Wednesday, December 6, 2023

నరేంద్రమొదీ విద్యార్హతలపై గురువారంనాడు గుజరాత్ హైకోర్టు కొట్టేసిన మాడభూషి శ్రీధర్ ఉత్తర్వు ఏమిటి?

కొందరు మిత్రులకైనా ఈ ప్రశ్న తలెత్తి ఉంటుందనీ, ఆసక్తి రేకెత్తి ఉంటుందనీ అనిపించి, ఆ ఐదు పేజీల ఆర్డర్ ను తెలుగు చేసి పంచుకోవాలనుకున్నాను. ఇదిగో, చూడండి:

http://rtiadmin.nic.in/cic_decisions/CIC_SA_C_2015_000275_T_184410.pdf

కేంద్ర సమాచార కమిషన్

(రూమ్ నం. 315, బి-వింగ్, ఆగస్ట్ క్రాంతి భవన్, బికాజీ కామా ప్లేస్, న్యూఢిల్లీ 110066)

ప్రొ. ఎం. శ్రీధర్ ఆచార్యులు (మాడభూషి శ్రీధర్)

సమాచార కమిషనర్  

CIC/SA/C/2015/000275

Adjunct Order

Arvind Kejriwal (Applicant)

in

Neeraj Saxena V. District Election Officer, GNCTD

ఫిర్యాది : నీరజ్ సక్సేనా

ప్రతివాది : జిల్లా విద్యాశాఖ అధికారి

విచారణ తేదీ : 28.04.2016

ఉత్తర్వుల తేదీ : 29.04.2016

హాజరైన కక్షిదార్లు:

1. శ్రీ సంజీవ్ గుప్తాతో కలిసి ఫిర్యాది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అనే ప్రభుత్వాధికారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎఇఆర్ వో శ్రీ మోహన్ లాల్, ఎచ్ సి శ్రీ వి కె బజాజ్, శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ప్రతినిధులుగా న్యాయవాదులు శ్రీ రిషికేశ్ కుమార్, మహమ్మద్ ఇర్షాద్ హాజరయ్యారు.

2. విచారణ క్రమంలో ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ఒక లిఖిత అభ్యర్థన చేశారు. అందులో ఆయన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ విద్యార్హతల డిగ్రీ గురించి సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఇమ్మని విజ్ఞప్తి చేశారు. శ్రీ నరేంద్ర మోడీ డిగ్రీ వెల్లడించడానికి కమిషన్ గతంలో అనుమతించలేదని కూడా ఆయన ఆరోపించారు. గతంలో హన్స్ రాజ్ జైన్ వర్సస్ ఢిల్లీ యూనివర్సిటీ కేసులో రెండో అభ్యర్థనను తోసివేస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీసుకున్న నిర్ణయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో వచ్చిన వార్త ప్రతిని కూడా ఆయన జతచేశారు. 

3. హన్స్ రాజ్ జైన్ వర్సస్ ఢిల్లీ యూనివర్సిటీ (CIC/SA//2014/001424) అనే ఆ కేసులో శ్రీ హన్స్ రాజ్ తాను కోరిన సమాచారాన్ని ఢిల్లీ యూనివర్సిటీ సకాలంలో అందజేయలేదని ఫిర్యాదు చేశారు. (అది రెండో అభ్యర్థన కాదు).

4. ఆ ఫిర్యాదు కేసులో ఢిల్లీ యూనివర్సిటీ ప్రధాన ప్రజా సమాచార అధికారి (సీపీఐవో) సాధారణంగా విద్యార్థుల చేరిక వివరాలు వారి రోల్ నంబర్ మీద ఆధారపడి మాత్రమే దొరుకుతాయని వివరించారు. ఇక్కడ ఫిర్యాది అడిగిన వివరాలు చాలా స్థూలమైనవనీ, ఆయన ఎం (మోడీ), లేదా ఎన్ (నరేంద్ర) తో మొదలయ్యే విద్యార్థులందరి సమాచారం కావాలని అడిగారని సీపీఐవో వివరించారు. అలా మొదటి అక్షరంతో పేరు వెతకడం చాలా కష్టమైన పని అని సీపీఐవో అన్నారు. నరేంద్ర అనే పూర్తి పేరుతో వెతికినప్పటికీ అది దొరకడం కష్టమనీ, డిగ్రీ ఏ సంవత్సరంలో ఏ రోల్ నంబర్ తో వచ్చిందో నిర్దిష్టమైన వివరాలు చెప్పకపోతే కష్టమనీ ఆయన అన్నారు. పీఐవో చెప్పిన సమాధానాన్ని ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ (ఎఫ్ ఎ ఎ) కూడా సమర్థించారు. అప్పుడు తన మొదటి అప్పీల్ ను వినడంలో ఆలస్యం చేసినందుకు ఎఫ్ ఎ ఎ కు జరిమానా విధించమని కోరుతూ ఫిర్యాది కమిషన్ ను అభ్యర్థించారు. అయితే, సమాచార హక్కు చట్టం కింద ఫస్ట్ అప్పిలేట్ అథారిటీకి శిక్ష విధించే నిబంధన లేదు. నిర్దిష్టమైన అడ్మిషన్ నంబర్ గాని లేదా డిగ్రీ నంబర్ గాని ఇవ్వకపోవడం వల్లనే ఫిర్యాది అడిగిన సమాచారం ఇవ్వడం కుదరలేదు. 1978లో డిగ్రీ పొందిన లక్షలాది ఎక్స్ టర్నల్ అభ్యర్థులలో కావలసిన అభ్యర్థిని వెతకడానికి ఆ సమాచారం అవసరం. ఫిర్యాది పీఐవో కు శిక్ష విధించాలని విజ్ఞప్తి చేయలేదు. ఒకవేళ అలా చేసినా, అది సాధ్యం కాదు. చట్టప్రకారం, కేంద్ర సమాచార కమిషన్ ఫస్ట్ అప్పిలేట్ అథారిటీకి శిక్ష విధించజాలదు. అందువల్ల ఆ అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. ఆ ఫిర్యాదులో సమాచారాన్ని అడగడం గాని, ఇవ్వడం గాని జరగలేదు.

5. ఇప్పుడు మా ముందు ఉన్న రెండో అప్పీల్ లో ప్రధానాంశం, శ్రీ అరవింద్ కేజ్రివాల్ ఎలెక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ బదిలీ సమాచారం వెల్లడించడానికి సంబంధించినది. ఒక శాసన సభ్యుడు, శాసనసభా పక్ష నాయకుడు సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారి అవుతారా కారా అనే విషయం లో శ్రీ అరవింద్ కేజ్రీవాల్ కు తన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం సముచితమని కమిషన్ భావించింది. రికార్డులలో ఉన్న విషయాలను వెల్లడించడానికి తనకు అభ్యంతరమేమీ లేదని ఆయన అన్నారు. కాని నోటీస్ లోని ప్రధాన అంశం మీద ఆయన మౌనం వహించారు. అందువల్ల ఆయన ప్రతినిధులకు మరింత సమయం ఇచ్చాం.

6. ఈలోగా, తన ప్రతిస్పందనలో శ్రీ కేజ్రీవాల్ ప్రధానమంత్రి విద్యార్హతలను వెల్లడించడం గురించి వచ్చిన హన్స్ రాజ్ జైన్ కేసును ఉదహరిస్తూ, ప్రధానమంత్రి విద్యార్హతల సమాచారం సమస్య లేవనెత్తారు. ప్రస్తుత కేసులో తన (శ్రీ కేజ్రీవాల్) సమాచారం ఇవ్వాలని కోరుతున్న కేంద్ర సమాచార కమిషన్, ప్రధాన మంత్రి శ్రీ మోడీ డిగ్రీల సమాచారం వెల్లడి మీద అవరోధాలు కల్పించిందని ఆయన అన్నారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, కమిషన్ నిష్పాక్షికత మీద అనుమానాలు వెలిబుచ్చారు.

7. అందువల్ల, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ కేజ్రీవాల్ ప్రతిస్పందన లేఖను, ఆయన ఒక పౌరుడి హోదాలో సమాచార హక్కు చట్టం కింద చేసిన అభ్యర్థనగా కమిషన్ పరిగణిస్తున్నది. 

8. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రభుత్వాధికారి లేదా ప్రభుత్వోద్యోగి లేదా రాజకీయ నాయకుడి విద్యార్హతలకు సంబంధించిన సమాచారం సమాచార హక్కు చట్టం సెక్షన్ 8 కింద మినహాయింపుల కిందికి రాదు. ఆ సమాచారాన్ని వ్యక్తిగత లేదా గోప్య సమాచారంగా చెప్పడానికి వీలు లేదు. వాస్తవానికి, ప్రధానమంత్రి విద్యార్హతల డిగ్రీల గురించి సమాచారం బహిరంగంగా దొరుకుతూనే ఉన్నది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఆ సమాచారం విస్తారంగా ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ జర్నలిస్టు శ్రీ రాజీవ్ శుక్లాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీ నరేంద్ర మోడీ తాను హైస్కూల్ చదువు ఎట్లా పూర్తి చేశారో, ఆ తర్వాత ఒక పెద్దమనిషి సలహా మేరకు కాలేజీలో అడుగు పెట్టకుండానే ఎక్స్ టర్నల్ పరీక్షల ద్వారా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఎలా సంపాదించారో చెప్పుకున్నారు. (చదువు గురించిన భాగాన్ని, పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూడవచ్చు. https://www.youtube.com/watch?v=yaDp8UPjeVU , https://www.youtube.com/ watch?v=shyXSvQW4_w)

9. ఇది ప్రజలలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు సోషల్ మీడియాలోనూ, ఎన్నో వార్తాపత్రికల వెబ్ సైట్ల మీద తమ అభిప్రాయాలు ప్రకటించారు. అయితే ఈ ఆసక్తినే ప్రజా ప్రయోజనంతో సమానం చేయడానికి వీలు లేదు. ప్రజలకు అందులో ఆసక్తి ఉన్నందువల్ల అది ప్రజా ప్రయోజనం అని అర్థం చెప్పలేం. చట్ట ప్రకారం ఏ ఎన్నికల హోదాకు పోటీ పడడానికైనా విద్యార్హత నియమం లేదు. విద్యార్హత అనే అంశం మీద లోకసభ అభ్యర్థిత్వాన్ని గాని, ప్రధానమంత్రి పదవిని గాని ప్రశ్నించడానికి వీలు లేదు. ఏదైనా పదవికి ఏదైనా ప్రత్యేక విద్యార్హతను నిర్దిష్టంగా సూచిస్తే, అప్పుడు ఆ విద్యార్హతను బైటపెట్టడం ప్రజా ప్రయోజన అంశం అవుతుంది. ఈ కేసులో విషయం అది కాదు.

10. ఇక్కడ స్వాతంత్ర్య సమరయోధుడైన మా తండ్రిగారి వ్యాఖ్య ఒకటి గుర్తు చేసుకోవాలనిపిస్తున్నది. ఆయన ప్రఖ్యాత తెలుగు పాత్రికేయులు గనుక తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు ప్రతిభా పురస్కారం ప్రకటించి, ప్రశంసా పత్రంలో ఆయన జీవిత విశేషాలు రాస్తూ విద్యార్హతలు ఏమి రాయాలని అడిగింది. మీరు ఏం చదువుకున్నారు అని ఆయనను అడిగినప్పుడు, ఆయన “నేను కాళిదాసు మహా కవీంద్రుని రఘు వంశం, మేఘదూతం, కుమారసంభవం చదువుకున్నాను” అని గర్వంగా జవాబిచ్చారు. అవి విశ్వవిద్యాలయాలు ఇచ్చిన డిగ్రీలు కావు గదా అని నేను అన్నప్పుడు, “అయితే ఏం, విశ్వవిద్యాలయాలు ఇచ్చే ఎన్నో డిగ్రీల కన్నా మెరుగైన చదువు ఆ కావ్యాలలో ఉంది” అని ఆయన అన్నారు. చివరికి తెలుగు విశ్వవిద్యాలయం ప్రశంసా పత్రంలో ఆ మహాకావ్యాలు చదువుకోవడమే ఆయన అర్హతగా ప్రస్తావించారు.

11. రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలలో శ్రీ ఎం వి కామత్ దేశంలో విస్తారంగా ఉన్న నిరక్షరాస్యతను ప్రస్తావించి, దాని వల్ల ప్రమాదాలను చెపుతూ, వోటు హక్కును అక్షరాస్యులకు మాత్రమే పరిమితం చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. దానికి జవాబుగా శ్రీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఇలా అన్నారు: “రాజ్యాంగం లోని మరే ఇతర నిబంధన కన్నా ఎక్కువగా ఈ రాజ్యాంగ నిర్ణయ సభ తీసుకున్న సాహసోపేతమైన ముందడుగు, సార్వత్రిక వయోజన వోటుహక్కు కల్పించడం లోనే ఉందని నేననుకుంటాను. ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సాధారణ మానవునికి ఉన్న శక్తి పట్ల, సాధారణ మానవుల పట్ల అది విశ్వాసం ప్రకటించింది”.  ఆ తర్వాత, 1949 నవంబర్ 23న చర్చ చివరి అంకంలో మాట్లాడుతూ ఆయనే, “భారత ప్రజానీకంలో అసంఖ్యాకులలో అజ్ఞానం, నిరక్షరాస్యత ఉన్నప్పటికీ సాధారణ మానవునిలో, ప్రజాస్వామిక పాలన అంతిమ విజయంలో అపార విశ్వాసం ఉంచుతూ ఈ రాజ్యాంగ నిర్ణయ సభ వయోజన వోటుహక్కు సూత్రాన్ని ఆమోదించింది. వయోజన వోటు హక్కు పునాదిగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం సాధారణ మానవునిలో విజ్ఞానం కలగజేస్తుందనీ, శ్రేయస్సును, జీవన ప్రమాణాలను, సౌకర్యాన్ని, మెరుగైన జీవనాన్ని ప్రోత్సహిస్తుందనీ రాజ్యాంగ నిర్ణయ సభ విశ్వసించింది. వయోజన వోటు హక్కు సూత్రాన్ని ఆమోదించడం ఏదో అలవోకగా తీసుకున్న నిర్ణయం కాదు, దాని పర్యవసానాల గురించి పూర్తి అవగాహనతో తీసుకున్నదే. ప్రజాస్వామ్యం విశాల ప్రాతిపదిక మీద ఉండాలంటే, ప్రభుత్వాలు నడవాలంటే మొత్తంగా యావన్మంది ప్రజల అంతిమ అనుమతి మీదనే సాగాలి. అశేష ప్రజానీకం నిరక్షరాస్యులుగా ఉన్న దేశంలో, ఆస్తి గల ప్రజలు అతి తక్కువ మంది ఉన్న దేశంలో, వోటు హక్కును అక్షరాస్యత, విద్యార్హత, ఆస్తి ప్రాతిపదికల మీద ప్రవేశపెట్టడమంటే ప్రజాస్వామ్య మూల సూత్రాలను రద్దు చేయడమే…. వయోజన వోటు హక్కు సూత్రాన్ని ఆమోదించినందుకు ఈ రాజ్యాంగ నిర్ణయ సభను ప్రశంసించవలసి ఉంది.  ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ప్రయోగాన్ని ఇంత సాహసోపేతంగా జరపలేదని చెప్పవలసి ఉంది…” అన్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి డిగ్రీల మీద ఆధారపడిన విద్యార్హతల నియమం పెట్టకపోవడం భారత ప్రజాస్వామ్యపు మహత్తర అంశాలలో ఒకటి. కావలసింది చదువే తప్ప డిగ్రీలు కావు.

12. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నఒక పౌరుడు ప్రధానమంత్రికి సంబంధించిన డిగ్రీ సమాచారాన్ని తెలుసుకోదలచుకున్నప్పుడు, అది తెలియజేయడం సముచితమైనది.

13. అందువల్ల, డిల్లీ యూనివర్సిటీలో, గుజరాత్ యూనివర్సిటీలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పత్రాలు వెతికే పని సులభం చేయడం కోసం ఆ సర్టిఫికెట్ల నిర్దిష్ట నంబర్లను, సంవత్సరాలను తెలియజేయడం అవసరమని ప్రధానమంత్రి కార్యాలయానికి కమిషన్ సూచిస్తున్నది. “శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ” అనే పేరుతో 1978 (డిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్), 1983 (గుజరాత్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్) డిగ్రీలన్నిటిలో వీలయినంత మెరుగైన అన్వేషణ జరిపి, ఆ డిగ్రీలను వీలైనంత త్వరగా దరఖాస్తుదారు శ్రీ కేజ్రీవాల్ కు అందజేయాలని కమిషన్ ఢిల్లీ యూనివర్సిటీ, గుజరాత్ యూనివర్సిటీల పి ఐ ఓ లను ఆదేశిస్తున్నది. (నిర్దిష్టమైన నంబర్ లేకుండా వెతకడం కష్టతరమైన పని అనే దృష్టితో ఇందుకు కాల పరిమితి విధించడం లేదు.)

 సంతకం

 ఎం శ్రీధర్ ఆచార్యులు

 సమాచార కమిషనర్

(తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles