Friday, March 29, 2024

ఇవి కేవలం భారత దేశంలోనే జరుగుతాయి!

నువ్వు చెప్పే విషయం నేను ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను చచ్చేదాకా నిన్ను నువ్వు వ్యక్తీకరించుకునే హక్కును మాత్రం సమర్థిస్తూనే ఉంటాను.

వోల్టేర్

(ఫ్రెంచి రచయిత, చరిత్రకారుడు, తత్త్వవేత్త)

రాలే ఆకులో, రాలే చినుకులో, మండే నిప్పులో, వీచే గాలిలో ప్రతి విషయంలో దాక్కుని ఉన్న అంతస్సూత్రాన్ని అర్థం చేసుకోవడమే సైన్సు. ప్రాయోగిక పరిజ్ఞానంత, నిరూపణలతో నిలబడేదే సైన్సు.  తనను తాను పునరుద్ధరించుకునేదే సైన్సు. అది పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదు. నిత్య జీవితంలో ప్రధాన భాగం కావాలి. మనమిప్పుడు ప్రతి అంశాన్నీ వైజ్ఞానిక దృష్టి కోణంతో అవలోకించాల్సి ఉంది. అప్పుడే సహేతుకమైంది ఏదో, అహేతుకమైంది ఏదో గుర్తించగలుగుతాం. దాని వల్ల వేటికి ప్రాధాన్యమివ్వాలో వేటికి ఇవ్వగూడదో అర్థమవుతుంది.

Also read: భిన్నత్వంలో ఏకత్వం: మా‘నవ’వాదం

గవర్నర్ కనువిందుకోసం నీటి వృధా

కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ప్రఖ్యాత జోగ్ జలపాతం చూద్దామని వెళ్ళారు. ఆయన వెళ్ళిన సమయానికి అందులో నీరు లేదు. గవర్నర్ కు నేత్రపర్వం కలిగించడానికి లింగనమఖి రిజర్వాయర్ నుండి 500 క్యూసెక్కుల నీటిని నాలుగు గంటల పాటు జోగ్ జలపాతానికి మరలించారు. అక్కడ కొంత సేపు ఆనందించిన గవర్నర్ తన దారిన తాను వెళ్ళిపోయారు. అసలు విషయమేమంటే అధికారులు గవర్నర్ మెప్పుకోసం విడుదల చేసిన నీటితో రెండు వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది.  అసలు ఆ లింగమఖి రిజర్వాయరు నిర్మించిందే జలవిద్యుత్తు కోసం. అధికారంలో ఉన్నవారి మెప్పుకోసం ఈ దేశంలో ఎంత దుర్వినియోగం జరిగుతుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఇది భారత దేశంలోని ఒక రాష్ట్ర గవర్నర్ విషయం.  మరి అలాంటి ఎంతోమంది గవర్నర్ లపైన ఉన్న ప్రధాని స్థాయి ఎంత ఉన్నతమైనదో మనకు తెలుసుకదా?

Also read: మనువాదుల ఇటీవలి పరిశోధనలు

ఆస్ట్రేలియా ప్రధాని వినమ్రత, ప్రజాస్వామ్య స్ఫూర్తి

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కు సంబంధించి ఒక సంఘటన చూద్దాం. ఎలక్షన్ సమయంలో ఆయన ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.  అంతే. ఎదురింట్లోంచి ఆ ఇంటి యజమాని బయటికొచ్చాడు. ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మీరేం చేస్తున్నారో తెలుస్తోందా? నా ఇంటి ముందు లాన్ పాడుచేస్తున్నారు. దయజేసి ఖాళీ చేసి వెళ్ళిపోతే సంతోషం’’ అని గొంతెత్తి బిగ్గరగా చెప్పాడు. అంతే – ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మోరిసన్ వినిపించుకున్నాడు. వెంటనే తన ఉపన్యాస కార్యక్రమం ఆపేసి నిముషాల్లో వెళ్ళిపోయాడు. ఏదో పక్కింటివాడి మీద కోపం వెళ్ళగక్కినట్టు ఆ ఇంటి యజమాని కోప్పడడం – దేశ ప్రధాని కిమ్మనకుండా వెళ్ళిపోవడం. ఎంత ప్రజాస్వామ్యం? ఎంత నాగరికత? పౌరులకు ఎన్ని హక్కులూ? ఇలాంటి సంఘటన మన దేశంలో సాధ్యమా? అలాంటి మాట ఇక్కడ, ఈ దేశంలో కనీసం వార్డు మెంబరుకు కూడా చెప్పలేం. చెప్పినా – అతనేమైనా వింటాడా? తన వెంట ఉన్నవారిని ఉసిగొల్పి ఆ ఇంటి యజమానిని తన్నించి, నోరు మూయిస్తాడు. నాగరిక-అనాగరిక దేశాల మధ్య వ్యత్యాసం అలా ఉంటుంది. మానవీయ విలువల్ని నిలుపుకోవడమంటే ఏమిటో మనం ఇంకా నేర్చుకోవాల్సే ఉంది.

Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

శిలావిగ్రహం నుంచి కాంతిరేఖ ఉద్భవించిందట!

ఇక్కడ భారత ప్రధాని, ఆయన అనుచరులు ఏ స్థాయిలో ఉన్నారో చూద్దాం. ఈ పోలిక ఎందుకంటే ఎవరు సహేతుకంగా ఉన్నారు. ఎవరు అహేతుకంగా మాట్లాడుతున్నారో బేరీజు వేసుకోవడానికి మాత్రమే. ఇందులో ఎవరినీ నొప్పించాలనిగానీ, ఎవరి మనోభావాలో దెబ్బతీయాలని గానీ…కాదు! దేశ ప్రజల ఆకలి, నిరుద్యోగం, ప్రాజెక్టులు, కరోనా నివారణ, రైతులకు కనీస మద్దతు ధరలాంటి అప్రధానమైన విషయాల్ని పక్కన పెట్టి – అతి ప్రధానమైన విగ్రహాల నిర్మాణం చేపట్టిన భారత ప్రధాని కేదార్ నాథ్ లో శంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠాపన చేసి 136 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చారు. ఆ విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం దాని ముందు కూర్చొని …ఆయన ‘ధ్యానం’ చేశారు. అప్పుడు శంకరాచార్య విగ్రహం నుండి ఒక కాంతిరేఖ ఉద్భవించినట్టు తనకు అనిపించిందనీ – భవ్యభారతదేశాన్ని సాక్షాత్కరింపజేసినట్టు అనిపించిందనీ ప్రధాని మోదీ పత్రికలవారికి తెలిపారు. ఒక నిర్జీవపు రాతి విగ్రహం – కాంతి రేఖలు ప్రసరించడం ఎప్పుడు ఎలా సాధ్యమౌతుందోనన్నది వారి అనుచరులెవరైనా పరిశోధిస్తే నొబెల్ ప్రకటిద్దామని స్వీడన్ స్టాక్ హోమ్ లో ప్రైయిజ్ కమిటీ ఆతురతతో ఉన్నట్లుంది. ఇలా భ్రమలూ, భ్రాంతుల్లో బతికే వారినా ఈ దేశ ప్రజలు దేశనాయకులుగా ఎన్నుకున్నారూ? దేశ ప్రజల అజ్ఞానానికి ఎంతో బాధ కలుగుతుంది. అజ్ఞానులు ఎన్నుకునే నాయకులు అజ్ఞానంలో ఉండక, జ్ఞాన సంపన్నులెలా అవుతారూ? అయోధ్యలో రామాలయం కాదు, ఇప్పటికైనా రామాయణం ఆధారంగా పుష్పక విమానం తయారు చేయించకపోతే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలి. దీనిపై మోదీ,షాలు స్పందించాలి – అని ప్రతిపక్షంవారు డిమాండ్ చేస్తున్నారు. ‘‘పరివార్ పరివార్ – అని తెగ మాట్లాడతున్నారు కదా? ఏదీ మీ పరివారం? ఏదీ మీ కుటుంబం?’’- అని కొందరు మోదీనీ, అదిత్యనాథ్ నీ ప్రశ్నించారు. దానికి ఆదిత్యనాథ్ ట్విట్టర్ లో జవాబిచ్చారు. ‘‘నా రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజలు నా పరివారమే’’ అని అన్నాడు. తన హృదయ వైశాల్యం ఎంతో ప్రకటించాడు. అయితే, అది కొద్ది నిమిషాలు కూడా నిలువలేదు. లక్షలమంది ప్రశ్నలు గుప్పించారు. ‘‘మరి ముస్లింలను ఏం చేస్తావు నాయనా? వాళ్ళు ‘‘అబ్బా జాన్’’ అంటే నీకు చిర్రెత్తుకొస్తుంది. దళిత అమ్మాయి అయితే అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా కాల్చేయిస్తావు. ఇక యువతీయువకులెవరైనా తిండిలేదని అన్నా, ఉద్యోగం ఇప్పించమని అన్నా లాఠీలతో వారిని నుగ్గు నుగ్గు చేయిస్తావు…ఇవి కాక ఇంకా ఎక్కడుంది నీ పరివారం?’’ అని!

Also read: మనుస్మృతిలో మాంసభక్షణ గూర్చి ఏముంది?

సంస్కృతం మాట్లాడితే మధుమేహం రాదా?

సంస్కృతం మాట్లాడితే మధుమేహం రాదు – అని అన్నాడు బీజేపీ ఎంపి గణేష్ సింగ్. అమెరికాకు చెందిన ఓ సంస్థ పరిశోధనల ప్రకారం రోజూ సంస్కృతం మాట్లాడటం వల్ల మానవ నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, కొవ్వు నియంత్రణలో ఉంటుందనీ,  మధుమేహం రాదనీ – ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 శాతం భాషలు సంస్కృతం ఆధారంగానే రూపొందాయని ఆయన ప్రకటించారు. ఇది ఆయన స్వీయ అనుభవమా, కాదా? అనేది చెప్పలేదు. ఈ ప్రకటనతో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి…! 1. ఆయన నాడీ వ్యవస్థ దెబ్బతిన్నదని 2. ఆయన శరీరంలో కొవ్వు నియంత్రణలో లేదని! ఇంతకూ అమెరికా పరిశోధనాసంస్థ దాకా ఎందుకూ?  తమరి వారణాసి పరిశోధనాశాలలో తయారైన విశ్వహిందూ ప్రోడక్ట్ – అని చెప్పుకుంటే గొడవే ఉండేది కాదు. మాక్సుముల్లర్ పండితునికి లేని పరిజ్ఞానం ఈ బీజేపీ ఎంపీకి ఉన్నందున ఆ పార్టీవారు బహుశా ఛాతీలు విరుచుకుంటున్నారేమో? అన్ని భాషలకు తల్లి సంస్కృతం కాదు నాయనా – అన్ని భాషల కలయిక సంస్కృతం అని చెప్పిన పండితులున్నారు. మరి ఈయన ఎప్పుడైనా విన్నాడో లేదో. ‘నేటి శాస్త్ర  సాంకేతికక పరిజ్ఞానానికి మూలం భగవద్గీత’- అని అన్నాడు  వరంగల్ నిటి అసోసియేట్ ప్రొఫెసర్ పి.ఎచ్. కృష్ణ. ఇతని కన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న పెద్దలే ఇంతకన్నా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలైతే  ఇలాంటివాళ్ళ డిగ్రీలు రద్దు చేయాలి. కానీ ప్రభుత్వాలే సన్నాసుల చేతుల్లో ఉంటే చర్య తీసుకునేది ఎవరూ? కావాలని మూర్ఖ సన్యాసులను ఎన్నుకుంటున్న సగటు మనుషులు తమ మూర్ఖత్వంలోంచి బయటపడి వివేకవంతులయితే కదా – వివేకవంతులను ఎన్నుకునేది? పాఠాలు  చెప్పే అధ్యాపకుల ఆలోచనలే అంత నాసిరకంగా ఉంటే, వారి క్లాసులో ఉండే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? ఇక దేశ భవిష్యత్తు ఏమిటీ?

Also read: మనల్ని మనం ఖాళీ కప్పులుగా చేసుకుంటే?

ప్రైవేటు ఆస్పత్రులకే పట్టం

ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు లేరు. వేరు వేరు కారణాల వల్ల డాక్టర్లంతా ఉద్యోగాల వదిలేసి వెళ్ళిపోయారు. కొత్తవారెవరూ వచ్చి చేరడం లేదు. ఎందుకంటే అక్కడి ఆసుపత్రులలో పనిచేసే పరిస్థితులు లేవు. వసతుల్లేవు. పరికరాలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి ప్రాణం మీదికి తెచ్చుకోవడమెందుకని మామూలు ప్రజానీకం కూడా అటువైపు వెళ్ళడం లేదు. అంతగా అవసరమైతే భూమి జాగా, నగానట్రా అమ్ముకుని, ప్రయివేటు హాస్పటల్స్ లో చేరుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు కూడా కాల్సింది  అదే. కార్పొరేట్లు బలపడితే, ఫలితంగా తాము బలపడినట్టే కదా? అదీ లింకు! ఎప్పటికప్పుడు ఏదో ఓ దేవుడిపై, ఏదో ఓ దేవాలయంపై చర్చ పెట్టుకుని మనోబలాన్ని, మనశ్శాంతిని పొందుతున్నారు. బీజీపీని విమర్శించే ప్రాంతీయ పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్నచోట బీజేపీనే అనుసరిస్తున్నాయి. అక్కడ వారు రామమందిరం అంటే ఇక్కడ వీరు మరో గుడిని పునరుద్ధరిస్తారు. అక్కడవాళ్ళు ఒక సన్యాసి కాళ్ళమీద పడితే ఒక్కడ వీరు మరో సన్యాసి కాళ్ళమీద పడతారు. ఎదురు నిలిచి గట్టిగా నిలదీయాల్సిన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మూర్ఖపు ప్రజలతో మమేకం అవుతున్నాయి. పూజలు నిర్వహిస్తూ బోనాలెత్తుకుని ఊరేగుతున్నారు. ఆచరించేదంతా ఒక్కటే అయినప్పుడు, హిందూ వేరు – హిందూత్వ వేరని ఉపన్యాలివ్వడం  ఎందుకూ? వేల యేళ్ళనాటి అనాగరిక సంప్రదాయాల్ని పునరుద్ధరించుకుంటూ తాము ప్రగతి పథాన ఉన్నామంటే ఎట్లా? దేశం వెలిగిపోతోందని చెపుతూ మూర్ఖులు మూర్ఖుల్ని కలుపుకుపోవడమేనా –సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ – అంటే? కల్తీ తేనెను అధిక ధరకు అమ్మే రామ్ దేవ్ దేశభక్తుడు. కష్టపడి తాము పండించిన పంటకు మద్దతు కనీస ధర అడిగితే – రైతు దేశద్రోహి-ఖలిస్తానీ-ఉగ్రవాది?  మొత్తం ఎయిర్ లైన్స్ అమ్మి, ఒకే ఒక్క విమనాం కొన్న తొలి ప్రధాని మోదీ అని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాబోయే రోజుల్లో మన పిల్లలకు లెక్కల పరిక్షలో ప్రశ్నలు ఇలా వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఉదాహరణకు – ‘‘మూడు ఎయిర్ ఫోర్ట్ లను అమ్మి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యుల్ని కొన్నచో – ఇరవై రెండు మందిని కొనాలంటే ఎన్ని ఎయిర్ పోర్టులు అమ్మాలి?’’- అని…

Also read: ఫేక్ వర్సెస్ రియల్

వాస్తవాల్ని పట్టించుకోరు, సినిమాలకు స్పందిస్తారు!

వాస్తవాల్ని వాస్తవాలుగా స్వీకరించే లక్షణం మన ప్రజలకు లేదు. వాస్తవాల్ని కూడా సినిమాగా తీసి చూపిస్తే తప్ప, మన జనం స్పందించరు, చలించరు. ‘జైభీం’ సినిమాకు గొప్పగా స్పందించిన ప్రేక్షకులు – సురేంద్రగాడ్లింగ్ , సుధాభరద్వాజ్, అరుణ్ ఫరేరా…మొదలైనవారు ఆదివాసీల విడుదల కోసం తమ జీవితాల్ని ఫణంగా పెట్టిన విషయం తెలుసుకోరు. అదే ఆదివాసీల గూర్చి మాట్లాడినందుకు జైల్లోనే చనిపోవాల్సి వచ్చిన స్టాన్ స్వామి గురించి మాట్లాడుకోరు. ఇంకా జైల్లోనే మగ్గుతున్న ప్రొ. సాయిబాబా గురించి గానీ, మన కళ్ళ ముందే తిరిగిన వరవరరావుకు జరిగిన – జరుగుతున్న అన్యాయం గురించి కానీ అదేమిటో…ఎవరూ మాట్లాడరు. అసలు విషయమేమిటో కనీసం తెలుసుకుందామన్న ఉత్సుకత కూడా ఉండదు. వీరి జీవితాల్లోని సంఘటనలు ఎవరికైనా తెరకెక్కిస్తే మాత్రం, మన ప్రేక్షక మహాశయులకు ఎక్కడలేని ఆవేశం పొంగుకొస్తుంది. ప్రేక్షకులు ‘ప్రేక్షకుల్లా’ ఉండిపోకుండా తాము బాధ్యతగల పౌరులమన్నది గుర్తుంచుకోవాలి! కేవలం మనదేశంలోనే ఇలా ఎందుకు జరుగుతోందన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి!  మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉండాలి!!

Also read: దేశాన్ని సానిటైజ్ చేద్దాం!

(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)  

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles