Friday, March 29, 2024

శివధనుర్భంగం: బాలరాముడు కళ్యాణరాముడైన వేళ

రామాయణమ్ 15

లీలగా విల్లందుకున్నాడు అవలీలగా ఎక్కుపెట్టాడు!

అంతే!! ఒక్కసారిగా భూనభోంతరాళాలాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫేళారావంతో విరిగిపోయింది ఆ విల్లు!

తస్యశబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః

భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః

ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్పశబ్దం వచ్చినది. పర్వతాలు బ్రద్ధలయితే  ఎలా అదురుతుందో అలా అదిరింది భూమి.

Also read: విశ్వామిత్రుడిని ‘బ్రహ్మర్షీ’ అని సంబోధించిన వశిష్ట మహర్షి

విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప తక్కినవారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారు.

…..

(ఈ సందర్భంలో కవి సమ్రాట్ విశ్వనాధసత్యనారాయణగారు చక్కటి శబ్దసౌందర్యంతో ఆ సందర్భాన్ని ఎంతో అద్భుతంగా మన కన్నుల ముందు ఆవిష్కరించారు!  ఆ పద్యం చూడండి. పద్యంయొక్క అర్ధం మనకు వెంటనే తెలియకపోయినా శబ్దచిత్రం మాత్రం కన్నుల ముందు వెంటనే ప్రత్యక్షమవుతుంది.

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత

స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం

హిష్ఠ స్ఫూర్జదుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా

ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్!

ఇది మీ కనుల ముందు ఊహించండి!

Also read: బొందితో కైలాసం, త్రిశంకు స్వర్గం

నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైనమబ్బులలో అగ్నికణాలమాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మండమైన శబ్దంతో పిడుగులు అదేపనిగా ఒకదానివెంట మరొకటి (series) గా వస్తే ఎలా ఉంటుందో అలాంటి శబ్దం ఆ విల్లు విరిగి నప్పటి ఫెళఫెళారావాలు అంత తీవ్రంగా వచ్చినవట!

అంతేనా ఈ పద్యంలో ఇంకొక చమత్కారం కూడా వున్నది! రాముడు నీలమేఘశ్యాముడు,  “మేఘపటలీ నిర్గచ్చ” అని వ్రాశాడాయన.

మేఘమండలం నుండి వెలువడిన అని అర్ధం! నీలమేఘశ్యాముడి చేతిలో విరిగి అంత ధ్వని పుట్టిందట!

భాస్కర రామాయణం లోని పద్యమొకటి చూడండి:

కులగిరులెల్ల బెల్లగిలె గుంభిని యల్లలనాడె దిగ్గజం

బులుబెదిరెన్ భుజంగపతి బొమ్మరవోయె బయోధులన్నియుం

గలగె దిగంతముల్ వగిలె గన్కనిదారలు రాలె సూర్యచం

ద్రుల గతులు తప్పె మేఘములు దూలె నజాండముమ్రోసె నయ్యెడన్.

ఆ శబ్దానికి పర్వతాలు పెళ్లగింపబడినవట, దిక్కులుమోసే ఏనుగులు బెదిరిపోయినవట, ఆదిశేషువుకు దిమ్మతిరిగి పోయిందట, సముద్రాలు క్షోభించినవట, భూమి అల్లల్లాడి పోయిందట, దిక్కులు పిక్కటిల్లినవట, నక్షత్రాలు రాలిపోయినవట, సూర్యచంద్రులు గతులు తప్పారట.

Also read: వశిష్ట, విశ్వామిత్రుల సంఘర్షణ

అంత భయంకరమైన శబ్దం పుట్టినదట!

ఒక్కక్క కవి యొక్క ఊహా వైభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి.)

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జనకుడు.

ఈయన అసలు పేరు సీరధ్వజుడు. మిధిలా నగరాధీశులందరినీ “జనకుడు” అనే పిలుస్తారు.

మూలపురుషుడు “నిమి” నుండి ఈయన ఇరవై మూడవ మహరాజు!

అప్పటికి దాదాపు 6 సంవత్సరాలనుండి శివధనుస్సు గురించి ప్రచారం జరుగుతూనే ఉన్నది.

ఒక్కొక్క రాజు రావడం ధనుస్సు ఎత్తలేకపోవడం ఆ అవమానభారంతో జనకుడి మీదికి దండెత్తి రావడం! ఒకసారి అయితే అందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చి కోటను సంవత్సరంపాటు ముట్టడించారు. కోటలో సైన్యసంపద తరిగిపోసాగింది. ఆహారధాన్యాలు నిండుకున్నాయి. అప్పుడు జనకుడు దేవతల సహాయంతో వారిని ఎలాగోలా ఓడించి సాగనంపాడు!

 ఇప్పుడిక ఆ బెడద తీరిపోయింది! అందుకు ఆ నిట్టూర్పు! హమ్మయ్య అని!

Also read: అహల్య శాపవిమోచనం

విశ్వామిత్రుడికి కన్నుల వెంట ఆనందబాష్పములు రాలినవి!

(ఎందుకని? జగత్కల్యాణకారకుడి కళ్యాణానికి తాను కారకుడనయ్యానని!)

పురజనులంతా సంబరపడిపోయారు. స్త్రీ జనమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు!

మరి తరుణి సీత!

తనువంతా పూచిన మందారమయ్యింది!

తానొక సిగ్గుల మొగ్గ అయ్యింది!

జనకుడు వెంటనే తన మంత్రులను అయోధ్యకు పంపించాడు. వారు శీఘ్రముగా వెళ్లి ఈ వార్త దశరధమహారాజు చెవిన వేశారు!

తనతో తీసుకువెళ్ళిన బాలరాముడిని మహర్షి కళ్యాణరాముడిని చేశాడు అనే వార్త విని దశరథుడి మనసులో ఆనందతరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తక్షణమే భరత,శత్రుఘ్న, మంత్రి, సామంత, పురోహితులు కులగురువు వశిష్ఠులవారు వెంటరాగా మిధిలా నగరానికి పయన మయినాడు.

సీరధ్వజుడు (జనకుడు) సాంకాశ్యపురాధీశుడు అయిన తన తమ్ముడు కుశధ్వజుని రావించాడు!

సీత, ఊర్మిళ జనకుడి కూతుళ్ళు, మాండవి,శృతకీర్తి కుశధ్వజుడి పుత్రికలు.

ఒక వివాహమనుకొన్నది నాలుగు వివాహాలుగా మారినది!

సీతారాములు

ఊర్మిళలక్ష్మణులు

మాండవిభరతులు

శృతకీర్తిశత్రుఘ్నులు

ఈ జంటలకు వివాహము చేయ పెద్దలు నిశ్చయించినారు!

Also read: భగీరథయత్నం, గంగావతరణం

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles