు. 2011 లో ఈ పుస్తకంగా ప్రచురించబడిన విశిష్టమైన ఆయన శోధనను గుర్తించి ఆ మేరకు గౌరవించడం ఈ రోజు మతోన్మాదం పెచ్చరిల్లుతున్న వేళ మరింత అవసరమనే భావనే ఈ వ్యాసానికి ప్రేరణ!

Also read: ఒకే వ్యక్తి – అనేక జీవితాలు! రాహుల్ సాంకృత్యాయన్ ! !(వ్యాస సంకలనం)

(ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారతీయ చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రాలకి సంబంధించిన పరిశోధనాత్మక చింతన గురించి సీరియస్ గా కృషి చేసే ఆలోచనాపరులు, బుద్ది జీవులు విస్మరించరాని విలువైన సంవేదనాత్మక గ్రంథం ఇది. ఆయా అంశాల్లో లోతైన కృషి మరింత జరగాల్సిన అవసరం ఎప్పటికంటే ఈ రోజు ఎక్కువ ఉందనేది నా అభిప్రాయం. ఆ రకంగా ఎప్పటి నుంచో పరిచయం చేయాలని అనుకున్న ఈ పుస్తకం గురించి ఇప్పటికిలా ఈ చిన్న రైటప్.)

Also read: ఉద్వేగభరితమైన రచన – లేడీ డాక్టర్స్!

గౌరవ్

Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles