Tuesday, September 26, 2023

నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటుల నిర్మాణంపై సింగరేణి యోచన

  • లోయర్‌ మానేరు డ్యాం ను సందర్శించిన సింగరేణి బృందం

సింగరేణి సంస్థ సి&ఎం.డి.ఎన్‌. శ్రీధర్‌ ఆదేశంపై రాష్ట్రంలోని భారీ జలాశయాల నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటుల నిర్మాణం కోసం సింగరేణి సోలార్‌ పవర్‌ విభాగం వారు తమ కసరత్తును ముమ్మరం చేశారు.

సోమవారం (డిసెంబర్‌ 28వ తేదీ) నాడు సింగరేణి డైరెక్టర్‌ (ఇ&ఎం) డి.సత్యనారాయణ రావు సారథ్యంలో ఒక ఉన్నతస్థాయి నిపుణుల బృందం కరీంనగర్‌ పక్కనే ఉన్న లోయర్‌ మానేరు జలాశయాన్ని సందర్శించింది. తెలంగాణా రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ (రెడ్‌ కో) ఇటీవల సింగరేణి సి&ఎం.డి.ఎన్‌.శ్రీధర్‌ కు ఈ విషయంపై ఒక ఫీజిబిలిటీ నివేదికను సమర్పించిన నేపథ్యంలో సింగరేణి అధికారుల బృందం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకొంది.

మూడు జలాశయాలు సోలార్ పాంట్లకు అనుకూలం

టి.ఎస్‌. రెడ్‌ కో వారు సింగరేణి ఛైర్మెన్‌ కు సమర్పించిన తమ నివేదికలో రాష్ట్రంలో గల మూడు భారీ జలాశయాలు సోలార్‌ ప్లాంటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కరీంనగర్‌ పక్కన ఉన్న లోయర్‌ మానేరు జలాశయం 350 మెగావాట్ల సోలారు ప్లాంటుకు ఎంతో అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటితో నిండినపుడు 82 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉంటుందనీ, దీనిలో కేవలం 12.5 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం సింగరేణి ఏర్పాటు చేయతలపెట్టిన 350 మెగావాట్ల ప్లాంటుకు సరిపోతుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో  ఎన్‌.శ్రీధర్‌ లోయర్‌ మానేరు జలాశయాన్ని సందర్శించవల్సిందిగా డైరెక్టర్‌ ఇ&ఎం ను ఆదేశించారు. డైరెక్టర్‌ (ఇ&ఎం) సత్యనారాయణ రావు సారథ్యంలో ఐదుగురు నిపుణుల బృందంతో పాటు టి.ఎస్‌. రెడ్‌ కో జిల్లా మేనేజర్‌ రవీందర్ , రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ (లోయర్‌ మానేర్‌ డ్యాం) అధికారులు  శివకుమార్‌ (ఎస్‌.ఇ),  వంశీ (ఎ.ఇ.)లు ఈ సందర్శనలో పాల్గొన్నారు. ముందుగా మానేరు డ్యాం కార్యాలయంలో జలాశయం వివరాలు, నీటి నిలువ సామర్థ్యం, విస్తీర్ణం, ఎండాకాలంలో నీటి నిలువ ఉండే విస్తీర్ణం మొదలైన అంశాలపై చర్చించారు. అనంతరం డ్యాము పై నుండి జలాశయంలో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రదేశం గురించి పరిశీలన జరిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావు గతంలో సింగరేణి సంస్థ తన గనుల ప్రాంతంలో సోలార్‌ విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో గల భారీ జలశయాలపై కూడా నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటుల ఏర్పాటుకు పూనుకోవాలని సింగరేణికి సూచించారు. ఈ విషయంపై శ్రీధర్  ప్రత్యేక చొరవ చూపుతూ తెలంగాణా రాష్ట్ర రెన్యూవబుల్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ (టి.ఎస్‌. రెడ్‌కో) వారితో పలుమార్లు సమావేశమై సింగరేణి సంస్థ తరపున 350 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటుకు ఏ జలాశయం అనుకూలంగా ఉంటుందో సూచించమని కోరారు. లోయర్‌ మానేరు డ్యాం అనుకూలమని రెడ్‌ కో సూచించిన నేపథ్యంలో డి.పి.ఆర్‌. ముసాయిదా కూడా తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మానేరు డ్యాంలో 350 మెగావాట్ల సోలార్ ప్లాంటు

జలాశయం సందర్శన తర్వాత డైరెక్టర్‌ ఇ&ఎం  డి.సత్యనారాయణ రావు మాట్లాడుతూ 350 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటుకు మానేరు డ్యాం ఎంతో అనుకూలంగా ఉందనీ, ఇదే విషయాన్ని ఛైర్మెన్‌ కు నివేదించనున్నామని తెలిపారు. సింగరేణి నిపుణుల బృందంలో ఆయనతో పాటు జనరల్‌ మేనేజర్‌ (సోలార్‌ ప్లాంటు)  డి.వి.సూర్యనారాయణ రాజు, జనరల్‌ మేనేజర్‌ (ఇ&ఎం) ఎన్‌.నాగేశ్వర్‌ రావు, ఎస్‌.ఓ.విశ్వనాథరాజు, సోలార్‌ రీజియన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, సోలార్‌ సలహాదారుడు మురళీధరన్‌ రాజగోపాలన్‌ పాల్గొన్నారు.

Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles