Thursday, April 25, 2024

మకరజ్యోతి మనిషి మహత్మ్యం

శబరిమలను హిందువులు పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అది పెరియార్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పశ్చిమ కనుమల కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న 18 కొండల మధ్య దట్టమైన అడవుల్లో ఒక కొండమీద అయ్యప్ప గుడి ఉంది. సముద్ర మట్టానికి 4,133 అడుగుల ఎత్తులో – పతనంతిట్ట జిల్లాలో,  పెరునద్ గ్రామ పంచాయతి పరిధిలో ఉంది. ప్రతి యేటా ఈ దేవాలయాన్ని 45-50 మిలియన్ల (నాలుగున్నర, ఐదు కోట్ల)భక్తులు దర్శించుకుంటున్నారు. అయ్యప్పను సస్ట అనీ, ధర్మసస్ట అనీ కూడా పిలుచుకుంటారు. పన్నెండో శతాబ్దంలో పండలం రాజవంశీకుడు, యువరాజు మణికందన్ శబరిమలలో తపసు చేశాడనీ, ఆయన అయ్యప్ప అవతారమనీ భక్తులు భావిస్తారు. పండలం రాజవంశీకుల కాలం (1821) నాటికే ఈ గుడి అతి పురాతనమైందని చెపుతారు. ఇపుడున్న అయ్యప్ప విగ్రహం 1910లో ప్రతిష్టాపించారు.

Also read: ఫేక్ న్యూస్ గాళ్ళు లార్డ్ మెకాలేను కూడా వదలరా?

మకర విలక్కు

కేరళ శబరిమలలో ప్రతి సంవత్సరం మకర విలక్కు – అనే పండగ జరుగుతుంది. ఇందులో 1. తిరువాభరణం 2. మకరజ్యోతి అనే రెండు ముఖ్యమైన కార్యక్రమాలుంటాయి. తిరువాభరణం – అంటే అయప్ప స్వామి ఆభరణాలని ఊరేగించడం. రెండోది మకరజ్యోతి దర్శనం. వీటిని చూడడానికే భక్తులు అక్కడికి చేరుకుంటారు.

Makara Jyoti a man-made fire'- The New Indian Express
వేలాది మంది భక్తులు

రామయణ కావ్యంలో కథానాయకుడు శ్రీరాముడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఆదివాసి భక్తురాలై శబరిని ఆ ప్రాంతంలో కలుసుకున్నందువల్ల దానికి శబరిమల అనే పేరు వచ్చిందని స్థలపురాణం ఉంది. అక్కడ శబరి-పండ్లు మంచివా కాదా అని ఒక్కొక్కటి ర చి చూసి, మంచి పండ్లు ఏరి రామునికి సమర్పించుకుందని కూడా స్థలవిశేషాల్లో ఉంది. కొద్ది దూరంలో తపస్సు చేసుకుంటున్నది ఎవరని రాముడు శబరిని అడిగితే, అతను సస్ట అని చెపుతుంది. రాముడు సస్ట దగ్గరికి వెళతాడు. సస్ట లేచి నిలబడి రాముడికి స్వాగతం పలుకుతాడు. ఆ సస్ట ఎవరో కాదు. అయ్యప్పే అని తెలుస్తుంది. అక్కడ పూజింపబడుతున్న అయ్యప్పకు హరిహరపుత్ర అనే మరో పేరు ఉంది. అంటే ఈయన హరికి-హరుడికి కలిగిన సంతానం. మహావిష్ణు-శంకరుల సంతానమన్నమాట. మన  హిందూ దేవుళ్ళకున్న మహిమల్లో ఇదొకటి. ఇద్దరు మగవాళ్ళకు అయ్యకు-అప్పకు పుట్టడమేమిటని అమాయకంగా ఎవరూ అడగొద్దు.  కల్పించుకున్న దైవ మహిమలు ఎలాగైనా ఉంటాయి. అసంబద్ధమైన అంశాలనే మన భక్తులు భక్తిపారవశ్యంతో పూజిస్తుంటారు. హేతుబద్ధత కోసం అంగలార్చేవారికి అదొక సమస్య. కానీ – కళ్ళు మూసుకుని విశ్వసించేవారికి అది సమస్యే కాదు.

Also read: మాస్ హిస్టీరియాకు గురిచేస్తున్న తెలుగు ఛానళ్ళు!

మకర రాశి వెలుగు

Kottayam: Thousands witness Makarajyothi sighting
భక్తిపారవశ్యం

హిందువులు ఏర్పరచుకున్న రాశులలో మకరరాశి ఒకటి. మకరజ్యోతి అంటే మకరరాశి వెలుగు. అయ్యప్ప ‘మకరజ్యోతి’గా మారి ప్రతి సంవత్సరం 14 జనవరి నాడు భక్తులకు ఒక నక్షత్రంగా (వెలుగుగా)కనిపించి దీవిస్తాడని స్థలపురాణం (ఒక విశ్వాసం) ఉంది. ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తర దిశగా ఆరు నెలలపాటు ప్రయాణిస్తాడనీ, మకర సంక్రాంతి (14 జనవరి) రోజు ప్రారంభమైన ప్రయాణం కర్కసంక్రాంతి (14 జులై) రోజున ముగుస్తుందనీ చెపుతారు. సంక్రాంతి పంటలు ఇళ్ళకు రావడం – గ్రామాలన్నీ సంతోషంతో కలకలలాడడం జరుగుతుంది. మనిషి ప్రకృతితో అనుసంధానమైన పండగ ఇది – అని అనుకుంటే – చాలా గొప్పగా అనిపిస్తుంది. మళ్ళీ రాముడు, శబరి, అయ్యప్ప అంటే మాత్రం కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మకరజ్యోతి వేరు. మకర విలక్కు అనేది వేరు. మకర జ్యోతి భక్తుల విశ్వాసం. మకర విలక్కు అనేది కేవలం మనిషి వెలిగించే అఖండ దీపం. దాన్నే ఇప్పుడు భక్తులు ‘మకరజ్యోతి’గా పరిగణిస్తున్నారు.

Also read: పరలోకంలో జిఎస్ టి అప్లయ్ అవుతుందా?

గిరిజన హారతి

శబరిమలలో అయప్ప దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నాంబలం కొండమీద గతంలో మల ఆర్య – అనే గిరిజన జాతివారు పూజచేసి పెద్ద దీపం వెలిగించేవారు. దాన్నే ‘మకర విలక్కు’ అని అనేవారు. పొన్నాంబలం కొండ మీద కూడా ఒక చిన్న గుడి ఉంది. అక్కడి గిరిజనులు ఆ గుడిలోని దేవతామూర్తికి హారతి ఇచ్చేవారు. కర్పూరం, నెయ్యి వంటి వాటితో పెద్ద దీపం వెలిగించి, అక్కడున్న విగ్రహం చుట్టూ మూడుసార్లు తిప్పి హారతి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ కొండ మీద దేవాలం వైపు ఎవరినీ పోనివ్వడం లేదు. అది అటవీశాఖ వారి అధీనంలో ఉంది. అటవీశాఖ, పోలీసు శాఖ, శబరిమల అయ్యప్ప దేవాలయం సిబ్బంది కలసికట్టుగా, గుట్టుగా నిర్వహిస్తున్న కార్యక్రమమే – మకర విలక్కు. వీరు వెలిగించే అఖండ దీపమే మకరజ్యోతి. అంటే – కొండమీద నక్షత్రమనే ఒకప్పటి భ్రమే, ఇప్పుడు వాస్తవంగా మారింది! కేరళ ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవోసం (దేవాలయ)బోర్డు, అటవీశాఖల సహకారంతో ఆ కార్యక్రమం నిర్వమిస్తోందని కేరళ హైకోర్టు ధ్రువీకరించింది. వాస్తవాలన్నీ బహిర్గతమయ్యాయి గనక, ఇంకా ఈ విషయం మీద పరిశీలనలు అవసరం లేదని కూడా కోర్టు చెప్పింది.

Also read: విద్యావంతులు సరే, వివేకవంతులు ఎక్కడా?

ఒకప్పటి అమాయక గిరిజన సంప్రదాయాన్ని నేటి నాగరిక మూఢభక్తాగ్రేసరులు కొనసాగిస్తున్నారు. దానికి ప్రభుత్వ యంత్రాంగాలన్నీ తమ శాయశక్తులా సహకరిస్తున్నాయి. మూఢభక్తి, ఒక ఆచారం – చాదస్తం కొనగాడానికి ఎక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసకులే కారణం కాదు. రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కారణమేనని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. భద్రాద్రికి వెళ్ళే ముత్యాల తలంబ్రాలే కావొచ్చు. సమక్క సారక్క జాతరే కావొచ్చు. ఇంకా అలాంటి ఏ ఇతర సంప్రదాయాలైనా కావొచ్చు. అన్నిటికీ సూత్ర మొక్కటే! ఏ ప్రాంతంలోనైనా, సూత్రధారులు ఒకేరకంగా వ్యవహరిస్తారనేది మనం తెలుసుకోవాలి!!

మకరజ్యోతి వెలుగు వెనక…

Makarajyothi - Religion World

14 జనవరి, ఉదయం పొన్నాంబలం (యిడు)కొండకు ఒక బృందం బయలుదేరి సాయంత్రానికి అక్కడికి చేరుకుంటుంది. మధ్యలో మధ్యాహ్నం కాసేపు సేద తీరి, భోజనాలు చేసి, మళ్ళీ ప్రయాణమవుతారు. అ బృందంలో యాభైమంది అటవీశాఖవారు, యాభైమంది పోలీసులు, విద్యుత్ శాఖవారు పదిమంది, అయప్ప ఆలయ సిబ్బంది మరో మది మంది. సామాన్లు మోయడానికి కూలీలు వగైరా అంతా కలిసి ఒక బృందంగా వెళతారు. సాయంత్రానికి కొండమీదికి చేరిన ఆ బృందం సంధ్యవేళ 6-16 నుండి 6-20వరకు అఖండజ్యోతి వెలిగిస్తుంది. సుమారు పది కిలోల కర్పూరం వెలిగించే సరికి పెద్ద జ్యోతి పైకి లేస్తుంది. ఆ వెలుగుకు అడ్డంగా కొందరు లావుపాటి దుప్పటి మూడుసార్లు అడ్డుపెట్టి తొలగిస్తారు. దాంతో శబరిమల ఆలయంలో ఉన్న భక్తులకు, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారికి ఆకాశంలో నక్షత్రం మూడుసార్లు మినుకుమని వెలిగి మాయమైందన్న భ్రమ కలుగుతుంది. అదే మనిషి చేసే మకరజ్యోతి మహత్మ్యం!

Also read: ఆలోచనా విధానం మారితే మనోభావాలు దెబ్బతినవు

ఈ కార్యక్రమాన్ని సన్నిధానం (అయప్పగుడి ఆవరణ) నుండి, పండిత వలం, పుల్ మేడు, కొండపై నుండి చలకయం, అట్టతోడు, పరంకుతి, నీలిమల, మరకుటమ్ వంటి నిర్ణీత స్థలాల నుండి భక్తులు మకరజ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు. పొన్నాంబలం (యిడు) కొండమీద హారతి కార్యక్రమం అయిపోగానే, కొండ కింద అయ్యప్ప గుడి గోపురం నుండి అర్చకులు భక్తులకు సంకేతాలిస్తారు. దాంతో కార్యక్రమం ముగిసిందని భక్తులు తెలుసుకుని, ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు.

కోర్టుకెక్కిన వివాదం

అయ్యప్ప దర్శనానికి సంబంధించి – మహిళల విషయమొకటి కోర్టుకెక్కింది. 1991లో కేరళ హైకోర్టు 10-50 సంవత్సరాల మధ్య గల బాలికల, మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ వయస్సులోవారు రుతుక్రమంలో ఉంటారని, వారి ప్రవేశం వల్ల ఆలయం అపవిత్రమైపోతుందన్న కారణంతో కోర్టు ఆ ఉత్తర్వు నిచ్చింది. (అదీ కాక, అయప్పకు తల్లి లేదు. ఆయన అయ్యకు, అప్పకు పుట్టినవాడు కదా? స్త్రీలు అపవిత్రులయితే, పుటకే అపవిత్రం, మనుషులంతా అపవిత్రులే – మరి దానికేమంటారు?) ఈ విషయం అక్టోబర్ 2017లో కాన్సిటిట్యూషన్ బెంచ్ కి వెళ్ళింది.

Also read: చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు!

పొన్నాంబలం కొండమీద 1950 కంటే ముందు ఆదిమ తెగలు నివసిస్తూ ఉండేవి. సంక్రాంతి రోజున దేవుడికి పెద్ద దీపం వెలిగదించి పూజలు చేసుకోవడం ఆనాటి గిరిజన సంప్రదాయం. అది ఆకాశంలో నక్షత్రమని చట్టుపక్కల ప్రాంతాల్లొనివారు అనుకుంటూ ఉండేవారు. హైడల్ ప్రాజెక్టు కట్టడం మూలాన ఆ కొండప్రాంతం వారు నిర్వాసితులయ్యారు. మూడునాలుగేళ్ళపాటు అక్కడ ఎవరూ దీపం వెలిగించలేదు. ఎవరికీ ఏ నక్షత్రమూ కనిపించలేదు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అలాగే నిలపడానికి కేరళ ప్రభుత్వమే మకరజ్యోతి వెలిగించడం ప్రారంభించింది. 1983-84 సంవత్సరాల్లో కేరళ రాష్ట్ర హేతువాద, మానవవాద సమాఖ్య (ఫారా)పూనుకుని, పొన్నాంబలం కొండపైకెక్కి రాకెట్టు, బాణాసంచా పేల్చారు. ఆ రోజుల్లో దూరదర్శన్ ప్రేక్షకులు ఆ దృశ్యాలు చూశారు. ఈ రచయిత కూడా ఆ ప్రేక్షకులలో ఒకరు.

ఈ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే మకరజ్యోతి మాయ బట్టబయలవుతుందని ఇప్పుడు ఎవరినీ ఆ కొండపైకి వెళ్ళనివ్వరు. మకరజ్యోతిపై నమ్మకం సడలితే భక్తులు తగ్గుతారు. శబరిమల కేంద్రంగా సాగుతూ వస్తున్న అనేక వ్యాపారాలు దెబ్బతింటాయి. ఏ ప్రభుత్వం లక్ష్యమైనా ప్రజల్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడమే కదా? అప్రయత్నంగా వస్తున్న రాబడిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారూ?

Also read: నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి!

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles