Thursday, May 19, 2022

బుక్కరాయలనాటి శాసనాలు : ఆ తెలుగు అద్భుతం

మైనాస్వామి

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో మేరెడ్డిపల్లి ఒక మారుమూల గ్రామం. గోరంట్లకు 5 కి. మీ దూరంలో ఉత్తర దిక్కున వుంది. 700 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన వుండాణమే గాక, సంస్థాన కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. ఆ గ్రామ అభివృద్ధిపై విజయనగర రాజ్య పాలకులు ప్రత్యేక దృష్టి సారించి, సాగు-తాగు నీటి కోసం కాలువ తవ్వించి, చెరువును నిర్మించినట్టు పొలాల్లో వున్న శిలాశాసనం వివరిస్తున్నది. శాసనకర్త విజయనగర ప్రభువు రెండో బుక్కరాయలు కాగా, శాసనాన్ని శ్రీ.శ. 1388లో రాశారు. శాసనంలో మేడిరెడ్డిపల్లి అని వుంది. అది దసవందు శాసనం.

శిలాఫలకాన్ని వివరిస్తున్న మైనాస్వామి

మేరెడ్డిపల్లిలో అందమైన ఆలయాలతో పాటు శిథిలమైన గుళ్ళు, శిల్పాలు, పడిపోయిన స్తంభాలు ఎన్నో కనిపిస్తాయి. ఆ పల్లి ప్రవేశంలో వేణుగోపాలస్వామి దేవాలయం, ఎదురుగా ఆంజనేయుని సన్నిధి, ఆ పక్కనే చౌడేశ్వరిమాత కోవెల, సమీపంలో శక్తి స్వరూపిణి – నల్లనమ్మ విగ్రహం, ఆ తర్వాత శిథిల శివాలయం వున్నాయి. శక్తి మాతలు-సప్తమాతృకల రూపు చెదిరిన  శిల్పాలూ దర్శనమిస్తాయి. వేణుగోపాలునిగుడి, మారుతిమందిరం విజయనగర రాజ్య ప్రారంభ కాలం నాటివి. నల్లనమ్మ విగ్రహం, చౌడమ్మ కోవెల చోళుల పాలనలో రూపుదిద్దుకొని వుండవచ్చు. చిత్రావతి నదికి వెళ్ళే దారిలో ఎత్తయిన వేదిక పై నల్లనమ్మ విగ్రహం వుంది. వేప చెట్టు నీడ అమ్మవారికి ఆలయం. గ్రామదేవతలకు బహిరంగ ప్రదేశాల్లోనే పూజలు జరుగుతుంటాయి. గ్రామదేవతలకు గుడులు అరుదుగా వుంటాయి. విజయనగర కాలంలో కట్టిన వేణుగోపాలస్వామి గుడికి ఇటివల మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడి, అంతరాళం, ముఖమండపం, ధ్వజస్తంభం, ప్రాకార గోపురంతో సంపూర్ణ గుడిగా నిలిచింది. గర్భగుడిపై ద్రావిడ పద్ధతిలో విమాన గోపురం నిర్మితమయింది. ముఖమండపంలోని స్తంభాల్లో ఎటువంటి శిల్పాలూ లేవు. గర్భగుడిలోని మూలవిరాట్- వేణుగోపాలుని సుందర రూపాన్ని చూడడానికి వేయి కన్నులు చాలవు. నునుపుదేలిన నల్లని రాతిలో నల్లనయ్య నిలువెత్తు విగ్రహాన్ని మలిచారు. వేణుధరుని వర్ణించడానికి మాటలు చాలవు. వేణువు వూదుతూ నిలబడుకొన్న గోవర్ధనుల్ని చూస్తూ గోవులు మైమరచి పోయాయి. స్వామివారి పాదాల చెంత అటూ ఇటూ రుక్మిణీ సత్యభామలున్నారు. పైన గల మకరతోరణంలో దశావతారాలున్నాయి. గోపాలుని నిండైన శిల్పం ఎంతో నాజూకుగా వుంది. మేరెడ్డిపల్లికి రహదం -రవాణా సౌకర్యం సరిగా లేకున్నా.. ఎంతో మంది యాత్రుకులు సుదూర ప్రాంతాల నుంచి స్వామి సందర్శనకు వస్తుంటారు.

రెండో బుక్కరాయలు

Kings, Queens and Warriors – Page 4 – Pakka Patriot
హరిహర, బుక్కరాయ

విజయనగర సామ్రాజ్య పాలకుడు రెండో హరి హర రాయల  రెండో కుమారుడు బుక్కరాయలు. రెండో హరిహర శ్రీ.శ.1377 నుంచి 1404 వరకు రాజ్య పాలన చేశాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు విరూపాక్ష రాయలు, బుక్కరాయలు, దేవరాయలు. విరూపాక్షుని తర్వాత తమ్ముడు బుక్కరాయలు రాజయ్యాడు. కేవలం సంవత్సరం రోజులు (1405-1406) మాత్రమే బుక్క ప్రభువుగా పాలన సాగించారు. రాజ్య అధిపతి గాక ముందు బుక్కరాయలు పెనుకొండలో రాజు ప్రతినిధిగా వుంటూ, పాలనలో తండ్రికి అండగా నిలబడ్డాడు. రెండో బుక్క రాయలకు సంబంధించిన వివరాలు అతి తక్కువగా లభ్యమవుతున్నాయి. మేరెడ్డిపల్లి శాసనంలోనూ “బుక్క రాయడు పృథ్వీ రాజ్యం చేయుచుండగా” అని చెప్పారు తప్ప, అతని బిరుదులు, రాజ్యకేంద్రస్థానం వంటి వాటిని వెల్లడించలేదు. తనతండ్రి ‘హరిహరరాయలను సైతం మహామండలేశ్వరుడు’ అని రాశారు. ‘అరి రాయ విభాడ, మూరు రాయరగండ’ అనే బిరుదులు హరిహరురనికి వున్నట్టు పేర్కొన్నారు. శ్రీమన్ మహా మండలేశ్వర అరిరాయ విభాడ, మూరు రాయర గండ శ్రీ వీర హరిహరరాయని కుమారుడు. బుక్కరాయడు ప్రితివి (పృథ్వీ) రాజ్యము చేయు చుండగా.. అని రాశారు. తండ్రి హరిహరుడు విజయనగరం (హంపి)లో రాజ్యాధికారం చేపట్టినప్పుడే శ్రీ.శ. 1377లొ బుక్కరాయలను పెనుకొండలో రాజు ప్రతినిధిగా నియమించి వుండవచ్చు. అప్పుడే ఆయన పెనుకొండ సీమలకు అభివృద్ధి పట్ల దృష్టి సారించాడు. వ్యవసాయం – ఆర్థిక ఎదుగుదలకు కృషి చేయడమే గాక, తెలుగు భాష- సంస్కృతి వికాసానికి తోడ్పడ్డాడు. మేరెడ్డిపల్లి శాసనాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకొంటే బుక్క రాయల భాషాభిమానాన్ని ప్రశంసించి తీరాలి.

అందులో ఏముంది?

మేరెడ్డిపల్లిలో లభించిన శిలాశాసనం

రెండో బుక్కరాయల 1388 నాటి శాసనాన్ని మేరెడ్డిపల్లి గ్రామ సమీపంలో చూడవచ్చు. శాసనంలోని తెలుగు భాష అద్భుతంగా వుంది. అప్పటికి తెలుగు భాష చందోబద్ధమైన పద్యాల రూపంలోనే. గద్యం చాలా తక్కువ. అంతా గ్రాంథికమే. కానీ మేరెడ్డిపల్లి శాసనంలోని వచనం ఎంతో సరళంగా వుంది. అంతేగాక, శాసనంలోని అక్షరాలు గుండ్రంగా అందంగా.. వరుసలు వరుసలుగా వున్నాయి. శాసనంలో వాడిన పదాలను బట్టి పెనుకొండ సీమలో తెలుగు భాష తేనె అంత మధురంగా వుండేదని చెప్పవచ్చు. పేరు తర్వాత గారు, గారి అని గౌరవాన్ని ప్రదర్శించారు. శాసనాన్ని అంత సుందరంగా రూపొందింప చేసిన ఆ కవివరేణ్యునికి జేజేలు పలకవలసిందే.

అది దసవంద శాసనం. చెరువులు కట్టించడం, కాలువలు తవ్వించడం, వాగులు, నదులకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడే విధంగా పాలకులు ఆదేశాలు జారీ చేసే అంశాలను పొందుపరిచిన రాతలను “దసవంద శాసనాలు’ అంటారు. నది నుంచి కాలువ ద్వారా చెరువుకు నీటిని మళ్ళించడం, చెరువు నిర్మాణ కర్తలు, చెరువును కట్టిన వారికి శాశ్వతంగా ధాన్యం హక్కు తదితర విషయాలన్నీ చాలా స్పష్టంగా వున్నాయి.. అందువల్ల మేరెడ్డిపల్లి శాసనం దశవంద శాసనమే. ఆ శిలా రాత నాయంకర పరిపాలనను, పాలకులను ప్రజలకు తెలుపుతున్నది. మేడారెడ్డి పల్లా నాయంకర పాలనలో వుంది.  నాయంకాచార్య (మండలాధ్యక్షుడు) హరిగిల కతనాయిని గారి కొడుకు పోలి నాయినింగారు మేడిరెడ్డిపల్లిని మేలుచుంనుండి అని శాసనం చెబుతున్నది. మేడిరెడ్డిపల్లి చెరువుకు చిరేట నుండి కాలువ తవ్వాలని పోలినాయకుడు ఆదేశించాడు. చిరేట అంటి చిరు ఏటి.. చిన్న నది అని అర్థం. నదిని వ్యవహారికంలో ఏరు అంటారు. నాయంకాచార్య పోలినాయక తోలేటి దేవోజు కొడుకులు పెదబయిరపోజు, చిన బయర పోజులచే చిరేటకు కాలువ తవ్పించాడు. (చిరేట ప్రస్తుతపు పేరు చిత్రావతి) ఏటి కాలువ తన్వినందుకు పెద బయిర, చిన బయిరలకు చెరువు కింద పండిన పంట (వరిమడి)లో పందుము ధాన్యం ఇవ్వాలని నాయకుడు ఆదేశించారు. పందుము అంటే ఆరు బస్తాలు. సూర్యచంద్రులున్నంత వరకు పోలినాయక ఆదేశం అమలులో వుంటుందని శాసనం చెబుతున్నది. 18-26 వరుసల మధ్య పందుము ధాన్యం ప్రతిఫలం విషయం వుంది. శాసనం మొత్తం 26 వరుసలు వుంది. ‘స్వస్తిశ్రీ జయాభ్యుదయ శక వర్షములు 1309’ అని మొదలై .. మంగళమహా శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ తో ముగుస్తుంది. శాసన కాలం శక వర్షం 1309 ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ 15 గురువారం (ఇంగ్లీష్ తేది. క్రీ.శ.1388 జనవరి 23) . తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్న శాసనాల్లో మేరెడ్డిపల్లి శాసనం ఒకటని చెప్పవచ్చు.

శాసన పాఠం

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శక వర్షము –

లు 1309 అగు నేటి ప్రభవ సంవత్సరం

మాగసు 15 గురువారము నాడు శ్రీమన్

మహామండలేశ్వర అరిరాయ విభాడ మూ

రు రామర గండ శ్రీ వీర హరి హర రాయని

కుమారుడు బుక్క రాయడు ప్రితివి రాజ్య –

ము చేయుచుంన్నగా శ్రీమన్ మహానా –

యంకాచాయ్య హరిగిల కితినాయిని గారి

కొడుకు పోలినాయి నింగారు మేడా ఱెడ్డిప

ల్లిమేలు చుంనుండి ఆ పొలినాయినింగా –

రు మేడిఱెడ్డ పల్లి చెఱువుకు చిఱేటనుండి

కాలువ తవ్వింప వలసి తోతటి దేవోజు కొ

డుకులు పెదబయిర పోజుంను చిన బయి –

రపోజుం పిలిపించి ఆబయిర పోజు గారి –

చేత మేడిఱెడ్డిపల్లి చెఱువుకు చితేట నుం

డి కాలువ తవింపించి ఆ కాలువ తవిన బ

సింగయ తూమున పందుము మడి వె

టరి యి  పందుము మడింని ప్రీతివింని

ఆకాశముం సూయ్య ్ చంద్రులు గలంత

గాల ముంను ఆ బయిరపోజు గారికి చె –

ల్లగలది ఆ బయిరపోజు గారు యి దస

వందము పందుము మడించి ఆచంద్రాక్క ర ము –

ను సేసి కుడిచి సుకాల నుండు వారు మీ –

౦గళమహా శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీశ్రీ

శాసనం పైభాగంలో సూర్యుడు, చంద్రుడు బొమ్మలున్నాయి. శాసనాన్ని శిల్పం మాదిరిగా మలిచారు.

శిలా శాసనం కరావుల పల్లికి చెందిన గంగిశెట్టి గారి సుభాష్ చంద్ర బోస్ పొలంలో గట్టున వుంది.

Mynaa Swamy
Myna Swamy's full name is Mylaram Narayana Swamy. A senior journalist who was a correspondent for Andhra Prabha, Indian Express, Andhra Jyothy, Ujwala and Subrabhatam. He is also a short story writer and novelist. Lepakshi is his latest book which received acclaim. It is being translated into English, French, Hindi, and other languages. His Forte is history. Mobile No: 9502659119

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles