Sunday, December 8, 2024

ధిల్లీ అల్లర్లపైన పోలీసుల వింత వైఖరి

  • బాధితులే నిందితులా?

కె. రామచంద్రమూర్తి

ఈశాన్య ధిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు బాధ్యులుగా మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శినీ, మరికొందరు మేధావులనూ ధిల్లీ పోలీసులు పేర్కొనడం వింతగా ఉంది. అల్లర్లను ప్రోత్సహిస్తూ, విద్వేష ప్రసంగాలు చేసినవారిపైన కేసులు పెట్టకుండా అల్లర్లను ఖండించినవారిపైనా, రాజకీయ ప్రధానస్రవంతిలో ఉన్నవారిపైనా, పాలకపక్షాన్ని వ్యతిరేకించే మేధావులపైనా కేసులు పెట్టడం విచిత్రంగా ఉంది. ధిల్లీ పోలీసులు దేశీయాంగమంత్రిత్వ శాఖ అదుపులో ఉన్నది. ప్రధానమంత్రినీ, ప్రభుత్వంలోని ఇతర పెద్దలనీ విమర్శించేవారిపైన కేసులు బనాయించడం పాలకపక్షం పనుపునే జరుగుతున్నదని భావించవలసి వస్తుంది. అసలు అల్లర్లు సృష్టించినవారిని పట్టుకోకుండా బాధితులనే నిందితులుగా పరిగణించి కేసులు బనాయించడం ధిల్లీ పోలీసులకే చెల్లింది.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు వామపక్ష భావాలు కలిగిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతిఘోష్ నూ, ధిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యుడు అపూర్వానంద్ నూ, స్వరాజ్య అభియాన్ నాయకుడు యోగేంద్రయాదవ్ నూ, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత రాహుల్ రాయ్ నీ నిరసనలను ప్రోత్సహించిన నిందితులుగా ధిల్లీ పోలీసులు పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగాన్నీ, సీబీఐనీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ)నీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అవసరాలకు తగినట్టు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలకు ఊతం ఇచ్చే విధంగా ధిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్నారు.

వరవరరావు, సాయిబాబా నిర్బంధం ఇటువంటిదే

కోరెగాం కేసులో ఏ మాత్రం సంబంధం లేదని ప్రజలు భావిస్తున్న విప్లవకవి వరవరరావునీ, ప్రొఫెసర్ సాయిబాబానూ, ఇతర హక్కుల నాయకులనూ నిర్బంధంలో కొన్ని మాసాలుగా ఉంచుతున్నట్టే, ధిల్లీ అల్లర్లతో సంబంధం ఉన్నవారిని పట్టించుకోకుండా సంబంధం లేనివారిపైనా, లౌకికవాదులపైనా పనిగట్టుకొని నిందితులుగా ముద్ర వేయడం శోచనీయం. స్వంత్రంగా ఆలోచించేవారినీ, ప్రభుత్వాన్ని విమర్శించేవారినీ, అధికారపార్టీ సిద్ధాంతాలతో విభేదించేవారినీ పోలీసులు, ఇతర ప్రభత్వ సంస్థలకు చెందినవారూ ఉపేక్షించబోరని ఈ విధంగా స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు.

హర్షమందిర్ పిటిషన్

ఈశాన్య ధిల్లీలో అల్లర్లకు కారకులైనవారిని పట్టుకొని శిక్షించాలని కోరుతూ మానవ హక్కుల నేత, మాజీ ఐఏఎస్ అధికారి హర్షమందిర్ ధిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ ను పురస్కరించుకొని ధిల్లీ పోలీసు విభాగం, దేశీయాంగశాఖ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. అల్లర్లు అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగినవి కావనీ, ఒక కుట్ర ప్రకారం ముందుగా వేసిన ప్రణాళికలో భాగంగా జరిగాయనీ, బుద్ధిపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చాలాజాగ్రత్తగా ఆలోచించి తయారు చేసిన పథకం ప్రకారం ధిల్లీవాసులలో అభద్రతాభావం కలిగించేందుకు అల్లర్లు జరిపించారనీ పోలీసు విభాగం, హోంశాఖ ఆరోపించాయి. దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం నాడు అల్లర్లు సృష్టించిన దుండగుల ఉద్దేశమనీ, ముస్లింలలో ఇప్పటికే పేరుకొని పోయిన ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని వేర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం జరిగిందనీ అఫిడవిట్ వివరించింది.

నిరసనలు ఎందుకోసం జరిగాయి?

వాస్తవానికి ఈశాన్య ధిల్లీలో నిరసనప్రదర్శన మూడు అంశాలపైన జరిగింది. 1. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (పౌరసత్వ సవరణ చట్టం). 2. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (పౌరుల జాతీయ రిజిస్టరు). 3. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (జాతీయ జనభా రిజిస్టర్). ఈ మూడు అంశాలపైన నిరసనకారులు చెప్పిన అభ్యంతరాలు ఏమిటో పట్టించుకోకుండా, బాధితులనే నిందితులుగా పరిగణిస్తూ పోలీసులు వాదిస్తున్నారు. భారత ముస్లింలలో అభద్రతాభావం సృష్టించడమే లక్ష్యంగా అల్లర్లు జరిగాయని ధిల్లీ పోలీసులు నిర్ధారించారు. అల్లర్లను జాతికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా పోలీసులు పరిగణిస్తున్నారు. పౌరసత్వ చట్టంలో చేస్తున్నసాధారణమైన సవరణలను తప్పుగా అన్వయించి, ముస్లిలంకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టాన్ని సవరించుతున్నదని అర్థం వచ్చే విధంగా నిసరనకారులు ప్రచారం చేశారని పోలీసుల వాదన. నాటి ఉద్యమానికి కేంద్ర బిందువంటూ లేదనీ, నాయకులంటూ ఎవ్వరూ లేరనీ, ఎక్కడివారు అక్కడ తమకు తోచిన విధంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారనీ అంగీకరించేందుకు పోలీసు విభాగం సిద్ధంగా లేదు. అహ్మదాబాద్ సందర్శన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీని బదనాం చేయడానికీ, ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేయడానికీ దుండగులు అల్లర్లు సృష్టించారని పోలీసుల విశ్వాసం.నరేంద్రమోదీ సర్కార్ ను కూలదోయడమే అల్లర్లు చేసినవారి లక్ష్యమని వారి ఆరోపణ.

ఇటువంటి ఆరోపణలనే బీజేపీ నాయకులూ పదేపదే చేస్తున్నారు. బీజేపీ అనుకూల మీడియా సంస్థలు కూడా ఈ ఆరోపణలకు విశేష ప్రచారం కల్పిస్తున్నాయి. ధిల్లీ మైనారిటీ కమిషన్ నివేదిక మాత్రం  ఇందుకు భిన్నమైన సమాచారం ఇచ్చింది. సిటిజన్స్ అమెండ్ మెంట్ యాక్ట్-నేషనల్ రిజిస్టర్ పట్ల వ్యతిరేకతతో జామియామిలియాలో నిరసనలు వ్యక్తమైనప్పటి నుంచీ గొడవలు ఆరంభమైనాయనీ, ఒక మతానికి చెందినవారికి (ముస్లింలకు) గుణపాఠం చెప్పే ఉద్దేశంతో అల్లర్లు జరిగాయనీ ధిల్లీ మైనారిటీ కమిషన్ అభిప్రాయపడింది. సిటిజన్స్ అమెండ్ మెంట్ యాక్ట్ విచక్షణతాయుతమైనదనీ, ముస్లింలను రెండవశ్రేణి పౌరులుగా చిత్రించే విధంగా ఈ చట్టం ఉన్నదనీ కమిషన్ ఆరోపించింది. నిరసనలలో చాలా భాగం ప్రశాంతంగా జరిగాయని కమిషన్ స్పష్టం చేసింది.

మైనారిటీ కమిషన్ నివేదిక

ధిల్లీ పోలీసుల పాత్రను కూడా మైనారిటీ కమిషన్ తప్పుపట్టింది. సీసీ కెమెరాలను ధ్వంసం చేసినవారికీ, ఆస్తులకు నష్టం కలిగించినవారికీ, అల్లర్లు చేసినవారికీ ధిల్లీ పోలీసులు అండగా నిలిచారని కూడా కమిషన్ ఆరోపించింది. నిజానికి అల్లర్లలో చనిపోయినవారిలో 77 శాతం ముస్లింలేనని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. ధ్వంసమైన ఆస్తులలో 90 శాతం ముస్లింలవే. ముస్లింల ప్రార్థనాలయాలనే ధ్వంసం చేశారు.  సిటిజన్ షిప్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారే కుట్రపన్ని అల్లర్లు సృష్టించారని ఆరోపిస్తున్న పోలీసులు ఈ అంశాల గురించి మాట్లాడటం లేదు. ‘ఆజాదీ’ అన్నది నిరసన ప్రదర్శనలలో ప్రధాన నినాదంగా మారింది. అందుకు తమను కొట్టిన హిందువులూ, పోలీసులు కూడా ‘ఇదిగో నువ్వు అడుగుతున్న ఆజాదీ’ అంటూ ఎద్దేవా చేస్తూ దెబ్బలు కొట్టారని దెబ్బలు తిన్న ముస్లింలు వాగ్మూలం ఇచ్చారు. గాంధీ పటాన్నీ ఒక చేత్తో, అంబేడ్కర్ పటాన్ని మరో చేత్తో పట్టుకొని నిరసన ప్రదర్శనలు చేసిన యువతీయువకులను అనంతరం పోలీసులు ఠాణాలకు పిలిపించి, బెయిలు లేని సెక్షన్ల కింద జైలులో కుక్కుతున్నారు. న్యాయమూర్తులు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

రాజ్యాంగం ఇచ్చిన హామీ

రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలనే కోరుతూ, దానినే ఆజాదీ అంటూ నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. అసమ్మతిని సహించే స్థితిలో ప్రభుత్వాలు లేవనీ, అసమ్మతిని జాతిద్రోహంగా, ప్రభుత్వాలను కూల్చడానికి చేసే కుట్రగా అభివర్ణిస్తూ అసమ్మతివాదులను అరెస్టులు చేసి, జైళ్ళలో పెట్టడం వల్ల నిరసన తగ్గిపోతుందనీ, ప్రశాంతత వెల్లివిరుస్తుందనీ పాలకులు భావిస్తే అంతకంటే తప్పు మరొకటి లేదు. పైకి ప్రశాంతంగా కనిపించినప్పటికీ గుండెలలో దావానలం చెలరేగడం సమాజానికి మంచిది కాదు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏ చర్యనైనా ప్రజలు వ్యతిరేకిస్తే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. ఒకటికి రెండు సార్లు వారితో చర్చలు జరపాలి. ప్రజలు చెబుతున్న అభ్యంతరాలు సమంజసమైనవని భావిస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ మేరకు ప్రభుత్వమే తన వైఖరిని సవరించుకోవాలి. పాలకులు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే అన్న విషయం మరచిపోరాడు. ప్రజలకు ఇష్టం లేనిదీ, కష్టం కలిగించేదీ సత్ఫలితాలు ఇవ్వదని గుర్తించాలి. ధిల్లీ పోలీసులు తమ ప్రవర్తనను సమర్థించుకుంటూ, అల్లర్లు చేసినవారి జోలికి వెళ్ళకుండా బాధితులనూ, వారి సానుభూతిపరులనూ నిందితులుగా పరిగణించి వారిపైన చర్య తీసుకోవాలని ప్రయత్నించడం రాజ్యాంగసమ్మతం కాదు. అన్యాయం. అక్రమం. అధర్మం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles