Saturday, May 18, 2024

అనితర సాధ్యం చంద్రక్క మార్గం

కె. రామచంద్రమూర్తి

విప్లవోద్యమం ఒక సమష్టి కార్యాచరణ. విప్లవపంథాలో అడుగు పెట్టాలా లేదా, అదే పంథాలో కొనసాగాలా లేదా అన్నది ఎవరికి వారు తీసుకోవలసిన వ్యక్తిగత నిర్ణయం. ఎందరో విప్లవకారులు ప్రాణాలకు తెగించి గిరిజనులకోసం, ఇతర బడుగుజీవులకోసం సుదీర్ఘంగా పోరాడి అలసిపోయి లొంగిపోయినవారూ, అజ్ఞాతంలోనే విశ్రాంతి తీసుకుంటున్నవారూ ఉన్నారు. పోరాడుతూ మరణించినవారూ ఉన్నారు. ఎవరి సంకల్పబలం వారిది. ఎవరి భావోద్వేగం వారిది.  ఎవరి సైద్ధాంతిక పునాది వారిది. శ్రీకాకుళం గిరిజన సాయుధపోరాటానికి నాయకత్వం వహించినవారిలో తుపాకీ చేతిలో ఉండగా పోరాడుతూ మరణించినవారే ఎక్కువ.

శ్రీకాకుళంలో 1967లో ఆరంభమైన సాయుధ పోరాటం 1970-71 వరకూ ఉధృతంగా సాగింది. ఇప్పటికీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు ఉనికి చాటుకుంటున్నారు. పంచాది కృష్ణమూర్తి, డాక్టర్ చాగంటి భాస్కరరావు, మరి ఆరుగురిని పోలీసులు 26-27 మే 1969న హత్య చేశారు. పంచాది నిర్మలను కూడా చంపివేశారు (మొన్న మరణించిన విప్లవనారి  పైలా చంద్రమ్మకి నిర్మల ఆదర్శం). 23 డిసెంబర్ 1969న ఒడిశా సరిహద్దు గ్రామంలో ప్రజాకవి, గాయకుడు సుబ్బారావు పాణిగ్రాహిని పోలీసులు చెట్టుకు కట్టివేసి కాల్చివేశారు. తామాడ గణపతి, రమేశ్ చంద్ర సాహూలను కూడా పోలీసులు చంపివేశారు. 1970 జులై 10న వెంకటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం పోలీసుల చేతిలో మరణించడంతో ఉద్యమ తీవ్రత తగ్గింది. ఒకవైపు పోలీసుల తుపాకులను ఎదుర్కొంటూ మరోవైపు ఉద్యమాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించినవారిలో పైలా వాసుదేవరావు, ఆయన భార్య చంద్రమ్మ  ప్రముఖులు. ఉద్యమం పట్ల వారి అంకితభావం తిరుగులేనిది. అజ్ఞాత జీవితంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరు విప్లవకారులూ జీవితపర్యంతం ఉద్యమంలో కొనసాగారు. వారికి బిడ్డ పుట్టినప్పుడు ఆమెను పోషించడం కోసం విప్లవజీవితానికి స్వస్తి చెప్పడమా లేక పోషణభారం ఎవరికైనా అప్పగించి విప్లవపంథాలో కొనసాగడమా అనే మానసిక సంఘర్షణ ఎదురైనప్పుడు చంద్రమ్మ విప్లవంవైపే మొగ్గుచూపారు.  పసికందును సహచరి అనసూయ ద్వారా దూరంగా గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర చింతలపుడి గ్రామంలో అత్తలూరి శేషయ్య, శిరోమణి దంపతుల దగ్గరికి పంపించివేశారు. అత్తలూరి కుటుంబం చంద్రమ్మ కుమార్తె అరుణను కన్నబిడ్డలాగే పెంచి పెద్ద చేసింది. ఆమె అత్తలూరి అరుణగా జర్నలిజంలో ప్రవేశించి రిపోర్టర్ గా, రచయితగా  మంచిపేరు తెచ్చుకున్నారు. పార్టీ సేవ కొనసాగించాలనే దీక్షతో తొమ్మిది మాసాలు మోసి కనిన చిన్నారిని ఒక కామ్రేడ్ చేతిలో పెట్టి వందల మైళ్ళ దూరానికి పంపించివేయడం, కుమార్తెను చూడాలనే ఆరాటాన్ని అణచుకుంటూ ఉద్యమంలో ఉక్కసంకల్పంతో కొనసాగడం మామూలు విషయం కాదు. ఎంతో త్యాగనిరతి, ఉద్యమం పట్ల అంకితభావం, గుండెధైర్యం, తెగువ ఉన్నవారికి మాత్రమే అటువంటి నిర్ణయం సాధ్యం. నాటి నిర్ణయంతోనే చంద్రమ్మ విశిష్టమైన విప్లవ మహిళగా పేరు తెచ్చుకున్నారు.

వృత్తిరీత్యా అరుణ పరిచయం కావడం, హెచ్ఎంటీవీలో కలసి పని చేయడం, ఆమె భర్త ఆంజనేయులుతో స్నేహం ఏర్పడటం, అందరినీ కలిపే వ్యక్తిగా మల్లెపల్లి లక్ష్మయ్యతో కలిసి పని చేయడం వల్ల వాసుదేవరావుగారితో, చంద్రమ్మగారితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. వాసుదేవరావుగారు 2010లో కేన్సర్ వ్యాధికి వైద్యం చేయించుకుంటున్న సమయంలో ఆయనను అరుణ ఇంట్లో కలుసుకున్నాను. లక్ష్మయ్య, నేనూ ఆయనను హెచ్ఎంటీవీ కోసం సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశాం. శ్రీకాకుళం ఉద్యమం గురించి అనేక విషయాలు ఆయన ముఖతా విన్నాం. నాయకుల హత్యలతో చప్పబడి, చీలికపేలికలైన ఉద్యమంలో జవజీవాలు  పునరుద్ధరించిన క్రమం ఆయన వివరించారు. 11 ఏప్రిల్ 2010లో వాసుదేవరావు తనువు చాలించారు. చంద్రమ్మ పలాసలో ఒంటరిగా నివసిస్తూనే ప్రజలతో మమేకమై చివరి శ్వాసవరకూ పోరాటం కొనసాగించారు. మేము పలాస వెళ్ళాం. జీడిచెట్లనూ, జీడిపిక్కల మీద ఆధారపడి జీవిస్తున్నవారినీ కలుసుకున్నాం. శ్రీకాకుళం పోరాట చిహ్నాలను చూశాం. సత్యంగారి కుమార్తెను కలుసుకున్నాం. చంద్రమ్మగారితో మాట్లాడాం. ఆమె మాటలో, చూపులో, వైఖరిలో సడలని దీక్షను గమనించాం. బోదకాలు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా అక్కడే ఉంటూ అక్కడే పోరాటం సాగించాలని ఆమె తీర్మానించుకున్నారు. అప్పటికే పది సంవత్సరాలకుపైగా అజ్ఞాతవాసం, పదిహేనేళ్ళకు పైగా కారాగారవాసం, దాదాపు రెండు దశాబ్దాలపాటు చట్టబద్ధంగా గిరిజనులకోసం పోరాటం చేసినప్పటికీ కూతురి దగ్గరికి వచ్చి సేదతీరాలని భావించలేదు. కనీస వసతులు కూడా లేని నివాసంలోనే ఉంటూ బడుగుజీవుల బతుకులలో వెలుగు నింపే ఉద్యమం శక్తివంచన లేకుండా కొనసాగించారు. ఒక సారి జైలులో ఉండగా ప్రసిద్ధ నటుడు చిరంజీవి వెళ్ళి సాయం చేయడానికి సంసిద్ధత వెలిబుచ్చినా చంద్రమ్మ స్వీకరించలేదు. తనను తన పార్టీ చూసుకుంటుందని, ఇతరుల సాయం అక్కర లేదని నిర్మొహమాటంగా చెప్పారట. పార్టీ పట్ల ఆమె విశ్వాసం అచంచలమైదని.  

పైలా వాసుదేవరావు విద్యావంతుడు. చదువురాని సహచరులకు సాయంకాలాలు పాఠాలు చెప్పేవారు. ఉద్యమంలో భాగంగా ఒక కర్తవ్యంగా ఈ పని ఆయన చేసేవారు. ఆ విధంగానే చంద్రమ్మతో పరిచయం. ఆమెకు పదకొండో ఏటనే బాల్య వివాహం జరిగింది. పార్టీ ప్రమేయంతో విడిపోయారు. 1948లో పుట్టిన చంద్రమ్మ  బాలల సంఘంలో చేరారు. 17 ఏళ్ళ వయసులోనే ఆమె సాయుధపోరాటంలో చేరారు. 24 నవంబర్ 1969న భూస్వామి మద్దె కామేశుకు చెందిన పంటను విప్లవకారులు కోశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. చంద్రమ్మ, గురకల అంకమ్మ టెక్కలి జిల్లా రావివలసలో తెలిసినవారింట్లో తలదాచుకున్నారు. మామిడి అప్పల సూరిని కలుసుకోవడానికి రైలు పట్టాల వెంట ఇద్దరు మహిళలూ నలభై మైళ్ళు నడిచారు. మళ్ళీ పాపర్తి నుంచి బారువకు 80 మైళ్ళు నడిచారు. మహేంద్రగిరి చేరుకున్నారు. అప్పుడే దళాలు ఏర్పడ్డాయి. చంద్రమ్మ దళసభ్యురాలుగా చేరారు.

కొండపల్లి సీతారామయ్య, రవూఫ్, సత్యమూర్తి, పైలా వాసుదేవరావులతో ఒక కమిటీ ఏర్పడింది. సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా 1971లో పైలా ఎన్నికైనారు. శ్రీకాకుళం ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులలోనే 24 మే 1972న వాసుదేవరావు, చంద్రమ్మ పెళ్ళి చేసుకున్నారు. పోలీసులు అణచివేత కార్యక్రమంలో విజయం సాధించిన తర్వాత శ్రీకాకుళంలో ఒక్క దళం కూడా లేని సమయంలో చెల్లాచెదురైన పార్టీ కార్యకర్తలనూ, సానుభూతిపరులనూ కూడగట్టి ప్రజాపంథా ఉద్యమాన్ని తిరిగి నిర్మించడంతో వాసుదేవరావు సఫలీకృతుడైనారు. విప్లవకారుల ఐకమత్యం కోసం కమ్యూనిస్టు ఉద్యమకారుల సమన్వయ సంఘం నాయకుడు చండ్ర పుల్లారెడ్డితో సమాలోచనలు జరిపి సత్యనారాయణ్ సింగ్  నాయకత్వంలోని సీపీఐ (ఎంఎల్)లో  విలీనమై ఉద్యమాన్ని కొనసాగించారు.

1975లో విప్లవకారుల సమావేశంపైన పోలీసులు దాడి చేసినప్పుడు ఒక కంచెను దూకపోయి చంద్రమ్మ పోలీసులకు పట్టుబడింది. మందస పోలీసు స్టేషన్ లో ఆమెను చిత్రహింసలు పెట్టారు. పార్వతీపురం కుట్ర కేసులో నిందితురాలుగా చేర్చారు. ఇంకా అనేక కుట్ర కేసులు పెట్టారు. పార్టీ ఆదేశం మేరకు పెరోల్ తీసుకున్నారు. 1984లో పెరోల్  ఉల్లంఘించారు. నల్లగొండ జిల్లాలో విక్రం, చంద్రమ్మలను  ఆయుధాలు రవాణా చేస్తున్నారనే ఆరోపణపైన అరెస్టు చేశారు.

మరణించిన సమయంలో చంద్రమ్మ సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి. అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. గిరిజనుల భూమి సమస్యలపైనా, రైతులకు గిట్టుబాటు ధరలపైనా, జీడిపిక్కల రైతాంగం సమస్యలపైనా అహరహం అవిశ్రాంతంగా పోరాడిన చంద్రక్క జీవితం సార్థకం.

12 సెప్టెంబర్ ను మహేంద్రగిరి కనుమల్లో మరణించిన కుమారన్న సంస్మరణ సభలో చంద్రమ్మ పాల్గొన్నారు. కోవిద్ ప్రబలిన ఈ సమయంలో అక్కడికి వెళ్ళవద్దని హితైషులు వారించినా వినలేదు. ‘అమరవీరుల సభలో కూడా పాల్గొనకపోతే ఎట్లా,’ అంటూ అక్కడికి వెళ్ళారు. జ్వరం వచ్చింది. కోవిద్ పాజిటీవ్ అని తేలింది. విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రిలో బుధవారం చేరారు. 53 సంవత్సరాలపాటు విప్లవరాజకీయాలలో విసుగూవిరామం లేకుండా పాల్గొన్న చంద్రక్క నాలుగు దశాబ్దాలుగా రైతుకూలీసంఘం, పీఓడబ్ల్యూ నేతగా పని చేస్తూ ప్రాణాలు విడిచారు.

జీవితంలో ఎవరు ఏమి సాధించారన్నది ముఖ్యం కాదు. ఎవరు ఎట్లా జీవించారన్నది ప్రధానం. తమ మనసు చెప్పినట్టు నడుచుకునేవారూ, తాము నమ్మిన సిద్ధాంతాలను రాజీలేకుండా ఆచరిస్తూ తుదివరకూ సాగేవారూ ధన్యులు. వారి సిద్ధాంతాల ప్రాసంగికత ఎంత, వాటి వల్ల ప్రయోజనం ఎంత అన్నది కూడా ముఖ్యం కాదు. వాసుదేవరావు, చంద్రమ్మలు జీవితపర్యంతం తాము విశ్వసించిన విప్లవమార్గంలోనే నడిచారు. గిరిజనుల జీవితాలను ఉద్ధరించేందుకు తమ జీవితాలను అంకితం చేశారు. కష్టాల నడుమ, పేదల మధ్యలో వారు ఎంచుకున్న పద్ధతిలో బతికారు, మరణించారు. అందుకే కోవిద్ ఆంక్షలను లెక్కచేయకుండా ఆమె అభిమానులు గురువారంనాడు విశాఖలో ప్రదర్శన చేశారు. శుక్రవారంనాడు పలాసలో సంతాపసభ నిర్వహించారు. పేద, పీడిత ప్రజల సేవలో మొక్కవోని దీక్షతో తనకు నచ్చిన మార్గంలో సుదీర్ఘ పోరాట జీవనయానం ముగించిన చంద్రమ్మకు హృదయాంజలి.

Related Articles

1 COMMENT

  1. గొప్ప సాహసమే చేసారు. ఇలాంటివాటికోసమే మేము వెతుకుతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles