Thursday, April 25, 2024

బెయిల్ కోసం నిరీక్షిస్తున్న స్టాన్ స్వామి మృతి

దిల్లీ: ఉపా చట్టం కింద అరెస్టయి, జైల్లో ఉంటూ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటూ స్టాన్ స్వామి అనే క్రైస్తవ ప్రీస్టు, సామాజిక కార్యకర్త తన 84వ ఏట సోమవారంనాడు ముంబయ్ లో మరణించారు. ఆదివారం పరిస్థితి విషమం కావడంతో జేసూట్ ప్రీస్ట్ స్వామిని వెంటిలేటర్ పైన ఉంచారు. హోలీ ఫామిలీ ఆస్పత్రిపైన కోర్టు ఆదేశాల మేరకు చికిత్స చేయించుకుంటూ ఆఖరి శ్వాస వదిలారు.

కోర్టు విచారణ సమయంలో నేషనల్ ఇన్వెగెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ) ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని కోరింది. చావనైనా చస్తాను కానీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళబోనని స్వామి పంతం పట్టారు. మే 28న కోర్టు స్వామిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందడానికి న్యాయస్థానం అనుమతించింది. నిరుడు అక్టోబర్ నుంచి ముంబయ్ సమీపంలోని తలోజా జైలులో బందీగా ఉన్నారు. స్వామికి పార్కిన్సన్ డిసీజ్ ఉంది. కాళ్ళూ,చేతులూ సరిగా పని చేయవు. చేతులు వణుకుతూ ఉంటాయి. కాఫీ కప్పు కూడా సరిగా పట్టుకోలేరు. అందుకని స్ట్రా కావాలంటే కోర్టులో పిటిషన్ పెట్టుకోవలసి వచ్చింది. ప్రతి చిన్న విషయానికీ కోర్టుకు వెళ్ళవలసి వచ్చేది. ‘‘తాత్కాలిక బెయిలు కూడా ఇవ్వకుండా నన్ను ఇట్లాగే జైలులో ఉంచితే తొందరగానే చచ్చిపోతాను’’అంటూ కోర్టుకు విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చెప్పుకున్నారు స్వామి.

తనకు బెయిలు మంజూరు చేయాలంటూ స్వామి గత వారం బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) కింద అరెస్టయిన 16 మంది మేధావులలో స్టాన్లీ ఒకరు. ఆయన పిటిషన్ ను సోమవారం మధ్యాహ్నం విచారణకు చేపట్టగా స్టాన్ స్వామి తరఫు న్యాయవాది తన క్లయింటు  మధ్యామ్నం గం.1.30లకు మృతి చెందారని తెలియజేశారు. వయస్సు మళ్ళిన సామాజిక కార్యకర్తను వేటాడి చంపిందని ప్రభుత్వాన్ని నిందిస్తూ హక్కుల కార్యకర్తలూ, ప్రతిపక్ష నాయకులూ ప్రకటనలు జారీ చేశారు. మానవహక్కుల రక్షకులకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి మేరీ లాలర్ ఒక విడియో ద్వారా తన సందేశం పంపించారు. ‘‘ఇండియా నుంచి  ఈ రోజు వచ్చిన వార్త దిగ్భ్రాంతికరమైనది. మానవహక్కుల కార్యకర్త, జేసూట్ ప్రీస్ట్ పాదర్ స్టాన్ స్వామి కస్టడీలో మరణించారు. బూటకపు ఉగ్రవాదం ఆరోపణలతో తొమ్మిది మాసాల కిందట ఆయనను అరెస్టు చేశారు. మానవహక్కుల కార్యకర్తలను జైలులో పెట్టడం క్షమించరాని నేరం,’’ అని ఐరోపాలో పౌరహక్కుల ప్రత్యేక ప్రతినిధి ఈమన్ గిల్మోర్ వ్యాఖ్యానించారు.

అనారోగ్యంగా ఉన్నవారిని ఆదుకునేందుకు అవసరమైన సదుపాయాలు జైలులో లేవని కోర్టుకు స్వామి లోగడ ఫిర్యాదు చేశారు. వైద్య సౌకర్యం కల్పించడంలో జైలు అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. వైద్య పరీక్షలకు అనువైన వసతులు లేవనీ, కోవిడ్ నుంచి రక్షణ చర్యలు లేవనీ, పరిశుభ్రత లేదనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పుణె దగ్గర కోరేగాం-భీమాలో 31 డిసెంబర్ 2017న జరిగిన సమావేశానికి సంబంధించింది ఎల్గార్ పరిషత్ కేసు. ఆ పరిషత్తు సమావేశంలో హక్కుల నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారనీ, మర్నాడు హింసాత్మక సంఘటనలకు వారి ప్రసంగాలే కారణమనీ పోలీసులు ఆరోపించారు. సీపీఐ (మావోయిస్టు) సంస్థ ఉపా చట్టం కింద నిషేధించిన సంస్థ. ఆ సంస్థకు చెందిన సీనియర్ నాయకులు ఎల్గార్ పరిషత్తు సమావేశాలు నిర్వహిస్తున్నవారితో సంపర్కంలో ఉన్నారని ఆరోపణ.

స్టాన్ స్వామి క్రైస్తవ మతాచార్యుడుగా జార్ఖండ్ ప్రాంతంలో అయిదు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. దిల్లీ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల బృందం రాంచీకి వెళ్ళి అర్ధరాత్రి స్టాన్ స్వామి ఇంటికి వెళ్ళి అరెస్టు చేశారు. తనపైన పోలీసులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ తన అనారోగ్యానికి సంబంధించిన అంశాలను వారికి తెలిపారు. తనను అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘‘మరింత విచారించడానికి తమతో పాటు ముంబయ్ రమ్మని అడుగుతున్నారు. నేను వెళ్ళదలచుకోలేదు. నా వయస్సు, నా ఆరోగ్య సమస్యలు అందుకు కారణం. కోవిద్ మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. ఈ విషయాలు పోలీసులకు తెలుపుతున్నాను. వారు ఇంగిత జ్ఞానంతో పని చేస్తారని ఆశిద్దాం,’’ అని వ్యాఖ్యానించారు.

పదిహారు మంది మేధావులు ‘ఉపా’ చట్టం కింద అరెస్టయి తలోజా జైలులో మగ్గుతున్నారు. రెండేళ్ళు అయినా వారిపైన చార్జిషీటు దాఖలు చేయడం కానీ, విచారణ ప్రారంభించడం కానీ జరగలేదు. ఆ పదహారు మందిలో తెలుగు కవి వరవరరావు ఉన్నారు. అటువంటి పరిస్థితులలోనే మరో తెలుగు ప్రముఖుడు ప్రొఫెసర్ సాయిబాబా కూడా ఉన్నారు. ‘ఉపా’ కింద అరెస్టయినవారిలో అందరికంటే వృద్ధుడు స్టాన్ స్వామి. పోయిన నెల కోవిద్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అప్పుడే ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) కు తరలించారు. వరవరరావుకు బెయిల్ మంజూరు అయింది. ఆయన ముంబయ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles