Wednesday, April 24, 2024

సిడ్నీ టెస్టులో శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు

  • రెండోరోజు ఆటలో స్టీవ్ స్మిత్, శుభ్ మన్ షో
  • ఆస్ట్ర్రేలియా 338 ఆలౌట్, భారత్ 2 వికెట్లకు 96 పరుగులు

టెస్ట్ క్రికెట్ రెండు, మూడు ర్యాంక్ జట్లు ఆస్ట్ర్రేలియా- భారత్ మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడోటెస్టు రెండో రోజు ఆటలో రెండు అరుదైన రికార్డులు నమోదైనాయి. కంగారూ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీ, భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో రికార్డుల్లో చోటు సంపాదించారు.

 21 ఏళ్ల 122 రోజుల వయసులో గిల్

జూనియర్ ప్రపంచకప్ తో పాటు ఐపీఎల్ 2020 సీజన్లో అసాధారణంగా రాణించడం ద్వారా భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించిన శుభ్ మన్ గిల్ మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా అరంగేట్రం చేశాడు. అరంగేట్రం టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ 45 పరుగులు సాధించడంతోనే కంగారూ గడ్డపై అరంగేట్రం టెస్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత మూడో క్రికెటర్ గాఇప్పటికే రికార్డుల్లో చేరిన గిల్‌ సిడ్నీ టెస్టులో సైతం మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 338 పరుగులకు సమాధానంగా రోహిత్ శర్మతో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ మొదటి వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. తన కెరియర్ లో టెస్ట్ తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 101 బాల్స్ ఎదుర్కొని 8 బౌండ్రీలతో 50 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 

ఇదీ చదవండి: నవదీప్ సైనీకి టెస్ట్ క్యాప్          

 మరో ముగ్గురి సరసన చోటు

ఆస్ట్ర్రేలియా ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్‌ వేసిన 32 ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీయడం ద్వారా అర్థశతకం పూర్తి చేసిన గిల్‌ కమిన్స్‌ వేసిన 33 ఓవర్‌ తొలి బంతికి పెవిలియన్‌ చేరాడు. అయితే ఆసియా ఉపఖండం వెలుపల అత్యంత పిన్నవయసులో 50, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత ఓపెనర్‌గా నిలిచాడు.   గతంలోనే భారత ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్‌ ప్రత్యర్థిగా 20 ఏళ్ల, 44 రోజులు వయసులో హాఫ్ సెంచరీ సాధించగా మాధవ్‌ ఆప్టే(20 ఏళ్ల 108 రోజులు-వెస్టిండీస్‌పై), పృథ్వీ  షా(20 ఏళ్ల 111 రోజులు-న్యూజిలాండ్‌పై) ఇదే ఘనతను సొంతం చేసుకోగలిగారు. ఇప్పుడు ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఆస్ట్ర్రేలియా గడ్డపై శుబ్ మన్ గిల్ అదే ఘనతను సొంతం చేసుకోగలిగాడు. 

విరాట్ కొహ్లీ సరసన స్టీవ్ స్మిత్

అంతకుముందు ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ సైతం ఫైటింగ్ సెంచరీతో తనజట్టుకు కొండంత అండగా నిలిచాడు. గత నాలుగు ఇన్నింగ్స్ లోనూ దారుణంగా విఫలమైన స్మిత్ పట్టుదలతో ఆడి  మొత్తం 226 బంతులు ఎదుర్కొని 16 బౌండ్రీలతో 133  పరుగులతో శతకం సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్‌ మాత్రం నిలకడగా ఆడాడు. స్కోరు బోర్డుపై కనీసం మూడొందల స్కోరు ఉండాలన్న పట్టుదలతోనే తన పోరాటం కొనసాగించాడు. టెస్టు క్రికెట్లో ఇది స్మిత్‌కు 27వ శతకం. అంతేకాదు. ఇప్పటికే 27 టెస్టు శతకాలు సాధించిన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ రికార్డును సైతం స్మిత్ సమం చేయగలిగాడు.   సెంచరీల రికార్డును సమం చేయడమే కాదు. పరుగుల్లో విరాట్ కొహ్లీని స్మిత్ అధిగమించాడు. కోహ్లి ప్రస్తుత సిరీస్ లోని అడిలైడ్ టెస్ట్ వరకూ 7,318 పరుగులు సాధిస్తే, స్మిత్‌ 7,368 పరుగులతో మందున్నాడు.

భారత్ ప్రత్యర్థిగా

భారత్ ప్రత్యర్థి అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్ల జాబితాలో స్మిత్‌ చోటు సంపాదించాడు. స్మిత్‌కు భారత్ పై ఇది ఎనిమిదో టెస్టు శతకం మాత్రమే. గతంలోనే భారత్ ప్రత్యర్థిగా కరీబియన్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్‌, వివ్‌ రిచర్డ్, ఆస్ట్ర్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ రికీ పాంటింగ్‌ మాత్రమే భారత్‌పై ఎనిమిదేసి టెస్టు శతకాలు సాధించినవారుగా ఉన్నారు. తాజాగా స్మిత్ వచ్చి ఈ ముగ్గురి దిగ్గజాల సరసన నిలిచాడు. మొత్తం మీద రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 96 పరుగుల స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అవుట్ కాగా చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి:సిడ్నీ టెస్టులో సిరాజ్ కంటతడి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles