Tuesday, September 10, 2024

చిన్న జిల్లాలు సామాజిక పరివర్తన సాధనాలు

“స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్” అని ఎప్పుడో అన్నాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి ఇ.యఫ్. స్కుమాచెర్. అ అనుభూతి ఆచరణలోకి వచ్చింది తెలంగాణాలో అదీ దశరా పర్వదినాన. ఇరవైనొక్క కొత్త జిల్లాల ఆవిర్భావంతో వాడవాడలా, పల్లె పల్లెన, పట్టణాల్లో వెల్లివిరిసిన ఆనందోత్సవాలు చూసి తరించాల్సిందే తప్ప వర్ణశక్యం కాదు.

అదిలాబాద్, మెదక్ వంటి పెద్ద జిల్లాల్లో – వైశాల్యం దృష్ట్యా – జిల్లా అధికారిగా పనిచేసిన అనుభవంతో ఈ పరిణామాన్ని ఆహ్వానించే వాళ్ళలో నేనొకడిని. మారుమూల ప్రాంతాలైన బెజ్జూరు, దహెగాం, తిర్యాణి మండలాల నుండి జిల్లా కేంద్రమైన అదిలాబాద్ చేరుకోవాలన్నా, అలాగే జగదేవ్ పూర్, దుబ్బాక నుండి సంగారెడ్డి (మెదక్ జిల్లా కేంద్రం) రావాలన్నా సామాన్య ప్రజానీకం పడే బాధలు అనుభవిస్తే తప్ప అర్థం కావు. అవి అలివి కాని ఇక్కట్లు. అందుకే అనుకుంటాను నా నివాసం (క్యాంపు ఆఫీసు) ముందు ప్రొద్దున్నే ధరఖాస్తుదార్లు వేచివుండడం చూసి మనసు కరిగి పోయేది. అంతకు క్రితం రోజంతా బస్సులో ప్రయాణించి, దూరాభారాలు ఓర్చి, రాత్రికి కలెక్టరేటు ఆరుబయట ప్రదేశంలో తలదాచుకుని ప్రొద్దున్నే జిల్లా అధికార్ల సందర్శనార్థం ఎదురు చూసే ఈ అభాగ్య జీవుల కష్టాలు ఎపుడు గట్టెక్కుతాయా అని ఆక్రోశించేవాణ్ణి. అయినా పని పూర్తవుతుందన్న నమ్మకం లేదు. పదిగంటలు దాటిందంటే దౌరా (టూరు) కు పోవటమో, మీటింగుల్లో మునిగిపోవటమో జరిగితే, అధికార్లు అందుబాటులో లేకపోతే, మరొక రోజు జిల్లా హెడ్ క్వార్టరులో ఉండాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు పెద్దగా రద్దీలేని సంగారెడ్డి, అదిలాబాద్ లాంటి పట్టణాల్లో, ఆఫీసుల ఆవరణలోనే మకాం. వీళ్ల కోసం దేవాలయ ప్రాంగణాల్లో వున్నట్లు సత్రాలు ఏర్పటు చేస్తే బాగుంటుదేమో అన్న ఆలోచన కూడా మెదిలేది. ప్రత్యామ్నాయంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళ ఆవరణలో వాళ్ళకు ఆశ్రయం కల్పించేవిధంగా చర్యలు తీసుకోవడం జరిగేది. ఇప్పుడు ఆ బాధలు తప్పినట్లే. చిన్న జిల్లాల ఏర్పాటుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజానీకానికి ఎంతో వెసులుబాటు కల్పించింది. దూరాలు దగ్గరయ్యాయి కదా అని అలసత్వంతో జిల్లా అధికార్లు ప్రజానీకానికి అందుబాటులో లేకపోయినా, వారి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేసినా, హెడ్ క్వార్టర్ లో మకాం లేకపోయినా, చిన్నజిల్లాలకు, పెద్ద జిల్లాలకు అట్టే తేడా వుండదు. సగటు మనిషి ఆశలు ఆడియాసలు కాకుండా చూసుకోవడం అధికార్ల బాధ్యత.

జాతీయ సగటుకు మూడు రెట్లు విస్తీర్ణం

జాతీయ స్థాయిలో జిల్లాల సగటు విస్తీర్ణం 4000 చదరపు కిలోమీటర్లు వుంటే తెలంగాణలో 11,000 చ.కి.మీ. వుండేది గతంలో. జనాభా రీత్యా చూసినా, జాతీయ సగటుకు రెట్టింపు జనసాంద్రత వుండేది. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో నలభై శాతం వున్న పంజాబు, హర్యానా, రాష్ట్రాల్లో నలభై, యాభై జిల్లాలు ఉండడం ఈ దిశగా గమనార్హం. చిన్న జిల్లాల సంఖ్యాపరంగా చూస్తే, జాతీయ స్థాయిలో తెలంగాణాది 9వ స్థానం. జనాభా రీత్యా , 12వ స్థానంలో వుంది. ఈ లెక్కన చూస్తే, 31 జిల్లాల తెలంగాణ రాష్ట్రం సముచితమే అనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా కూడా. ఎన్ని జిల్లాలు వుండాలి? ఆ జిల్లా ప్రధాన కార్యాలయాలు ఎక్కడ పెట్టాలి? రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఎన్ని? అన్న విశ్లేషణ ఎడతెగని తర్కం. అది నిరంతర ప్రక్రియ. విధాన నిర్ణయాల్ని పాలకుల విజ్ఞతకు వదిలేసి, అధికార్లు, ఉద్యోగులు జిల్లాల పునర్విభజానంతరం ఉద్యమ స్ఫూర్తితో, ఈ మార్పులు చేర్పులు ప్రజోపయోగం కోసమే కానీ తమకోసం కాదన్న వాస్తవాన్ని గ్రహించి, చిన్న జిల్లాల ఏర్పాటు ఉద్దేశ్యం నెరవేరేలాగున పనిచేయటం తక్షణ కర్తవ్యం.

బూజుపట్టిన బ్రిటిష్ కాలంనాటి వ్యవస్థ

అనాది కాలం నుండి నేటివరకు పాలనా వ్యవస్థ అనేక రూపాలలో అవతరించింది. సంఘంలో శాంతి భద్రతలు కాపాడి, ప్రజలందరూ సుఖశాంతులతో మనుగడ సాగించేలా, సమాజాభివృద్ధికి పాటుపడేందుకు పాలనా యాంత్రాంగం కావల్సివచ్చింది. రాచరికపు పాలనా వ్యవస్థ, భూస్వామిక పాలనా వ్యవస్థ సుదీర్ఘకాలం నడిచింది. గత మూడువందల సంవత్సరాల్లో ప్రజాస్వామిక వ్యవస్థలో పాలనా వ్యవహారాల్లో, సంప్రదాయాల్లో, పద్ధతుల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనదేశంలో వేళ్ళూనుకున్న పాలనా వ్యవస్థ బ్రిటీషు వారి కాలంలో రూపొందింది. ఒకవిధంగా చెప్పాలంటే శిస్తు వసూలు వ్యవస్థ అది. దానికి కాలదోషం పట్టటం సహజం. అందరూ మార్పుకోరుకునేవారే గాని, ఆ మార్పు సుసాధ్యం చేయటం కొందిరకే చెల్లింది. 1984 లో మొదలైన గ్రామ పరిపాలనా, మండలీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటికి చిన్నజిల్లాల ఏర్పాటుతో రూపాంతరం చెందటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పునర్వవ్యస్థీకరణ పాలన. గ్రామాలు పాలనా వ్యవస్థ ఆయువుపట్టులు. పునాది రాళ్ళ. గ్రామపాలన ప్రాచీన కాలం నుండి గ్రామాధికారులు చూస్తుండేవారు. వంశపారంపర్య గ్రామాధికార్ల వ్యవస్థ రద్దై ముప్పై ఏళ్ళు దాటినా, పటిష్టమైన, ప్రత్యామ్నాయ గ్రామపాలనా యంత్రాంగం లేదు. ఉదాహరణకు మాలీ పటేళ్ళ వ్యవస్థ. మద్రాసు ప్రెసిడెన్సీ పాలనకు భిన్నంగా, తెలంగాణా ప్రాంతంలో పోలీస్ పటేల్ (గ్రామమునసబ్), పట్వారీ (గ్రామకరణం), మాలీ పటేల్ గ్రామాధికార్లుగా వుండేవారు. మాలీ పటేళ్ళ అజమాయిషీలో గ్రామీణ సాగు నీటి వనరులు గ్రామస్థులు సమష్టి కృషితో నిర్వహింపబడేవి.

మాలీ పటేల్ కు ప్రత్యామ్నాయం

ఆ వ్యవస్థ రద్దు కావటంతో, ఈ వనరులన్నీ పంచాయితీరాజ్, జలనవరుల శాఖల ఆధ్వర్యంలోకి రావటంతో వాటి రోజువారి నిర్దేశం, నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అలాగే “రోజ్ నామాంచ” వ్రాసే పోలీసుపటేళ్ళ ప్రత్యామ్నాయం కరువైంది. తెలంగాణ ప్రాంతంలో గ్రామంలోని కొత్త వాళ్ళు ఎవరువచ్చారు. గ్రామం నుండి బయటకు ఎంతమంది వెళ్ళారు, ఎన్ని రోజులు వెళ్ళారు, ఎన్నాళ్ళు గ్రామంలో ఉన్నారు, అనుమానాస్పదస్తులు ఎవరైనా వుంటే వాళ్ళ వివరాలు రోజువారీ నమోదు చేస్తూ “రోజ్ నామాంచా” సమీపంలో గల పోలీసు రాణాకు పంపే ఏర్పాటు వుండేది. ఈ ముగ్గురి పాలనా బాధ్యతలు ఒకే ప్రభుత్వ అధికారికి (వి.ఆర్.ఓ లేదా వి.యార్.ఎ) రెవెన్యూ పరంగా అప్పజెప్పటం జరిగింది. అన్ని రెవెన్యూ గ్రామాలకు సరిపడా సిబ్బంది కరువే. ఇన్ చార్జీలతో పాలనా వ్యవహారాలు చెక్క బెట్టడం ఎక్కువ కాలం మంచిది కాదేమో, ప్రజావసరాల దృష్ట్యా. పునాది గట్టిదైతే, దాని మీద కట్టే నిర్మాణం ధృఢంగా వుంటుందని మనందరికీ అవగతమే. ఈ దిశలో గ్రామాధికార్ల పనితనం మెరుగుపరిచి, నైపుణ్యం వాళ్ళలో జొప్పించాల్సిన అవసరం ఈ పాటికే ప్రభుత్వాలు గుర్తించాయి. కంప్యూటర్ భాషలో చెప్పాలంటే, హార్డ్ వేర్ ఎంత ఖరీదుదైనా, మేలురకం అయినా, సాఫ్ట్ వేర్ లేకపోతే, ఉన్నా తప్పుల తడకగా వుంటే, రాశి తగ్గిందయితే, అది నిరుపయోగమేనని మనందరికి తెలుసు. అటువంటి వ్యవస్థ అనర్థాలకు దారితీస్తుందని వేరుగా చెప్పనక్కరలేదు.

సుపరిపాలన దృష్ట్యా వ్యవస్థలో మార్పులు

సుపరిపాలన దృష్ట్యా, ఇప్పటివరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు, మండల వ్యవస్థలో మార్పులు చోటుచేసుకున్నాయి, కానీ గ్రామాల పునర్వవ్యవస్థీకరణ అలాగే వుండిపోయింది. ఇప్పటికీ ఎంతో పెద్ద రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబంధంగా మజరాలు (హమ్లెట్లు) డిపాపులేటెడ్ మరియు ఫారెస్టు గ్రామాల శివార్లు అలాగే వుండిపోయాయి. భూకమతాల సంఖ్య, విస్తీర్ణం దృష్ట్యా, పట్టేదార్ల వారిగా చిన్న చిన్న రెవెన్యూ గ్రామాలుగా విడగొడితే పాలనా సౌలభ్యం, పర్యవేక్షణ పటిష్టం కావటానికి వీలుపడుతుంది. గ్రామస్థాయిలో సర్వే సిబ్బంది నియామకం తెలంగాణా జిల్లాలో తక్షణావసరం. మరీ ముఖ్యంగా రెవెన్యూ, ఫారెస్టు తగాదాల దృష్ట్యా. మజల్ని ప్రత్యేక రెవెన్యూ గ్రామాలుగా నోటిఫై చేయాల్సిన అవసరం పరిశీలనా యోగ్యం, సమాంతరంగా (పంచాయితీల విభజన కూడా సబబుగా వుంటుంది. మేజర్, మైనర్, నోటిఫైడ్ అన్న బేధం లేకుండా, పరిపాలనకు అనువుగా చిన్న పంచాయితీల్ని ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి, వాటికి మిగులు నిధులు, విధులు, తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తే సమగ్ర గ్రామీణాభివృద్ధి చేకూరుతుంది. జనాభా సాంధ్రత, పంచాయితీ విస్తీర్ణం ప్రామాణీకలుగా, చిన్న చిన్న పరిపాలనా సౌలభ్య యూనిట్లు ఈ దిశలో ఎంతో అవసరం. షెడ్యూలు కులాలు, తెగలు అవాసముంటున్న పల్లెల్ని, తండాల్ని ప్రత్యేక గ్రామపంచాయితీలుగా ప్రకటిస్తే, పంక్తిలో చివరి వ్యక్తి వరకూ అభివృద్ధి ఫలాలు చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే. ఇప్పటికే ఈ దిశలో తెలంగాణా ప్రభుత్వం చొరవ తీసికోవటం ఆహ్వానించదగ్గ పరిణామం.

అట్టడుగు ప్రజల అభివృద్ధికి వీలు

చిన్న జిల్లాలు సామాజిక పరివర్తనకు సాధనాలు కావాలి. గతంలో తెలంగాణా ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, చిన్న జిల్లాలు బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడటంలో అట్టడుగు ప్రజల బాగోగుల పట్ల శ్రద్ద వహించటానికి వీలవుతుంది కూడా. తనను కాపాడే ప్రభుత్వ యంత్రాంగం తన చెంతనే వుందన్న భరోసా సామాన్యుడికి ఎంతో ఊరటనిస్తుంది. శాంతి, భద్రతల స్థాపన సంక్షేమానికి మొదటి మెట్టని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దిశలో రెవెన్యూ, పోలీసు, న్యాయ వ్యవస్థ ఒక టీంగా (జట్టుగా) పనిచేసి అభివృద్ధి దిశగా పురోగమించాలి. అట్లాగాకుండ, అతి సామీప్యం అనర్థాలకు దారి తీయకుండా, “ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెప్ట్” అన్న భావజాలం దరికి రానివ్వకుండా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికార్లు ప్రభువుల సేవలో కాకుండ ప్రజాసేవలో నిమగ్నం కావటానికి చిన్న పాలనా యూనిట్లు దోహదపడితే, చిన్న జిల్లాల ఏర్పాటు లక్ష్యం నెరవేరినట్లే. జిల్లా స్థాయి శాఖ పునర్ వ్యవస్థీకరణ కూడా ప్రజలకు మేలు చేసేదిగా వుండాలన్నది ప్రభుత్వాధినేత అభిలాష. రాష్ట్రస్థాయిలో మంత్రుల (కేబినేట్) శాఖల కేటాయింపులో ఈ మార్కు పాలన ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. అదే వరవడిని జిల్లాలో కొనసాగిస్తే మంచిది. ప్రతి జిల్లాకు ఒకే స్థాయి గల అధికారి వుండాలన్న నియమంలేదు. ఆయా శాఖలు, జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాల్ని బట్టి తగుస్థాయి అధికారిని నియమిస్తే సబబు. కొన్ని సంస్థల శాఖల అవసరం వుండదు. అలాగే జిల్లా అధికార్లందరూ కేంద్ర కార్యాలయాల్లో వుండే పని చేయాల్సిన అగత్యమూ లేదు. వారి పర్యవేక్షణ, నిపుణత ఏఏ మండలాల్లో కావల్సివస్తుందో, ఆ సామీప్యంలోనే వారి హెడ్ క్వార్టర్ వుంటే మంచిది. ప్రయాస, దుబారా ఖర్చులు వుండవు. అవసరమైతే రెండు మూడు జిల్లాలకు కలిపి ఒకే అధికారిని నియమించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తే బాగు. క్షేత్రస్థాయి అనుభవం బట్టి, నేను జిల్లా అధికారిగా వున్న రోజుల్లో కొన్ని శాఖల జిల్లా అధికార్ల ముఖాలు కూడా చూసివుండను. ఉదాహరణకు, కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, మైనింగ్ & జియాలజి, దేవాదాయ శాఖ, నీటివనరుల శాఖ ప్రత్యేక డివిజన్ల అధికార్ల వునికే జనానికి ఎరుకే వుండదు. కొన్ని పేర్లు కూడా తెలియని శాఖల అనుబంధ సంస్థలెన్నో, ‘ఎంపైర్ బిల్డింగు’ అన్న ఆలోచన విధానమే ఈ పరిస్థితికి కారణం. దుస్థితి మారాలి.

మెరికల్లాంటి గ్రూప్1&2 అధికారులు

సిబ్బంది కొరత, నిపుణత లోపించటం వంటి పలుకులు పాలనా వ్యవస్థలో పరిపాటి. ఎప్పుడూ వుండేదే. అవసరం వున్న శాఖల్లో సిబ్బంది కరువు. అవగాహన లేని సంస్థల్లో పనిలేక యాతన పడేవాళ్ళు ఎందరో. మరీ ముఖ్యంగా జిల్లా, డివిజన్ల స్థాయిల్లో, పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా నియామకమైన సిబ్బంది, అధికార్లు మెరికల్లాంటివారు. అఖిల భారతీయ సర్వీసు అధికార్లకు ఏ మాత్రం తీసిపోరు కొన్ని సందర్భాల్లో. మరీ ముఖ్యంగా గ్రూప్ – 1 & 2 సర్వీసు అధికార్లు. రిక్రూట్ అయినప్పటినుండి అదే శాఖలో మగ్గిపోవాల్సిన దుస్థితి. అలాగాకుండా ఓ పదేళ్ళు ఆయా శాఖల్లో పనిచేసి నిపుణతను సంతరించుకున్న తరువాత జనరల్ పూల్ లోకి లాక్కొని వారి సేవలు అన్ని శాఖలకు విస్తరింపచేస్తే మంచిది. ఆ క్రమంలోనే స్టేట్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు చెందిన వారిగా పరిగణించి (గతంలో హైద్రాబాద్ సివిల్ సర్వీసు, ఆంధ్రప్రదేశ్ ఆడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లాగా), వాళ్ళ నుండే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ వంటి అఖిలభారతీయ సర్వీసులోకి ఎంపిక జరిగేలా చూడాలి. దీంతో ఒక సర్వీసు గొప్పది. మరొక సర్వీసు చిన్నది అన్న భావన తాజాగా పోతుంది.

పాలనా పద్ధతులు మారాలి

చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు పాలనా పరమైన పద్ధతులు, సంప్రదాయాలు, మ్యాన్యువల్స్ మార్చాల్సిన అవసరం ప్రభుత్వం ఈ పాటికే గుర్తించి వుంటుంది. ఏ ప్రతిపాదనలు వచ్చినా, ఏ దరఖాస్తు వచ్చినా రొటీన్ గా ‘తగు చర్య నిమిత్తం’ , పరిశీలనార్థం (ప్లీజ్ ఎగ్జామిన్) అని అంటూ విలువైన సమయాన్ని, శక్తి యుక్తుల్ని వృధా చేయరాదు. అలాగే కిందిస్థాయి నుండి నివేదికలు కోరటం కూడా తప్పే. ఉదాహరణకు ఏ దరఖాస్తు దారుడైనా క్రింది స్థాయిలో పని కావటం లేదని ఫిర్యాదు చేస్తే, నా పైనా, నా పని తీరు పట్ల పై అధికార్లకు కంప్లైంట్ చేస్తావా అని కక్షకట్టిన సందర్భాలు ఎవరి వల్ల తనపని కావటం లేదో, అదే అధికారికి ఆ పిర్యాదును తగు చర్య నిమిత్తం పంపటమో, నివేదిక కోరటంలో ఔన్నత్యం లేదు. ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తుదారు సంబంధిత అధికార్లను సంప్రదించినపుడు, ‘‘నన్ను కాదని పై అధికార్ల దగ్గరికి పోయావు కదా! అక్కడే నీ పని చేయించుకోపో’’ అంటూ వ్యంగంగా వ్యవహరించటం కూడా కద్దు. ఈ అడ్మినిస్ట్రేటివ్ పద్ధతులు అవమానీయం. ఆక్షేపణీయం. ఈ పరిస్థితి ప్రతి నిత్యం ప్రజా సంబంధాలు కలిగి వుండే శాఖల్లో మరీ దారుణం. ఈ పద్ధతులు మారాలి.

విప్లవాత్మక సంస్థాగత మార్పులు అవసరం

తెలంగాణాలో పట్టణాల సంఖ్య అతి తక్కువ అని మనకు తెలిసిందే. ఇప్పటికే నలభై శాతం జనాభా పట్టణాల్లో నగరాల్లో నివాసమున్నట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. రాబోయే పది సంవత్సరాల్లో జనసాంధ్రత యాభై శాతానికి మించిపోయే అంచనాలు. ఉదాహరణకు 38 ఏళ్ళ క్రితం (1978) లో ఏర్పాటైన కొత్త జిల్లా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ మహానగరం చుట్టూ వలయంగా, నాడు 6 లక్షల జనాభాతో, 6 అసెంబ్లీ నియోజక వర్గాలతో ప్రారంభమైన జిల్లా నేడు 14 అసెంబ్లీ నియోజక వర్గాలతో 52 లక్షల జనాభాతో మరో మహనగరానికి తెరలేపింది. అలాగే ఇప్పుడు ఏర్పాటైన కొత్త మండల, డివిజన్, జిల్లా కేంద్రాలు రాబోయే రోజుల్లో పట్టణాకృతుల్ని సంతరించుకునే అవకాశం వుంది. ఈ గ్రోత్ సెంటర్ల క్రమబద్దీకరణకు ఇప్పటి నుండే పునాదులు వెయ్యాలి. ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఈ దిశలో టౌన్ మరియు కంట్రీ ప్లానింగు శాఖను అన్ని గ్రామ, మండల, జిల్లా కేంద్రాల పరిధిలో విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ శాఖ రియల్ ఎస్టేటు, డెవలపర్లకే కాకుండ, సామాన్య ప్రజానీకానికి ఉపయోగ పడేలా రూపాంతరం చెందాలి. ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికబద్దమైన నమూనాలకు లోబడి, గ్రామ, మునిసిపల్, పట్టణాభివృద్ధి సంస్థలు మాస్టర్ ప్లాన్లు సవరించుకోవవాలి. గతంలో ఈ నమూనాలు కాగితాలకే పరిమితం కావటం కద్దు. ఈ దిశలో విప్లవాత్మకమైన సంస్థాగత మార్పులు అవసరం. లేదంటే భవిష్యత్తులో వగచాల్సి వస్తుంది. ఇపుడు జంటనగరాలు ఎదుర్కొంటున్న రుగ్మతులు అధిగమించాల్సిన అవసరం పట్టణీకరణ దిశలో ఎంతైనా వుంది.

తెలంగాణ జిల్లాలు పసికూనలు

రెండున్నర ఏళ్ళు కూడా నిండని పసికూనలు తెలంగాణా కొత్త జిల్లాలు. ముప్పై ఒక్క చేతులతో (జిల్లాల సంఖ్యాపరంగా) పొదివి పట్టుకొని, ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న రాష్ట్రాన్ని, సవరించుకుని సాదుకోవాల్సిన తరుణమిది అంటూ ప్రభుత్వాది నేత పలు సందర్భాల్లో గుర్తు చేయటం గమనార్హం.  ఇటీవలే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) వెల్లడించిన మానవ వనరుల అభివృద్ధి సూచికలు (హెచ్.డి.ఐ) గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మెరుగు పర్చాల్సి వుంటుంది. గతంలో వున్న పది జిల్లాలో, ఏడు జిల్లాలు పారిశ్రమీకరణలో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నాయి. వ్యవసాయ పరంగా మూడు జిల్లాలు ముందుడగులో వున్నాయి. అక్షరాస్యత, అరోగ్య పోషణాపరంగా ఇంకా సాధించాల్సింది ఎంతైనా వుంది.

ఐటీ చిరునామా రంగారెడ్డి జిల్లా

విభజించిన జిల్లాల పరంగా చూస్తే, ఐ.టి. రంగానికి రంగారెడ్డి జిల్లా చిరునామా. పారిశ్రామికంగా మేడ్చెల్, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు పెద్దపీట వేయాల్సి వుంటుంది. విత్తన క్షేత్రంగా కరీంనగర్, సాగునీటి పరంగా ఖమ్మం నేతన్నల జిల్లాగా సిరిసిల్ల, అడవుల జిల్లాగా అదిలాబాద్, సాంస్కృతిక వారసత్వ జిల్లాలుగా వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, జగిత్యాల జిల్లాలు మచ్చుకుకొన్ని. అయా జిల్లాల్లో అందుబాటులో వున్న సహజ సంపద, మానవవనరుల్ని ఆధారంగా చేసుకొని జిల్లా అభివృద్ధి నివేదికలు తయారు చేసుకోవాల్సిన తరుణం ఇది. ఒక జిల్లా బాగా అభివృద్ధి చెందిందనీ అంటూ మిగతా జిల్లాలు వెనుక బాటుతనాన్ని ఎత్తిచూపే సృహకు తావులేకుండా, అన్ని జిల్లాల సత్వర ప్రగతిని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా వుంది. సాంస్కృతిక వారసత్వ పరంగా కూడా తెలంగాణాకు ప్రత్యేకం కృష్ణా, గోదావరి లాంటి పవిత్ర నదీమ తల్లుల నట్టనడుమ మైదాన ప్రాంతంగా ఆవరించిన గడ్డ, పాలపిట్ట, తంగేడు చెట్టు జింక ప్రభుత్వ చిహ్నలు ఈ ప్రాంతపు ఆచార, వ్యవహారాలకు ప్రతిబింబం. బతుకునే దేవతగా చేసి పూజించే పుణ్యభూమి. అదే బతుకమ్మ వేడుక. తెలంగాణాకే ప్రత్యేక ఆకర్షణ. లోకపురంగుల ఆకర్షణలో పడొద్దని. బతుకు తెరువే బాటగా దైవం వైపు అడుగులు పడాల్సిన బతుకమ్మ నిర్మానం మనకు ప్రబోధిస్తుంది. ప్రాణ శక్తికి ప్రతీత (పసుపు) తంగేడు పూవును పునాదిగా (క్రింది వరుసలో) పేర్చటం పుట్టుటకు అనవాలు. తెల్ల గునుగు పూలు (కట్టలు) వరుసలు బాల్యానికి, ఎదుగుదలకు బాటలు. ప్రాసంచిక ఆకర్షణలు – రంగురంగుల పూలు – ఎత్తుగా పేర్చటం – వస్తు ప్రపంచ ప్రతిబింబాలు, గుమ్మడిపూవు శీర్షిక. పసుపు కొమ్మ గౌరమ్మ. ముంగిట్లో వృద్ధాప్యానికి గురుతు – దైశశక్తికి ప్రతిరూపం. తొమ్మిది రోజులు అడుకుని నిమజ్జనానికి దారితీసేదే మరణం. ఈ పరమార్థాన్ని వేడక రూపంలో గోచరింప జేసే తెలంగాణం కావాలి జానీకానికి దైవం ప్రసాదించిన వరం. దివ్య మంగళ శాసనాలు.

రచయిత: డా. దాసరి శ్రీనివాసులు

ఐ.ఎ.యస్., సంచారి ఉద్యమ కార్యకర్త.

Srinivasulu Dasari
Srinivasulu Dasari
మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అయనకు పేదల పక్షపాతిగా, ప్రజల తరఫున నిలిచే అధికారిగా పేరుంది. అనేక రంగాలలో అనేక హోదాలలో పని చేసి విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి.

Related Articles

2 COMMENTS

  1. The theme of the article is laudable. But, there has to be attitudinal change in the bureaucracy. Special training is required for this to happen. Right now, bureaucrats act as if they are colonial masters of people. Though British have left, the brown Sahibs rule like the British. Elitist institutions like the Institute of Administration a in Mussoorie, NPA in Hyderabad, etc have to be drastically reoriented to make officials public service oriented. I doubt that this will ever happen. Since independence, several administrative reforms commissions have been appointed but none of their recommendations have been implemented. Personally, I see no hope in India that bureaucracy will ever improve. That is why I had resigned from IPS.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles