Tuesday, April 23, 2024

గబ్బాలో కంగారూలకు సిరాజ్ దెబ్బ

  • హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ కు 5 వికెట్లు
  • హేమాహేమీల సరసన మహ్మద్ సిరాజ్

ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భారత యువఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ సత్తా చాటుకొన్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వికెట్ గా పేరుపొందిన బ్రిస్బేన్ గబ్బా పిచ్ పైన….రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టి…వారేవ్వా అనిపించుకొన్నాడు.ప్రస్తుత సిరీస్ లోని మెల్బోర్న్ టెస్ట్ ద్వారా అరంగేట్రం చేసిన సిరాజ్..ఆ తర్వాత జరిగిన సిడ్నీటెస్టులో సైతం అంచనాలకు మించి రాణించాడు. పేస్ బౌలింగ్ కుఅనుకూలంగా ఉండే ఫాస్ట్, బౌన్సీ బ్రిస్బేన్ పిచ్ పైన జరిగిన ఆఖరి టెస్టులో పూర్తిస్థాయిలో రాణించాడు.

నిప్పులు చెరిగిన సిరాజ్…

తొలి ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క వికెట్ పడగొట్టిన సిరాజ్…రెండోఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయాడు. స్వింగ్,పేస్,షార్ట్ పిచ్ బాల్స్ తో కంగారూ టాపార్డర్ ను కకావికలు చేశాడు. మిస్టర్ డిపెండబుల్ లబుషేన్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాథ్యూవేడ్, స్టార్క్, హేజిల్ వుడ్ ల వికెట్లు పడగొట్టాడు. మొత్తం 19.5 ఓవర్లలో 73 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు.మూడు టెస్టులు, ఆరు ఇన్నింగ్స్ తో కూడిన తన కెరియర్ లో సిరాజ్ కు ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి.

మరో నలుగురి సరసన సిరాజ్…

బ్రిస్బేన్ గబ్బా వేదికగా గతంలో జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో 5 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ ఇరాపల్లి అనంతరావు శ్రీనివాస్  ప్రసన్న, లెఫ్టామ్ స్పిన్నర్ బిషిన్ సింగ్ బేడీ, పేస్ బౌలర్లు మదన్ లాల్, జహీర్ ఖాన్ ఉన్నారు. ప్రస్తుతం ఈ టెస్టుమ్యాచ్ లో 5 వికెట్లు సాధించడం ద్వారా సిరాజ్ సైతం ఆ నలుగురు హేమాహేమీల సరసన నిలువగలిగాడు. 1968 సిరీస్ లో ప్రసన్న, 1977లో బేడీ, మదన్ లాల్, 2003లో జహీర్ ఖాన్ గబ్బా వేదికగా 5 వికెట్లు సాధించిన భారత బౌలర్లుగా ఉన్నారు. ఓ బ్యాట్స్ మన్ సెంచరీ సాధించడం ఎంత గొప్పో…ఓ బౌలర్లు 5 వికెట్లు పడగొట్టడం కూడా అంతే గొప్పని క్రికెట్ పండితులు చెబుతూ ఉంటారు.

కంగారూల క్లీన్ బౌల్డ్….

కంగారూల కంచుకోట బ్రిస్బేన్ గబ్బాలో ఆతిథ్యజట్టు రెండుసార్లు ఆలౌట్ కావడం 2008 తర్వాత ఇదే మొదటిసారి. 1987 సీజన్ నుంచి ఆలౌట్ కావడం ఇది మూడోసారి. ఐదుగురు ప్రధాన బౌలర్లు ( ఇశాంత్ శర్మ,భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా) లేకుండానే…యువబౌలర్ (సిరాజ్,నటరాజన్, శార్దూల్ ఠాకూర్)లతో భారత్ ఈ ఘనత సాధించడం విశేషం.

13 వికెట్లతో సిరాజ్ టాప్…

ఆస్ట్ర్రేలియాతో ముగిసిన ఈ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మూడుటెస్టులు మాత్రమే ఆడిన సిరాజ్ మొత్తం 13 వికెట్లు పడగొట్టి…అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు.గాయంతో ఆఖరిటెస్టుకు దూరమైన స్పిన్నర్ అశ్విన్ 12 వికెట్లు సాధించగా…సిరాజ్ 13 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టులో సభ్యుడిగా టెస్ట్ సిరీస్ లో పాల్గొన్న రెండో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ గా చరిత్ర సృష్టించిన సిరాజ్…కోవిడ్, క్వారెంటెయిన్ నిబంధనల కారణంగా తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఆస్ట్రేలియాలోని ఉండిపోవాల్సి వచ్చింది.తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుకొన్న సిరాజ్ కు మెల్బోర్న్ లో టెస్ట్ క్యాప్ దక్కింది. ఆ తర్వాత నుంచి భారత పేస్ బౌలింగ్ కీలక బౌలర్లలో సిరాజ్ కూడా ఒకనిగా గుర్తింపు సంపాదించుకోగలిగాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles