Saturday, July 13, 2024

శ్రీకృష్ణుడుఇంద్రనీలమణి, మణివణ్ణా, భక్తులకు కొంగుబంగారం

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై – 26

మాలే మణివణ్ణా మార్-గళి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్

 తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక

ప్రళయ కాలమున సాగరమ్ముప్పొంగి ముంచువేళ

నిశ్చింతగా  మఱ్ఱాకుమీద తేలు నీలి మణి వర్ణుడా

మార్గళి స్నాన వ్రతానుష్టాన పరికరాలకై వచ్చినాము

జగముగుండెలదరగొట్ట గర్జించుపాంచజన్యము వంటి

ధవళ వర్ణపు శంఖములెన్నొ మాకు కావలయు

పెద్ద ఢక్కివాద్యము, పల్లాండు సెప్పెడి దీపపు సెమ్మెలు

సన్నిధి కోలలును ధ్వజ వితానములు ఎన్నో మేలికట్లు

నెలనోము పూర్తికి వలయు వస్తు సంచయమెల్ల నిమ్ము.

మణివణ్ణా అంటే కొంగు మణి అనీ భక్తులకు కొంగుబంగారమనీ కూడా అర్థం. మాలే మణివణ్ణా అనే మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్సల్యం అనే సౌశీల్యం తోబాటు కొంగుమణిగా సులభంగా దొరికే సౌలభ్యం కూడా ప్రకటితమైంది.

నేపథ్యం

నన్ను కావాలనుకున్న వారు పఱై (ఢక్కా వాద్య పరికరం) కావాలని ఎందుకు అడుగుతున్నారు? అవి ఎన్నికావాలని శ్రీ కృష్ణుడు గోపికలను అడిగాడు. ఈ పఱై గానీ వ్రతంగానీ, వర్షంకోసం వ్రతం చేయాలనడం కోసం కేవలం వ్యాజం మాత్రమే. నిన్ను చూడడమే ఈ వ్రతం లక్ష్యం. ఈ వ్రతానికి మార్గళి స్నానం అనుష్టానం అని పెద్దలు అంటున్నారు. నీతో సంశ్లేషమే స్నానం. పైకి పెద్దలకోసం చేసిన వ్రతానికి కావలసిన పరికరాలు, కాని ఆంతరముగా భగవదనుభూతికి కావలసిన సామగ్రిని వారు అడుగుతున్నారు. శంఖాలు, పఱై వాయిద్యాలు, మంగళాశాసనం చేసేవారు, దీపాలు, కేతనాలు, గొడుగులు మొదలైనవి మాకు ఇమ్మని గోపికలు ప్రార్థిస్తున్నారు.

Also read: గుండెలో కంసుని ద్వేషమనెడు నిప్పు

భక్తులను కాపాడే (మాలే) నీలమణివర్ణుడా (మణవణ్ణన్) ప్రళయకాలంలో మఱ్ఱి ఆకు మీద పవళించినవాడా (ఆలిన్ ఇలైయాయ్) మార్గళి స్నానం చేయడం కోసం (మార్గళి నీరాడువాన్) పెద్దలు (మేలైయార్) చేసే అనుష్టాలకోసం (సేయ్ వనగళ్) కావలసిన ఉపకరణాలు (వేండువన) మీరు వింటే చెబుతాము (కేట్టియేల్) ప్రపంచమంతా (ఞాలత్తైఎల్లామ్) వణికేట్టు (నడుంగ) ధ్వనిచేసే (మురల్వన్) పాలరంగును బోలిన (పాలన్న వణ్ణత్తున్) నీపాంచజన్యానికి తోడైన (ఉన్ పాంచచన్నియయే) శంఖాలను (శంగంగళ్) చాలా విశాలమైన (పోయ్ పాడు ఉడైయన) చాలా పెద్దవయిన (శాలపెరం) డక్కాలు (పఱై) తిరుపల్లాండు పాడే వారు (పల్లాండు ఇశైప్పార్) మంగళ దీపాలను (కోలవిళక్కు), ధ్వజాలను (కొడి) మేలకట్లను (వితానం) మాకు అనుగ్రహించండి (అరుళ్) మాలే అన్న పదప్రయోగం ద్వారా గోదాదేవి, గోపికలకు శ్రీకృష్ణుడిమీద ఉన్న ప్రేమ కన్నా శ్రీకృష్ణుడికి వారిమీద ఉన్న ప్రేమ చాలా రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు. శ్రీరాముడి విశిష్ఠ లక్షణం శరణన్న వారిని రక్షించడమే. ఇన్ని రోజులు తమకు శ్రీకృష్ణుడంటే అమితప్రేమఅని గోపికలు అనుకున్నారట. కాని ఆయన చల్లని చూపుల్లో పొంగి పొర్లిన అనురాగాన్ని చూసి ఆయన భక్త వ్యామోహంతో పోల్చితే తమ వ్యామోహం సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే అని తెలుసుకున్నారు. కనుక ఆయనను మాలే అని సంబోధిస్తారు. శ్రీకృష్ణుడు నాలో ఆశ్రిత వాత్సల్యం ఉందని మీరు ఏవిధంగా తెలుసుకున్నారంటే మణిదీపాల కాంతి దీపాలను దాటి దానంతటదే ప్రకాశించినట్టు మీ గుణం ప్రకాశిస్తున్నది మణివణ్ణా శ్రీ కృష్ణా అంటారు. మనసులలోని గుణం శరీరవర్ణంలో ప్రతిబింబిస్తున్నదట. మణివణ్ణా అంటే కొంగు మణి అనీ భక్తులకు కొంగుబంగారమనీ కూడా అర్థం. మాలే మణివణ్ణా అనే మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్సల్యం అనే సౌశీల్యం తోబాటు కొంగుమణిగా సులభంగా దొరికే సౌలభ్యం కూడా ప్రకటితమైంది. అదిసరే మీరెందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు.

Also read: పరము వరమునిచ్చిమానోము నిల్పిన వరదునికి జయము

రామాయణ కథ

శ్రీరాముడు శరణాగతవత్సలుడు, శ్రీ కృష్ణుడు ఆశ్రిత వ్యామోహము కలవాడు. రాముడు రావణుడి తమ్ముడినైన నన్ను స్వీకరిస్తాడా అని విభీషణుడు అనుకుంటూ వస్తున్నాడట. కాని శ్రీరాముడేమో రావణుడే వస్తే బాగుంటుంది కదా. పోనీ అతను కాకపోతే ఆయన తమ్ముడైనా వస్తే బాగుండు అనుకుంటాడట.

భారత కథ

మహాపరాక్రమశాలి యోధ్ధలందరిలోకి మహా యోధ్ధ అయిన శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన పాండవులకోసం దూతగా సారథిగా చిన్నచిన్న పనులు చేస్తాడట. పరమాత్మను పొందడానికి ఆళ్వార్లు పడే ప్రేమ తపన కన్న ఆళ్వార్లను పొందడానికి పెరుమాళ్లు పడే తపన మరీ ఎక్కువట.

భాగవత కథ

శ్రీ కృష్ణుడిని పొందగలమాఅని గోపికలు భావిస్తుంటే,గోపికలకోసమే ఆయన ఒకరికి పుట్టి మరొకరి దగ్గర పెరిగాడట. శ్రీ భాష్యం వారు ఇలా రాసారు. తాను పిచ్చెక్కినట్టుండి, వీరికి కూడా పిచ్చెత్తించి తనతో పోలిక కలిగించే విచిత్రమైన పిచ్చిగలవాడు శ్రీకృష్ణుడు. ఆయన వ్యామోహము చూసి గోపికలు పరవశులై మరింత వ్యామోహం పొందారట.

Also read: నిప్పురవ్వలు కురిపించు కంటి కొసచూపులు విసిరి
తామరపూవులో పుట్టిన లక్ష్మీతాయారు హరి శరీరకాంతికి పరవశించి ఆయన వక్షఃస్థలంలోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నది. మాలే అంటే అత్యధికుడని సంబోధన. మణిని పోలిన స్వభావము కలవాడు నారాయణుడు. మణి కలిగి ఉన్నవాడు మణి ఉంటేనే బతుకని, లేకపోతే ఉన్నట్టు కాదని అనుకుంటాడు. శ్రీకృష్ణుడు కలిగి ఉన్నవాడే ఉన్నట్టు, లేని వారు లేనివారే. మణి మరొకరికి ఉపయోగపడుతుందే కాని తనకు తాను పనికి రాదు.

పెద్దల మాట

‘‘యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త తదేవేతరే జనః

సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే’’

అన్నది మీరే కదా.పెద్దలు చెప్పిన, ఆచరించిన ఉత్తమ పద్ధతులు పాటించాలని భగవద్గీతలో చెప్పారు కదా. శెయ్యాదన శెయ్యోం, – పెద్దలు వద్దన్న పనులుచేయం, పెద్దలు చెప్పినట్టు మేలైయార్ శెయ్ వనగళ్ మేము మార్గళి స్నాన వ్రతం ఆచరించదలిచాం. పెద్దల ఆచారమే వ్రతానికి ప్రబల ప్రమాణము.

జీయర్ స్వామి ఈ విధంగా వివరించారు –‘‘ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై “మేలైయార్ శేయ్-వనగళ్” ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా “నానే తాన్ ఆయిడుగ” నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో వ్రతం ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు గోదమ్మ “మేలైయార్ శేయ్-వనగళ్” సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయమై ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ’’.

మార్గళి స్నాన వ్రతానికి కావలసిన పరికరాలు ఇవ్వండి అన్నారు. సరే ఏంకావాలి? వేండువన కేట్టియేల్.. కావలసినవేమిటో చెబుతాంకాని మీరు వింటున్నారా? అన్నారు. అయిదులక్షలమంది ఆశ్రితులై రావడంతో ఉప్పొంగిపోయిన స్వామి ఆ ప్రేమలో వింటున్నారో లేదో అనుకుని గోపికలు ‘‘వింటున్నారా’’ అన్నారట.

“ఞాలత్తై యెల్లాం” భూమినంతా “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ధ్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన” నీ పాంచజన్యాన్ని పోలిన “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం అనే అసాదారణ ఆయుధాలు ఉంటాయికదా. శంఖ చక్రాలను ఆ పరమాత్ముడు మాత్రమే ధరించి భరించ ప్రయోగించగల శక్తమంతుడు. మరెవరికీ అవి అమరవు.

Also read: చీమకు, బ్రహ్మకు కూడా అహంకారం ఉండదా?

భాగవత కథ

జీయర్ స్వామి రెండు సంఘటనలు వివరించారు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలన్నాడట. ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూసాడు, ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియక దాంతో తన తలనే నరుక్కున్నాడు శ్రీమాలికుడు.

వేంకటాచలపతి చరిత్ర

శ్రీవేంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమ శివుడు కూడా వేంచేసాడు. అయితే పరమ శివుడికి శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమ శివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపైన కాదు, ఆదిశేషుడి చివరి స్థానం కపిల తీర్థం వద్ద నివసించమన్నాడు. శంఖ చక్రాలు ఎవ్వరి మాట వినవు శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.

Also read: ‘‘సర్వే వేదాః కృష్ణా’’ వేదాలు చెప్పేది కృష్ణుడే

గోపికలు పాంచజన్యం అడిగితే దాన్ని వదిలి ఉండలేక పరమాత్ముడూ తమతో ఉంటాడని వారి వ్యూహం. శాలపెరుమ్బత్తియే చాలా పెద్ద మద్దెల కూడా శంఖానికి తోడు కావాలన్నారు. పల్లాండు శెప్పార్ కోల విళక్కే కొడియే వితానమే… మార్గళి స్నానానికి వెళ్తున్నప్పుడు పల్లాండుచెప్పేవారు (మంగళం పాడే వారు), చీకటి లో నడుస్తారు కనుక మంగళ దీపం, చలిలో మంచు పడకుండా తలమీద ఆచ్ఛాదన వస్త్రం కావాలని అడిగారు. ఇవన్నీ ఇంతమందికి నేనివ్వగలనా నాదగ్గర ఉన్నాయా అని పరమాత్మ అన్నారట. లోకాలన్నీ కడుపులో దాచుకుని ఏ ఆధారమూ లేకుండా చిన్న మఱ్ఱి ఆకు మీద పవళించి ఈ ప్రపంచాన్నంటినీ ఉద్ధరించిన నీకు ఆలినిలైయాయ్ అసాధ్యం ఏదైనా ఉందా? అని గోపికలు అన్నారు.ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాబట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం చేసేప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ధ్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేషుడు వెళ్ళడు కనక, తాను ధరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు.తనను ఆశ్రయించే జనులమీద ఎంత వాత్సల్యం లేకపోతే వైకుంఠం వదిలి సౌలభ్య గుణాన్ని ప్రకటిస్తూ రేపల్లెలో శ్రీకృష్ణుడు వెలుస్తాడు? సర్వాధికుడైనా సర్వసులభుడాయన. ఎంతటి జ్ఞానసంపన్నులైనా కర్మను వీడకూడదని, కనుక మార్గళిస్నానం వ్రతం వంటి పెద్దలు చెప్పిన శిష్టాచారాన్ని పాటించాలి. శంఖం కోరడమంటే ప్రణవధ్వని చేసే శంఖం ద్వారాప్రణవార్థమైన అకార త్రయ జ్ఞానాన్ని, పఱై అడిగి పరతంత్ర జ్ఞానాన్ని , పల్లాండు శైప్పారే అంటే సజ్జనసాంగత్యం, కోలవిళక్కే అంటే జ్ఞాన దీపమును, కొడియే వితానమే అంటే స్వభోక్తృత్వ దోషము లేని నీ కైంకర్యాన్ని అనుగ్రహించమని గోపికలు కోరుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అన్న చరమశ్లోకంలో శ్రీకృష్ణుడు మామ్ అనడం ద్వారా సౌలభ్య లక్షణాన్ని గోదాదేవి ఈ పాశురంలో ప్రతిపాదించారు. అహమ్ అన్న మాటను, ఆలినిలైయాయ్ పదం ద్వారా పరమాత్ముడి సర్వశక్తి సంపదను వివరించారనీ ఈ పాశురం చరమశ్లోకవైభవాన్ని వివరిస్తున్నదనీ జీయర్ స్వామి ప్రవచించారు.

శ్రీకృష్ణుడిని ఇంద్రనీలమణితో పోల్చి, ఆ మణి ఉన్నవాడే సంపన్నుడు అంటున్నారు గోదమ్మ.  ఇక్కడ స్నానమంటే క్రిష్ణయ్య గుణగానం చేయడమే. శంఖం అంటే ప్రణవం. ప్రణవం భగవచ్ఛేషత్వమును బోధిస్తుందని కందాడై రామానుజాచార్యులు వివరించారు. గోపికలు ప్రణవ శబ్ద కైంకర్యం అడుగుతున్నారు. చాలా పెద్ద పఱ కావాలట.  ఆ పఱ అష్టాక్షరిలో ‘నమః’. పురుషార్థములో దోషమును పోగొట్టే పదం నమః.  అనన్యార్హ శేషత్వ జ్ఞానమును, పారతంత్ర్య జ్ఞానము, భాగవత సహవాసము, భాగవత శేషత్వ జ్ఞానము భగవత్ కైంకర్యము, కైంకర్యమున భోక్తృత్వ బుద్ధి నివృత్తి కావాలని గోపికలు క్రిష్ణయ్యను అడుగుతున్నారని గోదాదేవి మనకు తెలియజేస్తున్నారు ఈ పాశురంలో.

Also read: ముక్కోటి దేవుళ్లు ముప్పు వచ్చెనంచు విన్నవించకమున్నె

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles