Wednesday, September 18, 2024

సంపాతి వృత్తాంతం

రామాయణమ్ 120

ఈ శిఖరముపై పడిపోయిన ఆరు దినములకు నాకు స్పృహ వచ్చినది. వ్యాకులత్వము చెంది వివశుడనై దిక్కులుచూసుకుంటూ దేనినీ గుర్తించే పరిస్థితి లేక అలాగే ఉండిపోయినాను. ప్రక్కనే కల సముద్రఘోష, నదులు, వనములు, చుట్టుపక్కన కల ప్రదేశములు చూసిన పిమ్మట నాకు నెమ్మదిగా ఒకటొకటి జ్ఞప్తికి రాదోడంగినవి.  ఆ ప్రదేశమేదో గురుతు పట్టకలిగితిని. ఆ ప్రాంతములో నిశాకరుడు అను గొప్ప మహర్షి తపమాచరించుచుండెడివాడు.

Also read: వానరులకు సీతమ్మ జాడ చెప్పిన సంపాతి

నేనూ, జటాయువూ అనేక పర్యాయములు ఆయన దర్శనము కొరకు వచ్చుచుండెడి వారము. నేను అతి కష్టము మీద ప్రాకుకుంటూ ఆయన ఆశ్రమము చేరగలిగితిని. ఒక చెట్టు మొదట్లో చేరగిలబడి ఆయన దర్శనము కొరకు నిరీక్షించుచుంటిని. శరీరము నందు ప్రాణములు మాత్రమే మిగిలి సర్వ అవయవములు కాలిపోయి గుర్తుపట్టలేనంత వికారముగా మారిన దేహముతో నున్న నన్ను ఆయన అతికష్టము మీద గుర్తు పట్టెను.

‘‘సంపాతీ ఏమైనది నీకు? ఏదైనా రోగము వచ్చినదా? లేక ఎవరైనా దండించినారా?  నాకు అన్ని విషయములు వివరముగా చెప్పుము’’ అని ప్రేమతో అడిగిన మహర్షికి జరిగిన విషయము తెలిపినాను.

Also read: అంగదుడికి హనుమ మందలింపు

‘‘స్వామీ,  నేనూ, మా జటాయువు  గర్వముచేత ఒళ్ళు తెలియక మా బలమును తెలుసుకోనవలెనను కోరికతో ఒకరితో ఒకరము పోటీపడి ఆకాశము మీదికి ఎగిరితిమి. అస్తాద్రివరకు సూర్యుని అనుసరించి వెళ్ళవలెనని తలచి కైలాస శిఖరమున యున్న మునుల సమక్షములో పందెము వేసుకొని ఎగిరితిమి.

క్రమక్రమముగా సూర్యుని సమీపమునకు వచ్చితిమి. మా ఇరువురికీ తీవ్రమైన చెమట, దుఃఖము, భయము కలిగినాయి. మాకు దిక్కులేవి తెలియలేదు. ప్రపంచమంతా ప్రళయకాల మందు అగ్నిచే కాల్చబడుచున్నట్లు గా అనిపించెను. మా మనస్సు పనిచేయలేదు. అంతలో హఠాత్తుగా జటాయువు భూమిపైకి పడిపోవుచుండెను. అది చూసి నేను క్రిందకు దిగుతూ నా రెక్కలతో జటాయువును కప్పివేసినాను. వాడు క్షేమముగా ఎక్కడో పడిపోయినాడు. నేను మాత్రము రెక్కలుకాలి ఇచట పడినాను. నా ఊహ ప్రకారము వాడు జనస్థానము వద్ద భూ పతనమై యుండి యుండవచ్చును.

Also read: స్వయంప్రభ సందర్శనము

రాజ్యము, సోదరుడు, రెక్కలు, పరాక్రమము, అన్నీ కోల్పోయి నేను ఈ శరీరముతో మిగిలియుంటిని’’ అని ఈవిధముగా సంపాతి తన కధను మహర్షికి వినిపించెను.

………………………

‘‘ఆ విధముగా పలికి ఏడుస్తున్న నన్ను ఆ ముని ఓదార్చి, సంపాతీ నీకు నీ రెక్కలు బలము, దృష్టి అన్నీ మునుపటివలెనే రాగలవు. కానీ నీవలన ఒక మహాత్కార్యము జరుగవలసిఉన్నది అప్పటి వరకు ఓపిక పట్టవలెను. భవిష్యత్తులో రాముని భార్యను రావణుడు అపహరించుకొని తీసుకు వెళ్లి లంకలో దాచి ఉంచగలడు. ఆవిడను ప్రలోభ పెట్టుచూ రావణుడు వివిధ భక్ష్య భోజ్యములను ఇవ్వజూపినప్పటికీ ఆవిడ భోజనము చేయదు.

Also read: హనుమపైనే అన్ని ఆశలు

‘‘దేవేంద్రుడు  దేవతలకు కూడా దుర్లభమైన  పరమాన్నమును  ఆవిడకు ఇవ్వగలడు. ఆవిడ జీవించి యున్న వార్తను నీవు ఆమెను వెదుకుతూ వచ్చిన వానరులకు  ఎరిగింప వలెను.

‘‘ఆ కారణము చేత నీవు ఎచ్చటికీ వెళ్ళరాదు. ఇచటనే ఈ కొండ మీదనే నిరీక్షిస్తూ కాలము గడుపుము. వారికి నీవు ఈ వార్త తెలిపిన పిదప మరల నీకు కొత్త రెక్కలు పుట్టుకొని రాగలవు’’ అని మహర్షి పలికినాడు.

ఇప్పటికి మహర్షి స్వర్గస్తులై మూడువందల సంవత్సరములు గడిచిపోయినవి.

సంపాతి తన కధను వానరులకు వినిపిస్తూ ఉండగానే ఆయనకు కొత్త రెక్కలు పుట్టుకు రాసాగినవి.

మొలిచిన రెక్కలు ఎర్రని ఈకలు చూసి సంపాతి పరమానంద భరితుడాయెను.

ఇదుగో మహర్షి వాక్యములు సత్యములాయెను. మీకు అనతికాలములో సీతా మాత దర్శనము కాగలదు. ఇది ముమ్మాటికీ సత్యము. నిరాశను వీడండి’’ అని పలుకుచూ తన రెక్కలను పరీక్షించుట కొరకై ఆకాశమునకు ఎగిరెను.

సంపాతి మాటలకు వానరులలో ఆశలు కొత్త చిగురులు తొడిగినవి సంతోషముతో ఎగురుకుంటూ దక్షిణ సముద్ర తీరమునకు చేరినారు.

ఆ సముద్రమును చూడగానే వారిలో మరల దిగులు పుట్టినది. కల్లోలముగా ఉండి, ఉవ్వెత్తున లేస్తున్న తరంగాలతో భయంకరము గానున్న ఈ సముద్రమును దాటుటెట్లు?

Also read: వానర వీరులకు దిశానిర్దేశం చేసిన సుగ్రీవుడు, హనుమకు తన గుర్తుగా ఉంగరం ఇచ్చిన రాముడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles