ప్రముఖ గాయని సునీత పెళ్లికి ఈ రోజు నిశ్చితార్థం జరగడంతో ఈ విషయమై ఎన్నో రోజులుగా వస్తున్న వదంతులకు తెరపడింది. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ వీరపనేనితో ఆమె జీవితం పంచుకోబోతున్నారు. 19 ఏళ్ల వయసులోనే పెళ్లయిన సునీత ఇద్దరు పిల్లలు కలిగాక భర్తతో అభిప్రాయభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇప్పడు కట్టుకోబోయే రామ్ కు కూడా ద్వితీయ వివాహమే. ఆమె నిశ్చితార్థం ఫొటో మాధ్యమాలను చుట్టేస్తోంది.

నా కల నెరవేరబోతోంది
పిల్లలను బాగా పెంచి జీవితంలో స్థిరపడేలా చేయాలని ప్రతి తల్లి కలలు కంటుందని, తన విషయంలో ఆ కల సాకారం కాబోతోందని సునీత అన్నారు. వివాహ నిశ్చితార్థం తర్వాత సామాజిక మాధ్యమంలో సందేశం పెడుతూ, `రామ్ నా జీవితంలో ప్రవేశించారు. ఆయన మంచి స్నేహితుడే కాదు…మంచి భాగస్వామి కూడా. ఆయనతో జీవితం పంచుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకున్నవారందరికీ ధన్యవాదాలు‘అని పేర్కొన్నారు.
