Friday, June 9, 2023

ప్రపంచ సంస్థల సూచీలలో ర్యాంక్ లను పట్టించుకోకుండా ఉందామా?

  • ఖండించడం, ఓట్రించడం, ఎదురుదాడి చేయడం మంచిదా?
  • ప్రభుత్వమే అధ్యయనం చేసి ప్రపంచ  సంస్థలకు సమాధానం చెప్పాలా?
  • దేశీయ సంస్థలనూ, ప్రవీణులనూ ప్రోత్సహించాలా?

వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండే ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్న నాయకుడు కానీ మనజాలడం కష్టం. ఇది ఈ రోజు సర్వేసర్వత్రా అందరికీ, అన్ని ప్రభుత్వాలకు వర్తించే విషయం. అందుకే అధికారంలో ఉన్నవారు చెప్పేమాటలకు క్షేత్రం కనిపించే వాస్తవాలకు పొంతన ఉండటం లేదు. ఈ రెండు స్థానాల నుంచి రాజకీయ నాయకులు పింగ్ పాంగ్ ఆడుకుంటారు. అదే వారిని సజీవంగా, సచేతనంగా  ఉంచుతుంది. ఈ క్రమంలో అతిశయోక్తులు సర్వసాధారణమైపోయాయి. గొప్పలు చెప్పుకోవడం కూడా అంతే. అధికారంలో ఉన్నవారు  తమను తాము పొగుడుకుంటూ సాగిపోతారు. మరికొందరు వ్యూహాత్మకంగా అవాస్తవాలు గోరంత కొండంత చేసి చూపుతారు. వారు కూడా అమాయకులుగా తప్పించుకుంటారు. నైతిక ఇబ్బందులు ఏమీ లేవు. ఈ మూడు వైఖరులలో ఏది వాస్తవికమైనదో తెలుసుకోవడం ప్రజలకు చాలా కష్టం.

Also read: భారత్ అగ్రరాజ్యం కాకుండా నిరోధిస్తున్నఅవరోధం ఏమిటి? రాజకీయాలకు అతీతమైన దృక్పథం లేకపోవడమేనా?

ఆత్యయిక పరిస్థితినాటి జ్ఞాపకం

నాలుగు దశాబ్దాల కిందట 1975లో ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించిన నేపథ్యంలో సమాచార మంత్రిత్వశాక ‘దశాబ్దపు విజయాలు’ అనే అంశంపైన ప్రచారానికి సన్నాహాలు చేస్తోంది. అభూతకల్పనతో ప్రచారకాండ సాగించాలన్న ప్రతిపాదన బెడిసికొడుతుందని మంత్రిత్వశాక కార్యదర్వి జమాల్ కిద్వాయ్ కి చెబుతూ బూమరాంగ్ (బెడిసికొట్టడం) అనే సూత్రాన్ని వివరించాను. పైనుంచి వచ్చిన రాజకీయ నిర్ణయం కనుక ఆయన నాకేసి నిస్సహాయంగా చూశారు. త్వరలోనే ఆయన రంగం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఘనవిజయాలు సాధించామంటూ అతిశయోక్తులు దేశమంతటా ప్రచారం చేశారు.

Also read: ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ మంత్రతంత్రాలు

అధికారంలో ఉన్న నాయకులు తమ విజయాలను మోతాదుకు మించి ఘనకార్యాలుగా చెప్పుకుంటారో వారికి దిద్దుబాటు అవకాశం కూడా ఉండదు. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్ నేషనల్ అనే సంస్థ 23 ఏళ్ళ కిందట అవినీతి అనే అంశంపైన దేశాలకు ర్యాంకులు ఇచ్చుకుంటూ ప్రకటించినప్పుడు ఆ సంస్థ అనుసరించిన పద్ధతిని మాత్రమే కాక ఆ వార్తను మీడియా ప్రచురించిన లేదా ప్రసారం చేసిన పద్ధతిని సైతం నిశితంగా విమర్శించినవారిలో నేనొకడిని. కొత్త పూనికలకు దోహదం చేయకపోతే సర్వేలూ, సూచికలూ నిరర్థకమని నేను వాదించాను.  ప్రభుత్వ ప్రాథమిక సేవలను వినియోగించుకోవడంలో ప్రజల అనుభవం, వారి పరిస్థితుల ప్రాతిపదికగా భారత దేశంలో అవినీతిపైన వార్షిక నివేదికలు వెలువరించడం ఆరంభించాను. పీఈఈ (పాయెంట్స్, ఎవిడెన్స్, ఎక్స్ ప్లనేషన్ మెథడ్) పద్ధతి అమలు చేసే సంస్థలు చొరవ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత తన అభిప్రాయం ప్రాతిపదికగా మాత్రమే నివేదికలు తయారు చేసే పద్ధతికి ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ స్వస్తి చెప్పింది.

Also read: పీకే ఎన్నికల తంత్రమే గెలుపు మంత్రమైతే ప్రజాస్వామ్యం ఏమౌతుంది?

ఆకలి సూచీలో అట్టడుగుకు దిగజారిన భారత్

ప్రపంచ ఆకలి సూచిక 2021లో ఇండియా అట్టడుగుకు దిగజారినట్టు వచ్చిన వార్తలను గతవారం మీడియా ప్రచురించింది, ప్రసారం చేసింది. అనుకున్నట్టే ప్రభుత్వం వెంటనే ఆ నివేదికను ఖండించింది. వివిధ అంశాలవారీగా దేశాలకు ర్యాంకులు ఇచ్చే సంస్థలు ప్రపంచంలో డజనుకు పైగా ఉంటాయి. ఇటీవల నేను రాసిన పుస్తకాలలో ఈ విషయాలను కొంతమేరకు చర్చించాను. కొన్ని సూచికా సంస్థలు వెల్లడించిన నివేదికలను నేను విమర్శించాను. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు చెందిన వివిధ సంస్థలు రకరకాల సూచికలపైన నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలకు చెందినవి. మరికొన్ని స్వతంత్ర సంస్థలుగా చెప్పుకుంటాయి కానీ వాటి పుట్టుపూర్వోత్తారలు తెలియవు. ఈ సంస్థల ఉనికి గురించి కానీ అవి వినియోగించే మెథడాలజీ (పద్దతి) గురించి కానీ చెప్పకుండా వాటి నివేదికలకు మీడియా అగ్రతర ప్రాధాన్యం ఇస్తుంది.

Also read: పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది

ఈ ప్రపంచ సూచికలు ఆధారంగా నివేదికలు తయారు చేస్తున్న పెక్కు సంస్థలు కొన్నేళ్ళుగా ఇండియాను జాబితాలో అడుగున, చాలా దేశాల వెనకన ఎందుకు చూపిస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించక పోవడం ఆందోళన కలిగించే అంశం. దాదాపు దశాబ్దానికి పైగా ఇండియాను ఈ సంస్థలు అడుగు భాగంలో చూపిస్తుంటే ప్రభుత్వాలు చేతులు కట్టుకొని కూర్చోవడం ఆసక్తికరమైన విషయం. మన దేశంలో అంతర్జాతీయంగా విశ్వసనీయత కలిగిన, విషయ పరిజ్ఞానం కలిగిన ప్రవీణులు అనేకమంది ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకున్నదో తెలియదు. మన పరిశోధన సంస్థలూ, విద్యాసంస్థలు స్వయంగా ప్రపంచ సూచికలపైన అధ్యయనం చేసి నివేదికలు వెల్లడించవచ్చును. ‘‘ఆర్టికిల్ 15’’ అనే పేరుగల హిందీ చలనచిత్రం ఒకటి 2019లో విడుదలైంది. అంతర్జాతీయ సూచికలలో ఇండియా వెనకబడి ఉండటానికి పేదరికం, అంటరానితనం, వివక్షతో కూడిన పీడన మూల కారణమని తేల్చింది. సత్యజిత్ రే సినిమాలను గుర్తు చేసిన ఈ సినిమా పెద్ద ప్రచారార్భాటం లేకుండా నిశ్శబ్దంగా విడుదలై విజయ ఢంకా మోగించింది. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా ఇవ్వలేదు. రాజ్యాంగంలోని ఒకానొక ప్రధానమైన అధికరణను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు సినిమా నిరూపించినప్పటికీ అధికారంలో ఉన్నవారికి చీమకుట్టినట్టు కూడా లేదు. అటువంటి పరిస్థితిపైన ఇతోధికమైన దృష్టి పడాలంటే ఎట్లా? ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు అతిశయోక్తులు వల్లించడం కొనసాగిస్తున్నదనే స్పృహతో ప్రజలు ప్రపంచ సూచీలను చూస్తున్నారు.

Also read: చర్చ లేకుండా బిల్లుల ఆమోదం: రాజ్యాంగ సూక్ష్మాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి

2021 ప్రపంచ ఆకలి సూచీలు ఇండియా 116 దేశాల జాబితాలో 101 స్థానంలో ఉన్నట్టు చూపించాయి. 2014లో 55వ స్థానంలోనూ, 2020లో 94వ స్థానంలోనూ ఇండియా ఉండేది.

ఎట్లా లెక్కలు వేస్తారు, ర్యాంకులు నిర్ణయిస్తారు?

నాలుగు అంశాల ఆధారంగా లెక్కతీస్తారు. అవి: పౌష్టికాహారలోపం, ఉండవలసిన బరువుకంటే తక్కువ ఉండడం, ఎదుగుదల లేకపోవడం, శిశుమరణాలు. ఐక్యరాజ్య సమితికి భారత్ అధికారికంగా అందించిన గణాంకాలని ఆధారం చేసుకొనే లెక్కలు వేస్తారు. ఐర్లాండ్ కు చెందిన వరల్డ్ వైడ్ అనే సంస్థ, జర్మనీకి చెందిన స్వచ్ఛందసంస్థ డబ్ల్యూహెచ్ హెచ్ కలిసి ఈ నివేదిక తయారు చేస్తాయి. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇతర అంశాలలో మాదిరిగానే ఇందులో కూడా గ్యాలప్ సర్వే ఫలితాల ఆధారంగా లెక్కలు వేసి నివేదిక తయారు చేశారని ఆరోపించింది. అయిదేళ్ళలోపు బాలల మరణాల విషయం పరిస్థితి మెరుగైనదనీ, వారిలో ఎదుగుదల లేకపోవడం కూడా తగ్గుతున్నదనీ, పోష్టికాహారలోపం కూడా తగ్గుముఖం పట్టిందనే వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. కానీ ఆ విషయాలను వార్తాపత్రికలు ప్రచురించలేదు, న్యూస్ చానళ్ళు ప్రసారం చేయలేదు.

Also read: జనాభా విధానం ఎన్నికల హెచ్చరికా? ఎన్నికల వాగ్దానమా?

పర్యావరణానికి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కూడా అమెరికాకు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు (ఏల్స్, కొలంబియా) ఇండియాకు తక్కవ ర్యాంక్ ను దశాబ్దకాలంగా ఇస్తూవస్తున్నాయి. దానికి మన స్పందన ఏమిటి? మనం ప్రదర్శించిన చొరవ ఏమిటి? ఈ విషయంలో ఇండియా 2008లో మొత్తం 168 దేశాల జాబితాలో 118వ స్థానంలో ఉంటే 2020లో చివరి 168వ స్థానంలో నిలిపి అత్యంత దారుణమైన నాలుగు దేశాలలో ఒకటిగా తేల్చారు. ప్రజాస్వామ్య సూచీలను మూడు ప్రపంచ సంస్థలు ప్రతి ఏటా నివేదిస్తాయి. అందరూ ఎక్కువగా మాట్లాడేది లండన్ లో ఉన్న ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ సంస్థ 70 సూచీల ఆధారంగా ప్రజాస్వామ్య విలువల స్థాయిని 167 దేశాలలో పరిశీలిస్తుంది. అత్యుత్తమమైన ప్రజాస్వామ్యదేశాల విభాగంలో ఇండియాను 2020 నివేదిక చేర్చలేదు. కానీ అపభ్రంశమైన ప్రజాస్వామ్యంగా పరిగణించి 53వ స్థానంలో నిలిపింది. ప్రజాస్వామ్య  సూచీలలో డెన్మార్క్ కు చెందిన వీ-డెమ్ (V-Dem Institute) సంస్థ ఇంకా కటువుగా నిగ్గు తేల్చింది. ఇండియాను ఎలక్టొరల్ ఆటోక్రసీ (ఎన్నికైన నిరంకుశ వ్యవస్థ) అని అభివర్ణించింది. అమెరికాకు చెందిన  ‘ఫ్రీడం హౌస్’ తన ప్రజాస్వామ్య సూచీలలో ఇండియాను పాక్షికంగా స్వేచ్ఛాయుతమైన దేశంగా పేర్కొన్నది. మొత్తం ప్రపంచంలో 15 సూచీల ప్రకారం ఇదే ధోరణి కనిపిస్తున్నది. జీవన ప్రమాణాల విషయంలో ప్రపంచంలోని అగ్రగాములుగా ఉన్న వంద నగారాలలో ఇండియాకు చెందిన ఒక్క నగరం కూడా లేదు. ప్రపంచంలోని అత్యున్నతమైన వంద విశ్వవిద్యాలయాలలో భారత్ కు చెందిన విశ్వవిద్యాలయం ఒక్కటీ ఉండదు. స్మార్ట్ సిటీ పథకం అమలు 17శాతం మేరకు మాత్రమే జరుగుతోందని ప్రభుత్వం స్వయంగా చేసిన సర్వేలోనే తేలింది. నూతన విద్యావిధానం రూపకల్పన జరిగి మూడేళ్ళు పూర్తయినా ఇంకా అమలు కావలసి ఉన్నది. ప్రపంచ సంస్థల అంచనాలూ, ర్యాకింగ్ ల గురించి ఇన్నేళ్ళుగా మనం ఏమి చేస్తున్నాం? ఆ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్ లను పరిగణనలోకి తీసుకోకుండా ఉందామా లేక ఎదురుదాడి చేద్దామా లేక దిద్దుబాటు చర్యలు తీసుకుంటామా?

Also read: ప్రాథమి విద్యను ప్రోత్సహిస్తున్నామా? పాడుచేస్తున్నామా?

సమాంతర కసరత్తు అవసరం

ప్రపంచ సంస్థల ప్రాసంగికతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని తన మేలుకోసమే సమాంతరంగా కనసరత్తు చేయాలి. మార్కెట్ ఇండెక్స్ లను ఎక్కువ చేసి చూపడం కాదు. మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఖండించడం, అనుకూలంగా వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేయడం మంచిది కాదు. 2020లో ఒక ఊరూపేరూ లేని సంస్థ భారత దేశంలో రెండు సముద్రతీర ప్రాంతాలు పర్యావరణకు సానుకూలంగా ఉన్నాయంటూ నివేదిక వెల్లడించగానే అది మనకు ‘‘గర్వకారణమైన క్షణం’’ అంటూ ‘‘గొప్ప విజయం’’ అంటూ మంత్రి ఒకరు హడావుడి చేశారు (ఆ తర్వాత సముద్రతీరాలలో ఇసుక తవ్వకాన్ని ప్రైవేటురంగానికి అప్పగించారు. అది ప్రభుత్వం ప్రకటించిన విధానానికి విరుద్ధం). అవే ప్రపంచ సంస్థలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడానికి బదులు ప్రభుత్వం సొంతంగా విశ్లేషణ చేసుకొని సంస్థల నివేదికలను ప్రశ్నించాలి. అటువంటి విశ్లేషణలో ఇప్పటికే నిమగ్నమై ఉన్న మన సంస్థలను ఉపయోగించుకోవాలి. ఇప్పటికే ఉన్న విశ్వసనీయమైన సంస్థలను బలోపేతం చేయాలి. సమాచారహక్కు  (ఆర్ టీఐ) వంటి చట్టాలూ, సోషల్ ఆడిట్, సిటిజన్ కేరక్టర్ వంటి సంస్థలను ప్రోత్సహిస్తే బయట నుంచి అటువంటి అవమానకరమైన రేటింగులు వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి దాపురించకుండా చూసుకోవచ్చు. అన్ని రకాల రాంకింగ్ లనూ, రేటింగ్ లనూ, సూచీలనూ ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వార్తాసంస్థలు సంస్థల నేపథ్యాన్ని తనిఖీ చేసుకోవాలి. ఆయా సంస్థల విశ్వసనీయతనూ, అవి వినియోగించే పద్ధతులనూ (మెథడాలజీ) వంటి ముఖ్యమైన సమాచారం ఇస్తూ ఆ సంస్థలు అందించే సమాచారం ప్రచురించవచ్చు. అటువంటి సూచీలతో వార్తలు వేసేటప్పుడు వాటితో క్షేత్ర వాస్తవికతకు సంబంధించిన వ్యాఖ్యానాలను జోడించాలి.

Also read: మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?

(డాక్టర్ ఎన్. భాస్కరరావు సుదీర్ఘకాలంగా పరిశోధనల ఆసరాతో ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు)

Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles