Friday, December 2, 2022

ఆత్మకథలూ, జీవితచరిత్రలతో గ్రంథాలయం

ముదునూరు గ్రంథాలయంలో విద్యార్థులు

  • కృష్ణాజిల్లా ముదునూరులో కొత్త ప్రయోగం
  • డాక్టర్ ఎన్ భాస్కరరావు చొరవ
  • గ్రంథాలయానికి క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థులు

కడచిన సోమవారం విజయవాడ సమీపంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. అది ముదునూరు గ్రామం. గుడివాడ సమీపంలో కాకాని దగ్గర ఉన్న ఈ గ్రామంలో పుట్టిపెరిగిన నాలుపల్లి భాస్కరరావు ఉన్నత చదువులు చదివి, అమెరికా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. దేశంలో ప్రజాభిప్రాయ సేకరణల (ఒపీనియన్ పోల్స్) వ్యవస్థకు ఆద్యుడు. డాక్టర్ భాస్కరరావు తర్వాతనే ప్రస్తుతం ఎన్ డీటీవీ ప్రణయ్ రాయ్, ఇత్యాదులు రంగంలో దిగారు. డాక్టర్ భాస్కరరావు తల్లిదండ్రులు నాగులపల్లి సీతారామయ్య, సోమిదేవమ్మ పేరు మీద స్వగ్రామంలొ స్వగృహంలో ఒక గ్రంథాలయం స్థాపించారు. సీతారామయ్య గారు స్వాంతంత్ర్య సమరయోధుడు.

గ్రంధాలయంలో విద్యార్థినులు పుస్తకాలు తీసుకుంటున్న దృశ్యం

ముదునూరులో గ్రంథాలయం పెట్టడం విశేషం కాదు. ఆ గ్రామంలో గ్రంథాలయం లేకపోలేదు. ముగురమ్మల ముదునూరు అనే వృత్తంతంలో చాలా సంవత్సరాల కిందటే, పాఠశాల రావడానికి ముందే ఒక మహిళ గ్రంథాలయం స్థాపించినట్టు డాక్టర్ భాస్కరరావు రాశారు. 21 ఫిబ్రవరి 2022న ప్రారంభమైన గ్రంథాలయం ప్రత్యేకత ఏమంటే ఇందులో జీవితచరిత్రలూ, ఆత్మకథలు మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితం నుంచి ఇతరులు నేర్చుకోవలసిన పాఠాలు అనేకం ఉంటాయి. ప్రముఖుల జీవిత చరిత్రల నుంచి తెలుసుకోవలసిన అంశాలు విశేషంగా ఉంటాయి. ఇటువంటి గ్రంథాలయం నాకు తెలిసి మరొకటి లేదు.  సీతారామయ్య, సోమిదేవమ్మసంతానం సుమారు నలభై మంది ఉంటారు. వారిలో చాలామంది ఈ గ్రంథాలయం ప్రారంభమైన రోజు ముదునూరు వచ్చారు. డాక్టర్ భాస్కరరావు సతీమణి, ఇద్దరు కుమార్తులూ, వారి భర్తలూ, ఇతర బంధువులు చాలామంది హాజరైన సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, గ్రంథాలయోద్యమంలో పని చేస్తున్న డాక్టర్ రావి శారద, ఆకాశవాణి సంచాలకులుగా ఉద్యోగవిరమణ చేసిన నాగసూరి వేణుగోపాల్,  పాత్రికేయుడు కె. రామచంద్రమూర్తి పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేస్తున్న నాగసూరి వేణుగోపాల్, కుడి పక్కన హంసావేణుగోపాల్, ఎడమ పక్కన డాక్టర్ భాస్కరరావు

తెలుగులో కథలూ, నవలలూ చాలా ఉన్నాయి కానీ ఆత్మకథలూ,జీవిత చరిత్రలూ తక్కవ. కందుకూరి వీరేశలింగం రాసుకున్న స్వీయచరిత్ర ప్రసిద్ధమైంది. గాడిచర్ల హరిసర్వోత్తమరావు అబ్రహాం లింకన్ జీవితచరిత్రను తెలుగులో రాశారు. గాంధీజీ స్వీయచరిత్ర ‘మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’ ను ‘సత్యశోధన’ లేదా ‘ఆత్మకథ’ పేరుతో తెలుగులోకి తర్జుమా చేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం రాసుకున్న ఆత్మకథ ‘వింగ్స్ ఆప్ ఫైర్’ ను ‘ఓ విజేత ఆత్మకథ’గానూ, ‘నా జీవ గమనం, కలల సాకారం’ అనీ, ‘అగ్నిపథం’ అనే పేర్లతో మూడు పుస్తకాలు తెలుగులో వచ్చాయి. భారత దేశంలో శ్వేత విప్లవాన్ని జయప్రదం చేసిన వర్గీస్ కురియన్ స్వీయరచన ‘ఐ టూ హాడ్ ఏ డ్రీమ్’ను ‘నాకూ ఒక కల ఉంది’ అని అనువదించారు. మహాకవి శ్రీశ్రీ ‘ప్రజాతంత్ర’లో వారంవారం రాసిన ధారావాహిక ‘అనంతం’ ఆయన ఆత్మకథే. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు రచించిన ‘నా యెరుక’ కూడా ప్రసిద్ధిపొందిన స్వీయరచన. క్యూబా విప్లవ యోధుడు చేగువేరా కలం నుంచి వెలువడిన ఆత్మకథ ‘మోటార్ సైకిల్ డైరీస్’ ను ప్రజాశక్తి బుక్ హౌస్ ‘చేగువేరా’ పేరుతో అనువదింపజేసి ప్రచురించింది. రామకృష్ణమఠం ప్రచురించిన ‘నా ఆత్మకథ’ స్వామి వివేకానంద విరచితమైన స్వీయరచన. ఎంవి రమణారెడ్డి మార్టిన్ లూథర్ కింగ్ జీవితచరిత్రను తెలుగులో రాశారు. ఇది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ.

భీంరావ్ అంబేడ్కర్ స్వదస్తూరితో రాసిన ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ వీసా’ను తెలుగులో ‘అంబేడ్కర్ ఆత్మకథ’గా ప్రచురించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాసిన ‘ద ఇన్ సైడర్’ను కల్లూరి భాస్కరం అనువదించగా ‘లోపలి మనిషి’ టైటిల్ తో ఎమెస్కో బుక్క్ వారు ప్రచురించారు. వినయ్ సీతాపతి రచించిన ‘హాఫ్ లయన్’కు వల్లీశ్వర్ తెలుగు అనువాదం ‘నరసింహుడు’ను కూడా ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు.  సచిన్ టెండూల్కర్ రాసిన స్వీయరచన ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ను ‘సచిన్ టెండూల్కర్ ఆత్మకథ’ పేరుతో తెలుగులో ప్రచురించారు. ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘నాఇష్టం’ పేరుతో ఆత్మకథ ప్రచురించారు. ‘టాప్ విజనరీస్’ అనే పుస్తకాన్ని బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్,మార్క్ జూకర్ బర్గ్, జాక్ మాల అత్మకథలతో జార్జి ఇలియాస్ రచించిన గ్రంథాన్ని‘ప్రపంచాన్ని మార్చివేసిన గొప్ప దార్శనికులు’ పేరుతో తెలుగులోకి అనువదించి ప్రచురించారు. రాజ్ మోహన్ గాంధీ రాసిన రాజాజీ జీవిత కథ (ఎమెస్కో), ‘ఓటమిని అంగీకరించను‘ అనే పేరుతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆత్మకథ (ప్రిజమ్), ‘వికాసభారతావని దిశగా’ అనే పేరుతో అంబేడ్కర్ దే మరో ఆత్మకథ (అలకనంద), మధుదండావతే రాసిన ‘జీవన స్మృతులు’ (అలకనంద) కూడా అందుబాటులో ఉన్నాయి.

‘దివ్యౌషధ అన్వేషణశీలి’ పేరుతో ఎల్లాప్రగడ సుబ్బారావు జీవిత చరిత్రను అలకనంద్ వారు ప్రచురించారు. ‘విధి నా సారథి’ అని ప్రఖ్యాత సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన ఆత్మకథనూ, ఆయనే రాసిన వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు అనే అమరావతి ప్రభువు జీవిత చరిత్రనూ ఎమెస్కోబుక్స్ ప్రచురించింది. అదే సంస్థ వాణిజ్య ప్రచార కౌశలంలో ఆరితేరిన ఎజీకె అనే ఏజీ కృష్ణమూర్తి స్వీయరచన ‘ఇదండీ నా కథ’ను కూడా ప్రచురించింది. తొలి ఐపీఎస్ మహిళా అధికారి కిరణ్ బేడీ రాసిన ‘సాహసమే నా ఊపిరి’ అనే పుస్తకం తెలుగులో ఉంది.  ‘అక్షరానికి ఆవల’ అని ప్రసిద్ధ ఇంగ్లీషు జర్నలిస్టు కులదీప్ నయ్యర్ తెలుగు ఆత్మకథని ఎమెస్కో బుక్స్ ప్రచురించింది. అదే సంస్థ మణిశంకర్ అయ్యర్ రాసిన రాజీవ్ గాందీ జీవితచరిత్రను ‘రాజీవ్’ అనే టైటిల్ తో ప్రచురించింది. ‘డియర్ ప్రొఫెసర్ ఐన్ స్టీన్’ అనే శీర్షికతో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ జీవితచరిత్ర ప్రచురించారు. ఫ్రెడ్రిక్ నీషే రచించిన ‘వివేక విస్ఫోటనం’ అలకనంద ప్రచురణ మార్కెట్ లో ఉంది.

ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పుస్తకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ డాక్టర్ బాస్కరరావు ముదునూరు గ్రంథాలయంకోసం సేకరించిన పుస్తకాలలో ఉన్నాయి. తక్కినవాటిని కూడా సేకరించే పనిలో ఆయన ఉన్నారు. ప్రస్తుతానికి అన్నీ తెలుగు పుస్తకాలే పెట్టారు. కొంతకాలానికి ఇంగ్లీషు పుస్తకాలను కూడా చేర్చుతామని అన్నారు.  అన్నిటి కంటే ముఖ్యం కొత్త గ్రంధాలయానికి పిల్లలు రావడం, పుస్తకాలు చదవడం. ఈ దిశగా విద్యార్థులనూ, యువతీయువకులనూ, గ్రామస్థులనూ ప్రోత్సహించేందుకు డాక్టర్ భాస్కరరావు, ఆయన భార్య  స్వగ్రామంలోనే ఉంటున్నారు. పిల్లలు వచ్చి పుస్తకాలు చదువుతున్నారు. గ్రంథాలయానికి వస్తున్న పిల్లలతో డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతున్నారు. ఇది స్వగ్రామానికి డాక్టర్ భాస్కరరావు కుటుంబం చేస్తున్న సేవ. ఆరు దశాబ్దాలుగా దిల్లీలో నివసిస్తున్నవారు పనికట్టుకొని ముదునూరులో నివాసం ఉంటూ పిల్లలకూ, పెద్దలకూ పుస్తకపఠనం అలవాటు చేసేందుకు పూనికవహించడం విశేషం. సమాజం సహకారంతో జీవితంలో విజయాలు సాధించినవారిలో సమాజానికి తిరిగి ఎంతోకొంత చెల్లించాలని అనుకునేవారికి నాగులపల్లి సీతారామయ్య సంతానం ఆదర్శం.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles